II కొరింథీ-2 - 1:1-2
సత్య వాక్యమును సరిగా విభజించడమెలాగు? - 2
శ్రోతలూ, ఇటీవల ఒక వ్యాపారస్తుడు ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమీద
రానున్నాయని చెప్పాడు. జాగ్రతగా లోకమును సృష్టిని పరీక్షించి పరిశోధిస్తే, అది సత్యదూరమని
స్పష్టంగా తెలుస్తుంది. సృష్టిలో ప్రస్తుతమున్న సృజనాత్మకత భారీగా సన్నగిల్లింది. భూమిలో
సస్యము లేదు, వర్షములు మనకవసరమైనన్ని రావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, సృష్టి
అంతటిలో దేవుని శాపము, శిక్ష, తీర్పు స్పష్టంగా కనిపిస్తున్నవి. మనుష్యకుమారుడు యేసు క్రీస్తు
భూపతులకు అధిపతిగా, సమస్త సృష్టికి వారసుడు, విమోచకుడుగా, న్యాయాధిపతిగా త్వరలో
రానున్నాడు. “ఆత్మయు, పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము
అని చెప్పవలెను” ప్రకటన 22:17 ప్రభువును ఎదుర్కోవడానికి మీరు సిధ్ధమా? ప్రార్ధించుకుందాం.
ప్రార్థన: మీరే మీ స్వంత మాటలతో ప్రార్ధన చేసుకోండి
ఈ నాడు అధ్యయనం చేస్తున్న అంశం “సత్య వాక్యమును సరిగా విభజించడమెలాగు?-
రెండవ భాగము”. మునుపటి అధ్యయనములో కొరిoధు పట్టణము ఆ రాష్ట్రానికి ఎంత కీలకమైన
స్థానములో ఉందో తెలుసుకున్నాం. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథు పట్టణం మొదటి
శతాబ్దములో చాలా పేరు గాంచిన ప్రాముఖ్యమైన పట్టణం. అది ఒక రోమీయుల కాలనీ. ప్రవాస
స్థానము. అకైయ అనే ప్రాంతానికి ముఖ్యపట్టణం. ఇప్పటి భాషలో చెప్పాలంటే, ఒక రాష్ట్రానికి
ముఖ్యపట్టణం. గ్రీసు దేశములో ఎజియన్ సముద్రము, అయియోనియా సముద్రము, అను రెండు
సముద్రాలకు మధ్యలో వ్యాపించిన పేలికలాంటిది. అది ఒక కంఠ భూమి. దీని స్థానము చాలా
కీలకమైన స్థానము.
మీ సైకిల్ లేక మోటర్ సైకిల్, లేదా ఎడ్లబండి చక్రమును ఒక్కసారి ఊహించుకోండి. మధ్యలో
ఇరుసు, దానితోబాటు ఉన్న ఆకులు. వీటన్నిటికి ఇరురు ఎంత కీలకమైనదో, కొరింథు పట్టణం ఆ
రాష్ట్రానికి అంత కీలకమైనది. యుధ్ధానికైనా, సైన్యపుమొహరింపుకైనా, వ్యాపారానికైనా, కొరింథు
పట్టణం అంత కేంద్రoగా ఉండేది. రెండు సముద్ర తీరాలమధ్యలో ఉన్నందువలన, సముద్ర
వ్యాపారము ముమ్మరంగా జరుగుతూ ఉండేది. పెద్ద పెద్ద నౌకలు వాటి సరుకులను ఇక్కడ
దించేవారు. ఇక్కడనుండి చిన్న చిన్న పడవల మీద చుట్టూ ఉన్న ప్రాంతాలకు పంపుతూ
