2 కొరింధీ 11~15-22 మూడవ భాగము - క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? మూడవ భాగము

 

 2 కొరింధీ 1: 15-22 మూడవ భాగము 

క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? మూడవ భాగము

    రేడియో దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ శుభములు! మీలో ప్రతి ఒక్కరికోసం ప్రార్థిస్తున్నాము. మీ ప్రార్థన మనవి 

లేదా క్లిష్ట పరిస్థితి, బాధ, వేదన, వేదన, భయముల, ఆందోళన మాకు తెలియచేస్తే, ఆ పరిస్థితి, మనవి కోసం ప్రార్థన 

చేస్తాము. మీరు యేసు క్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం కలిగినవారైతే, మీగురించి మీరే ఎక్కువ భారంగా, 

వేదనతో ప్రార్థన చేసుకోవాలి. ఎంత ప్రార్థన జీవితములో ఎదిగితే అంతగా బలపడి క్రీస్తులో వేరుపారి స్థిరపడతారు. 

ప్రార్థన:

         క్రీస్తులో వేరుపారి స్థిరపడాలంటే మార్గాలు, పద్ధతులు అధ్యయనం చేస్తున్నాము. మొదటి మార్గం దేవుని 

ప్రణాళిక ద్వారా, రెండవ మార్గం, దేవుని వాగ్దానముల ద్వారా. ఇక మూడవ మార్గం, దేవుని సన్నిధి 

ద్వారా. లేఖన భాగము II కొరింధీ 1:15-22 ఈ భాగములోని చివరి 2 వచనాలు, 21-22 వచనాలు గమనించండి: 

మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు 

ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.”  పౌలు వాదన 

ఏమిటి? దేవుడు తన ప్రణాళికనుబట్టి నా ప్రణాళికలను మార్చాడు. మీరు నన్ను నిలుకడ లేనివాడని, 

నమ్మకత్వము లేనివాడని నా మీద ముద్ర వేశారు. కాని, నేను మీ వద్దకు తీసుకు వచ్చిన సువార్త దేవుని మారని 

నమ్మకత్వము మీద ఆధారపడి ఉంది. ఈ సువార్త పరిచర్య చాలా జీవితాలను మార్చివేసింది. అంతేకాదు, దేవుడు 

నా పరిచర్యమీద తన ముద్ర వేశాడు. పరిశుధ్ద్ధాత్ముని ముద్ర నా మీద వేశాడు. మీలో ప్రభువును నిజముగా నమ్మే 

వారిమీద కూడ ఆ ముద్ర వేశాడు. కాబట్టి మీరు నా మీద వేసిన ఈ అబద్ధపు అభియోగం దేవుడు మీ మధ్యలో నా 

ద్వారా చేసిన సువార్త పరిచర్యను బట్టి వీగిపోయింది. దేవుని ఈ క్రియద్వారా, నాలోను, ప్రభువు శిష్యులుగా 

ఉండాలని ఆయన పిలుపును అంగీకరించి ప్రభువును వెంబడించి నడుస్తున్న వారిద్వారా ఈ ముద్ర 

స్పష్టమవుతుంది. ఇది పౌలు కొరింధీయులతో చెబుతున్న సమర్ధన.


         ఇక్కడ పౌలు క్రీసులో వేరుపారి స్థిరపడాలని బలమైన చివరి విన్నపము చేస్తున్నాడు. మొదటిగా 

అభిషేకమునుబట్టి. అనగా దేవుని ప్రజలు పరిచర్యచేయడానికి శక్తి పొందాలని పరిశుధ్ద్ధాత్ముడు ఇచ్చిన వరములు. 

రెండవది, దేవుడు మమ్ములను ముద్రించాడు. అనగా మేము తనకు చెందినవారమని దేవుడు ఆమోదించి మేము 

ఆయన సొత్తు అని దానికి గుర్తుగా తన పరిశుద్ధాత్ముని అనుగ్రహించాడు.

        

మన నిత్యత్వపు స్వాస్థ్యమునకు బయానాగా, గ్యారంటీగా తన పరిశుద్ధాత్మనే దేవుడు అనుగ్రహించాడు. ఈ

 బయానాను బట్టి అసలైన స్వాస్థ్యమును తప్పనిసరిగా ఇవ్వవలసిన బాధ్యత బయానా ఇచ్చినవారి మీద 

ఉంటుంది. అది ఒక న్యాయబద్ధమైన బాధ్యత. మనకు క్రీస్తులో అనుగ్రహించిన మహిమకు, అనుగ్రహించబోతున్న 

మహిమకుస్వాస్థ్యమునకు పరిశుధ్ద్ధాత్ముడే దేవుని గ్యారంటీ, బయానా! హల్లెలూయ! మన దేవుడు ఎంత 

నమ్మకమైనవాడు! ప్రియ సోదరీ సోదరులారా! నిరాశలో కుమిలిపోతున్నారా? బాధలు వేదనలతో అలిసి పోయారా? 

