2వ కొరింధీ-12 1:23-2:11 మొదటి భాగము
దైవభక్తి గల నాయకుని హృదయము - మొదటి భాగము
శ్రోతలందరికి యేసు క్రీస్తు ప్రభువు నామములో శుభములు! ఈ దినము II కొరింధీ పత్రికలో
క్రొత్త శీర్షిక ఆరంభిస్తున్నాము. లేఖన భాగము II కొరింధీ 1:23-2:11. ఈ శీర్షిక “దైవభక్తిగల నాయకుని
హృదయము” క్రమము తప్పకుండ ప్రతి వారము రేడియో వినండి! మీ ప్రార్థన మనవి ఏమిటో,
మీరే పరిస్థితిలో ఉండి ప్రార్థన చేయమని కోరుతున్నారో ఆ విషయమును స్పష్టంగా
తెలియచెప్పడం మంచిది. ప్రార్థన చేయండి, అంటే సరిపోదు. సరికాదు.
మీ బైబిల్ తెరిచి ఉంచండి. రేడియో దగ్గరే కూర్చొని ప్రశాంతంగా దీనమనసుతో ప్రభువు తన
పరిశుధ్ద్ధాత్ముని ద్వారా మీతో మాట్లాడాలని మీ హృదయాల్లో ప్రార్ధనతో విన్నట్లయితే పరిపూర్ణమైన
మేలు పొందగలుగుతారు.
ప్రార్థన:
ముందుగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. దైవభక్తిగల ఒక నాయకుడు
ఆ స్థానములో పనిచేయాలంటే, ఏవిధమైన గుణ లక్షణాలు కలిగి ఉండాలి? మేము చెప్పే కొన్ని
ఏమిటంటే, నిష్కాపట్యము, న్యాయబుద్ధి, జాగ్రత్తగా వినేశక్తి ఈలాటివి. మీరు కూడా ఈ లిస్ట్ లో
మరికొన్ని కలపగలరు. ఈ దినాల్లో యధార్ధమైన, సజ్జనులైన నాయకులు కావాలని అందరూ
చూస్తూ ఉంటారు. వారి బలహీనతలను ఒప్పుకునే వారు, వారి లోటుపాట్లను తెలుసుకున్నవారు,
అపజయము, ఓటమిని అంగీకరించేవారు కావాలని చూస్తూ ఉంటాము. ఇతరులవి కాదు సుమా!
ఇతరుల పోరాటాల్లో, శ్రమల్లో వారితో సహకరించి, నిలువబడి, పరానుభూతి చూపేవారికోసం
చూస్తూ ఉంటాం. నేనే నీకంటే గొప్పవాణ్ణి, పరిశుధ్ధుడ్ని, అన్ని చేయగలవాణ్ణి అని చూపించే వారు,
చెప్పుకునేవారు అవసరo లేదు. ఇది దేవుని సంఘపు నాయకత్వము విషయములో కూడా నిజమే!
మనమందరం కలిసి దేవుని పరిశుద్ధ లేఖనాలు అధ్యయనం చేస్తున్నాము కాబట్టి క్రైస్తవ
జీవన విధానం, పద్ధతి ఏమిటో తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ సమయములో
“దైవభక్తిగల క్రైస్తవ నాయకుని హృదయము” అనే శీర్షిక అధ్యయనం చేద్దాం. ఒకవేళ మీరు వెంటనే
అనుకోవచ్చు. నేను నాయకుణ్ణి కాదు, నాకిది అవసరం లేదు అని. ఆగండి! ఎందుకంటే ఈ గుణ
లక్షణాలు ప్రతి యేసయ్య శిష్యునికి అవసరం. కేవలం నాయకులు అని పిలువబడుతున్న పాస్టర్,
సువార్తికుడు, సంఘ పెద్ద, పరిచారకుడు ఇలా పదవుల్లో ఉన్నవాళ్లకు మాత్రమే కాదు, కాబట్టి
జాగ్రతగా మనమంతా వినాలని కోరుతూ ఉన్నాము. మన లేఖన భాగము: II కొరింధీ 1:23 - 2:11. ఈ
లేఖన భాగములో అపో. పౌలు దైవభక్తిగల నమ్మకమైన క్రైస్తవ నాయకుని హృదయమును తన
జీవితము ద్వారా మనము నేర్పిస్తూ ఉన్నాడు.
