రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 49 14 1-6
బలహీనులకు చేయూతనిచ్చి సహాయం చేయండి
Praise the Lord! బాగున్నారా? జీవితయాత్ర ముందుకు సాగుతున్నపుడు ఒడుదుడుకులు ఎన్నో ఉంటాయి.
వాటన్నిటిని విశ్వాసముతో సహించి తగిన రీతిగా వాటికి స్పందించి జీవించడం కష్టమే, కానీ యేసు ప్రభువు మనతో
చెప్పిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి 28 చివరివచనములో “ఇదిగో... సదకాలము మీతోకూడా
ఉన్నాను.” అని ప్రభువు చెప్పిన మాటను నమ్మండి. ప్రార్ధించుకుందాం, తలలువంచండి. ప్రార్థన:
అందరూ అన్నీ విషయాల్లో బలవంతులు కారు. కొందరు కొన్ని విషయాల్లో బలవంతులైతే మరికొన్ని
విషయాల్లో బలహీనులు కావచ్చు. బలహీనులకు సహాయం అవసరం. అది చేసినపుడు వారు బలవంతులౌతారు.
ఆపో. పౌలు రోమా 14:1-6 లో ఎలాగు బలహీనులకు సహాయం చేయాలో బోధించాడు. ఈ లేఖన భాగమును ఈ
పూట అధ్యయనం చేద్దాం.
1. విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు
2. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు.
3. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.
4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
5. ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.
6. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.
బలహీనులకు మనమందరము సహాయం చేయాలని హెచ్చరిస్తూ ఆపో. పౌలు కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఈ వాక్యభాగములో ఇచ్చారు. వాటిని మనము జాగ్రతగా అధ్యయనం చేసి వాక్యమునకు విధేయత చూపడం చాలా ప్రాముఖ్యం.
మొదటిది, ఇతరులకు సహాయo చేసేటపుడు బూటకపు వివాదములు, తర్కములు పెట్టుకోవద్దు. ఆపో. పౌలు వాటిని అనుమానపు వివాదములు అని పిలుస్తూఉన్నాడు. వాటివల్ల ఏ ప్రయోజనము ఉండదు. మనకు ఎదుగుదల, అభివృధ్ధి అవసరం. అదెలా కలుగుతుంది? మన ప్రశ్నలకు జవాబు దొరికినపుడు. అవునా? చాలా సార్లు చిన్న విషయాలగురించి ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. వాటివల్ల ఏమి దొరకదు. ఏ ప్రయోజనము లేని పనికిమాలిన ప్రశ్నలు, వివాదాలు, చర్చల ద్వారా, ఏమి సాధిస్తాం? దేవుని లేఖనములను మన అనుదిన జీవితానికి అన్వయించుకొని దాని ద్వారా అభివృద్ధి, రూపాంతరం చెందడం ప్రాముఖ్యమైనది. ఏ ఆహారం తీసుకుంటారు అనే విషయం ఆపో.మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరు కూరగాయలు, మాంసాహారం అన్నీ తినవచ్చు అంటారు, మరి కొందరు కేవలము కూరగాయలు మాత్రమే తింటానంటారు. ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే అధ్యాత్మిక జీవమును వృద్ధి చేసి మనలను క్రీస్తు స్వరూపము లోనికి మార్చడానికి ఉపయోగపడే ప్రశ్నలు అడగాలి. వాటి సమాధానము తెలుసు కున్నపుడు అవి మన హృదయాలను మార్చివేస్తాయి.
క్రీస్తునందు ప్రియులారా, దేవుని లేఖనపు సత్యమును మన అనుదిన జీవన విధానానికి అన్వయించుకోవాలి. కూరగాయలు మాత్రమే తీసుకున్నా, మాంసాహారం కూడ తీసుకున్న అది ప్రాముఖ్యమైన విషయo కాదు. ఒక వ్యక్తి అన్నీ తినవచ్చు అనుకుంటాడు, మరో వ్యక్తి కొన్ని మాత్రమే తినవచ్చు, కొన్ని తినకూడదు అనుకుంటాడు. పౌలు భక్తుడు ఇటువంటి అనవసరమైన విషయములలో జోక్యం మానేసి బాలహీనులను బలపరచమని ఉపదేశిస్తున్నాడు. ఒకవేళ ఇటువంటి వాటి విషయం వివాదాలు, జగడాలు, చర్చలు పెట్టుకోవడం మంచిది కాదు అని పౌలు భక్తుని తేటగా ఉపదేశిస్తున్న బోధ.
బలహీనులకు చేయూత నివ్వడానికి రెండవ ఆదేశం కఠినమైన తీర్పులు మానుకోండి. ఒక వ్యక్తి తీసుకునే ఆహారపధార్ధముల మీద ఆధారపడి అతనితో లేక ఆమెతో సహవాసం చేయడం మానేయవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అన్ని ఆహార పదార్ధాలు తీసుకున్నా, లేక కేవలం కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తీసుకున్నా, సహవాసమునకు అది ఆధారం కాకూడదు. దీని విషయంలో పౌలు భక్తుని దైవోపదేశం 3వ వచనములో జాగ్రతగా గమనించండి: “తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.” ముఖ్యమైన విషయం భోజనము కారణంగా సహావాసమును మానేయవద్దు. మన దృక్పథంను బట్టి తీర్పులు ఉంటాయి. కాబట్టి సరియైయన దృక్పథము ఉండాలి. ఎందుకంటే దాసుణ్ణి యజమానుడు చూసుకుంటాడు. మీరు నేను యజమాని కాదు. యజమానిముందు దాసుడు అంగీకరించబడతాడా, తిరస్కరించబడతాడా మనకు తెలియదు. తీరుపు చేయవలసిన వాడు ఆయన. చాలా సార్లు క్రైస్తవ విశ్వాసులు దేవుని స్థానములో వారున్నట్టు భ్రమించి తప్పుడు తీర్పులు తీరుస్తూ ఉంటారు. కాబట్టి కఠినమైన తీర్పులు మానేయండి. చివరికి దేవుడే తీర్పరి. 4వ వచనముపు చివరిభాగమునుబట్టి సంతోషించండి: “ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.” బలహీనులకు మనము చేయూతనిచ్చి సహాయపడాలనుకుంటే కఠినమైన తీర్పులు చేయవద్దు.
