రోమా అధ్యయనం – 58 16:24-27
సువార్త యొక్క స్వభావము, గుణము
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రోమా పత్రిక చివరి అధ్యాయం, చివరి వచనాలు అధ్యయనం
చేస్తున్నాం. మీరంతా సంతోషంగా ఉన్నారా? నాతోబాటు దేవునికి కృతజ్ఞత, స్త్రోత్రం చెల్లించండి.
కోవిడ్ పరిస్థితులలో ముగించగలమో లేదో తెలియని సమయంలో ప్రభువు కృప చూపించారు. I
కొరింథీ పత్రిక అధ్యయనానికి సిద్ధంగా ఉన్నారా? మీ స్నేహితులు, బంధువులు, తోటి విశ్వాసులు,
ఇరుగు పొరుగు వారికి బైబిల్ అధ్యయనాలగురించి చెప్పండి. మీరు పొందుతున్న దీవెనలు,
ధైర్యం, ఆత్మీయ మేలు వారు కూడా పొందడం ఎంత సంతోషం! మీలో ఎవరైనా అవిశ్వాసపు
వలలో చిక్కుకొని ఉన్నారా? ఆందోళనలో మునిగిపోయారా? వేదన, బాధ, శ్రమలు, హింసలు
మిమ్మని వేధిస్తున్నాయా?
క్రైస్తవ్యం ప్రపంచం లోని ఇతర మతాలకు వేరుగా, భిన్నంగా ఉంటుంది. ఇది దానంతట
అదే నిలబడుతుంది. ఈ మాటలు నిజమైన బైబిల్ బోధించే క్రైస్తవ్యమునకు వర్తిస్తాయి. ఆదిమ
విశ్వాసులు క్రీస్తు సువార్తను వెంబడించినందుచేత వారిని క్రైస్తవులు అని పిలిచారు. క్రైస్తవ్యం
యేసు క్రీస్తును గూర్చిన శుభవార్త మీద ఆధారపడిఉన్నది. ఈ విషయం మీకు తేటగా చెప్పాలి.
క్రైస్తవులమని చెప్పుకునేవారందరూ క్రైస్తవులూ కారు, వారు బైబిల్ బోధించే జీవితము జీవించరు
కూడా. అక్కడే మనమంతా ఎల్లప్పుడూ మనలను జాగ్రతగా సరిదిద్దుకోవలసిఉంటుంది.
క్రొత్త నిబంధనలోని మొదటి 4 గ్రంధాలు యేసు క్రీస్తు ప్రభువు జీవితము, పరిచర్య ద్వారా
సువార్తను అందిస్తున్నవి. మిగతా గ్రంధాలు సువార్త ఎందుకు ఏ విధంగా వేరైనదో, ఎందుకు
వేరుగా ఉందో వివరిస్తాయి. దేవునితో సమాధానపడ్డానికి సువార్త ఒక్కటే మార్గం.
ఇక రోమా పత్రికలోని ఆపో. పౌలు చివరి మాటలు విందాం. రండి, రేడియో కు దగ్గరగా వచ్చి
కూర్చోండి. రోమా 16:24 నుండి.
24 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు
తోడై యుండును గాక.
25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి
రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని
ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును
అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,
26 యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు
శక్తిమంతుడును
27 అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ
కలుగునుగాక. ఆమేన్.
ఈ చిన్ని లేఖన భాగములో సువార్త యొక్క స్వభావము, గుణములను ఏ
దృక్పధములలో, ఆలోచనవిధానములలో తెలుసుకోవాలో అపో. పౌలు వివరించాడు.
సువార్త యొక్క స్వభావమును గ్రహించడానికి మొదటి దృక్పథము దాని మర్మము. 25వ
వచనములో ఈ మాట వాడబడినది. “రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన
మర్మము,” గమనించండి, ప్రియులారా, దేవుని ఉద్దేశ్యములు మనము వెదకలేనంత మర్మమైనవి.
ఆయన చేసివాటి గూర్చి మనకు ఎందుకు? ఏమిటి? అని మనము అడగలేము. చెప్పవలసిన
అగత్యత ఆయనకు లేదు. అనేక సందర్భాల్లో ఆయన బయలు పరుస్తాడు, కాని అలా
చేయవలసిన అగత్యత లేదు. మనకేదీ చెప్పకుండా ఆయన చేయవచ్చు. తన రహస్యాలు
మనకు చెప్పవలసిన అగత్యత, అవసరం దేవునికి లేదు. ఎంతవరకైనా తనలోనే ఉంచుకోవచ్చు.