మొదటి గుణం, అతడు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాడు. పౌలు ఒక సంఘపెద్దగా,
అపోస్తలునిగా కొరింధీ సంఘములో కొన్ని జటిల సమస్యలు ఎదుర్కుంటూ ఉన్నాడు. తానే ఈ
సంఘమును స్థాపించాడు. కాని అనుదినపు తీర్మానాల్లో, నాయకత్వపు నిర్ణయాల్లో ఆయనకు పాత్ర
లేదు. మొదటి కొరింధీ పత్రిక ద్వారా ఈ సంఘములో పార్టీలు ఏర్పడ్డట్టుగా మనకు
అర్ధమయ్యింది. కొందరు పౌలు పార్టీ, మరికొందరు అపోలో పార్టీ, ఇంకా కొందరు పేతురు పార్టీ, ఈ
విధంగా పార్టీలు సంఘములో ఏర్పడ్డాయి. మీ సంఘములో కూడా పార్టీలు ఉన్నాయా? అయితే
జాగ్రత్తగా అలకించండి. పౌలు వ్యక్తిగతంగా కొరింధుకు వెళ్ళి, తన అపోస్తలుని అధికారంతో వాటిని
సరిచేయగలడు. కానీ వెళ్లలేదు. ఎందుకు వెళ్లలేదు? ఎందుకంటే ఉన్న అవకాశాలన్నిటిని
కూలంకషంగా క్షుణ్ణంగా ఆలోచించడానికి సమయం తీసుకున్నాడు. తొందరపడలేదు.
ఉత్తమమైన శ్రేష్టమైన పద్ధతిలో ఈ జటిల సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. నామట్టుకు ఒక
సమస్యకు మొదట్లోనే శ్రేష్టమైన ప్రతిస్పందన నేను చేయలేను. క్లిష్ట పరిస్థితుల్లో, జటిల
సమస్యలు ఎదురైనపుడు ఒక దైవభక్తిగల నిజాయితీపరుడైన క్రైస్తవ నాయకుడు సరైన పద్ధతి,
సమయము, ఇలాటివన్ని ఆలోచిస్తాడు.
అబధ్ధపు నిందలు వేసినపుడు ఇంకా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరము ఉంటుంది.
మీమీద, నామీద, అసత్యపు, అబద్ధపు నిందలు మోపినపుడు మొదటిగా మనపేరు చెడిపోకుండా
ఉండాలని వెంటనే వాటిని అరికట్టడానికి, ఆపి వేయడానికి, సమర్ధించుకోవడానికి
ప్రయత్నిస్తాము. ఇవి స్వానుభవము కూడా! కొన్ని ఉత్తరాలు, ఈమెయిల్స్ వ్రాసిన నేను
పంపలేదు. ఎందుకు? నా తలంపులు బాగానే వెళ్లగక్కి ఉండవచ్చు. నన్ను నేను బాగానే
సమర్ధించుకొని ఉండవచ్చు. నా పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఆపిఉండవచ్చునేమో!
కాని, నన్ను నిందించిన వాని క్షేమం సంగతేమిటి? కొన్ని సందర్భాల్లో వేయబడ్డ నిందలకు
సమాధానం, సమర్ధన చెప్పే అవసరo కూడా ఉండదు. ఒక దైవభక్తిగల నిజాయితీ గల క్రైస్తవుడు,
లేదా ఆమాటకొస్తే క్రైస్తవ నాయకుడు ఆచితూచి, ఆలోచన తీవరంగా చేసి స్పందిస్తాడు.
భావోద్రేకాలతో స్పందించడు. ఆవేశానికి బానిస కాడు. అపో.పౌలు ఆయనను విమర్శిస్తున్న వారికి
కొరింధుకు తాను ఎందుకు వెళ్ళడం లేదో వివరిస్తున్నాడు. తన నిజాయితీకి దేవుణ్ణి ఆయన
సాక్షిగా పెట్టడం గమనించారా? ప్రమాణం చేసి చెబుతున్నట్టు. బాగా ఆలోచించిన తరువాత తాను
వ్యక్తిగతంగా అక్కడికి వెళితే కోప తాపాలతో ఎంత వేడిగా వాతావరణం మారుతుందో పౌలు
ఊహించుకున్నాడు. పౌలు తనంతట తాను ఆగిపోవడం వల్ల, తమాయించుకోవడ వల్ల దయను
ఓపికను చూపుతూ ఉన్నాడు. స్వయానా యేసు ప్రభువు ఆయనకు ఇచ్చిన అపోస్తలుని
అధికారము ఆయనకు ఉన్నది. కావాలనుకుంటే, ఆయన తన అధికారమును ఉపయోగించి
గుంపులు గుంపులుగా వీడిపోయిన ఈ సంఘాన్ని చక్కబెట్టగలడు. వారి మీద అపో. పౌలుకు
అధికారము ఉన్నప్పటికి, దాని ఉపయోగించడం లేదు. వారిమీద పెత్తనం చేయాలని తనకు
కోరిక లేదని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కాని, వారు క్రీస్తులో స్థిరపదాలని, వారి జీవితల్లో
సంతోషం ఆనందం ఉండాలని కోరుకుంటున్నట్టు సాక్ష్యమిస్తున్నాడు. ఈ లేఖన భాగమంతటిలో
‘ఆనందం’ అనే అంశం అల్లుకుపోయినట్టుగా ఉన్నది. కొరింధు సంఘస్తుల్లో ఎన్ని సమస్యలు,
భేదభావాలు ఉన్నా, వారు విశ్వాసముతో దేవుని శక్తి చేత కాపాడబడుతూ ఉన్నారు. అది నిజమైన
విస్వాసమంటే! దీని ఆధారంగా పౌలు వారితో ముచ్చటిస్తూ బుజ్జగిస్తూ ఉన్నాడు.