ఇవి సైతాను చేస్తున్న విఫల ప్రయత్నాలు. మీరు విశ్వాసముతో లేచి నిలువబడి సైతానును వెంబడించడం వాడి మాటలు వినడం మానేసి, ప్రభువు యేసును సమీపించి ఆయన వాక్యమును ఆశ్రయిస్తే, విజయం, విడుదల 

నిరీక్షణ, మీదే! 

    ప్రియ స్నేహితులారా, మీకు దేవునితో అనగా యేసు క్రీస్తు ప్రభువుద్వారా సంబంధం లేకపోతే, ఆయన సిలువ 

రక్తము చేత నీ పాప దోషములు శుద్ధి చేయబడకపోతే, ఇవన్నీ మీకు అర్ధం కావు, మీకు వర్తించవు. కారణం? 

దేవునికి మీకు ఏ సంబంధము లేదు. క్రైస్తవ పేరు మీకుందా? దానివల్ల మానసిక తృప్తి తప్ప ఏమి కలుగదు. ప్రతి 

మానవునికి ఏ కులమైన, మతమైనా, ఏ భాష, రంగు, అంతస్తు, ఏ భేదములేకుండా దేవునితో సంబంధం అవసరం 

ఎందుకంటే మనము జన్మించినపుడే దేవునికి శత్రువులము. దేవుని తీర్పు అప్పటికే మనమీద ఉన్నది. ఎన్ని సార్లు నీ పాపము, నిత్యనరకము, దేవుని తీర్పు దానినుండి విమోచన పొందడానికి దేవుని మార్గము గురించి 

విన్నప్పటికినీ హృదయం కత్తినపరచుకుంటున్నావా? దానికి కారణం “పాపము వలన కలుగు భ్రమ” అని హెబ్రీ. 

3:15 లో పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఉద్ఘాటిస్తుంది. “పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును 

కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినము ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి”  నేడు 

అనే సమయము ఎల్లప్పుడు నీకు ఉండకపోవచ్చు. జాగ్రతగా ఆలోచించండి. యేసు క్రీసు ద్వారా మాత్రమే నీవు 

నేను దేవునితో సమాధానపడగలము. నేను సమాధానపడ్డాను. నీ సంగతేమిటి? దీని విషయం మీకు ఆత్మీయ 

సహాయం కావాలని ఆశిస్తే చెప్పబడిన టైమ్ ప్రకారం మాకు ఫోన్ చేయండి.     

         ప్రియ సోదరీ, సోదరులారా, మీరు పరిశుద్ధాత్ముని అభిషేకమును పొందారా? ఇది వినగానే ఎవరో ఒకరు 

మీవైపు తన చేయి చూపగానే క్రిందపడిపోవడమని ఊహించుకోకండి. భాషల్లో మాట్లాడమేమో అని అపోహపడకండి. 

ఇది ఎవరో నీ మీద చేయి పెట్టి  ప్రార్థన చేస్తే వచ్చే వరము కాదు. నీవు అమాంతం క్రిందపడి పోవడం అసలే కాదు. 

చప్పట్లు కొడుతూ చేతులు చరుచుకొని చేసే విన్యాసాలు చేయడం కాదు.


I యోహాను పత్రిక 2వ  అధ్యాయం 20 వచనం గమనించండి. “అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము 

పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.” ఇక్కడ పరిశుద్ధుడు అంటే పరిశుద్ధాత్ముడు అని అర్ధం. ఆయన 

అభిషేకం ఏ మానవునివలన కలుగదు. అది కేవల దేవుని పరిశుద్ధ గ్రంధం బైబిల్లోని దేవుని మాటలకు నీవు, నేను 

చూపే విధేయత మీద ఆధారపడి ఉంటుంది. 27వ వచనం చూడండి. అయితే ఆయనవలన మీరు పొందిన 

అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే 

గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన 

ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు.”  పరిశుద్ధాత్ముని అభిషేకము నిలిచిఉండేది అనే సత్యము 

జాగ్రతగా గమనించండి.  ఈ అభిషేకము ఆయనకు ఆయన మాటకు విధేయత చూపే వారిలో ఉంటుంది. 

