2024 New Year Meditation - దేవునినుండి కలిగే క్రొత్తదనం

2024 New Year Meditation

దేవునినుండి కలిగే క్రొత్తదనం

         శ్రోతలందరికి నూతన సంవత్సర శుభములు! Happy New Year Greetings To Everyone!! ఈ న్యూ 

ఇయర్ దినాన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను.

        మొదటిది,  క్రొత్తదనమంతా దేవుని నుండి కలుగుతుంది. క్రొత్తదనమును ఇష్టపడని వారుండరు! 

ఏదైనా క్రొత్తది మన చేతిలోనికి వచ్చినపుడు దానిని జాగ్రతగా పరిశీలించడం చేస్తూ ఉంటాం. పాతదానికి, క్రొత్తదానికి 

భేదమేమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాము. పాతవి గతించిపోతూ ఉంటాయి, క్రొత్తవి వస్తూ ఉంటాయి.  

జీవముగలిగినవైతే మరణిస్తూ ఉంటాయి, క్రొత్తవి పుడుతూ ఉంటాయి. మన కన్నులకు కనిపించే వాటినన్నిటిని 

సృష్టించిన సృష్టికర్త ప్రతి క్రొత్తదనానికి సృష్టికర్త అని మర్చిపోకండి. ఒక చెట్టు ఎండిపోతుంది, దాని విత్తనాల్లోనుండి 

మరో క్రొత్త చెట్టు పుడుతుంది. ఒక వ్యక్తి మరణిస్తాడు, అతడి సంతానం ఈ లోకములో జీవిస్తుంది. సృష్టి అంతటిలో 

మరణం, జీవం; పాతది, క్రొత్తది, మనకు ప్రతి దినం కనిపిస్తూ ఉంటాయి. కాని, సృష్టికర్తను సృష్టికర్తగా నీవు గుర్తించి, 

విశ్వసించి నమ్ముతున్నావా? చాలామంది సృష్టిని పూజిస్తున్నారు. గాలిని, నీటిని, వెలుగును, చెట్టును, పుట్టను, 

సూర్యుణ్ణి, చంద్రుణ్ణి  పూజిస్తూ ఉంటారు. దేనినైనా, చివరకు మన చేతులో ఉండే డబ్బును సహితం పూజిస్తూ  మనుషులను సహితం దేవుడని భ్రమ పడుతూ ఉంటారు.  ఇది ఎంత ఘోరమైన పాపమో దయ చేసి గమనించండి! దేవుని హెచ్చరిక ఏమిటో తెలుసుకుందాం. రోమా 

పత్రిక 1: 18  నుండి గమనించండి.

         18. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను,         దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

            19. ఎందుకనగా దేవునిగూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది;         దేవుడు అది వారికి విశదపరచెను.

            20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి          మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

          21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు,      కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.

            22. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు

  బుద్ధిహీనులైరి.

            23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

సృష్టికర్త అయిన దేవుణ్ణి సృష్టికర్తగా ఒప్పుకొని, ఆయన వైపు మళ్లుకొని, ఆయనకు ఇవ్వవలసిన కృతజ్ఞత, 

మహిమ చెల్లించకపోవడమే ఘోర పాపం.

         రెండవది, క్రొత్త జీవితం, క్రొత్త హృదయం, కలిగించగలిగిన శక్తిమంతుడు దేవుడే! చాలామంది క్రొత్తగా 

జీవించాలనుకుంటారు. క్రొత్త నిర్ణయాలు క్రొత్త సంవత్సరపు మొదటి దినాన తీసుకుంటారు. నిర్ణయాలు 

క్రొత్తవైనంతమాత్రాన అవి మనలో క్రొత్తదనాన్ని కలిగిస్తాయా? ఎంతో కోపముతో బాధపడేవారు వారి కోపపడే 

గుణాన్ని మార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే భయపడేవారు, అనుమానపడేవారు, 

చింతకు, దిగులుకు బానిసలైనవారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు కలుగదు. మరి కొందరు మందుల ద్వారా 

బాగవుతామనుకుంటారు. ప్రతి మందుకు ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ తప్పకుండ ఉంటుంది. మరి కొందరు చెడు 

అలవాట్లకు, హానికరమైన అలవాట్లకు బానిసలయిఉంటారు. మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పాట్లు పడ్డా, 

ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా మార్చబడం సాధ్యం కాకపోవచ్చు. కాని, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న వారందరూ 

క్రొత్త సృష్టి అవుతారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది, ఎంతో సంతోషంతో ఈ మాటలు చెబుతున్నది. II కొరింథీ 

5:17. "కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

18. సమస్తమును దేవుని వలననైనవి;" 

మీరు ఎన్నో సార్లు వినివుండవచ్చు. కాని, ఈ సత్యం మీ జీవితములో క్రియారూపం దాల్చాలంటే, ఈ షరతు 

ఉన్నది. “క్రీస్తునందు” ఉండాలి. నీవున్నచోటనే ఉంటానంటే ఇది జరగదు. నీ ఇష్టమొచ్చినట్టు ఉంటానంటే ఇది 

అసాధ్యం. అబ్రాహముతో దేవుడేమన్నాడు? ఆది. 12:1-2

         “1. యెహోవా --నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి            నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

            2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు             ఆశీర్వాదముగా నుందువు.

            3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను;

    దేవుని వాగ్దానములో షరతులు ఉన్న సంగతి మనము లెక్క చేయము. పట్టించుకోము. వాగ్దానమును

మాత్రము కంఠస్థం చేసి దేవుని అడుగుతూ ఉంటాము. కాని ఆయన చెప్పింది చేస్తేతప్ప ఆ వాగ్దానము నెరవేరదు. 

నీవు, ప్రియ స్నేహితుడా, సోదరీ, యేసు క్రీస్తులోనికి వచ్చి “ఆయనయందు” నిలిచి ఉండడానికి సిద్ధమైతే, నీ 

హృదయమును, జీవితమును సంపూర్ణంగా క్రొత్తదిగా చేయడానికి ఆయన శక్తిమంతుడు, నమ్మకమైన దేవుడు. 

మాట తప్పని పరిశుద్ధుడు.

    మూడవది, మన పరిస్థితులలో క్రొత్తవి కలిగించడానికి యేసు క్రీస్తు ప్రభువు శక్తిమంతుడు.

యెషయ 43:19 గమనించండి.

         “18. మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.

            19. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.”

    ఈ లేఖన భాగములో చాలా లోతైన భావము ఇమిడి ఉన్నది. ఈ ప్రవచనములు ప్రవచించిన యెషయ ప్రవక్త 

తన గ్రంధములో, 40వ అధ్యాయము తరువాత, రక్షకుని గూర్చి ప్రవచించాడు. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు. 

అపజయములో కూరుకుపోయి ఉన్నారు. వారిని అదరిస్తూ ప్రవక్త యెషయ వారితో దేవుని ఆదరణను అందిస్తూ ఈ 

మాటలు చెబుతున్నాడు. గతమంతా మర్చిపొండి! దేవుడు క్రొత్త క్రియలు చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయమంతా 

గొప్ప అద్భుతములు, అసాధ్యమైన క్రియలు దేవుడు చేస్తాడని దేవుని పరిశుద్ధ లేఖనం నిన్ను, నన్ను ఆదరిస్తుంది. 

    గత సంవత్సరములోని బాధలను, అపజయాలను, దుఃఖములను, అన్నిటిని మర్చిపోయి, దేవుని నూతన 

క్రియ కోసం విశ్వాసముతో, పశ్చాత్తాపముతో ఎదురు చూడండి. నిజముగా “క్రీస్తు నందున్న” వారిని ప్రభువు 

విడిచిపెట్టడు. నూతనక్రియలు చేసి నూతన మార్గాములు తెరచి, నూతన మేళ్ళు, ఆశీర్వాదాలు, విజయాలు 

అనుగ్రహించగలడు. కాని, షరతు ఏమిటి? పశ్చాత్తాపం. మారు మనసు. పాపమును అసహ్యించుకొని 

విడిచిపెట్టడం. 

    యెషయ 40వ అధ్యాయం నుండి అంతా యేసు క్రీస్తు ప్రభువు గురించి, ఆయనద్వారా కలిగే క్రొత్త జీవితము 

గురించి ప్రవక్త ప్రవచించాడు. శ్రోతలూ, అన్నీ క్రొత్తవిగా మారేది యేసు క్రీస్తులోనే, ఇక వేరే మార్గము లేదు!

         ఇక చివరిది, నాలుగవది, సమస్త సృష్టి, క్రొత్తదిగా చేయబడే శుభదినము రానున్నది. మీరు చూస్తున్న 

సృష్టి, ఎంత అందంగా, ఆహ్లాదంగా కనిపించినా, అది శపించబడింది. సృష్టిలో ఎంతో క్రూరత్వం మనకు కనిపిస్తుంది. పాపము ప్రవేశించకముందు దేవుని సృష్టి ఎంత 

అద్భుతంగా, పరిశుధ్ధంగా రమ్యంగా ఉండేదో మీరు, నేను ఊహించలేము! రోమా పత్రిక 8వ అధ్యాయములో సృష్టి, 

మన పాపమునుబట్టి విమోచన కోసం  మూలుగుతున్నదని అపో. పౌలు బోధించాడు. అవును, సృష్టి శపించబడి, 

మూలుగుతూ, విమోచన విడుదల కోసం ఎదురు చూస్తున్నది. ఒకానొక అద్భుతమైన దినాన మన రక్షకుడు, 

యేసు క్రీస్తు ప్రభువు ఈ సృష్టి అంతటినీ క్రొత్తదిగా చేయబోతున్నాడు! హల్లెలూయ!!     

            ప్రకటన 21:5-8 వరకు చదువుకుందాం.

         “5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా            చేయుచున్నానని చెప్పెను; మరియు--ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు

            6. మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా         ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును          నేను ఉచితముగా అనుగ్రహింతును.

            7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు            కుమారుడై యుండును.

            8. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును,            మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు   గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

    ఇవి స్వయాన యేసు క్రీస్తు ప్రభువు పలికిన మాటలు. ఆయనే అది, అంతం. సర్వమునకు సృష్టికర్త, 

విమోచకుడు. “సమస్తమును” దేన్ని విడిచిపెట్టకుండా ఆయన క్రొత్తవిగా చేయబోతున్నాడు. కాని, కొందరు ఆ 

అద్భుతమైన క్రొత్త సృష్టిలో ఉండరు. వారి లిస్ట్ ఇప్పటికే చదివాము. మీరు అందులో ఉన్నారా? ఉంటే నిత్యనరకం 

తప్పదు. యేసుక్రీస్తు నందు ఉండని వారంతా అగ్నిగంధకములతో మండే నిత్యనరకములో శిక్ష పొందక తప్పదు.  

ఈ భయంకరమైన శపించబడ్డ సృష్టిలో లోకములో, సైతాను ఏలుతున్న దుష్టపాపపు లోకములో కలిసిపోతారా? 

లేదా యేసు క్రీస్తు నందు ఉండి, క్రొత్త హృదయము, జీవితము, ప్రవర్తన, దీవెన, ఆశీర్వాదం, విజయం, మరణము 

తరువాత నిత్యజీవములో ప్రవేశిస్తారో మీరే నిర్ణయం తీసుకోవాలి! 

ప్రార్థన:  మీ స్వంత మాటల్లో మీరు ప్రార్ధన చేసుకొండి. యధార్ధమైన మాటలు దేవుడు తప్పక వింటాడు. 

దీనమనసుతో చేసే ప్రార్ధన అయితే దేవుడు తప్పక వింటాడు. మీకు అధ్యాత్మిక జీవితములో సహాయము, లేదా ఒక 

బైబిల్ మీరు కావాలని కోరితే, ఫోన్ చేయండి. ఫోన్: 81431 78111 

           

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...