రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 40 11:7-12 అందరికోసం రక్షణ, పాప క్షమాపణ

 గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!

రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 40  11:7-12

అందరికోసం రక్షణ, పాప క్షమాపణ

సజీవనిరీక్షణ రేడియో శ్రోతలందరికీ యెసయ్య పరిశుద్ధనామములో శుభములు! మీరు చెప్పిన ప్రతి ప్రార్థన మనవి కోసం ప్రార్థిస్తున్నాము. కానీ మీకు బదులుగా కాదు, మీతో బాటు. అంటే ఏమిటి? మీరు దేనికోసమైనా పట్టుదలతో ప్రార్ధిస్తున్నట్లయితే, మీతో బాటు మేము విజ్ఞాపన చేస్తాము. మీరు ప్రార్థన చేయకుండా కేవలం ఇతరులపైన ఆధారపడే వారైతే అది సరికాదు. ప్రభువు నమ్మకమైన వాడు, మాట తప్పడు, న్యాయం విడువడు, కృపాతిశయము గలవాడు, అనగా కృపచూపించడంలో సంతోషించేవాడని అర్ధం. క్రుంగిన వేళలో, లేదా రాత్రి నిద్రపట్టకపోయినపక్షంలో కీర్తనలగ్రంధం చదవండి. దేవుని శక్తిగల మాటలు, ధైర్యము, నిబ్బరము, ఆదరణను కలిగిస్తాయి, ఇది నా స్వానుభవము కూడా! 

ముందుగా ప్రార్ధించుకుందాం, తలలు వంచండి:   ప్రార్థన:

బైబిల్ గ్రంధం సమస్య ఏమిటో విశ్లేషించి తెలిపే గ్రంధం. మనమందరమూ, మినహాయింపు  లేకుండా, దేవుని యెదుట, ప్రతి ఒక్కరమూ పాపము చేసినవారమని చెబుతుంది. అందుచేత, న్యాయబద్ధంగా దేవుని కోపానికి అర్హులము. మీరు నేను, యేసు క్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా నమ్మి, హృదయములో చేర్చుకునేవరకు దేవుని కోపానికి పాత్రులమే! ఆ ఘోరమైన ప్రచండమైన ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడు కరుణతో ఒక మార్గం ఏర్పాటు చేశాడు. మన స్వంత ఇష్టపూర్వక మార్గాలు పని చేయవు. కేవలం దేవుని మార్గమే పనిచేస్తుంది, అదొక్కటే మార్గం!! అవును, దేవునికి స్తోత్రం, ప్రభువు ఏర్పాటు చేసిన మార్గమే, అదొక్కటే మార్గం! దేవుడు అందరి రక్షణ, పాపక్షమాపణ కోసం ఏర్పాటు చేశాడు, అందులో నీవు, నేను ఉన్నాము. హల్లెలూయ!  దేవునికే మహాస్తోత్రo కల్గుగాక!

ఈ నాటి లేఖన భాగము: రోమా 11:7-12.

            7   ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు, ఏర్పాటు   నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.

              8   ఇందువిషయమైనేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను,          వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

              9   మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు   ప్రతిఫలముగాను ఉండును గాక.

            10  వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును    వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.

              11  కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు.

              12  వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి         తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును       అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

     

     దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాలని ఉద్దేశించినందుచేత ఏ ఏ ప్రక్రియల ద్వారా మానవులందరికీ తన రక్షణ ఏర్పాటు చేసిఉన్నాడో అది ఈ పూట అధ్యయనం చేద్దాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి నెమ్మది నిచ్చే దేవునివాక్యం వినండి.

