రోమా అధ్యయనం – 55 15:22-33
సహవాసములో ఉండే ఆనందం
రేడియోవద్ద ఆశతో కూర్చోన్న ప్రతి ఒక్కరికీ, శుభములు, వందనములు. మీ ఎదుట ఉంటే మీతో షేక్ హాండ్ చేసి
దగ్గరి సహవాసములో, మీలో ప్రతి ఒక్కరినీ ముఖాముఖి చూచే కృపను ప్రభువు అనుగ్రహించా లని ఎంతో
ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీకు కూడా ఇలాంటి భారము ఉన్నట్లయితే భారంగా ప్రార్థించండి. మీరు
ప్రార్దిస్తున్నట్లయితే, ఆ విషయం మాకు తెలియచేయండి. ఈ విషయాలన్నింటికోసం మనమంతా కలిసి
ప్రార్ధించుకుందాం, ఏ మారుమూల గ్రామములో, అడవి ప్రాంతాల్లో, ఏ కొండ కోనల్లో, ఏ పట్టణములో లేదా మహా
నగరములో ఎక్కడ ఉన్నా, మన ప్రభువు యేసు క్రీస్తు మనతో ఉన్నాడు, మన మొఱలు అలకిస్తున్నాడు.
హల్లెలూయ! దైవ చిత్తమయితే మనమంతా ఒక చోట కలిసికొని సహవాసములో పాల్గొని పార్ధించే అవకాశము
ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము.
చాలాకాలం క్రిందట బెత్లేహేమునకు వెలుపల కొండ ప్రాంతములలో గొర్రెలకాపరుల వద్దకు దేవుని దూత
వచ్చి, ‘రక్షకుడు పుట్టి యున్నాడు, ఈ మహాసంతోషకరమైన శుభవార్త మీకు తెచ్చాను’ అని చెప్పినపుడు నిజంగానే
గొప్ప సంతోషం కలిగింది. కానీ ప్రస్తుతం ప్రపంచమంతా బాధలతో, వేదనలతో, నిండిపోతున్నది. కరోన వైరస్ అందరికీ
భయము, ఆందోళన, ఆర్ధిక ఇబ్బందులు, నిరుద్యోగం, కట్టుబాట్లు కడగండ్లు కలిగించింది. ఎందుకు ఇంత వేదన, శ్రమ,
బాధ, హింస ఉన్నది? సమాధానం చాలా సులభం. సంతోషం యేసు క్రీస్తులో ఉన్నది. ఆయనలో మాత్రమే ఆనందం
దొరుకుతుంది. దేవుని దూత చెప్పింది అదే కదా! రక్షకుడు మహా సంతోషాన్ని కలిగిస్తాడు.
యేసు క్రీస్తు ప్రభువులో మనము సహవాసము అనుభవిస్తుంటే సంతోషం కలుగుతుంది. ఆపో. పౌలు రోమా
15:22-33 లో సహవాసములో ఎలా సంతోషించవచ్చో బోధించాడు.
22. ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.
23. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి,
24. నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.
25. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.
26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.
27. అవును, వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు.
28. ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును.
29. నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని యెరుగుదును.
30. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును,
31. నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును,
32. మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
33. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్.
సువార్తలో ఉండే సహవాసమును మనము ఆనందించాలంటే కొన్ని పరిస్థితులు అవసరం.
మొదటిది, సువార్తలోని సహవాసములో సంతోషించాలంటే మన ఉద్దేశ్యము యొక్క ఐక్యతను అలవాటు గా ఆకళింపు చేసుకోవాలి. ఆపో. ఎలా బోధిస్తున్నాడో పరీక్షిద్దాం. 23వ వచనము గమనించండి. “అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి,” ఉన్నానంటున్నాడు. రోమ్ పట్టణములో ఉన్న తన సహోదరులను ముఖాముఖి చూడాలని ఆశించాడు. వారితో ఉండే సహవాసముకోసం తపన పడ్డాడు. ఆయన నిర్విరామ కృషి చేశాడు. ఆ చుట్టుపట్ల ప్రాంతములలో తాను వెళ్లవలసిన స్థలములు లేవు గనుక వారి వద్దకు వెళ్లాలని ఆశపడ్డాడు. వారితో ఉండి వారికి సువార్తను బోధించాలని కోరుకుంటున్నాడు. తన బావిష్యత్ ప్రణాళిక పంచుకున్నాడు. ఆయన స్పెయిన్ దేశం వెళ్లాలనే ఉద్దేశ్యముతో ఉన్నాడు. మార్గమధ్యలో వారితో కొంత సమయం గడపాలని ఆశపడుతున్నాడు. ఎందుకు ఈ విషయాలు వారికి వ్రాస్తున్నాడు? తన ఉద్దేశ్యముతో వారు కూడా ఏకమనసుతో ఉండాలని. ఈ విధంగా పౌలు వారితో ఉండాలని, సహవాసము చేయాలని, సహవాసములో ఆనందించాలనీ, ఆరాటపడు తున్నాడు గదా! వీటన్నిటిద్వారా, తన ఉద్దేశ్యముతో వారు ఏకమనసు కలిగిఉండాలని వారిని కోరుతున్నాడు. ప్రియ సోదరులారా, ఈలాంటి పరిస్థితులు మనకు సహవాసములో ఆనందము కలిగిస్తాయి. మనము ఉద్దేశ్యములో ఏకీభవిస్తే, దేవుడు సహవాసపు ఆనందమును మనకనుగ్రహిస్తాడు.
