- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- or send a message by WhatsApp to 8143178111
రోమా పత్రిక అధ్యయనం - 5
అవిశ్వాసము యొక్క త్రోవక్రమము
మనమెరుగని రోడ్డు, త్రోవ, లేదా ప్రాంతo లాంటిది జీవితo.
ఆ రోడ్డులో జంక్షన్లు ఉండవచ్చు, లేదా పాయలుగా చీలి వేరే వైపు మళ్లించే చిన్న
రోడ్లు ఉండవచ్చు. రోడ్డు మరికొన్ని చిన్న రోడ్లుగా మారిపోవచ్చు, లేదా కొన్ని
ప్రక్క రోడ్లు ఉండవచ్చు. మనము అలాంటి స్థలములకు వచ్చినపుడు, వెంటనే ఎటువైపు
వెళ్లాలో, మళ్ళాలో మనకు వెంటనే తెలియకపోవచ్చు.
జీవితమును ఒక
త్రోవతో పోల్చుకోవచ్చు. ఆ త్రోవలో మైలురాళ్ళు ఉండవచ్చు, మనము ఎక్కడ ఉన్నామో తెలిపే
బోర్డులు ఉండవచ్చు, ఎలా వెళ్లాలో తెలియచెప్పే వ్రాతలు ఉండవచ్చు. మార్గంలో కొన్ని
బోర్డులు ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలు, లేదా కాలనీల వివరాలు తెలపవచ్చు. ఈ జీవితంలో
ప్రతి రోడ్డు ఏదో ఒక స్థలమునకు నడిపిస్తుంది. మనము వెళ్ళవలసిన స్థలానికి నడిపించే రోడ్డును
ఎంచుకోవడం ప్రాముఖ్యమైనది.
మన జీవితం మహిమ వైపునకు, లేదా పరలోకానికి నడిపించే రోడ్డు. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళడానికి సరియైన రోడ్డు ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడప్పుడు జీవనమార్గములోని ప్రజలకు వారు ఎక్కడకి వెళుతున్నారో తెలియదు. ఆపో. పౌలు రోమీయులకు 1:24-32 లో వారిని గూర్చి, అవిశ్వాసము యొక్క త్రోవక్రమము విషయం వ్రాసి ఉన్నాడు.
24. “ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్.26. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.27. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి. 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును 31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.”
ఇది అవిశ్వాసపు త్రోవక్రమమును వివరిస్తున్నది. ఈ అవిశ్వాసపు
త్రోవక్రమము కొన్ని ఖచ్చితమైన స్థాయిలలో కనిపిస్తూ ఉంటుంది. వాటిని మనము పరిశీలించాలి.
ఆవిశ్వాసపు త్రోవక్రమములో మొదటి స్థాయి స్థితితప్పిన ఆరాధన లేదా తప్పుడు ఆరాధన అని చెప్పవచ్చు. మనుషులు ఈ త్రోవలోనికి
వెళ్తే, 24 వ వచనం ప్రకారం “వారు తమ హృదయముల దురాశలను అనుసరించి….. అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.” దేవుడు తన కట్టుబాటును విడిచిపెట్టినాడు. కారణం, వారు దేవుణ్ణి తిరస్కరించారు. కాబట్టి అపవిత్రమైన కామవాంఛలు విస్తరిస్థాయి. అడవిలో చెట్లు విచ్చలవిడిగా
పెరిగినట్టు అవి పెరుగుతాయి. దేవుడు మానవులను విడిచిపెట్టినపుడు వారు దేవుని
ఆరాధించడానికి బదులు సృష్టిని ఆరాధిస్తారు. వారు పరస్పరం వారి శరీరాలను
అవమానపరచుకుంటారు, దాన్ని బట్టి దేవుని సత్యమును ప్రక్కకు నెట్టివేసి, నిత్యం
స్తుతించబడుతున్న ధన్యు డైన దేవునికి మారుగా సృష్టిని ఆరాధిస్తారు. నేను దీన్ని
జంతువులకంటే హీనమైన స్పందన అంటాను.
తప్పుడు ఆరాధన చేస్తే ఏమి జరుగుతుందో చూస్తున్నారా? దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా వారు వారిని లేదా సృష్టించబడిన వాటిని ఆరాధిస్తుంటారు. ఈ జ్ఞానులు బుధ్ధిహీనులై దేవుని ఆరాధించడానికి బదులుగా జీవములేని నశించేపోయే మానవులను, లేదా పక్షుల ప్రతిమలను, లేదా నాల్గుకాళ్ళ జంతువుల ప్రతిమలను, లేదా ప్రాకు వాటి ప్రతిమలను ఆరాధిస్తుంటారు.
నా మిత్రమా,
బైబిల్ బోధించే సత్యం నిజంగా దేవుణ్ణి ఆరాధించడానికి నడిపించే మార్గం. అవిశ్వాసపు
త్రోవ క్రమము తప్పుడు ఆరాధన వద్దకు నడిపిస్తుంది. ఆవిశ్వాసపు త్రోవక్రమములోని
మొదటి స్థాయి ఇదే!
ఆవిశ్వాసపు
త్రోవ క్రమములో రెండవ స్థాయి లేదా రెండవ దశ తప్పుడు గురివైపు ఉంచే అభిలాష మళ్ళీ దేవుడు తన కట్టుబాటు తీసివేసిన సంగతి
మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే 26 వ వచనంలో “దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను.” అని మనం చదువుతున్నాము. తప్పుడు అభిలాష
గురిoచి నేను మాట్లాడుతున్నాను. పౌలు తుచ్ఛమైన అభిలాష అంటున్నాడు. దుష్ట అభిలాషలు,
లేదా పాపిష్టి కోరికలు, లేదా కిరాతకమైన కోరికలు
అని అర్ధం. దుష్ట ప్రేమ, దుష్ట నైతికవిలువలు, ఇవి అపరాధముతో, దోషముతో నిండినవి. ఈ
దుష్ట నైతికవిలువలనుబట్టి, స్త్రీలు వారి స్వభావసిద్ధమైన క్రియలకు బదులు స్వభావానికి విరుద్ధ్ద్ధమైన వాటిని ఎంచుకుంటారు.
ఇది జంతువులకంటే హీనమైన అధమమైన స్పందన. స్తీలు స్త్రీలతో లైంగిక సంబంధాలు
పెట్టుకోవడం ఎంతటి హీనం!
27 వ వచనంలో
ఇంకొంచం వివరణ ఉంది. “పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు ……ఒకరియెడల ఒకరు కామతప్తులైరి” ఇది తప్పుడు అభిలాష. స్త్రీ పురుషునితో జీవించినట్టు మరొక
పురుషునితో జీవించడం గాని, లేదా పురుషులు భార్య భర్తలలాగా జీవించడం దేవుడు ఏనాడూ
ఉద్దేశించలేదు.
ఈ తప్పుడు అబిలాష ఎలాగు వృధ్ది చెందుతుందో తెలుసా ? ఈ విధంగా వాళ్ళ అభిలాషలతో దుష్టమార్గములో జీవిస్తున్నవాళ్ళు “తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు” ఉన్నారని పౌలు స్పష్టంగా గ్రహించాడు.
ఈలాటి
ప్రవర్తన, జీవన విధానం దుఖం, వేదన కలిగించే ఫలితాలను తెస్తుందని నీవు తప్పనిసరిగా
అర్ధం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఆవిశ్వాసపు త్రోవ క్రమము తప్పుడు అభిలాషల దగ్గరికి
నడిపిస్తుంది.
బైబిల్
బోధించే విశ్వాసం మాత్రమే సరియైన అభిలాషలను కలిగుస్తుంది. ఒక సారి ఒక వ్యక్తి యేసు ప్రభువును ఆజ్ఞలన్నీటిలో ప్రాముఖ్యమైన ఏదని అడిగాడు. ప్రభువు సమాధానం
ఏమంటే, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ
పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. నిన్నువలె నీ పొరుగువాని
ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” కానీ అవిశ్వాసము ఆశలను,
అభిలాషలను తప్పుతోవ పట్టిస్తుంది.
అవిశ్వాసపు త్రోవక్రమములో చివరి స్థాయి ఏమిటంటే, నైతిక విలువలు దిగజారిపోవడం. ఈసారి దేవుడు వారిని బ్రష్టమనస్సుకు అప్పగించాడని 28 వ వచనంలో గమనించాలి. “వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి” అంటే దేవుని వారి మనసులో, అవగాహనలలో ఆలోచనలలో ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు గనుక దేవుడు వాళ్ళను “బ్రష్ట మనస్సుకు” అప్పగించాడు. దేవుడు మానవులమీద తన కట్టుబాటును ఉంచలేదు కాబట్టి వాళ్ళు జంతువులకంటే హీనంగా ప్రవర్తించారు. వారికి ఇక నైతిక విలువలు లేవు. వారు, మంచి చెడుల మధ్య భేదం గమనించ లేకపోయారు. ఏది మర్యాద, యుక్తమైనది, ఏది మంచితనం, ఏది చెడు లేక దుష్టత్వం అనే అవగాహన పోగొట్టుకున్నారు. ఆపో. పౌలు గారు వాళ్ళను “సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను,” నిండియున్నారని వివరిస్తున్నాడు. “దుష్టత్వము” అనగా లైంగిక అపవిత్రత అని అర్ధం. లేదా కామవికారము అని అర్ధము. ఆ తరువాత వారు చేసే ఇతర దుష్టక్రియల లిస్ట్ ఉన్నది.