ప్రభువునందు ప్రియులారా, బలహీనులకు సహాయపడాలనుకుంటే కఠినమైన తీర్పులు చేయవద్దు. బలహీనులతో సరియైన సంబంధాలు కలిగియుండాలంటే ఈ సత్యము అర్ధం చేసుకోవడం అత్యవసరం. అప్పుడే బలహీనులకు మనము సహాయపడగలము. ఒకవేళ మనము కఠినమైన మాటలు, కఠినమైన తీర్పులు చూపించినట్లయితే, బలహీనులకు సహాయపడలేము.
మూడవది. బలహీనులకు అవసరమైన ఆరోగ్యకరమైన ఆదేశము ఇవ్వాలనుకుంటే హానికరమైన వివక్షలు మానేయండి. నిర్ణయాలు వేరు వేరుగా ఉండవచ్చు. ప్రజలు వేరు వేరు స్థాయిలలో జీవిస్తారు, నడుస్తారు, పనిచేస్తూఉంటారు. ఆపో. ఒక దినమును మరొక దినముకంటే మంచిదనుకునే ఉదాహరణను వాడుకుంటున్నాడు. “ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు;” దాని విషయము ఆపో. మంచి ప్రకటన చేయడం గమనించారా, శ్రోతలూ? “ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.” ఈ దినము కంటే ఆ దినము మంచిది అనుకునే వారు వారికి వారే నిర్ధారణం చేసుకోవాలి. బాగా తరచి చూచి ఏ నిర్ణయము ఎందుకు తీసుకొంటున్నారో ఆ వ్యక్తికి సందేహము లేకుండా తెలిసిఉండాలి. ఈ మాటలు చాలా గట్టిగా నొక్కి చెబుతున్నాయి. గమనించండి, ప్రియ సోదరీ, సోదరులారా, ఆపో. మనము మన సహోదరుని విషయమో, సహోదరి విషయమో రూఢి పరచుకోమని ఉపదేశించడం లేదుగదా? మన స్నేహితుని గురిచిగాని, మన పొరుగువారిగుంరించిగాని రూఢిపరచుకోమని ఉపదేశించడం లేదుగదా? కాబట్టి హానికరమైన వివక్షలు చేయకుండా జాగ్రత్తపడoడి. 6వ వచనం కొంచెం కష్టమైనది, కానీ కేంద్రబిందువు కీలకమైనది. “దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు;” కేంద్రబిందువు ప్రభువే. ప్రభువుతో మీ సంబంధం ఎలాగుందో దాన్నిబట్టి మీరు ఈ విషయాలకు స్పందిస్తారు. ఏ దినమైనా మీరు ప్రభువు కోసమని మంచిదిగా భావిస్తే అది ప్రభు వు కోసమే భావించండి. లేదా మీరు ఏ దినమునయినా ప్రభువు కోసం కాదని భావిస్తే దాన్ని ప్రభువు కోసం కాదని భావించండి.
మరోసారి ఆహారం విషయం పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. 6వ వచనం గమనించండి. “తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.” ప్రభువునందు ప్రియులారా, హానికరమైన వివక్షలు చూపించకపోవడం అత్యవసరం. ఒకరు ఒక విషయమును బట్టి బలహీనుడు అని నిర్ణయించడం మంచిది కాదు. ఎవరికి వారు వారు మనసులో రూఢిపరచుకోవాలి. బలహీనులకు సహాయపడాలనుకుంటే బాధపెట్టే మాటలు, హానికరమైన వివక్షలు మానేయాలి. మన క్రియలు, మాటలు ఎంత ప్రముఖ్యమో అవి ఎందుకు చేస్తునామో ఆ కారణం అంతా ప్రాముఖ్యం. బాలహీనులకు సహాయం అవసరం. వారికి ఎలా సహాయం చేయాలో అనే ప్రశ్న మనముందున్నది. ఎవరు బలవంతులో, ఎవరు బలహీనులో గ్రహించడం ఆ ప్రశ్నలో భాగం.
ప్రియ సోదరీ సోదరులారా, ఆపో. పౌలు ఇస్తున్న ఆదేశాలు సులభంగా గ్రహింపగలిగినవే గాని, సార్ధకమైనవి. చిన్నవిషయాల గురించి, అనవసరమన వాటి గురించి పనికిరాని చర్చలు, వివాదాలు మానేద్దాం. సహవాసమునకు భంగం కలిగించే కఠినమైన తీర్పులు చేయవద్దు. హానికరమైన వివక్షలు చేసినట్లయితే కొందరిని బయటకు నెట్టేసినట్టే. క్రీస్తు శరీరమైన ఆయన సంఘము ప్రేమ, నెమ్మది, ఐక్యత ఉండే స్థలము. అలాంటి సంఘముగా జీవించగల శక్తి, కృప ఆయనే మనకనుగ్రహించుగాక! ఆమెన్ !!
No comments:
Post a Comment