సువార్త సహవాసములో ఆనందించడానికి రెండవ పరిస్థితి కార్యాచరణలో ఐక్యత ఉండాలి. యెరూషలేములోని పరిశుద్ధులకు పరిచర్య చేయాలని ఆశిస్తున్నాడు. మాసిడోనియ, ఆకయ ప్రాంతాల్లో ఉండే విశ్వాసులు యెరూషలేములోని పెద విశ్వాసులకు చందా పంపిస్తున్నారు. ఆపో. పౌలు ఈ కానుకను వారికి అందిస్తున్నాడు. ఈ కార్యాచరణ యూదులను, అన్యజనులను ఐక్యపరుస్తుంది గనుక దీనిలో రోమా విశ్వాసులు కూడా ఏకమనసుతో ఉండాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాడు. మాసిదోనియా, ఆకయ లోని విశ్వాసులు అన్యజనులై ఉండవచ్చు. వారు, యెరూషలేములోని యూదులు ఒకరి అవసరాలు మరొకరు తీర్చడము ద్వారా కార్యాచరణలో ఐక్యపరచబడ్డారు.
యూదుల ద్వారా కలిగిన ఆత్మీయ ఆశీర్వాదములలో, అనగా సువార్తలో, యూదులు కాని అన్యజనులు భాగము పొందినందుచేత, యెరూషలేములోని పేదవారైన యూదుల ఆర్ధిక కొరతలను తీర్చడానికి అన్యజనులకు బాధ్యత ఉన్నది, అని ఆపో. పౌలు బోధన. వీరు సువార్తను ఇస్తున్నారు, వీరు వారికి ఆర్ధిక చేయూతనిస్తున్నారు. ఎంత ఐక్యత కదూ! యెరూషలేములో పౌలు భక్తుడు ఈ పరిచర్య ముగించిన తరువాత రోమా సంఘమును దర్శించి, వారి చేత స్పెయిన్ వెళ్లడానికి సాగనంపాలని కోరుతున్నాడు. కార్యాచరణలో ఐక్యత అంటే ఇదే! వారి వద్దకు వెళ్ళేటప్పుడు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణ ఆశీర్వాదముతో వస్తానని సాక్ష్యమిస్తున్నాడు. కార్యాచరణలో ఐక్యతో ఉన్నపుడే క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణ ఆశీర్వాదము కలుగుతుంది. పౌలు అడిగిన ఈ ఐక్యత సహవాసములో ఆనందము నిస్తుంది. ఈలాటి ఐక్యత కలిగే పరిస్థితులు మనము కల్పించినపుడు సహవాసములో ఆనందముంటుంది. ప్రియ సోదరులారా, మీరు నేను ఈ కార్యాచరణలో పాలుపంచుకుంటున్నాము. ఈ కార్యాచరణలో మనము పంచుకుంటున్నాము కాబట్టి మనకు సహవాసములో ఆనందమున్నది.
సహవాసములో ఆనందమునకు మూడవ పరిస్థితి, ప్రార్ధనలోని ఐక్యత ఆకళింపు చేసుకోవాలి ఆపో. పౌలు ఈ పత్రిక ముగింపులో రోమా విశ్వాసులను ప్రార్థించమని గట్టి విజ్ఞప్తి చేస్తున్నాడు. 32వ వచనం చివరలో ఏమంటున్నాడు? “మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” ఈ మాట చాలా బలమైన మాట. బ్రతిమాలడమంటే దీనంగా విజ్ఞప్తి చేయడం. యాచించడం. “మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను” “పోరాడుచు” అనే మాటకు గ్రీక్ లో వాడబడిన మాటకు అర్ధం “వేదనపడుట”
ప్రార్థన సమయం ఆడుకునే సమయం కాదు, ప్రియులారా! ప్రార్థన అంటే వేదనతో ప్రసవవేదన లాంటిది. ప్రార్థన అంటే పని చేయడం. ఆపో. ఇలాటి ప్రార్ధనలో ఐక్యతను కోరుకుంటున్నాడు. దీంట్లోనుండి సహవాసపు సంతోషం వస్తుంది. ప్రత్యేకంగా ప్రార్థించమని వారిని కోరాడు. మొదటి అంశము యూదయలోని అవిధేయులచేతిలోనుండి తాను విడిపించబడుట. వారు అవిశ్వాసులు. ఇది ముఖ్యమైన అంశము. మనము, ప్రతి దేవుని సేవకుడు, విశ్వాసి అవిశ్వాసుల చేతిలోనుండి విడిపించబడాలని ప్రార్థించాలి. రెండవ ప్రార్ధనాంశం అంశం యెరూషలేములో తాను చేసే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం చేయడం. మూడవ ప్రార్ధనాంశం 31వ వచనములో ఉన్నది. “నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును,” ప్రార్ధనలో ఐక్యత సహవాసపు సంతోషాన్నిస్తుంది. పౌలు భక్తుడు వారినడిగినట్లే ఈనాడు నేను మీలో ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాను. ఈ రకంగా ఐక్యతతో మనమంతా ప్రార్ధించినపుడు సహవాసములోని ఆనందము కలుగుతుంది. ఒకానొకరోజు మనమంతా ముఖాముఖి కలిసి ప్రార్థించే కృప ప్రభువు అనుగ్రహించవచ్చు. ఈ మూడు పరిస్థితులు మనము నెరవేరిస్తే సహవాసపు ఆనందం దొరుకుతుంది. ఏమిటవి? 1. ఉద్దేశ్యములో ఐక్యత, 2.కార్యాచరణలో ఐక్యత 3.ప్రార్ధనలో ఐక్యత. ఇంత గొప్ప సహవాసపు ఆనందం మనమంతా పొందటానికి, ఈ పరిస్థితులు నెరవేర్చడానికి యేసు ప్రభువు తన మహా కృపను మనలో ప్రతి ఒక్కొరికి సమృద్ధిగా అనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment