రోమా అధ్యయనం – 53 15:5-13 సత్యము యొక్క కేంద్రబిందువును తెలుసుకోవడమెలాగు?

 

రోమా అధ్యయనం – 53    15:5-13 

సత్యము యొక్క కేంద్రబిందువును తెలుసుకోవడమెలాగు?

         మీకందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ శుభములు! బాగున్నారా? భయము మిమ్మల్ని బంధించిందా? దేనికైనా 

భయమే మొదటి స్పందనగా అనుభవిస్తున్నారా? పరిశుధ్ధ గ్రంధం బైబిల్ భయపడకుము అని  కోట్లాదిమందిని 

పలుసార్లు ప్రతి పరిస్థితిలో ధైర్యపరిచింది. వారిలో నేను కూడా ఉన్నాను. మిమ్మల్ని కూడా మీ పరిస్థితులలో 

ధైర్యపరచగల శక్తి కలిగినది దేవుని మాట. ఎందుకనగా బైబిల్లో ఉన్న మాటలు స్వయాన దేవుని మాటలు. రండి, 

ఇలా రేడియోకుదగ్గరగా వచ్చి కూర్చోనండి. ప్రార్ధించుకుందాం, తలలువంచండి.   ప్రార్థన:

     ప్రతి తరములో సత్యం ఏమిటి అని అన్వేషిoనవారు, ప్రతి జాతిలో ప్రతి ప్రజలో ఉన్నారు. ప్రతి ఒక్కరి మదిలో ఈ 

ప్రశ్న మెదులుతూ ఉంటుంది. సత్యమును ఎక్కడ ఏ విధంగా తెలుసుకోవచ్చు అని ఎందరో మేధావులు, 

తత్వజ్ఞానులు, తార్కికులు, పండితులు అన్వేషిస్తూ ఉంటారు. ఇంతకూ సత్యము ఎక్కడ ఉన్నది? ఈ పూట ఈ 

ప్రశ్నకు సమాధానం బైబిల్ లేఖనాల్లో అన్వేషిద్దామా? పౌలు రోమా 15:5-13లో “సత్యము యొక్క కేంద్రబిందువును 

కనుక్కోవడం” అనే విషయమును బోధించాడు.

5-6 మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.౹ 7 కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.౹ 8-9 నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని సాప్థి౦చుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై–

ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును;

నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.

10మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు

11మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.

12మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు–

యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు

అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.”

13 కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

      ఏ స్థానాల్లో నిలుచుంటే సత్యము యొక్క కేంద్ర బిందువును తెలుసుకోవచ్చునో తెలుసుకుందాం.

మొదటి స్థానము, దేవుని మహిమను గూర్చి నొక్కి చెప్పండి. ఇది ఇక్యతలో బహిర్గతమవుతుంది. ఆపో. పౌలు తన చదువరులను ఐకమత్యంగా ఉండాలని విజ్ఞాపన చేస్తున్నాడు. 5,6 వచనాలు: “మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము...”  కాబట్టి దేవుని మహిమపరచడమును నొక్కిచెప్పండి. శ్రోతలూ, ఏకగ్రీవంగా ఐక్యతతో యేసుక్రీస్తు ప్రభువుచుట్టు చేరి ఒక్క మనసుతో ఒక్క స్వరములాగా ప్రభువును స్తుతిస్తుంటే ఎంత ఘనతగా ఉంటుందో గమనిస్తున్నారా? మరో మాటలో చెప్పాలంటే ఒకరితో మరొకరు కలిసి ఆలోచించండి, మాటలాడుకొనండి.

      దేవుని మహిమ గురించి మాట్లాడుకొనండి, అది యేసు క్రీస్తులో బయలుపడుతుంది. యేసు ప్రభువు మనలను ఉన్నదున్నట్టుగా స్వీకరించాడు, గనుక దేవుని మహిమకోసం, ఆయన ఉద్దేశ్యం కోసం మనము ఒకరినొకరము అలాగే స్వీకరించుదాం. 7వ వచనమును జాగ్రత్తగా గమనిద్దాం. “ కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి.”  దేవుడు ఏ స్థితిలోనుండి మిమ్మల్ని ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడో, ఎన్నెన్ని క్లిష్టపరిస్థితులలో మిమ్మల్ని రక్షిoచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనండి. ప్రియ సోదరీ సోదరులారా, మనము వీటన్నిటినిబట్టి దేవుని మహిమపరచాలి. మన పక్షంగా ఆయనకున్న శ్రేష్టమైన ప్రణాళిక, సంకల్పమును బట్టి దేవునికి స్తోత్రం! హల్లెలూయ! దేవుని కుటుంబములో మనలను ఉంచిన ఈ స్థితినిబట్టి ఆయనకు నిరంతరం మహిమ, ఘనత చెల్లించాలి. ఇది సత్యముయొక్క కేంద్రబిందువు. అది దేవుని మహిమను  నొక్కి చెబుతుంది.  సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందునుగాక!

