గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!
రోమా పత్రిక అధ్యయనం -39 11:1-6
కృప యొక్క ఏర్పాటు (కృపలో ఎన్నుకొనుట)
కృపలో లేదా కృపను బట్టి దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేశాడు అనే బైబిల్ సిధ్ద్ధాంతము యొక్క వివరణలు గమనించండి:
మొదటిది, ఆపో. పౌలుయొక్క స్వయం మాదిరి, లేదా ఉదాహరణ. దీనిద్వారా మనము కృపలోని ఏర్పాటును గ్రహించవచ్చు. మొదటి వచనములో ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. “దేవుడు తనప్రజలను విసర్జించెనా?” “అట్లనరాదు” అంటూ కాదని గట్టి జవాబిస్తున్నాడు కదూ! తన స్వంత ఉదాహరణ ఇస్తూఉన్నాడు. పౌలుగారి దినాల్లోనే దేవుడు ఇక ఇశ్రాయేలును విడిచిపెట్టాడని చాలామంది నమ్మారు. అందరినీ ఒకే గూటిలో పెట్టేశారు. కానీ దేవుడు జనములను అందరినీ ఒకే ఉద్దేశ్యముతో, ఒకే కోణములో చూడడు అనే విషయాన్ని వారు గ్రహించలేదు, గ్రహించడానికి ప్రయత్నముకూడా చేయలేదు. దేవుడు ఒక్కొక్కరితో వేరువేరుగా వ్యవహరిస్తాడు. ఇది మనలో ప్రతి ఒక్కరూ గ్రహించడం చాలా ప్రాముఖ్యం.
అంచేత పౌలు గారు, కాదు కాదు, దేవుడు తన ప్రజలను విసర్జించలేదు అని ఉద్ఘాటిస్తున్నాడు. దీన్నoతటినీ మొత్తంగా గ్రహించుదాం. దేవుడు తన ప్రజలను త్రోసివేయలేదు అని చెప్పడానికి, తానే ఒక ఉదాహరణ అని పౌలు తేల్చి చెపుతున్నాడు. దానికి రుజువుగా తన వంశపు నేపధ్యం గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటి వచనములో “నేనుకూడ ఇశ్రాయేలీ యుడను,” అనే మాటలు గమనించారా, శ్రోతలూ?
పౌలు తన ప్రజాలైన ఇశ్రాయేలీయులనుగూర్చి, అనగా దేవుని ప్రజలగూర్చి మాట్లాడుతూఉన్నాడు.
“ అబ్రహాము సంతానమందలి” వాడనని కూడా చెబుతున్నాడు. “ఊరు” అనే కల్దీయుల పట్టణము నుండి దేవుడు అబ్రహామును పిలిచి ఏర్పాటు చేసుకొని గొప్ప జనముగా ఆయనను చేస్తానని వాగ్దానమిచ్చిన వాడే అబ్రహామని మనకు, అంతే కాదు, ప్రతి యూదునికి తెలుసు. అబ్రహాముద్వారా, దేవుడు మనకోసం రక్షకుడు మెస్సీయాను తీసుకురావాలని ఆయన ఏర్పాటు.
ఆ తరువాత పౌలు, “బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.” అని చెబుతున్నాడు. అవునా? దీనoతటి ఆధారంగా పౌలు చెప్పతలచిందేమిటి? దేవుడు తన ప్రజలను త్రోసివేయలేదని చెప్పడానికి తానే ఒక ఉదాహరణ అని పౌలు బోధన. కాబట్టి పౌలు ఉదాహరణద్వారా కృప యొక్క ఎన్నిక లేదా ఏర్పాటు అంటే ఏమిటో ఇప్పుడు మనకు అర్ధం అయిందని నమ్ముతున్నాను.
