- I కొరింథీ-75 16:13-14
కలిసి పనిచేయడం
దేవునికి స్తోత్రం, హల్లెలూయ! 1 కొరింథీ పత్రిక చివరి అధ్యాయము చివరి వచనాలు ఈ దినము అధ్యయనం
చేస్తున్నాము. మీరు, ఈ పత్రిక మొదటి అధ్యయనo నుండి ఇప్పటివరకు ప్రతి అధ్యయనమును విన్నారా? దేవుని
పరిశుధ్ధ లేఖనముల అధ్యయనము ద్వారా మీరు ఏవిధంగా రూపాంతరం చెందారో, ఏ విధమైన మార్పులు మీ
ఆలోచన విధానం, ప్రవర్తనలో కలుగుతున్నాయో తెలుసుకోవాలని ఎంతో ఆకాంక్షిస్తున్నాము. వివరంగా
తెలియచేయండి, మీ దగ్గరలో ఉన్న తోటిసంఘస్తులతో, తోటి విశ్వాసులతోకూడా పంచుకోండి. మీకు మేలు ఏదైనా
జరిగితే, ప్రమోషన్ కాని, స్వస్థత కానీ, మరేదైనా, మేలు కలిగితే చెప్పకుండా ఉంటారా! ఆత్మీయ జీవితములో కలిగిన
మేళ్ళు వాటికంటే గొప్పవి.
ఈనాటి అంశము కలిసి పనిచేయడం. లేఖన భాగము 1 కొరింథీ 16:13-14. ఈ భాగములో అపో.
పౌలు కొరింథీ సంఘపు వారిని ఇతరులతో కలిసిపనిచేయమని ప్రోత్సహిస్తున్నాడు. ఈ విధంగా కలిసి పనిచేయడానికి
కొన్ని మూలసూత్రాలు ఇక్కడ వివరించబడ్డాయి.
మొదటి సూత్రం, ప్రేమ విషయములో నమ్మకమైన నిశ్చయత కలిగిఉండాలి. 13, 14 వచనాలు
“13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;
14. మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
కొరింథీయులను ముందుకు పరుగెత్తేలా చేయడానికి పౌలు వారికి యుధ్ధపిలుపు ఇస్తూఉన్నాడు. మరో మాటలో
చెప్పాలంటే, నాలుగు ఆజ్ఞలు ఇస్తునట్టుగా ఉన్నది. అవి 13వ వచనములో స్పష్టంగా ఉన్నవి. 1. ‘మెలకువగా ఉండుడి’
అంటే నిద్రపోవద్దు, తేరుకోండి, మత్తులోనికి జారిపోవద్దు అని అర్ధం. ఈనాడు ఎంతో మంది ‘క్రైస్తవ విశ్వాసులు’ అని
పిలువబడుతూ ఉన్నా, వారిని వారి మంచి విశ్వాసులమని అందరు అనుకుంటున్నా, ఇతరులచేత ఆలాగు
పిలువబడుతున్నా, సత్యం మాత్రం వేరు. నిద్ర మత్తులోనికి జారుకున్నారు. అందుచేత పౌలు ‘లెండి, మత్తు విడువండి’
అని హెచ్చరిస్తున్నాడు. ఇటీవల ఒక సర్వేలో వెల్లడించబడ్డ విషయాలు విన్నప్పుడు ఇది నిజమే అని తెలిసింది.
జాగ్రత్తగా వింటున్నారా? మన దేశములో ఉన్న క్రైస్తవులలో 54% కర్మను నమ్ముతున్నారు. 32% నదులలోని నీళ్ళలో
దైవత్వముoదని నమ్ముతున్నారు. 29% మళ్ళీ మళ్ళీ పుడతారని, జన్మలున్నాయని నమ్ముతున్నారు. 31%
దీపావళి పండుగను చేసుకుంటున్నారు. 25% హోలీ పండుగను చేసుకుంటున్నారు. 22% బొట్టు పెట్టుకుంటున్నారు.
వీళ్ళంతా క్రైస్తవ విశ్వాసులుగా చలామణి అవుతున్నవారే! మీరు కూడా ఇందులో ఉన్నారేమే చూచుకొనండి. మీ
విశ్వాసమెక్కడ? ఈ లెక్కలు చెబుతున్నదేమిటి? మన నిద్రావస్థ గురించి ఈ లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి.
రెండు తలంపుల మధ్యలో, రెండు మార్గాలలో, సంఘపు ఆవరణములో ఒక పేరు, పధ్ధతి, బజారులో మరో పేరు,
పధ్ధతి, ఉన్నట్లయితే ప్రభువు తీర్పును ఎదుర్కూంటామే కాని, మెప్పును కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
2. “విశ్వాసమందు నిలుకడగా ఉండుడి” నిలుకడ అనే మాట మనము ఎల్లప్పుడు వాడుకునే మాట! ఒక్కొక్క
సారి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ప్రవర్తించే వారిని నిలుకడగా లేరని వెంటనే చెప్పగలుగుతాము. గాలి కొట్టినపుడు
చెట్టు ఊగినట్టు, పొట్టు ఎగిరిపోయి ఎక్కడో పడిపోయినట్టు చంచలమనసుతో జీవిస్తీన్నావా? విశ్వాసము బలముగా
కొంచెము కాలము, అనుమానము, ఆందోళనలో, చెడు వ్యసనాలలో మరి కొంత కాలము జీవిస్తున్నామా? ప్రియ
సోదరీ సోదరులారా, ఒత్తిడికి లోనై దారితప్పకండి! నిలుకడగా నిటారుగా నిలువబడండి, ఎంత గాలి కొట్టినా, ఎంత
బలమైన గాలి కొట్టినా, చెట్టు కూలిపోకుండా నిలుబవబడ్డట్టు మన విశ్వాసము నిలువబడాలి!!
3. ఆ తరువాత మూడవ హెచ్చరిక “పౌరుషమూగలవారై యుండుడి!” “పురుషుల్లాగా ధైర్యంగా ఉండండి” అని
మూలభాషలో, ఆంగ్లములోనూ తర్జుమా చేశారు. పురుషులు ధైర్యము, బలమునకు గుర్తు. కాని ఈనాడు, పురుషుడు
అంటే దౌర్జన్యానికి, క్రూరత్వానికి మారుపేరుగా ఉన్నది. ఎంతటి దౌర్భాగ్యంగా మన పాపపు సంస్కృతి దేవుని
ప్రమాణాన్ని మార్చిందో గమనిస్తున్నారా? పురుషునిలాగా పౌరుషంగా ఉన్న దైవజనుడు పరిశుద్ధ గ్రంధంలో
కనబడుతున్నాడు. ఆయనపేరు దావీదు. అప్పటికింకా రాజు కాలేదు. శత్రువులు సమస్తాన్ని, భార్య పిల్లలను సహితం
దోచుకొని పోయారు. కట్టుబట్టలతో ఆయుధాలతో మాత్రమే మిగిలారు. వారి ఊరు సిక్లగును శత్రువులు కాల్చివేశారు.
ఆయన సహచరులు ఆయనే రాళ్ళతో కొట్టాలని ఆలోచిస్తున్నారు. 1 సమూ. 30:6 “దావీదు మిక్కిలి దుఃఖపడెను.
మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు
రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము
తెచ్చుకొనెను.” హల్లెలూయ! పురుషత్వము అంటే ఇది!! కొట్లాడడం, కోపావేశాలతో ఊగిపోవడం కాదు. క్రూరత్వము
అంతకూ కాదు. దేవునిలో పురుషుల విశ్వాసము బలంగా ధృడంగాగా నిలబడాలి!
దావీదు లాంటి బలమైన విశ్వాసము, ప్రత్యేకించి, పరిస్థితులు ప్రతికూలిస్తున్నపుడు, వ్యతిరేకత, తిరిగుబాటు
విస్తరంగా వ్యాపించినప్పుడు నిటారుగా నిలువబడాలి! ఒత్తిడికి లోనై, దుర్వ్యసనాలకు బానిసగా మారి విశ్వాసమును
తాకట్టు పెట్టే వారు క్రైస్తవ పురుషులు కారు! వారు విశ్వాస బ్రష్టులు! మరి, ప్రియ తోటి సహోదరులారా, మీరు ఏ
లెక్కలోనికి వస్తారు? దావీదు లాంటి విశ్వాస వీరులలెక్కలోనికా! లేదా సౌలు లాంటి విశ్వాస బ్రష్టుల లెక్కలోనికా? 2
కొరింథీ 13:5 “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే
పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా? “ ఎవరో
మీ గురించి చెప్పే మాటలు, సాక్ష్యము కాదు, మీ స్వంత మనస్సాక్షి మీకు బోధించి మీ స్థితి మీకు తెలుపుతుంది.
నాలుగవ హెచ్చరిక ఈ మూడింటిలో అత్యంత అవసరమైనది. 14వ వచనములో ఉన్నది, “మీరు చేయు
కార్యములన్నియు ప్రేమతో చేయుడి.” ఇది ఒక ధ్వజము, లేదా, బేనర్ లాంటిది. మొదటి మూడు హెచ్చరికలు, అంతే
కాక మన ప్రవర్తన, క్రియలు, మాటలు, తలంపులు, యోచనలు అన్నింటిని ప్రభావితం చేసిది ఈ నాలుగవ హెచ్చరిక.
మనము ఏది చేసిన, ప్రేమనుబట్టి, ప్రేమతో, ప్రేమకు గుర్తుగా చేయాలి. ప్రేమ మనసులో ఉంటుందికదా!, దాన్ని
బహిర్గతం చేసేవి ఆ మొదటి మూడు హెచ్చరికలు. ఇక్కడ ప్రేమ అనే మాటకు వాడబడిన మాట అగాపే. అనగా
స్వార్ధముతో ఏ మేలు చేయకూడదు. ఏదైనా ఆశించి చేయ కూడదు. ఏ ప్రలోభానికి తన ప్రేమ పొందే వారిని
లోపరచదు. 1 కొరింథీ 13వ అధ్యాయము అగాపే ప్రేమను చక్కగా వివరిస్తుంది, ఆ ప్రేమకు ఉండే గుణాలు, ఆ ప్రేమకు
చెందని గుణములు అన్నింటినీ సవివరంగా బోధిస్తున్నది. అగాపే ప్రేమ ఏది అవునో ఏది కాదో ఆ పరిశుద్ధ
లేఖనములోని మాటల వెలుగులో పరీక్షించినట్లయితే స్పష్టమవుతుంది. ఆ అధ్యాయము చిన్నది, దాని లోని అన్ని
వచనములు కంఠస్థం చేస్తే చాలా మంచిది. మచ్చుకు కొన్నింటిని మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి.
“4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
5. అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
6. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
7. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
ఈ ప్రేమ కేవలము దేవునివద్దనుండి, దేవుని ఆత్మచేత దేవుని ద్వారా మాత్రమే పొందగలము. ఇదే ప్రేమను మనలో,
అనగా దేవునికి చెందినవారిలో ప్రభువు కుమ్మరించాడని లేఖనం సెలవిస్తున్నది. “మనకు అనుగ్రహింపబడిన
పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింప బడియున్నది.” చాలా జాగ్రత్త గమనించాలి
సుమా! ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మన హృదయాలలో
కుమ్మరించబడింది. పరిశుధ్ద్ధాత్ముడు ఎవరి హృదయములో జీవిస్తాడు. యేసు క్రీస్తు ప్రభువును వారి హృదయాల్లో
కలిగినవారిలో మాత్రమే! వారిలో అగాపే ప్రేమ కొంచె కాదు సుమా, సమృధ్ధిగా కుమ్మరించబడుతుంది. హల్లెలూయ!
యేసు ప్రభువునకు, పరిశుధ్ద్ధాత్మునికి, మనము ఎంత లోబడి అప్పగించుకుంటే, అంత ఆ ప్రేమ మనలో
కుమ్మరించబడుతుంది.
ప్రార్ధించుకుందాం:
No comments:
Post a Comment