సువార్త చాలా కాలము మర్మముగానే ఉన్నది. అది అభివృద్ధి చెందుతున్నపుడు స్పష్టంకాలేదు.
రక్షణ ప్రణాళిక ఒక విధమైన మర్మము. అది ఇప్పుడు ప్రకటించబడుతున్నదని పౌలు
చెబుతున్నాడు. ఈ మర్మము “యేసు క్రీస్తును గూర్చిన ప్రకటనము ద్వారా” తెలియవస్తుంది.
యేసు క్రీస్తు ప్రభువు సరియైన సమయములో వచ్చారు. ఆయన ఎప్పుడు రావాలని
నిర్ణయమో అప్పుడే వచ్చాడు. గలతీ 4:4లో “కాలము సంపూర్ణమైనప్పుడు” అని వ్రాయబడింది.
ఆయన రాకకు అన్ని సిద్ధపాట్లు చేయబడ్డాక సరియైన దినమున ఆయన దిగి వచ్చాడు. యేసు
క్రీస్తు ప్రభువు ప్రకటించబడిన తరువాత ఆయనను ప్రజలు నమ్మారు. ఈ సువార్తకు విశ్వాసులను
స్థిరపరిచి బలపరిచే శక్తి ఉన్నది. అనగా నిజమైన విశ్వాసులు లౌకిక వివేకములలో, స్వంత
ఆలోచనలలో, వేదంతాలలో కొట్టుకొని పోవలసిన పనిలేదు. మనకు స్థిరమైన పునాదిరాయి,
భద్రత, నిలుకడ ఉన్నది. అన్నిటినీ మనము సంపూర్ణంగా గ్రహించలేకపోయినా, బైబిల్ గ్రంధం
బోధించేది నమ్మడం మనవంతు. సువార్త ఒక మర్మము. కాని దేవుడు దాన్ని కాలము
సంపూర్ణమైనపుడు మానవాళికి బయలు పరిచాడు.
రెండవది, సువార్త స్వభావమును గ్రహించడానికి రెండవ దృక్పథము దాని
వ్యక్తీకరణ. 26వ వచనంలో “ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన” అనే మాటలను గమనించారా?
అనగా “కనిపిస్తున్నది” అనిఅర్ధం. ఇప్పుడది మర్మము కాదు. ఇప్పుడు తెర తీయబడి, బయటికి
వచ్చేసింది. మరి వెతికి చూడాలి? “ప్రవక్తల లేఖనములద్వారా” సువార్తకు ఒకే ఒక టెక్స్ట్ బుక్
ఉన్నది, అది "డిక్షనరీ" కాదు, "ఎన్సైక్లోపీడియా" కాదు. అది పరిశుద్ధ లేఖనములున్న బైబిల్
గ్రంధం. సువార్త అంటే ఏమిటో తెలుసుకోవాలంటే బైబిల్ ఒక్కటే ఆధారం, ఇక ఏదీ లేదు.
ప్రవక్తలు దేవుని వర్తమానికులు. దేవుడు వారికి బయలుపరచింది వారు చెప్పారు, రాశారు. మరి
ఇప్పుడు స్పష్టంగా ఉందా?
అవును, “ప్రత్యక్షపరచబడుట” అంటే తేటతెల్లం చేయడం. ఎవరైనా సువార్తను నమ్మి దాని
శక్తిని అనుభవించవచ్చు. కాని తాళముచెవి ఏమిటి అనగా విశ్వాసము. విశ్వాసముతో
విధేయత చూపు! “విశ్వాసమునకు విధేయులగునట్లు” అనే మాటలను గమనించారా? ఇది
నిజజీవితములో రుచిచూచే అనుభవము. విశ్వాసమంటే ఒక తలంపు కాదు, ఒక మాట కాదు.
"నేను కూడా నమ్ముకున్నాను" అని అంటూ ఉంటారు. అది విశ్వాసము కాదు. దేవుని వాక్యమునకు
విధేయత చూపడం విశ్వాసమంటే!
