రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 51 14 13-21
సమాధానమును వెంటాడుదాం
క్రొత్త సంవత్సరమని మురిసిపోయిన కొద్ది రోజులకే జీవితపు కష్టాలు, వేదనలు, కన్నీళ్లు ఎదుర వుతున్నాయా?
సంవత్సరం మారినంతమాత్రాన జీవితo మారదుకదా! జీవితం, హృదయం మారేంతవరకు శాంతి సమాధానం,
నెమ్మది, నిబ్బరం కలుగదు. యేసుక్రీస్తు ప్రభువునకు సమాధానమునకు అధిపతి, కర్త అని పేరు. అనగా లేనిచోట
కలిగించగల శక్తిమంతుడు. రండి, ఇలా రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి.
సంఘర్షణలేని చోటు లేదంటే అతిశయోక్తి కాదేమో! ప్రతి చోట, ప్రతి కుటుంబంలో ఏదో ఒక విషయంలో
సంఘర్షణ ఉంటుంది. మనుష్యుల మధ్యలో అభిప్రాయాల విషయంలో సంఘర్షణ ఉంటుంది. అన్నింటికంటే పెద్దది,
కీలకమైనది, దేవునికి సైతానుకు మధ్య ఉండే నిరంతర సంఘర్షణ. శాంతి సమాధానం అందరికీ ఇష్టమైనప్పటికీ,
మన స్వభావములనుబట్టి, నెమ్మది కలగడం కష్టమనే చెప్పాలి. దేవుని కృపను బట్టి, ఆయన పరిశుద్ధాత్ముని వల్ల
కలిగే ప్రత్యేకమైన అభిషేకం, పొందితే తప్ప అది అసాధ్యం.
శాంతి సమాధానాలు నీతిమంతత్వం మీద ఆధారపడి ఉంటాయి. మనలో ఎవరు కూడా యేసుక్రీస్తు
ప్రభువునకు వేరుగా ఉండి నీతిమంతులము కాలేము. కానీ సమాధానం, శాంతి, నెమ్మది మనమెలా పొంద
గలము? పౌలు భక్తుడు రోమా 14:13-21లో ఉన్న లేఖన భాగమును ఉపదేశించి ఎలా పొంద గలమో బోధించాడు.
లేఖన భాగమును చదువుకుందాం, మీ బైబిళ్లలో గమనించండి, మీకు అవకాశ మున్నట్ల యితే నాతో బాటు మీరు
కూడా బిగ్గరగా చదవవచ్చు. రోమా 14:13-21
13. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.
14. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.
15. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖంచినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తుచనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము.
16. మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.
17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.
18. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.
19. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.
20. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్ధ్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము.
21. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.
పౌలు భక్తుడు మనకోసం నిర్దేశించే ఈ మార్గాలలో మనము నడిచినట్లయితే మనము సమాధానమును వెంటాడగలుగుతాం.
మొదటిది, సమాధానము, నెమ్మది పొందడానికి మొదటి మార్గము మనకు సరయిన సమాచారo తెలిసిఉండాలి. మనము తీర్పు తీర్చకూడదు. మనకు మనమే న్యాయమూర్తులమని అపోహపడవద్దు. “కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పుతీర్చకుందము.” అనే మాటలు 13వ వచనములో గమనించారా? నీ సహోదరుని ముందర ఒక అడ్డుబండను ఉంచకుండా జాగ్రత్తపడండి. ఇతరులగురించి ఆలోచించడం ప్రక్కకు పెట్టి, నీగురించి నీవు ఆలోచించుకో! ఆహారం గురించి అయినా, లేదా మనస్సాక్షి గురించిన దేనివిషయమైనా, మన సహోదరునికి తీర్పు తీర్చకూడదు. ప్రియ సోదరీ సోదరులరా, మనమంతా అతిజాగ్రత్తగా వ్యవహరించాలి. మనము తీర్పు తీర్చడంద్వారా మన సహోదరుడు పడిపోకూడదు. దీని గురించిన సమమచారం మనము తెలుసుకొనిఉండాలి. 14వ వచనములో ఆపో. బోధిస్తున్నదేమిటి? “సహజముగా ఏదియు నిషిద్ధము కాదని, ....నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.” అందుచేత సరయిన సమాచారం తెలుసుకొని, మరొకరు మనస్సాక్షికి మనము తీర్పు తీర్చకుండా, తప్పు చేయకుండా చూసుకోవలసిన బాధ్యత మనమీద ఉన్నది.
