రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 50 14 7-12
వ్యక్తిగత బాధ్యత, జవాబుదారీతనం
‘జీవితం ఇంత కష్టంగా ఎందుకు సాగుతుంది’ అనుకుంటున్నారా? మీ కష్టాలు మీరే
భరించినంతవరకు కష్టంగానే ఉంటుంది. “నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.” అని
చెప్పిన యేసు క్రీస్తు ప్రభువును నీవు ఎరుగుదువా? ఆయన నీకీవిధంగా చేయాలనుకుంటే ఒక్కటే
మార్గం. నీ జీవితపు సారధ్యం ఆయన చేతిలో పెట్టు. నీ భారము ఆయన తీసికొని నీకు విశ్రాంతి,
నెమ్మది, క్షమాపణ, నిరీక్షణ అనుగ్రహించి నీకు రక్షకుడుగా నిత్యం ఉంటాడు.
మన మొదటి తల్లితండ్రులు ఆదాము హవ్వల నాటనుండి ఒకరు తాను చేసిన పాపమునకు బాధ్యత
వహించకుండా ఎవరో ఒకరిమీద నెట్టేయడం జరుగుతూనేఉంది. వారు తోటలో దాక్కొన్నపుడు కనుక్కుని ఏమి
చేశారని అడిగాడు. ఆదాము హవ్వ మీదికి నెట్టేశాడు, హవ్వ సాతను మీదికి నెట్టేసింది. కానీ దేవుడు ఎవరి క్రియల
ఫలితం వారు భరించాలని నిర్ణయించాడు. ప్రియ శ్రోతలూ, మన క్రియలకు మనమే బాధ్యత వహించాలి. ఇది వ్యక్తిగత
బాధ్యత, జవాబుదారీతనం. ఈ దినము దీనిగురించి మనము అధ్యయనం చేయడం అత్యవసరం. ఎందుకంటే ఈ
జీవితములో చేసే క్రియలనుబట్టి మరణము తరువాత ఉండే జీవితంలో ఫలితం ఉంటుంది. ఈనాటి లేఖనభాగము
రోమా 14:7-12
7. మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
8. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము.
9. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తుచనిపోయి మరల బ్రదికెను.
10. అయితే
నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము
దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.
11. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని
ప్రభువు చెప్పుచున్నాడు
12. అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.
ఈ లేఖన భాగములో మనమoదరము వ్యక్తిగత బాధ్యతను జవాబుదారీతనముతో ఏ ఏ విషయాల్లో నిర్వహించాలో ఆపో. బోధిస్తున్నాడు.
మొదటిది, మనమందరము క్రీస్తు ప్రభుత్వము క్రింద జీవించాలి. యేసు క్రీస్తు ప్రభువునకు చెందని వారు కూడా ఒకవిధంగా చూస్తే ఆయన ప్రభుత్వము క్రింద జీవిస్తున్నట్టే. వారికి ఆ విషయము తెలియదు కాని “యేసు క్రీస్తు అందరికీ ప్రభువు”. ప్రస్తుతం లోకములో సైతాను కొన్ని అధికారాలు చలాయిస్తున్నాడు, కానీ వాడి పైన, వాడి క్రియలపైన కూడా యేసు క్రీస్తు ప్రభువు అధికారము ఉన్నది. ఆయన అధికారమును గుర్తించని వారిపైన కూడా ఆయన అధికారమున్నది.
ఆయన యందు విశ్వాసముంచిన ఆయన శిష్యులమీద ప్రత్యేక అధికారమున్నది. క్రైస్తవ విశ్వాసులు ఆయన ప్రత్యేకమైన అధికారముక్రింద ఉన్నారు. అందుచేత “మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము” అని పౌలు ఉద్ఘాటిస్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, మనము ఆయన అధికారాము, ప్రభుత్వము క్రింద ఉన్నాము. ఈ సందర్భములో మరొక లేఖన భాగము గుర్తుకు తెచ్చుకుందాం. II కోరింథీ 5:6-8 “ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము” 6వ చనం “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము” మన ధైర్యమేమిటంటే దేహమును విడిచిపెట్టినపుడు ప్రభువుతో ఉంటామనే ధైర్యం. క్రైస్తవ విశ్వాసులమైన మనము మరణించినా, జీవించినా క్రీస్తు అధికారముక్రింద ఉన్నాము. ఇక వేరే చోటు మనకు లేదు.
శ్రోతలూ, గమనిస్తున్నారా, ఆయనలో జీవిస్తున్న మనము ఆయన ప్రభుత్వము క్రింద ఉన్నాము, ఆయన ఆదేశం మేరకు ఆయన అధిపత్యములో ఉన్నాము. మనకు వేరుగా ఉండే హక్కు లేదు. మనమంతా క్రీస్తు అధికారము క్రింద ఉన్నాము.