అందరికోసం రక్షణ, పాపక్షమాపణ ఏర్పాటు చేయడములో ఉండే మొదటి ప్రక్రియ నిష్ఫలమైన వెతుకులాట.  7వ వచనము ప్రశ్నతో ఆరంభమౌతుంది. “ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు  వారు వెతుకుతున్నది, ఇశ్రాయేలీయులకు ఎందుకు దొరకలేదు? వారు స్వనీతితో వెతికారు కాబట్టి. వారికి క్రియలు ప్రాముఖ్యమైనవి. క్రియలు ముఖ్యమైనవే, కానీ దేవుని కృపను వారి క్రియలచేత పొందాలని ఆశించారు. మోషే ద్వారా దేవుడు మాట్లాడినందుచేత వాళ్ళకువాళ్లు గొప్పవాళ్లు అనుకుని గర్వించారు. దానిలో వారు అహంకారము చూపారు. ఈ విధంగా దేవుని కృపను స్వనీతితో, నీతిక్రియలచేత పాప క్షమాపణపొందాలని ప్రయత్నము చేసినారు. అది నిష్ప్రయోజనమైనదని ఆపో. స్పష్టపరుస్తున్నాడు. అందుకే వారు వెతికినది, వారు ఆశించినది, వారు పొందలేదు. అది వారిని అపజయము పాలు చేసింది. కృపలోని ఏర్పాటు ప్రకారం స్పందించినవారు మాత్రమే పొందారు, మిగిలిన వారు గుడ్డివారిలాగా చూడలేకపోయారు. వారికి ఆటంకాలు ఎదురయ్యాయి. కారణం? వారు సరిగా వెతకలేదు. దేవుడు చేస్తున్న దాన్ని జాగ్రతగా చూడలేకపోయారు. దేవుడు చెప్పేదాన్ని వారు వినలేకపోయారు. అది వ్యర్ధ ప్రయత్నం, నిష్ఫలమైన వెతుకులాట. గమనిస్తున్నారా, శ్రోతలూ? నిష్ఫలమైన వెతుకులాట స్వనీతితో ఆరంభమై స్వీయఓటమితో ముగుస్తుంది. మరోసారి గమనిద్దామా?   నిష్ఫలమైన వెతుకులాట స్వనీతితో ఆరంభమై స్వీయఓటమితో ముగుస్తుంది.   

     అందరికీ రక్షణ, పాపక్షమాపణ ఏర్పాటు చేయడములోని రెండవ ప్రక్రియ ప్రాణాంతకమైన అడ్డుబండ. 9వ వచనములో “...వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక”  అని దావీదు ఎందుకు అంటున్నాడని ఆలోచిస్తున్నారా? వారి మతపరమైన పద్ధతులు, భక్తిపరమైన క్రియలు, వారి మతమును వారు చూపించేవిధానమును గూర్చి దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బల్ల సహవాసమునకు గుర్తు. వారు దేవునితో సహవాసము కలిగిఉన్నారని చెప్పడానికి అది సూచన. కానీ దావీదు అంటున్నదేమిటి? వారి భోజనము వారికి ఉరి కావాలని కోరుతున్నాడు. ఎందుకంటే వారు దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండానే కేవలం పైపైన కనిపించేవి చేస్తున్నారు. బైబిల్ తెరచి ఉంచారా? 10వ వచనం గమనించండి.

ప్రజలు పక్షులను పట్టుకోవడానికి వల వేస్తారుకదా! చిన్న జంతువులను పట్టుకోవడానికి బోను పెడుతూఉంటారు. వారి భోజనం వారికి వలలాగా, బోనులాగా, ఒక అడ్డుబండలాగా ఉంటుందని అర్ధం. మరోమాటలో చెప్పాలంటే, వారి భోజనమే వారికి దోషభరితంగా, అపనిందగా, గాయపరిచేటట్టు మారుతుందని భావము. వారి భోజనమే వారికి కీడు కలిగించేదిగా ఉండి, వారి చేసినవాటికి వచ్చే ప్రతిఫలముగా ఉంటుందని హెచ్చరిక! అవును, సోదరీ సోదరులారా, పైపైకి కనిపించే భక్తి ప్రార్ధన, అడ్డుబండలుగానే ఉంటాయి.

