రోమా అధ్యయనం – 54 15:14-21
అప్పగింపబడినపని యొక్క స్ఫూర్తిని నిర్వచించడం
ఎందుకంత దిగాలుగా కూర్చొన్నారు? నిరాశపడి నీరసించిపోయారు గదూ? రేడియోకు దగ్గరగా వచ్చి ఇలా కూర్చోండి. పని భారమైనా, కుటుంబపు వేదన అయినా, దీన్నంతటినీ మీ వద్దనుండి తీసుకొని మీకు తేలికైన మనసు నివ్వడానికి యేసు క్రీస్తు ప్రభువు సిధ్ధంగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు ప్రశాంతంగా వినండి: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.” మత్తయి సువార్త 11:28
ప్రతి ఒక్కరూ చేసే పనికి ఒక ఉద్దేశ్యం, అది చేయడానికి వారికి ప్రేరణ ఇస్తున్నది ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఉద్దేశ్యo, ప్రేరణకు కారణం ఏమిటో తెలుసుకోవడం అవసరం. కొన్ని పనులు ఇక వేరే గత్యంతరం లేక చేస్తూ ఉండవచ్చు. జీవనోపాధికి కావచ్చు. డబ్బు సంపాదించడం కావచ్చు. కానీ దేవుని పని మనము ఏ ప్రేరణతో, ఉద్దేశ్యముతో చేస్తున్నామో తెలిసిఉండడం ముఖ్యమైనది. ఈనాటి ఈ అధ్యయనం దేవుని సేవకులనుద్దేశించి చెప్పబడుతున్నది. రోమా 15:14-21లో ఆపో. పౌలు దేవుని పనిలో మనకుండే ఉద్దేశము, ప్రేరణను నిర్వచించడానికి అవసరమైన బోధ చేస్తూఉన్నాడు. లేఖన భాగమును ముందుగా చదువుకుందాం:
14. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను.
15. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.
16. ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.
17. కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు.
18. ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను.
19. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.
20. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతురనియు,
21. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.
పంపబడిన పని చేయడానికి గల ప్రేరణను నిర్వచించడానికి ఈ లేఖన భాగములో దాగిఉన్న కొన్ని మూలాంశాలను పరీక్షించాలి.
మొదటిది, ముఖ్యమైన మూలాంశం, పంపబడిన పనిని చేయడానికి పిలుపు. ఆపో. పౌలు దీనిగురించి సుదీర్ఘంగా ఆలోచించాడు. రోమా లోని విశ్వాసులకు ఈ పత్రిక ఆయన ఎందుకు వ్రాశాడంటే, అది చేయాలని ఆయనకు పిలుపు కలిగింది. సజీవ నిరీక్షణ రేడియో కార్యక్రమము ఎందుకు ప్రసారం చేస్తున్నామంటే ఇది ఇలా చేయమని దేవుని పిలుపు ఉన్నది. శ్రోతలూ, అతి జాగ్రత్తగా గమనించండి, ఈ విషయం వారికి నచ్చచెప్పి వారి అవగాహనను ఎక్కువ చేయాలని పౌలు ఆరాటపడుతూ ఉన్నాడు. దీని ద్వారా దేవుని చిత్తమును బాగుగా తెలుసుకొని ఒకరికి ఒకరు బుద్ధి చెప్పే స్థాయికి వారు ఎదగాలని తన పిలుపును గూర్చి పంచుకుంటున్నాడు. 14వ వచనములో “ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్ధులై ఉన్నారని “ అనే మాటలను గమనించారా? ఇది జరగాలని ఆయన ఉద్దేశ్యం.
ఇక ఆ తరువాత “ఎక్కువ ధైర్యము కలిగి” వ్రాస్తున్నానని 16వ వచనం చివర్లో చెప్పాడు. తాను వ్రాస్తున్న విషయాలు వారు క్షుణ్ణంగా గ్రహించాలని, అవి వారి మనసుల్లో నాటాలని ఆశతో వ్రాస్తున్నానని భావము. అందుకే ధైర్యంగా వ్రాస్తున్నాడు, దేవుని సేవకులమైన మనమంతా, సంఘపెద్దలైనా, చివరకు సామాన్య విశ్వాసులైనా, ధైర్యంగా దేవుని విషయాలు, విశ్వాసము గూర్చిన విషయాలు మాట్లాడు తున్నామా? ఒక్క క్షణం ఆగి పరీక్షించుకుందాం! “దేవునిచేత నాకు అనుగ్రహింపబడిన కృప చొప్పున” అనే మాటలు 16వ వచనములో గమనించారా? దేవుని కృపనుబట్టి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు, ప్రియతోటి దైవ సేవకులారా! దేవుడు ఆయనను “అన్య జనులకు యేసు క్రీస్తు పరిచారకుడు” గా చేశాడని స్పష్టంగా సాక్ష్యమిస్తున్నాడు. వారికి సువార్తను బోధించి, సువార్తలో వారిని బలపరచి, స్థిరపరచి వారిని దేవునికి ఒక అర్పణగా అర్పించాలని ఆరాటపడుతున్నాడు. వారిని దేవుడు పరిశుద్ధపరచి అంగీకరించాలని భారంతో ఉన్నాడు. ఆయన ఈ పిలుపును నెరవేర్చాలని బలమైన కోరికతో వ్రాస్తున్నాడు. మన ఆరాటమేమిటి? బ్రతుకుతెరువా? మన భారమేమిటి? కుటుంబ క్షేమమా? వృత్తిగా చేస్తున్నామా? పేరు ప్రతిష్టకోసమా? ఆలోచించండి! మీకు ప్రభువు పిలుపు ఉన్నదో లేదో నిర్ధారణ చేసుకొనండి! మీ గురించి మీరు తక్కువగా ఆలోచించి మీరు సేవ చేస్తున్న ప్రజలకు నమ్మకమైన సేవ చేయడానికి ప్రభువు మనకందరికీ సహాయం చేయుగాక!