రెండవది, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడవలసి ఉంటుంది. 9వచనం: “తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తుచనిపోయి మరల బ్రదికెను.” యేసు క్రీస్తు ప్రభువు సజీవుడైన సర్వాధికారి అయిన న్యాయాధిపతి అని ఆపో. బోధిస్తున్నాడు. ప్రభువు మరణము, పునరుధ్ధానము ఎంత ప్రాముఖ్యతను సంతరించికున్నాయో మనమంతా గమనించాల్సి ఉన్నది. ప్రభువు ఏ పాపము లేని పరిశుద్ధుడుగా జన్మించి, భూమిమీదికి దిగివచ్చి. మరణించి తిరిగి సజీవుడయ్యాడు. ఆయన మన పాపముల క్షమాపణ కోసం ఇదంతా చేశాడు. మరణమును జయించిన జయశాలి యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయ! ఆయనకే యుగ యుగయుగ ములు మహిమా, ఘనత, ప్రభావములు కలుగుగాక!
ఆయనకే సమస్తమునకు తీర్పు తీర్చే అధికారము ఇవ్వబడినది. “మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలుతుము” అనే మాటలు గమనించారా? యోహాను సువార్త 5:22,23 వచనా ల్లో ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నారో వినండి: ఆ మాటలు పౌలు చెబుతున్న ఈ మాటలను ధ్రువపరుస్తున్నాయి. “ తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.” జాగ్రతగా వింటున్నారా, శ్రోతలూ? ఇక ఎవరికి ఏ అధికారము లేదు, మనమంతా యేసు క్రీస్తు ప్రభువు న్యాయపీఠము ఎదుట నిలిచిఉంటాం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందర నిలువనైయున్నాము గనుక ఇతరులకు తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. 10 వ వచనం గమనించండి: “అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల?” మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట సమానమే గనుక ఎవరికీ తీర్పు తీర్చే అధికారము లేదు.
ఇక మూడవది, క్రీస్తు ప్రభువు ఆధిపత్యం క్రింద తల మోకాలు వంచవలసిఉన్నది. ఇది చివరి సత్యము. ఆపో. పౌలు యెషయ ప్రవచనములో నుండి ఎత్తి వ్రాస్తున్నాడు. యెషయ 45:22,23. “నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను” ఈ మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో వింటున్నారా? “భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. “నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.” ఆపో. పౌలు కొంచెం వ్యాఖ్యానించి, “నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును” అని ఉద్ఘాటిస్తున్నాడు. ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభువునకు వర్తించే మాటలు. ప్రతి మోకాలు, ప్రతి నాలుక, హల్లెలూయ, దేవునికి స్తోత్రం! ఇది చివరి సత్యము. ప్రభువునందు ప్రియులారా, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ముందర నిలుస్తాము. పౌలు ఫిలిప్పీయులకు వ్రాసినపుడు ఈ సత్యమును మరలా జ్ఞాపకం చేశాడు. ఫిలిప్పీ 2:9,10. “అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” శ్రోతలూ, ఈ భయంకరమైన సత్యమును గమనించారా? జాగ్రతగా వింటున్నారా? మనమందరము క్రీస్తు అధిపత్యము క్రింద ఉన్నాము. వ్యక్తిగతమైన లెక్క విషయం చివరి లేఖనభాగములోని చివరి వచనములో ఉన్నది. “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” మీరు, నేను ఇతరుల గురించి కాదు లెక్క అప్పగించేది. మీరు నా గురించిన లెక్క అప్పగించరు, నేను మీ గురించి లెక్క అప్పగించను. ఇది ఎవరికి వారి వ్యక్తిగత విషయం. కాబట్టి, క్రీస్తు అధిపత్యము ఎదుట వంగడం ఎవ్వరికీ తప్పదు. ప్రియ శ్రోతలూ, ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట మోకరించే సమయం, నాలుకతో ఆయనను ఒప్పుకునే సమయం త్వరలో వస్తుంది. వ్యక్తిగత జవాబుదారీతనం ఒక బాధ్యత, ఉపశమనం కూడా! బాధ్యత ఎందుకంటే మనగురించి ఎవ్వరూ జవాబు చెప్పలేరు. ఉపశమనం ఎందుకంటే మనము ఇతరులకోసం జవాబు ఇవ్వనవసరం లేదు.
ప్రభువు నందు ప్రియులారా, శ్రోతలారా, ఈ సత్యములను మనస్కరించి, తీవ్రంగా ఆలోచించి మనమందరము
క్రీస్తు ఆధిపత్యం క్రింద ఉన్నామని గ్రహించాలని, దైవసేవకునిగా మీలో ప్రతి ఒక్కరికీ మనవి చేస్తూఉన్నాను.
మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడబోతూ ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరమూ క్రీస్తు ఆధిపత్యం క్రింద
ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ మనసుతో క్రీస్తు ప్రభువునకు సమర్పించుకోవడానికి తగినంత కృప
అనుగ్రహించబడునుగాక! అమెన్!!
No comments:
Post a Comment