అవిశ్వాసపు త్రోవ క్రమములోని చివరి స్థాయి ఏమిటనగా మానవులు మంచి చెడులకు మధ్య భేధము గ్రహించలేకపోవడం. ఇది సాటి మానవులకు అధమమైన, నీచమైన స్పందన. దుష్టత్వం, కామవికారం, దుర్మార్గత, లోభత్వం, మొదలైనవి జరిగించడం. దేవునిపట్ల అవిశ్వాసముతో స్పందించడము వలన కలిగే ఫలితం ఈర్ష్య , మత్సరం, ఇలాంటి వాటిద్వారా వారు “ కొండెగాండ్రు గుసగుసలాడేగారు, చాడీలు చెప్పేవారు, దేవుని ద్వేషించేవారు, క్రూరమైన మనస్తత్వం గలిగినవారు, అహంకారులు, గర్విష్టులుగా మారతారు. దేవుని న్యాయతీర్పును లెక్క చేయనివారు, గ్రహింపు లేకుండా ఉంటారు, మాట తప్పుతారు. స్వభావసిద్ధమైన ప్రేమాభిమానాలు లేకుండా ఉంటారు. ఈలాంటి వాటికి దేవుని న్యాయతీర్పు ఉంటుందని అవిశ్వాసులకు తెలుసు. అలాంటివారికి వారే తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ వారే వీటన్నిటిని చేస్తూ ఆ విధంగా చేసేవారిని మెచ్చుకుంటూ వారితో మనస్సుకలిసిఉంటారు.
అవిశ్వాసపు
త్రోవక్రమములో చివరిస్థాయి నైతిక విలువలు దిగజారిపోవడం, మంచి చెడుల మధ్య, నీతి
అవినీతి మధ్య ఉన్న భేదం గ్రహించకపోవడం. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే
బైబిల్ బోధించే మార్గమే సరియైనది. ఆవిశ్వాసము నైతిక విలువలను తారుమారు చేసి మంచిచెడుల మధ్య ఉన్న భేదమును గ్రహించలేని స్థితి కలిగిస్తుంది.
ఈ మూడు స్థాయిలలో అవిశ్వాసపు త్రోవక్రమము సాగుతుంది. స్థితితప్పిన ఆరాధన లేదా తప్పుడు ఆరాధన, తప్పుడు గురివైపు ఉంచే అభిలాష , నైతిక విలువలు దిగజారిపోవడం.
ఈ అవిశ్వాసపు క్రమమును తప్పించుకోవడానికి బైబిల్ చూపించే మార్గం యేసు
క్రీస్తు నందు నమ్మిక ఉంచి ఆయనను గ్రహించి నిజముగా ఆయనను ఆరాధించడం.
అప్పుడు దేవుడు మెచ్చే అభిలాషలను నైతిక విలువలను నీవు పొందవచ్చు. అట్టి
కృప ప్రభువు నీకు నాకు అనుగ్రహించుగాక!
ప్రార్ధనలో నాతో ఏకీభవించండి: పరమ తండ్రి, మీ కట్టుబాటు లేనందున మేము
విచ్చలవిడిగా తిరుగుతున్నాము. మీ మార్గమే సత్యమైన మార్గమని తెలుసుకున్నాము. నిరాశను
విడిచి నిరీక్షణ మార్గములో జీవించాలని ఆశిస్తున్నాము. మీ సంతోషము, సమాధానము,
నిరీక్షణ మాకు అనుగ్రహించండి. మా స్వంత దుష్ట మార్గములను విడిచి మీ పరిశుద్ధ
మార్గములో నడచుటకు, మీ కృప చేత యేసుక్రీస్తు రక్తముచేత సజీవ నిరీక్షణ శ్రోతలు మీ మార్గములో జీవించడానికి
శక్తి నిమ్మని క్రీస్తు నామములో ప్రార్ధిస్తునాము, తండ్రీ, ఆమెన్!!
No comments:
Post a Comment