     దాని తరువాత ఉటంకించబడిన వాక్యంలో వీటియొక్క ఘోరమైన ఫలితం కనిపిస్తుంది. 10వ వచనం. “  వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము...”  అడ్డుబండకు ఎంత భయంకరమైన పరిణామమో గమనిస్తున్నారా, శ్రోతలూ? పైపైకి కనిపించే భక్తి, ప్రార్ధనలకు దేవుడు ఎంత భయంకరమైన తీర్పు చేస్తాడో తెలుసుకుంటున్నారా? వారి కన్నులు చూడలేవు, వారి వీపు మోయలేనంత భారంగా ఉంటుంది. ఇంత భయంకరమైన అడ్డుబండ ఆరంభమయ్యేది పైపైకి కనిపించే భక్తి, విశ్వాసము, ప్రార్థనతోనే.

     ఇక మూడవ ప్రక్రియ ఈ క్రమములోని కిరీటము లాంటిది. అది అందరికీ నిత్యమైన రక్షణ అనుగ్రహించే ఏర్పాటు. ఈ లేఖన భాగములోని చివరి రెండు వచనాలు నాకు చాలా ఇష్టమైనవి. అపోస్తలుడు “వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా?  అనే ప్రశ్న లేవదీస్తున్నాడు. సమాధానం “అట్లనరాదు”.  ప్రియ సోదరీ సోదరులారా, ఇక్కడ దేవుని ఉద్దేశ్యం మీరు గమనించాలని ఆశిస్తున్నాను. మన చెవులకు ఇది వింతగా అనిపించినా, పౌలు విపులీకరిస్తున్నాడు. “వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను.”  మనము దేవుని ఉద్దేశ్యము ఏమిటో తెలుసుకుందాం. సర్వశక్తిగల దేవుడు ఏమి చేసిఉన్నాడో, ఏమి చేయబోతున్నాడో మనము స్పష్టంగా గ్రహించాలి.

     ఇశ్రాయేలీయుల తొట్రుపాటు అన్యజనులు రక్షించబడడానికి ద్వారం తెరిచింది. అందుకే ఈ అధ్యాయనానికి “అందరికీ రక్షణ” అనే శీర్షిక ఇచ్చాము. అన్యజనులు అంటే అందరూ, మీరు నేను, ఈ భూమ్మీద ఉన్న ప్రతి జాతి, ప్రతి జనము, ఒక్క యూదులు లేదా ఇశ్రాయేలీయులు తప్ప. ఆపో. చెబుతున్నదేమిటంటే, యూదులలో పౌరుషము కలిగించడానికి దేవుడు ఇది చేస్తున్నాడు. అందరికీ ద్వారము తెరవడంద్వార, ఇశ్రాయేలీయులు ఎక్కడ తప్పిపోయారో తెలుసుకోవాలని. ఇది దేవుని ఉద్దేశ్యం. దేవుని క్రమము కూడా ఉన్నది. 12వ వచనములో దేవుడు చేస్తున్నదాని సారాంశము ఉన్నది. గమనిస్తున్నారా, శ్రోతలూ?  వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!”  అన్యజనులైన మనకు సువార్త, రక్షణ పాప క్షమాపణ అందడానికి దేవుని క్రమము, ప్రణాళిక ఎలా ఉందో తెలుసుకుంటున్నారా? యూదుల పడిపోవడం ప్రపంచమంతటికీ దేవుని ఐశ్వర్యం అనుగ్రహించాడానికి ద్వారo తెరిచింది. వారు పోగొట్టుకున్నది మనకు దొరుకుతున్నది. ఇది దేవుని ప్రణాళిక. చివరలో పౌలు ఒక వాక్యం ఇస్తున్నారు.వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!” అవును, ప్రియ సోదరీ సోదరులారా, దేవుని బృహత్తర ప్రణాళిక అందరి రక్షణ కోసం జగత్తు పునాది వేయకముందే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం! ఇక స్వనీతికి, నీతిక్రియలకు ఏ ఫలితం ఉండదని గుర్తుంచుకోండి.  పైపైకి భక్తి, ప్రార్థన విశ్వాసము చూపించడం అడ్డు బండే అవుతుంది. దేవుని ప్రణాళికలో నీవు రక్షించబడడం ఉన్నది. విశ్వాసంతో స్పందించి ఆమూల్యమైన రక్షణ పొందుతావా? అట్టి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించుగాక! 

 

 

    

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...