రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 41 11:13-24
అవిశ్వాసం అనే విషాదం
క్రుంగిపోయి నిరాశలో ఉన్నారా? యేసు క్రీస్తులో నిరీక్షణ ఉన్నది. ప్రభువు నీ నిరాశ నుండి నిన్ను ఇప్పుడే విడిపించగల శక్తిమంతుడు. “యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు” కీర్తన 145: 14. “అందరిని” అన్నప్పుడు అందులో నీవు కూడా ఉన్నావుకదా! ఈ వాక్యము కంఠస్థం చేయండి. నీవు లేచి ఆయనతో నీ సంబంధమును సరిచేసుకొని, ఆయనచేతిలో నీ చేయి వేసి నడవడానికి సిద్ధమా? లేచి మీ బైబిల్, నోట్ బుక్ పెన్ తెచ్చుకొనండి, దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం.
ప్రతి ఒక్కరికీ ఒక పరిమాణములో విశ్వాసము ఉంటుందని బైబిల్ గ్రంధం సెలవిస్తుంది. దీని అర్ధం ఏమిటంటే మనము విశ్వసించగల శక్తితో దేవుడు సృష్టించాడు. ఏది విశ్వసిoచాలో నిర్ణయించుకుంటారు. విశ్వసించ వద్దనికూడా ఎంచుకోవచ్చు. మనము ఒక అబద్ధమునైనా విశ్వసించవచ్చు, కానీ అప్పుడు మోసపోతాము.
విశ్వసించినపుడు ప్రతిఫలము ఉంటుంది. బైబిల్ బంగారు వాక్యం ఏమంటున్నది? “విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” యోహాను సువార్త 3:16 యేసు ప్రభువును విశ్వసించినవారికి నిత్యజీవము బహుమానము. విశ్వసించకపోవడమునకు కూడా ప్రతిఫలము ఉన్నది. విశ్వసించని వారు నిత్య నరకములో వేయబడతారు. విశ్వసించడమైనా, విశ్వసించక పోవడమైనా, రెండూ మనకు సాధ్యమే. విశ్వసించడమునకు మంచి ప్రతిఫలము, విశ్వసించకపోవడానికి చెడు ప్రతిఫలము ఉంటుంది. పౌలు రోమా పత్రిక 11:13-24 లో అవిశ్వాసమనే విషాదము గురించి బోధించాడు.
13. అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,
14. వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను.
15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?
16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.
17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన
18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు.
19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.
20. మంచిది; వారు అవిశ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;
21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.
22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.
23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.
24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా?
అవిశ్వాసమనే విషాదమును మనము అర్ధం చేసుకోవాలంటే, ఈ లేఖన భాగములో దానికి సంబంధించిన మూడు మాటలను మనము పరీక్షించాలి:
మొదటిది, అవిశ్వాసానికి సంబంధించి తిరస్కరించుట ప్రాముఖ్యమైన మాట. పౌలునకు రెండు గుంపులు మనసులో ఉన్నారు. 13వ వచనములో అన్యజనులగురించి వ్రాశాడు: “అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను.” అనే మాటలు గమనించారా? ఆ తరువాత తన ప్రజలైన యూదుల గురించి 14వ వచనములో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవునికి దూరస్థులైన అన్యజనులు ఉన్నారు. వారిలో విశ్వసించినవారు సమీపస్థులైనారు. యూదులు కూడా ఉన్నారు, వారు దేవుని ప్రజలు, కానీ అవిశ్వాసమునుబట్టి వెలివేయబడ్డారు. 15వ వచనములో ఈ వెలివేత గురించి అపోస్తలుడు మాట్లాడుతున్నాడు. ఈ తిరస్కరించుటను రెండు గుంపులు నిరూపించిన విధమిదే! సమీపస్తులైన అన్యజనులు, వెలివేయబడ్డ యూదులు. యూదులకు దేవునితో దగ్గరి సంబంధం, చాలా దగ్గరి సంబంధం ఉన్నది. ఎందుకంటే దేవుడు అబ్రహామును అనేక సంవత్సరాలక్రితమే యూదులకు తండ్రిగా ఉండాలని, వారు హెబ్రీయులనే జాతి గా ఏర్పాడాలని ముందే ఏర్పాటు చేసిఉన్నాడు. ఆ తరువాత వారిని ఐగుప్తు నుండి విమోచించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఆయన ద్వారానే వారికి ధర్మశాస్త్రమును ఇచ్చి, పది ఆజ్ఞలను అనుగ్రహించి, బైబిల్లోని మొదటి ఐదు గ్రంధాల్లో ఉన్న ఆజ్ఞలన్నీ వారికిచ్చాడు.