రెండవది, కృప యొక్క ఏర్పాటునకు మరొక ఉదాహరణ ఏలియా అని మనము తెలుసుకోవచ్చు. ఏలియా ప్రవక్త చాలా దుఖ:ముతో క్రుంగి పోయాడు. దానికి కారణమైన పరిస్థితులు ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు విగ్రహారాధనకు బానిసలైపోయారు. వారు బయలు అనే పేరుగల విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఈ దేవత ఫిలిస్తీయులు, కనానీయుల దేవత. అది ఒక విగ్రహం, ఒక బొమ్మ మాత్రమే, వాళ్లను ఐగుప్తు నుండి విమోచించిన సజీవుడైన సత్యదేవుణ్ణి విసర్జించి, ఇతరులు దేవుడని పిలుస్తున్న ఈ విగ్రహాన్ని ఇశ్రాయేలీయులు ఆరాధిస్తు ఉన్నారు. ఏలియా వాళ్ళను కర్మెలు పర్వతం మీద పోగు చేసి, ఒక నిర్ణయం తీసుకోమని హెచ్చరించి, బయలు ప్రవక్తలందరినీ కీషోను వాగువద్ద మట్టుబెట్టించాడు. దాంతో రాణి ఆయనపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నది. అప్పుడు ఏలియా ప్రవక్త పారిపోయాడు. ఎంత దూరం పారిపోయాడంటే, సీనాయి అరణ్యములో ఉన్న హోరేబు పర్వతం వరకు పారిపోయాడు. అక్కడ దేవుడు ఆయనను కలుసుకున్నాడు. ఇశ్రాయేలు పక్షంగా ఏలియా ప్రవక్త దేవునికి మొరపెట్టింది అక్కడే! అప్పుడు ఏలియా చెప్పిన మాటలను ఇప్పుడు పౌలు మన లేఖన భాగములోని 3వ వచనములో ఉటంకిస్తున్నాడు. “ ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారు.” ఏలియా ప్రవక్త ఎంత వేదనపడుతున్నాడో గమనిస్తున్నారా? ఆయన మిక్కటంగా నిరాశపడి తాను చేసిందంతా ఫలితము లేకుండా పోయిందని చాలా బాధ పడుతున్నాడు.
కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి, దేవుడు ఆయనను గద్దించి, “బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.” అని చెప్పాడు. దేవుడు వారిని చూశాడు, ఏలియా వారిని చూడలేదు. కానీ, ఏలియా అనుభవం కృప యొక్క ఏర్పాటు ఏమిటో మనం అర్ధం చేసుకోవడానికి సరిపోతున్నది. “
ఇక మూడవది, కృపయొక్క ఏర్పాటును అర్ధం చేసుకోవడానికి క్రియలు పనికి రావు, అనవసరమని గ్రహించాలి. 5,6 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏలియాతో కలిపి దేవుని వద్ద ఉన్న శేషము ఏడువేల ఒకటి. గమనించారా ? ఐదవ వచనము ఏమంటుంది? “ఆలాగుననే ఇప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.” కృపలోని ఏర్పాటునకు స్పందించిన కొందరు మిగిలిఉన్నారని పౌలు బోధన. దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకోవడానికి కృప చూపించాడు, వారు స్పందించారు.
కృప కాలాతీతమైనది. అవును, కృప కాలాతీతమైనది. ఏలియా కాలమునుండి, పౌలు కాలము వరకు కృప అనుగ్రహించబడుతూనేఉంది, అందుచేత శేషము మిగిలిఉన్నదని పౌలు బోధిస్తున్నాడు. అందరూ ఎలాగున్నా, ఏ విధంగానైనా రక్షించబడతారు అనే సిద్ధాంతమునకు తావులేదు, ప్రియ సోదరీ, సోదరులారా? మరో మాటలో చెప్పాలంటే, దేవునికి సరియైనరీతిలో స్పందించినవారే కృప పొందుతారు. వారే శేషములో ఉంటారు. కృప నిర్ణయాత్మకమైనది, 6వ వచనం నిర్ణయాత్మకమైనది. “అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.” కృప, క్రియలు రెండింటినీ కలపలేము. కృపచేత రక్షణ పొందవచ్చు, లేదా క్రియలను నమ్ముకొని రక్షణ పొందకకోవచ్చు. నిర్ణయంమీదే!
ప్రియ స్నేహితుడా, సోదరీ, దేవుడు తన కృపను అనుగ్రహించిన సత్యమును పౌలు, ఏలియాల ఉదాహరణలద్వారా అనుగ్రహించాడు. క్రియలకు కృపలో తావు లేదు. ప్రభువు ఇప్పుడుకూడా కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు ! కృపను పొంది నీ పాపమును శుద్ధిచేసుకుంటావా? క్రియలమీద ఆనుకొని మోసపోతావా? నిర్ణయం నీదే! నిత్యత్వమును గూర్చిన సరియైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభువే మీకు సహాయం చేయుగాక! ప్రశ్నలు సందేహాలు, ప్రార్థన అవసరతలు ఉన్న్త్లట్లయితే, 8143178111 ఫోన్ నంబర్ లో సంప్రదించండి. సర్వశక్తిగల దేవుని నిత్యకృప, ఆయన ఆత్మవలనకలిగే కనువిప్పు, శక్తి మనమందరికీ తోడుగా ఉండుగాక! ఆమెన్ !!
No comments:
Post a Comment