సువార్త స్వభావము దాని వ్యక్తీకరణలో కనిపిస్తున్నది. అపో. పౌలు మరొక చోట ఏ విధంగా
దేవుని కృప మానవులకందరికీ ప్రత్యక్షమైనదో బోధించారు. అదే కృపచేత ఇప్పుడు మేము సువార్త
వింటున్న మీకు, చదువుతున్న మీకు స్పష్టంగా తేటపరుస్తున్నాము. మనము లేఖనములను
నమ్మినపుడు సువార్త అంటే ఏమిటో అర్థమవుతుంది. అప్పుడే సువార్త వ్యక్తీకరణను
గ్రహించగలుగుతాము.
సువార్త యొక్క స్వభావమును తెలుసుకోవడములో మూడవ దృక్పథము దాని శాసనము, ఆదేశము.
ఇక్కడ అపో. పౌలు 26వ వచనములో “నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ” అనే మాట వాడడం
గమనార్హం. నిత్యదేవుని ఆజ్ఞ ఏమిటి? అదేమిటనగా తెలుసుకున్నవారందరూ ఇతరులకు
చెప్పాలి. మనమంతా సమస్త ప్రజలకు సువార్త చెప్పాలి. మీ ఇరుగు పొరుగు, బంధువులు,
స్నేహితులు, ప్రతి ఒక్కరికీ యేసు క్రీస్తు సిలువ మీద చేసిన పాప పరిహారము గూర్చి, విమోచన
గూర్చి చెప్పాలి. ఇక ఏ మాత్రం మర్మము కాదు అని తేటగా చెప్పాలి. యేసు క్రీస్తు సువార్త, ఆయన
సిలువ, ఆయన కార్చిన రక్తము, ఆయన పాపములేని పరిశుద్ధ జీవితము, ఆయన శరీరముతో
పునరుద్ధ్ధానుడు కావడం, ఆయన తిరిగి వస్తాడానే వాగ్దానము--- ఇవన్నీ స్పష్టంగా అందరికీ
అందుబాటులో ఉన్నవి. వీటన్నింటినీ బైబిల్ గ్రంధం స్పష్టంగా తెలియచేసింది. ఇప్పుడిది
జనములు, రాజ్యములు, ప్రజలకందరికీ తెలియచేయబడింది.
ప్రియ స్నేహితుడా, సోదరీ, మీరు ఏ మారుమూలగ్రామములో ఉన్నా, మీకిదే సువార్త పిలుపు.
సువార్త దేవుని ఆజ్ఞ. ప్రతి ఒక్కరికీ, అందరికీ సువార్త అందుబాటులో ఉన్నది! రోమా పత్రిక
అంతటినీ అధ్యయనం చేశాము కదా! క్రైస్తవ విశ్వాసములోని ముఖ్య సిధ్ద్ధాంతములను
మనమంతా కలిసి అధ్యయనం చేశాము. ఇక చేయవలసినది మీరే! సువార్తను అంగీకరించి,
నమ్మి, దేవుని నిత్య రక్షణ, పాపముల క్షమాపణ, విమోచన, నిత్య జీవమును ఈ భూమీద
ఉండగానే గ్రహించి స్వీకరిస్తారా? మీరు ఆ నిర్ణయం చేసుకున్నట్లయితే మీలో కలిగిన ఈ క్రియను,
ఒక ఉత్తరం, లేదా మెసేజ్, లేదా ఫోన్ కాల్ ద్వారా మాకుతెలియచేయండి. మీకోసం ప్రార్థిస్తాము.
మీ ప్రార్థన మనవులు స్పష్టంగా తెలియచేయండి. ఇప్పటికే సువార్తను నమ్మి దేవుని కుటుంబంలో
సహోదరులు, సహోదరీలుగా ఉన్నవారు ఇతరులకు సువార్తను తెలియచేయడం దేవుని ఆజ్ఞ.
ప్రతి ఒక్కరూ “యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన” వినడం ప్రభువు మీ ద్వారా నెరవేరుస్తాడు.
అందుకు మీరు సిధ్ధమా? సువార్త లో ఉన్న దేవుని అపరిమితమైన శక్తి మనలను, సువార్త విని
నమ్మి దేవుని కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరినీ, యేసు క్రీస్తు ప్రభువు స్వరూపము
లోనికి రూపాంతరం చెందించుగాక! అమెన్!! ప్రార్థన: మీ స్వంత మాటల్లో ప్రార్ధన చేసుకొనవచ్చు.
No comments:
Post a Comment