రెండవది, సమాధానము పొందడానికి మనమెంచుకోవలసిన రెండవ మార్గము మనమంతా నిజమైన అనుదిన అన్వయం చేసుకోవాలి. చేయలేనటువంటి వాటిని విడిచిపెట్టండి. నీ సహోదరుడు నీవు తినే ఆహారమునుబట్టి నొచ్చుకుంటున్నట్లయితే అది తినడం మానేయండి. దయతో వ్యవహరించాలి, గాని నీ కిష్టము వచ్చినట్టు నీవు చేయడానికి నీ తోటి సహోదరుణ్ణి నాశనములోనికి నెట్టివేయకూడదు. దీని గురించి దీర్ఘంగా ఆలోచించి సమాధానమును వెంటాడండి. నీవు తినే ఆహారము వల్ల కీడు, నష్టము ఇతరులకు జరగనివ్వవద్దు. జీవితపు సత్యాలను, నిజాలను ఉన్నదున్నట్టు ఎదుర్కుందాం. క్రీస్తు ప్రభువు ఉద్దేశ్యమును ముందుంచుకుందాం. ఈ ప్రాముఖ్యమైన సత్యమును మనసులో నాటుకుందాం. దేవుని రాజ్యమంటే, భోజనము, పానీయము కాదు గాని, అది నీతి, సమాధానము, పరిశుధ్ధాత్మయందలి ఆనందమని గుర్తుంచుకుందాం.
దేవుని ప్రేమించి సేవించడమునకు మొదటి ప్రాముఖ్యత నిద్దాం. యేసు క్రీస్తునకు చెందినవాటిని ముందుంచుకుందాం. సంఘర్షణ తప్పనిసరి అనే విషయాన్ని ఒప్పుకుందాం. అప్పుడే మనము దేవుని అంగీకార ముద్ర, మనుషుల సమ్మతి పొందగలుగుతాం. ఇదీ అపోస్తలుని బోధన.
ప్రియ స్నేహితులారా, ఇది అనుదిన జీవితoలో చేయవలసిన సత్యము. దేవుని రాజ్యమంటే ఆహార పానీయాలకు చెందినది కాదని మనము గ్రహించాలి. ఇది వేరే రాజ్యము. అనగా దేవుని రాజ్యములో భోజనపానీయాలు లేవని అర్ధం కాదు. మనము ఈ లోకములో జీవిస్తున్నాము, దేవుని పిల్లల్లాగా మనము జీవించాలి. మన విశ్వాసాన్ని అనుదిన జీవితమునకు అన్వయించుకొని సమాధానమును వెంటాడేరీతిగా దేవుని వాక్యమును, మన విశ్వాసమును క్రియారూపకంగా ప్రకటిద్దాం.
సమాధానము పొందడానికి మూడవ మార్గము, మనకు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయోజనకారిగా ఉండాలనే ఆలోచన, అవగాహన ఉండాలి. ఇతరులను కట్టి, నాటి, అభివృద్ధి చేయడం మన ఆశగా ఉండాలని ఆపో. పౌలు హెచ్చరిస్తున్నాడు. 19వ వచనం గమనించండి, “పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే అనుసరింతము” అనగా నాటి, స్థిరపరచడం, గట్టి పునాది వేసి నిలబెట్టడమని అర్ధం. సమాధానము పడగొట్టదు, నాశనం చేయదు. కానీ అది కడుతుంది. ప్రియ సోదరీ, సోదరుడా, మనము చేసే ఏ క్రియ అయినా, ఏ ప్రయత్నమైనా, ఇతరుల విశ్వాసమును బలపర్చాలి. కానీ కూలగొట్టి, బలహీన పరచ కూడదు. ఆపో. గట్టి హెచ్చరిక, జాగ్రత్త చూపించి మనమంతా ఘనమైన ఉద్దేశ్యముతోప్రయోజనకరమైన పద్ధతిలో నడవాలని ఖచ్చిత్తంగా బోధిస్తున్నాడు. “భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి” . పవిత్రత మన వైఖరిలో ఏ చోట కనిపించకపోయినా, హృదయములో ఉంటుంది. 20వ వచనం గమనించండి. “సమస్త పదార్ధ్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము.” మరో మాటలో చెప్పాలంటే, భౌతికమైన ఏ వస్తువైనా, ఒక వ్యక్తి వాడుకున్నపుడు దానికి నైతిక విలువ కలుగుతుంది. అంచేత కూలగొట్టకండి. మన సహోదరునికి అభ్యంతరకరమైనది ఏదైనా దాన్ని విడిచిపెడదాం. “మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.”
సమాధానమును వెంటాడి పొంది, అభివృద్ధి చెందేలా చూడాలంటే, ఈ మూడు మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, సరి అయిన సమాచారం తెలుసుకొనిఉండాలి, అనగా సన్నిహిత సహవాసము ద్వారా అది తెలుసుకోవచ్చు. తీర్పు చేయకుండా ఉండండి, ఇతరులముందు అడ్డుబండ పెట్టకండి. అనుదిన జీవితములో విశ్వాసమును క్రియాత్మకంగా చూపించండి. క్రీస్తు ప్రభువును ఆయన వాక్యమును ప్రధమ స్థానములో ఉంచుకొందాం. తోటి సహోదర సహోదరీలను కట్టాలని, వారు విశ్వాసములో అభివృద్ధి చెందించాలని, అన్ని ప్రయత్నాలు చేద్దాం! ఈ విధంగా సమాధానమును వెంబడించడానికి అవసరమైనoత్త కృప మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు మనలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహించుగాక! ఆమెన్!!
No comments:
Post a Comment