ఆ తరువాత దేవుడు దావీదును ఎన్నుకొని వారిని ఒక్క జాతి, ఒక్క ప్రజగా చేశాడు. దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని వారిని తన వాక్కుతో పంపించి తన ప్రజలవద్దనుండి ఆయన ఏమి కోరుతున్నాడో, ఎలా వారు జీవించాలని ఆశిస్తున్నాడో తెలియచేశాడు. తిరస్కరించడం యొక్క అర్ధం 15వ వచనములో అది తెలియపర్చబడింది. “వారిని విసర్జించుట….” అన్న మాటలు గమనించండి. తిరస్కరించడo వారు చేసిన పని. దేవుని మాటకు విధేయత చూపలేదు, ఆయన మాటను లెక్క చేయలేదు. ఇది విషాదకరమైన సంగతి. ఈ విషయం చాలా జాగ్రతగా గమనించండి. ఆయనకు విధేయత చూపని వారిని దేవుడు తిరస్కరిస్తాడు. ఈ విషయం గ్రహించినపుడే తిరస్కరించుట యొక్క విషాదము ఏమిటో మనకు అర్థమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే, అవిధేయులు, అనగా దేవునికి విధేయత చూపనివారు మొదట దేవుని తిరస్కరించారు. గనుక దేవుడు వారిని తిరస్కరించకతప్పదు.
అవిశ్వాసమునకు సంబంధించి రెండవ మాట తీసివేయడం. ఇక్కడ కూడా రెండు తలంపులు అనగా రెండు ఒలీవ చెట్లు ఉన్నవి. ఒకటి మంచి ఒలీవ చెట్టు, రెండవది అడవి ఒలీవ చెట్టు. అడవి ఒలీవచెట్టు కొమ్మలు మంచి ఒలీవ చెట్టుతో అంటు కట్టబడినట్టు గమనిస్తున్నాము. గమనించండి, మంచి ఒలీవ చెట్టు సేద్యముచేయబడుతున్న చెట్టు. నాకు తెలిసినంతమట్టుకు సేద్యముచేయబడుతున్న ఒలీవ చెట్టు పెద్దగా ఏపుగా పెరుగుతుంది, బలంగా ధృడంగా ఉంటుంది, అడవి ఒలీవచెట్టుకంటే ఎక్కువ పళ్ళు కాస్తుంది. ఇక్కడ పోలిక ఏమిటి? యూదులు సేద్యముచేయబడిన ఒలీవ చెట్టు. ఈ చెట్టునుండి పళ్ళు కాయని కొన్నికొమ్మలు విరిగిపోయాయి. అప్పుడు వాటి స్థానంలో అడవి ఒలీవచెట్టు కొమ్మలు మంచి ఒలీవచెట్టుతో అంటుకట్టబడ్డాయి. ఈ అడవి ఒలీవ చెట్టు సేద్యముచేయబడిన ఒలీవచెట్టు అంత పళ్ళు కాయలేదు. అది చిన్న చెట్టు, అంత బలమైనది కాదు. అడవి ఒలీవ చెట్టు కొమ్మలు అనగా ఏమిటి? అన్యజనులు. యూదులు కాని వారందరూ అన్యజనులే. వారు సేద్యము చేయబడిన ఒలీవ చెట్టుతో అంటుకట్టబడ్డారు.
స్వాభావికమైన కొమ్మలు, స్వాభావికం కాని అడవి కొమ్మలు ఉన్నాయి. కొన్ని స్వాభావికమైన కొమ్మలు విరిగిపోయాయి. ఆపో. 20వ వచనములో అవి ఎందుకు విరిగిపోయాయో వివరిస్తున్నాడు “అవిశ్వాసమునుబట్టి”. సేద్యము చేయబడిన మంచి ఒలీవ చెట్టుతో అంటుకట్టబడిన అడవి ఒలీవచెట్టు కొమ్మలు విశ్వాసమునుబట్టి నిలిచిఉన్నాయి. ఏ అనుమానము లేకుండా, ప్రశ్నలు లేకుండా ఈ సత్యమును మనము గమనించాలి. అవిశ్వాసము అనే విషాదమును తీసివేయబడడం అనే మాట వివరిస్తున్నది. స్వాభావికమైన కొమ్మలు అవిశ్వాసమునుబట్టి తీసివేయబడ్డాయి, లేదా విరిగిపోయాయి.