పరిశుద్ధాత్ముడు దేవుని సేవకులను, ప్రవక్తలను, అపోస్తలులను తన ఆధీనములోనికి తీసుకొని వారి చేత 

లేఖనాలను వ్రాయించాడని II పేతురు 3:16లో స్పష్టంగా ఉన్నది. పరిశుద్ధాత్ముని అభిషేకము, సత్యము

 యధార్ధము కూడా! ఈ అభిషేకము అన్నిటిని గూర్చి బోధిస్తుందని ఈ వచనములో చదువుతున్నాము. మీ 

బైబిల్లో గమనించారా? అన్ని ఎవరు మనకు బోధిస్తారు. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంధం బైబిల్లోని ప్రతి మాట 

మనకు బోధిస్తుంది. మన ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యములో సమాధానము ఉన్నది. మన విశ్వాసము ఈ 

విషయములో చాలా తక్కువ ఆని చెప్పక తప్పదు. చదేవేకొద్ది, వినేకొద్ది గనిలోనుండి నిధులు బయట పడ్డట్టు 

పరిశుద్ధ గ్రంధం బైబిల్లోనుండి ప్రశ్నలకు సమాధానాలు, సత్యాలు బహిర్గతమవుతున్నాయి. ఇది నా వ్యక్తిగత 

అనుభవము. మనము సరిగ్గా చదవము, జాగ్రతగా చదవము, అర్ధం చేసుకోము, పద్ధతి ప్రకారము అధ్యయనం 

చేయమని వేరే చెప్పనవసరములేదు. ఇంకా చెప్పాలంటే, మనము అర్ధము చేసుకున్నట్టు బైబిల్ 

ఉండాలనుంటాము. ‘దేవుడు నాకేమి బోధిస్తున్నాడు?’ అనే దీనమనసుతో, ఒక ఖాళీ పాత్రలో నీళ్ళు పోస్తినట్టుగా 

మనము పరిశుద్ధ వాక్యమును అంగీకరించము. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకుంటే ఈ సత్యం ఒప్పుకోక 

తప్పదు. పరిశుద్ధాత్ముని అభిషేకము పొందడానికి అన్నింటికంటే ముఖ్యమైన గుర్తు, రుజువు ఏమిటో 

తెలుసుకోవాలి. గలతీ 5:22లోని ఆత్మఫలము ఫలము ఫలించడం. ప్రేమ సంతోషం, సమాధానము మొదలైన 

గుణములు మనలో ఫలించడము మొదటి రుజువు. క్రీస్తులో వేరు పారి స్థిరపడాలని ఆశిస్తే మనలో ప్రతి ఒక్కరము 

పరిశుధ్ద్ధాత్ముడు వ్రాయించి, భద్రపరచి ఉంచిన లేఖనములను దేవుని మాటలని, ఒప్పుకొని, దేవునికి మన 

జీవితాలమీద ఉన్న అధికారమునకు ఒప్పుకొని, పరిశుద్ధమైన ప్రవర్తనజీవితం, క్రియలు, ఆత్మ  ఫలము 

ఫలించడానికి అనువైన దీనమనసు, దేవుని వాక్యమునకు విధేయత, పరిశుద్ధాత్మ నడిపింపు శక్తిని బట్టి నూతన 

పరచబడుతూ ఉండాలి. అపో పౌలు మాటలు గమనించండి: “మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా 

మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ 

అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.  సంచకరువు లేదా గ్యారంటీ అయిన పరిశుద్ధాత్ముడు మీలోని మీ 

ఆత్మతో లేదా మనస్సాక్షితో సాక్షమిస్తున్నాడా? రోమా 8:16 “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో 

కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.” ప్రియ సోదరీ సోదరులారా, ఇది మీకు క్రొత్తగా వింతగా అనిపిస్తున్నట్లయితే మీకు 

దేవునితో సంబంధం లేదని అర్ధం. మీ సంబంధం దేవునితో నిశ్చయం చేసుకోవడానికి యేసు క్రీస్తు ప్రభువు, ఆయన 

పరిశుద్ధ రక్తం మార్గం. మీకు అధ్యాత్మిక సహాయం కావాలంటే, మీకు పరిశుద్ధ గ్రంధం బైబిల్ కావాలంటే మాకు 10 

నుండి 6 లోపల ఫోన్ చేయండి. 

ప్రార్థన: మీ స్వంత మాటల్లో మీకు తోచినట్టుగా ప్రార్ధన చేయండి. 

 

          

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...