దీర్ఘంగా ఆలోచించిన తరువాత వ్యక్తిగతంగా స్వయానా అక్కడికి రాకుండా, ఒక పత్రిక ద్వారా
వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న అందరి మేలు కోరి, ఈ నిర్ణయం తెసుకున్నట్టు
పౌలు చెప్పడం గమనించాలి. వ్యక్తిగతంగా సంఘమును దర్శించి ఈ కఠినమైన విషయాలు
మాట్లాడితే, కొంత ఆందోళన, కఠినమైన మాటలు, కోప తాపాలు ఒకరినొకరు మనసులను కష్ట
పెట్టుకోవడం జరుగుతుందని ఊహించిన పౌలు అది జరగకుండా చూసుకున్నాడు. 2:2వ వచనం
గమనించండి. “నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి
ఎవడు నన్ను సంతోషపరచును?” దీనిలో దాగి ఉన్న ప్రశ్న ఏమిటంటే, “ఇదేవిధంగా
జరుగుతుంది?” ఆయనను దుఖపరచిన ఒకడే కాదు, ఇంకా చాలామంది ఆయనకు తిరిగుబాటు
చేస్తున్నవారు కొరింధులో ఉన్నారు. ఈ సంఘమునకు క్రమశిక్షణ, గద్దింపు అవసరమైనప్పుడు
ఆయనకు వారేవిధంగా సంతోషము కలిగించగలరు? ఇక్కడ పౌలు తాను వ్యక్తిగతంగా వెళ్లవద్దని
నిశ్చయించుకోవడమే కాకుండా, తన మాటలు జాగ్రతగా ఎన్నుకుంటున్నాడు. తన సంతోషానికి
కారణము కావలవసినవారు దుఖపడడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన క్రమబద్ధీకరించ
వలసిన విషయాలను దూరమునుండి బాగు చేయడానికి సున్నితంగా ప్రయత్నం చేస్తున్నాడు.
అప్పుడు ఆయన వ్యక్తిగతంగా దర్శించినపుడు ఇంత ఘర్షణ కలగక పోవచ్చని ఆయన భావన.
దాని ద్వారా ఒకరిద్వారా మరొకరికి సంతోషం కలుగుతుంది. సాధారణంగా గద్దింపు, క్రమశిక్షణ
చేయడానికి వ్యక్తిగతంగా దర్శించడం మేలు. కాని, ప్రతి సారి కాదు. పౌలు జాగ్రత్తగా ఆలోచించి,
పరిశుధ్ద్ధాత్ముని నడిపింపుకోసం కనిపెట్టుకున్నందు చేత శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. 1:24
నుండి 2:3 వరకు ఉన్న లేఖన భాగము సారాంశం గమనించండి. కొరింధు సంఘపు వారి
సంతోషము పౌలు సంతోషం ముడిపడి ఉంది. ఒకటి మరొకదానిమీద ఆధారపడి ఉంది. వారి
విధేయత, విశ్వాసము ద్వారా ఆయనకు ఆనందం కలుగుతుంది. జటిల సమస్యలను గూర్చి,
సంఘపు విశ్వాసులను గూర్చి అపో. పౌలు జాగ్రత్తగా ఆలోచించడం దైవభక్తిగల క్రైస్తవ నాయకుని
ఒక గుణమును మనకు చూపిస్తున్నది. సంఘమే కాదు, మనమంతా ప్రతి రోజు కుటుంబములో
బయటి ప్రపంచములో, సంఘములో, బజారులో మార్కెట్లో ఇతరులతో సంబంధాలు చేస్తూ
ఉంటాం. ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితిలో జాగ్రత్తగా, దైవభక్తిలో ఆలోచించి అప్పుడు సరిగా
స్పందించడం, మాట్లాడడం, మనమంతా నేర్చుకోవాలి. టెన్షన్ కలిగినపుడు, భేదభావాలు
కలిగినపుడు, కోపతాపాలు, ఉద్రేకాలు, కలిగినపుడు ఏ విధంగా స్పందిస్తాము? పౌలు మాదిరిగా
మనము కూడా చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయుగాక!
No comments:
Post a Comment