      శ్రోతలూ, జాగ్రతగా వింటున్నారా? రెండవ స్థానము దేవుని వాత్సల్యతను హెచ్చించు!  మీ ధ్యానమును 8,9 వచనాలవద్దకు తీసుకెళుతున్నాను. దేవుని గొప్ప ఉద్దేశ్యమేమిటంటే యేసుక్రీస్తు ప్రభువును తన ప్రజలవద్దకు తీసుకురావడం. ఇది దేవుని వాగ్దానములమీద ఆధారపడిఉన్నది. 9వ వచనములో “క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను.” అనే మాటలను గమనించారా? ఇది యూదుప్రజలకు వర్తిస్తుంది. “పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని సాప్థి౦చుటకు” అనే మాటల్లో ఇది కనిపిస్తున్నది. చాలా సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముతో ఆయనసంతతి ద్వారా భూమి మీద ఉన్న జాతులన్నీ ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు. అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువును సూచించాడు. దేవుని ఈ వాత్సల్యతను మనము హెచ్చిస్తున్నాము. దేవుని

వాత్సల్యతను బట్టి మనము పొందిన మేలులు, కృపలనుబట్టి ఆయనను హెచ్చిస్తూ ఉన్నాము. దేవుని ఉద్దేశ్యం కేవలం యూదుప్రజలకోసం మాత్రమే కాదు, యూదుప్రజలు కాని ప్రతి జాతి గురించికూడా! 9వ వచనములో “అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును”  అని వ్రాయ బడింది. అర్ధమేమిటి? దేవుని మనసులో యూదేతరులందరూ ఉన్నారు, మీరు, నేను అందరమూ ఆ లెక్కలోకి వచ్చినవారమే! యూదులైనా, యూదేతరులైనా అందరూ దేవుని మహా వాత్సల్యతను బట్టి ఆయనను ఘనపరుస్తారు. ఇది దేవుని అద్భుతమైన బృహత్ ప్రణాళిక, సంకల్పం. ఏ జాతి వారైనా, ఏ తెగవారైనా, ఏ రంగువారైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష వారైనా, అందరూ దేవుని ఈ ప్రణాళికలో ఉన్నారు, హల్లెలూయ! సత్యము యొక్క కేంద్ర బిందువు తెలుసుకోవాలనుకుంటే, దేవుని మహా కనికర వాత్సల్యతలను ఘనపరచాలి. దాని బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరినీ వారి పాపములనుండి క్షమించి విడుదల చేస్తాడు. ప్రియ శ్రోతలూ, ఇది సత్యము యొక్క కేంద్ర బిందువు.

     మూడవ స్థానము దేవుని శక్తిని, అధికారమును గ్రహించు, గుర్తించు. ఇది ఎంత అద్బుతమైన సత్యం కదూ! ఈ వచనములద్వారా దేవుని మహా శక్తి ప్రభావములను గ్రహించుకుందాం. ఆయన ఒక్కడే అద్వితీయ సత్యదేవుడైనందు చేత ఆయన గొప్పదనమునునుబట్టి మనము సంతోషిస్తున్నాము. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యెషయ ప్రవక్త యొక్క దేవుడు అనేక సంవత్సరాల క్రితమే, “భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.” అని సెలవిచ్చాడు. యెష.46:22. ప్రియ శ్రోతలూ, ఆయన ఒక్కడే దేవుడని మనం ఇప్పుడే తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే మనము ఆయన గొప్పదనమునందు సoతోషిస్తాము. ప్రియ సోదరీ సోదరులారా, ఆయనను స్తుతించు, ఘనపరచు, సంతోషించు, ఆయన ప్రజలతోబాటు సంతోషించు.

     ఆయన రాజరికమునందు కూడా ఆనందించు. 12వ వచనములో “యెష్షయిలో నుండి వేరు చిగురు” అని వ్రాయబడింది కదూ? అది నజరేయుడైన యేసు గురించిన సూచన. ప్రవక్త ఆయన రాబోతున్నాడని అప్పుడే ప్రవచించాడు. ఆయనే ఆ “వేరుచిగురు”.  ఆయన జనములనేలబోతున్నాడు. ఆయనను జనములు నమ్ముతున్నారు. అవును, దేవుని శక్తిని మనము గ్రహించి గుర్తించాలి.

      అంతేకాదు, ఆయన శాంతి, నెమ్మది యందు మనము సంతోషించి ఆనందించాలి. ఈ ఆశీర్వచనం 13వ వచనములో ఉన్నది. “కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.”   హల్లెలూయ! దేవుడు ఎంతటి అభిషేకమును మనకిస్తున్నాడో గమనిస్తున్నారా? పరిశుధ్ద్ధాత్ముని కుమ్మరింపు మనమీద కుమ్మరించబడుతున్నది. దేవుని శక్తి, అధికారమును గ్రహించి, గుర్తించినపుడు మనము సత్యము యొక్క కేంద్ర బిందువును కనుగొంటాము, అనుభవిస్తాము.  

      ఈ మూడు స్థానములు సత్యముయొక్క కేంద్రబిందువును బయలుపరుస్తున్నాయి. నీవు దాన్ని కనుక్కోవాలనుకుంటే, దేవుని మహిమను గూర్చి నొక్కిచెప్పు. దేవుని కనికర వాత్సల్యతలను ఘనపరచు. దేవుని శక్తిని గ్రహించి, గుర్తించు. ఈ స్థానములనుండి సత్యము యొక్క కేంద్ర బిందువును నీవు కనుక్కోకలుగుతావు. దానికి అవసరమైనంత మహాకృప ప్రభువు మనకందరికీ అనుగ్రహించుగాక! అమెన్!!

 

 

 

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...