అవిశ్వాసమునకు సంబంధించిన మూడవ మాట, ఖచ్చితమైన, ప్రాముఖ్యమైన మాట సరి అయిన స్థానములో ఉండుట. ఇక్కడ దేవునినుండి రెండు స్పందనలు కనిపిస్తున్నాయి. 22వ వచనములో ఈరెండు కలిపి వ్రాయబడ్డాయి. అవేమిటో తెలుసుకుందాం. “ దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును,” అనుగ్రహము అంటే దేవుని దయ. దేవుడు మనలను కరుణతో చూస్తున్నాడు. కాఠిన్యము అంటే దేవుడు ఖచ్చితమైన న్యాయదృష్టితో చూస్తాడు. జాగ్రతగా గమనించవలసిన అంశం ఇది. ఎవరు అవిశ్వాసముతో, అవిధేయతతో ఆయన మాటను లెక్కచేయక తిరస్కరిస్తారో, వారిని కఠినంగా చూచి తగిన శిక్ష వేయడం దేవుని తపనిసరి స్పందన. దేవునికి విధేయత చూపనివారిని ఆయన తిరస్కరిస్తాడు. తీసివేయబడినవారు ఎవరు అనగా ఆయనయందు విశ్వసముంచనివారు. ఆయన తన నిత్య న్యాయము తప్పడు, ఆయన వ్యక్తిత్వము ప్రకారమే చేస్తాడు. విశ్వాసముంచక అవిధేయత చూపిన వారిమీద ఆయన కఠినత్వము కనబరుస్తాడు. విశ్వాముంచి విధేయత చూపినవారికి మంచితనము కనుబరుస్తాడు. దేవుని ఈ రెండు స్పందనలను జాగ్రతగా గమనిస్తున్నారా?
ఇక ఇప్పుడు ఆపో. వివరించేదేమిటంటే, మంచి ఒలీవచెట్టులో నిలిచిఉండడానికి ఒకే ఒక్క మార్గము దేవుని దయలో కొనసాగిపోవడమే! 22వ వచనములో ఆయన ఏమంటున్నాడు? “నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల....” అప్పుడు దేవుడు నీ పట్ల మంచితనము, దయ కనుబరుస్తాడు. పట్టుదలతో నిలిచిఉండడం తప్పనిసరి. మన క్రైస్తవ జీవితాల్లో సడలింపు, మినహాయింపు ఉండవు. మంచి ఒలీవ చెట్టు తనతో అంటుకట్టబడిన అడవి ఒలీవచెట్టు కొమ్మల భారమును వారు దేవుని అనుగ్రహములో నిలిచినoతసేపు భరిస్తుంది. ఇంకొంచం వివరణ చూద్దాం. మంచి ఒలీవచెట్టు లోని తీసివేయబడిన కొమ్మలు వారి అవిశ్వాసం, అవిధేయతలో కొనసాగకుండా ఉన్న్ట్లట్లయితే వారిని మళ్ళీ అంటుకట్టడం దేవునికి సాధ్యమని పౌలు భక్తుడు బోధిస్తున్నాడు. ఇది 23వ వచనములో స్పష్టంగా ఉంది. “వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.” అవును, ఆయన మంచితనమునుబట్టి, కఠినత్వమును బట్టి దేవునికి స్తోత్రం! వారిని మళ్ళీ అంటుకట్టడములో దేవుని మంచితనము కనిపిస్తున్నది. దేవుని కరుణ, ఆయన మంచితనము, ఆయన కఠినత్వము ద్వారానే సరి అయిన స్థానములో ఉండడం సాధ్యం.
అవిశ్వాసమనే విషాదం నీ జీవితములో జరగకూడదని ఆశిస్తే, ఈ మూడు మాటలను అర్ధం చేసుకోవాలి. అవిధేయతను బట్టి
తిరస్కారం కలుగుతుంది. అవిశ్వాసమును బట్టి తీసివేయడం జరుగుతుంది. దేవుని దయ, కరుణనుబట్టి సరయిన స్థానములో
ఉండడం జరుగుతుంది. ప్రియ మిత్రమా, యేసు క్రీస్తునందు విశ్వాసముంచమని నిన్ను బ్రతిమాలుతున్నాను. అప్పుడే
అవిశ్వాసమనే విషాదమును నీవు తప్పించుకోగలవు! ఇప్పుడే ప్రభువును వేడుకో!!
No comments:
Post a Comment