ఉండేవారు. దీని కీలకమైన స్థానాన్ని బట్టి కొరింథు పట్టణం రకరకాలైన సంస్కృతి, భాష,
జాతులవారు ఇక్కడ స్థిర నివాసముండేవారు, లేదా తరచూ వస్తూ పోతూ ఉండేవారు. ఈ నేపధ్యం,
చారిత్రికతను బట్టి ఇక్కడి సంఘములో ఎలా విస్తరించిందో రానున్న అధ్యయనాల్లో
తెలుసుకుంటాము. ప్రతి అధ్యయనం వరుస తప్పకుండా వినండి. ఇంతే కాదు, ఈ పట్టణం చాలా
ధనిక పట్టణమైనందు చేత పాపము, దుష్టత్వము, అల్లరి, ఆటపాటలు అతిఘోరమైన పాపముతో
నిండా ఉన్నాయి. ఇది ఎంత పాపపు సముద్రమంటే, కొరింథులో ఉండే అంత దుష్టుత్వమనే ఒక
సామెత వాడుకలో ఉండేది. దీన్ని బట్టి ఎంత పాపిష్టి పట్టణమో మీరు అర్ధం చేసుకోవచ్చు. ఒక
ప్రఖ్యాత పండితుడు కొరింథీ పట్టణాన్ని “బుద్ధికుశలతలో చురుకైనది, ఆర్ధికపరంగా ధనికమైనది,
నైతిక విలువలలో అధమ స్థాయిలో ఉన్నదని” వివరించాడు. మనము కొరింథీ పట్టణము గూర్చి
మాట్లాడుకున్నపుడల్లా ఈ మూడు దుర్గుణాలు మన మనసుల్లో నాటుకోవాలి.
ఇటువంటి ఘోరమైన పట్టణములో సంఘము స్థాపించండమంటే ఏమిటో ఒక్కసారి
ఊహించండి! ప్రస్తుతము ఇలాంటి సమాజములోనే సంఘము ఉన్నదని మనము గ్రహించాలి!
స్థూలంగా పాపిష్టి వాతావరణములో కొరింథీ సంఘము ఉండేది. ఈ కారణాన్ని బట్టి పౌలు తన
రెండు పత్రికల్లో
చాలా ఘోరమైన అంశాలను ఖండించిన విషయం మనము గమనిస్తున్నాము.
ఆఫ్రోదితు అనే దేవత ఫోయినిషియాలో ఉండేది. ఆ దేవత గుడి కొరింధు పట్టణములో
ఉండేది. వందలాది పూజారిణులు, అనగా స్త్రీ పూజారులు అక్కడ ఉండేవారు. వారు పేరుకే
పూజారిణులు, కాని, నిజానికి వారు దేవదాసీలు, అనగా వ్యభిచారిణులు. కాబట్టి విగ్రహారాధన
వ్యభిచారం కలిసి ఉండేవి. ఇంకా ఇతర విగ్రహాలకు చెందిన గుడులు కూడా ఉండేవి. ఈ గుడులు
సామాజిక జీవితములో, ఆర్థికపరమైన విషయాల్లో ప్రముఖ పాత్ర పోషించేవి. ఈ నేఫధ్యములో
నుండి కొరింధు సంఘములో చర్చకు వచ్చిన ఒక అంశం విగ్రహాలకు అర్పించిన మాంసం ఒక
క్రైస్తవ విశ్వాసి తినవచ్చా?
అపో. 18వ అధ్యాయములో మనము చదువుతున్నట్టుగా పౌలు తన రెండవ మిషనరీ
ప్రయాణములో కొరింధు సంఘాన్ని స్థాపించాడు. ఏథెన్స్ పట్టణము నుండి ఆయన కొరింధు
పట్టణానికి వచ్చాడు. అది 45 మైళ్ళ ప్రయాణము. ఇక్కడ పౌలు అప్యాయమైన స్వాగతాన్ని
ఆశించలేదని ఇట్టే అర్థమవుతుంది. I కొరింథీ 2:3లో ఉన్నట్టుగా పౌలు ఇతర పట్టణాల్లో
ఎదుర్కున్న అనుభవాలనుబట్టి
కొరింధులో “భయముతోనూ ఎంతో వణకుతోనూ” ఉన్నాడు.
అపో. పౌలు కొరింధులో ఆకుల ప్రిస్కిల్లలను కలుసుకున్నాడు. వారితో బాటు డేరాలు కుట్టేపని
చేశాడు. ఈ పనిద్వారా వచ్చిన డబ్బును సువార్త పరిచర్యకోసం వాడాడు. అందుచేత ఆయన
ఇతరుల సహాయము మీద ఆధారపడవలసిన అవసరము లేదు. వారమంతా ఆ పనిచేసి
శనివారము సమాజమందిరములోనికి వెళ్ళి సువార్తను బోధించేవాడు. యూదులు సువార్తను
తిరిస్కరించినపుడు ఆయన ప్రక్కలోఉన్న యూస్తు ఇంటిలో నుండి సువార్తను బోధించాడు. దీన్ని
బట్టి యూదులకు మత్సరం, కోపం వచ్చింది. అయినా, యూదులు, యూదేతరులు ఆయన
పరిచర్య వలన మారు మనసు పొందారు. కాబట్టి కొరింధు లోని సంఘములో యూదులు,
యూదులు కానివారుకూడా ఉన్నారు. అపో. పౌలు ఇక్కడ ఒకటిన్నర సంవత్సరాలు పరిచర్య
చేశాడు.
పౌలు కొరింధు లో ఉన్న సమయములో తిరుగుబాటు, వ్యతిరేకత ఎక్కువ అయ్యింది. ఆ ఊరి
రోమా అధిపతి గల్లియోను వద్దకు, వ్యతిరేకించిన యూదులు పౌలు మీద నేరము మోపారు. కాని
గల్లియోను మతపరమైన నేరారోపణలు స్వీకరించడానికి ఒప్పుకోలేదు. దీని తరువాత
ఇంకొన్నాళ్లు ఇక్కడే పౌలు ఉన్నప్పటికి, తరువాత ఎఫెసుకు వెళ్లిపోయాడు. కొరింధీ సంఘముతో
ఆయన పత్రికల ద్వారా, తన ప్రతినిధులద్వారా, సంబంధమును పటిష్టపరచుకొని, వారికి
హెచ్చరికలు, ఉపదేశాలు ఇచ్చాడు.
గమనించండి, ఒకే సంఘానికి పౌలు ఇచ్చిన హెచ్చరకలు ఉపదేశాలు కొరింధు సంఘానికే
ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు పత్రికలు కొరింధు సంఘములో ఉన్న సమస్యలను ఉద్దేశించి
వ్రాశాడు. కాని, ఇవే సమస్యలు ఇప్పటి సంఘములో కూడా ఉన్నాయి. ఎందుకు? మానవ
స్వభావం, ప్రాచీన స్వభావం మారలేదు కదా! ఏదేనులో మన ఆది పితరులు
పడిపోయినప్పటినుండి
మన నైజము ఏ మాత్రం మారలేదు.
పౌలు కొరింధులో సంఘమును స్థాపించిన తరువాత ఇతర పట్టణాలకు వెళ్ళాడు.
సంఘములో గుంపులు, పార్టీలు, దెబ్బలాటలు మొదలయ్యాయి. ఈ పార్టీలు ఒక వ్యక్తికి వత్తాసు
పలుకుతూ ఏర్పడ్డాయి, కొందరు పౌలు పార్టీ అని, మరికొందరు అపోల్లో పార్టీ అని, ఇంకా ఇతరుల
పేర్లను బట్టి పార్టీలు ఏర్పడ్డాయి. క్లోయే ఇంటివారిద్వారా ఈ విషయం పౌలుకు తెలిసింది. క్లోయే
ఇంటివారు కూడా ఒక పార్టీ అయ్యారేమే! సంఘము మరికొన్ని ప్రశ్నలు, సందేహాలు పౌలునకు
పంపింది. వాటికి ఆయన ఇచ్చిన ఉపదేశం, సమాధానము మొదటి కొరింధీ పత్రికలో ఇమిడి
ఉన్నాయి.
స్పష్టపడుతున్న విషయమేమిటి? పౌలు మొదటి పత్రిక వల్ల సంఘములో ఉన్న
ప్రశ్నలకు, సదేహాలకు సమాధానం, పరిష్కారం దొరకలేదు. సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యాయి.
II కొరింధీ 2:1 ప్రకారము ఆయన ఒకసారి చాలా బాధతో వారిని దర్శించినట్టు స్పష్టమవుతుంది.
“నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగి రానని నామట్టుకు నేను నిశ్చయించుకొంటిని” అని ఆయన
చెప్పడంలో అర్ధం అదే! ఆ పరిస్థితుల్లో ఆయన ఎఫెసీకి వెళ్ళి అక్కడనుండి మన బైబిళ్లలో ఉన్న
తన రెండవ కొరింధీ పత్రికను క్రీ. శ. 55/56లో వ్రాశాడు. పౌలు ఈ రెండవ పత్రికను వ్రాయడానికి
కొన్ని ఉద్దేశ్యాలు ఉన్నాయి. ప్రాధమిక ఉద్దేశ్యం ఆ సంఘములో ఆయన అపోస్తలత్వపు
అధిక్కారమును ధిక్కరించిన కొందరికి ఆయన ఏ విధంగా అపోస్తలుడుగా యేసు రక్షాకుని
పిలుపు, అధికారము పొందాడో స్పష్టపరచండం. వాళ్ళ మీద ఆయన పెత్తనం చేస్తున్నాడని వారి
అభియోగం. అందు చేత ఈ పత్రికలో ఆయన చాలా వ్యక్తిగత అనుభవములను, వాటికి
సంబంధించిన సమాచారమును చెప్తూ దీని ద్వారా తన అపోస్తలుని అధికారమును
ధృవీకరిస్తున్నాడు. రెండవ ఉద్దేశ్యము నమ్మక మైన విశ్వాసులను బలపరచడం. వీరి సంఖ్య
ఎక్కువ ఉండడం సంతోషించవలసిన సంగతి. మూడవ ఉద్దేశ్యం యేసు ప్రభువు లాంటి
మాదిరిగా జీవిస్తూ తోటి విశ్వాసుల పట్ల దయ, కనికరం, ప్రేమతో వ్యవహరించాలని వారిని
హెచ్చరించడం. రెండవ కొరింధీ పత్రికకు ఒక బ్యానర్ లాగా నిలిచి అలంకరింకరించే
ఉద్దేశ్యమేమిటి? ఒక విశ్వాసి జీవితములో శ్రమలకు పరిశుద్ధాత్ముని శక్తికి ఉన్న సంబంధమును
వ్యక్తిగత జీవితము, సాక్షము ద్వారా తెలియచేయడం. ఈ కారణాన్ని బట్టి రెండవ కొరింధీ పత్రిక
అధ్యయనాలకు ఇచ్చిన శీర్షిక ఏమిటంటే, “మంటికుండలు - శ్రమలు, సమర్పణ,
పరిశుధ్ధపరచబడుట” ప్రతి సారి మర్చిపోకుండా మీరు మీ ఇంటిల్లిపాది బైబిల్
అధ్యయనాలు విని, దానిద్వారా రెండవ కొరింధీ పత్రికను అన్వేషిద్దాం.
ప్రార్థన: మీ స్వంత మాటల్లో ప్రార్ధన చేసుకోండి. ప్రభువు తన పరిశుద్ధ్ద్ధాత్ముని ద్వారా, ఏ
విషయములో ఏ మార్పు మీలో కలిగించాలని కోరుతున్నాడో అది చేయడానికి మీరు సిధ్ధంగా
ఉండాలని మీకోసం మేము ప్రార్ధిస్తున్నాము. మీరేదైనా పంచుకోవాలని ఆశిస్తే, లేదా ప్రశ్న
సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయవచ్చు. ఫోన్: 814 317 8111
No comments:
Post a Comment