రెండవది, అప్పగింపబడిన పనిని నిర్వచించడములో క్రియసాధకమైన మూలాంశం పనిచేయడానికి నిబధ్ద్ధత. ఆపో. పౌలు గట్టి నిబధ్ద్ధత కలిగినవాడు. 19వ వచనం. “క్రీస్తు నాద్వారా చేయించినవాటిని గూర్చియేగాని, మరి దేనిని గూర్చియు మాటలాడతెగింపను.” తనమీద యేసు ప్రభువు ఆత్మ యొక్క శక్తి ఉన్నదనీ, సమస్తమూ క్రీస్తు మహిమకోసమే తాను చేస్తున్నాననీ సాక్ష్యమిస్తున్నాడు. దేవునికి చెందిన ఏ విషయమైనా, కేవలం ప్రభువును మహిమపరచాలని మాత్రమే చేశాడు. ఆయన ప్రభువు చెంతకు ప్రజలను నడిపించడానికి గల శక్తి ఏమిటంటే, దేవుని ఆత్మశక్తితో తన పరిచర్య చేశాడు. దాని వల్ల, యెరూషలేమంతట, చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలన్నింటిలో “క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి యున్నాను” అంటూ ధృడమైన సాక్ష్యం 19వ వచనములో సుస్పష్టంగా ఉన్నది. ఆయన యేసు క్రీస్తు ప్రభువుమీద, ఆయన పని, పరిచర్యపైన, ఆయన ప్రాయశ్చిత్తబలి మీద, నిజముగా దృష్టి సారించి, సరిచేసుకొని, కేంద్రీకరించాడు. క్రీస్తు సువార్త అంటే ఇదే! ఆయన “మరియొకని పునాది మీద కట్టకుండ” జాగ్రత పడ్డాడు.
చుట్టుపట్ల అంతటా ఆయన క్రీస్తును ప్రకటించాడు. సోదరులారా, ఈ శ్రేష్టమైన ప్రణాళిక విషయం మనము ఆలోచించడానికి సమయం తీసుకోవడం ప్రాముఖ్యమైనది. నీ సాక్ష్యం ఎలా ఉన్నది? ఎంతవరకు నీవు నమ్మతగిన వాడవని ప్రజలు నమ్ముతున్నారు? నీవు వెళ్ళిన ప్రతిచోట సువార్తను మోసుకొని, క్రీస్తును ప్రకటించి, సత్యమును గట్టిగా పట్టుకొని, సమస్తమును యేసుప్రభువుకు అప్పగించుటలో నీకు ఎంత త్యాగమున్నది? ప్రభువు పిలిచిన పనికి ప్రేరణ కలిగియుండాలంటే ఈ నిబద్ధత ప్రాముఖ్యమైన మూలంశం!
ఇక మూడవది, చేయవలసిన పని విషయం నిశ్చయత కలిగియుండడం ఫలించడానికి నడిపిస్తుంది. క్రొత్త స్థలాలను వెతకడం పౌలు కోరిక. చుట్టుపట్ల అంతటా ప్రకటించాను, ఇక ఇప్పుడు క్రీస్తుసువార్త అందని క్రొత్త స్థలాలను వెతకాలని ఆయన ఆశ. “”క్రీస్తు నామమెరుగని చోట్లను” అనే మాటలు 21వ వచనములో ఎంత స్పష్టంగా ఉన్నాయి కదూ! ఇతరులు పని చేయని చోట, క్రీస్తు సువార్త అందని స్థలాలకు వెళ్లాలనుకున్నాడు. అది ఆయన అభిలాష, కోరిక! గమనిస్తున్నారా? క్రొత్త సంఘాలు, అనగా బిల్డింగ్ కాదు, నిజమైన సంఘము కట్టాలని ఆరాటపడ్డాడు. ఇతరులు పనిచేయని చోట చేయాలనుకున్నాడు. సువార్త సత్యము ఇంకా గ్రహించని వారికి బోధించి వారిని సత్యములో జీవించేలా చేయాలని ఆయన ప్రగాఢ వాంఛ. ఇది హృదయాల్లో ఉండే పెద్ద అవసరత!
ప్రియ సోదరులారా, ఇదే నిబధ్దతో ఇప్పుడు నేను మీవద్దకు వస్తున్నాను. మీలో ఉన్న భారమును, ఆశను, ఆతురతను, ఆరాటమును బలపరచాలని, ఈ విధంగా మిమ్మల్ని స్థిరపరచాలని ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. మనమంతా కలిసి ఇంతవరకు గ్రహించని వారు దేవుని మహా కృపనుబట్టి మన అందరిద్వారా ఇతరులకు సువార్త సత్యమును అందిద్దాం. వారి ప్రాధమిక అవసరత మీలాంటిదే, నాలాంటిదే! వారు యేసు క్రీస్తును తెలుసుకోవాలి, యేసు క్రీస్తు ప్రభువు సువార్తను వినాలి. గమనించండి, పిలువబడిన పని చేయడానికి మొదటిగా, స్పూర్తి పిలుపు, రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువునకు షరతులు లేని సంపూర్ణ సమర్పణ, మూడవది, ఆపో. పౌలు జీవించి, నేర్పించిన, నిబద్ధత అత్యవసరం. పౌలు బాటలో నడుస్తూ, ఆయన సేవించిన యేసు ప్రభువును మనమంతా సేవించడానికి ఒక్కొక్కరికీ అవసరమైన కృప, ఆయన సర్వ సమృద్ధిలోనుండి అనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment