2023 క్రిస్మస్ బైబిల్ అధ్యయనం
మొదటి క్రిస్మస్ సందేశము ఎవరిచ్చారు?
“సజీవ నిరీక్షణ” శ్రోతలందరికి, ప్రతి ఒక్కరికి, ఒక్కొక్కరికి, యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహించే కృప సమాధానములు, ఆనందం, శాంతి నెమ్మది సమృద్ధిగా కలుగును గాక! క్రిస్మస్ శుభములు మీకు మీ ఇంటిల్లిపాదికీ సర్వశక్తిగల దేవుడు, సర్వసమృద్ధిగా అనుగ్రహించుగాక! Happy Christmas!!
ఈ క్రిస్మస్ దినాన మనమంతా కలిసి అధ్యయనం చేసే అంశం: “మొదటి క్రిస్మస్ సందేశము ఎవరిచ్చారు? మొదటి క్రిస్మస్ సందేశం ఎక్కడ, ఎవరు ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అది ఆది. 3:15వ వచనములో సర్వసృష్టికర్త అయిన దేవుడే స్వయంగా ఇచ్చారు. “నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.” ‘ఇక్కడ క్రిస్మస్ సందెశమేమిటి?’ అనుకుంటున్నారా? జాగ్రతగా వింటే స్పష్టమవుతుంది. ఆదాము హవ్వలు చేసిన పాపము చాలా చిన్నదనుకుంటున్నారా? ఎంత మాత్రము కాదు. దేవుడు ఎవరో, ఆయన స్వభావము తెలుసుకుంటే తప్ప పాపపు భయంకరత్వము మనకు తెలియదు. దేవుని పరిశుద్ధత ఏమిటో తెలిస్తేతప్ప ఆయన తీర్పులు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలియదు. పాపమే లేని పరిశుద్ధమైన సృష్టిలోనికి వాళ్ళ అవిధేయతనుబట్టి ఘోరమైన తీర్పు, శాపము ప్రాకింది. మానవజాతి అంతటికి ప్రాకిన పాపపుఫలితాలు ఈ అధ్యాయమునుండి, ప్రకటన 20వ అధ్య్యాయము వరకు కనిపిస్తున్నవి. దేవుడు సైతానుతో అన్న మాటలలో ఈ మాటలు ఉన్నాయి. సైతానుకు, స్త్రీకి, సైతాను సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగచేస్తానని దేవుని తీర్పు లేదా శాపము చెప్పాడు. మానవజాతి అంతటిని ఈ తీర్పు ప్రభావితం చేసింది. ప్రతి తరములో ఉన్నవారికి వర్తించే ఈ శాపములోనే దేవుని అద్భుతమైన సువార్త ఇమిడి ఉన్నది. హల్లెలూయ! అదే రక్షకుని గూర్చిన మొదటి వాగ్దానము. ఆది. 3:15 విశ్లేషణ జాగ్రతగా గమనించండి! “అది” అనగా స్త్రీ సంతానము. మానవ శరీరములో జన్మించిన దైవకుమారుడు, అభిషిక్తుడు యేసు క్రీస్తు! “నిన్ను” అనగా సైతానును. “తలమీద కొట్టును” అనగా చితుకగొట్టడం, సంపూర్ణంగా జయించడం. యేసు క్రీస్తు ప్రభువు సిలువ మీద సరిగ్గా అదే చేశాడు. ప్రభువు జన్మించింది ఈ ఉద్దేశ్యం కోసమే! అందుచేత ప్రభువు జన్మించినపుడు “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును” అనే అద్భుతమైన సువార్త సందేశము మత్తయి సువార్త 1:21లో భూమి మీద ఉన్నవారందరికోసం దేవుడనుగ్రహించిన శుభవార్త! ఆదినుండి, అనగా సృష్టి ఆరంభము నుండి సైతాను దేవుని కార్యములకు, దేవుని రక్షణ ప్రణాళికకు ఆటంకాలు పెడుతూనే ఉన్నాడు. దేవుని ప్రణాళిక ప్రకారం ఆదాము సంతానములోనుండి రక్షకుణ్ణి తీసుకురావాలనుకున్నాడు. కాని, మొదట జన్మించిన మానవుడు కయీనులో వాని దుష్కృయ చేశాడు. దేవునికి వ్యతిరేకిగా, హంతకుడుగా, పశ్చాత్తాపం ఏమాత్రము లేకుండా కయీను దేవునిని ధిక్కరించాడు. మరోప్రక్కన ఆయన తరువాత జన్మించిన హేబేలును అతడే హతమార్చాడు, తన స్వంత జీవితములో కూడా దేవుని ప్రణాళికకు ఆటంకం పెట్టాడు. అయినప్పటికి, దేవుడు మరొక మానవుడు షేతు ద్వారా తన ప్రణాళికను నెరవేర్చాలని సంకల్పించాడు. ఆది. 6వ అధ్యాయములో “దేవుని కుమారులు” అనే మాట చదివారా? వారు సైతానుతో ఉన్న తిరుగుబాటు చేసిన దుష్టదూతలు. వారు చేయరాని పాపము చేసి అక్రమ సంతానాన్ని కలిగించారు. ఆతరువాత దేవుడు మానవజాతిని సృష్టించినందుకు నొచ్చుకొని, జీవము కలిగిన ప్రతిదాన్ని జలప్రళయము చేత తుడిచివేశాడు. కాని, కనికరము కలిగిన ప్రభువు నోవాహు, ఆయన కుటుంబముద్వారా మళ్ళీ క్రొత్త తరమును కలిగించాడు. ఇంకా, ఈ విధంగా, అధ్యయనం చేస్తూ ఉంటే, పాత నిబంధన అంతటిలో పాపపు ఫలితాలు కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కసారి పరిశుద్ధ గ్రంధం బైబిల్ సాంతం చదివితే మీకే అర్థమవుతుంది. పాత నిబంధన లోని ప్రతి గ్రంధములో యేసు క్రీస్తు ప్రభువు గుప్తమై ఉన్నాడు. ఆయన క్రిస్మస్ సమయాన మానవుడుగా జన్మించాడు. కాని, ఆయన సృష్టించబడినవాడు కాదు, సృష్టి కర్త. యోహాను సువార్త 1:2-4 వచనాలు గమనించండి: “2 ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. 4. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఈ లేఖన భాగములో “ఆయన” అనే మాట యేసు క్రీస్తునకు తప్ప మరెవరికి చెందదు. యేసు క్రీస్తు సృష్టికి మూలమైన వాడని చెప్పడానికి ఇంత కంటే వేరే సాక్ష్యం అవసరమా? యేసుక్రీస్తు ప్రభువు ఎవరో, ఆయన మానవునిగా జన్మించక ముందు ఎప్పుడు ఎక్కడ, ఉన్నాడో, ఆయన అధికారం, భవిషత్తులో ప్రభువు ఎలాంటి మహిమా పొందనున్నారో కొలస్సీ పత్రికలో అపో. పౌలు 1:15-20లో స్పష్టంగా బోధించాడు.
“15. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. 16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. 17. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. 19. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, 20. ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.”
ఆదినుండి సైతాను దేవునితో చేస్తున్న పోరాటములో వాడి సమస్త ఆటoకములను దేవుడు నశింపచేశాడు. చివరికి, యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకములోనికి, దేవుని గొర్రెపిల్లగా, మానవ శరీరములో జన్మింప చేయడానికి దేవుడు చేసిన ప్రణాళికలలో కూడా వాడు అడ్డు తగిలాడు. యేసు క్రీస్తు ప్రభువు సిలువమీద తన ప్రాణమును పాప పరిహారముగా బలి చేయడానికి సంపూర్ణమైన సంసిద్ధతతో దిగి వచ్చాడు. ప్రభువు సిలువమీద మరణించడం సైతాను తలను చితుకగొట్టడమే! హల్లెలూయ! దేవుని పరిశుద్ధ లేఖనం ఏమని వర్ణిస్తుందో జాగ్రతగా గమనించండి. కొలస్సీ పత్రిక 2:15 “ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.” సిలువమీద ప్రభువు చేసింది అత్యంత ఘనమైన విజయం. ప్రధానులు అనగా సైతాను దూతల నాయకులు. అధికారులు అనగా ఆ నాయకుల క్రింద పనిచేసే దుష్టులైన వానిదూతలు. వాళ్ళను జయించి వారి ఆయుధాలను నాశనం చేసి, బంధించి బందీలుగా చెరపట్టి వారిని తాను జయించినట్టుగా అందరియెదుట వేడుక చేశాడు. ప్రియ సోదరీ, సోదరులారా, మీరు ఎవరిని నమ్మి, ఎవరిని ఆశ్రయించి, ఎవరి అధికారము క్రింద ఉన్నారో, మీకు తెలుసా? ఇంత గొప్ప విజయం ఎక్కడ నెరవేరింది అనగా సిలువమీద! యేసు క్రీస్తునందు స్థిరమైన, నిజమైన విశ్వాసము ఉంచి ఆయనను నిస్సందేహంగా, నిర్మొహమాటంగా, ప్రజలందరి యెదుట ఆ విశ్వాసమును కనుపరిచే వారికి ఆయన సన్నిహితుడు! ఈ రోజుల్లో సమాజానికి, చుట్టూ ఉన్న వారికి, ఇక మరిదేనికైనా, భయపడి, లేదా సిగ్గుపడి, యేసు క్రీస్తు ప్రభువును తృణీకరించేవారు ఎందరో ఉన్నారు. మీరు కూడా అందులో ఉన్నారా? ప్రభువు తిరిగి తన మహిమతో వచ్చినపుడు మిమ్మల్ని గూర్చి సిగ్గుపడతాడు, త్రోసివేస్తాడు. జాగ్రత సుమీ! రెండు తలంపుల మధ్యలో రెండు మార్గాల్లో, కొంత సేపు ప్రభువును మరి కొంతసేపు మీ చుట్టూ ఉన్నవారిని మీరు సంతోషపెడుతున్నారా? ఈ క్రిస్మస్ దినాన మీ విశ్వాసమును శుద్ధి చేసుకోవడం మంచిది. నిజమైన విశ్వాసమును పటిష్టపరచుకోవడం మంచిది. సైతాను ఈనాటికీ దేవుని శత్రువుగా ఆయనవద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని దారి మళ్లిస్తున్నాడు, తప్పుదారిలో నడపడానికి శోధిస్తున్నాడు. ఈ నాడు నిన్ను నన్ను, ప్రతి ఒక్కరిని, దేవునిమార్గములో చేరకుండా, ప్రభువు పరిపూర్ణ మార్గములో నడవకుండా ఆటంకపరిచేది సైతాను. కాని,పరిపూర్ణ విజయం యేసు క్రీస్తు ప్రభువు సంపాదించాడు. ఆయనతో ఆయనలో ఉన్నవారు కూడా వారి జీవితాల్లో సైతానును జయించడానికి అవసరమైనంత శక్తి, కృప ఆయనలో ఉన్నవి. వాటిని నిండుగా పొంది ప్రభువును వెంబడించే నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి ప్రభువు మనలో ప్రతి ఒక్కరికీ సహాయం చేయుగాక! అమెన్!!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment