I కోరింథీ-42 12:8-11 పరిశుద్ధాత్ముని సజీవత్వము, జీవశక్తి

 

పరిశుద్ధాత్ముని సజీవత్వము, జీవశక్తి

            దేవునికి స్తోత్రం! మరో అధ్యయనానికి సిద్ధంగా ఉన్నారా? మీరేమి హెచ్చరికలు, దీవెనలు, ఆదరణ 

పొందుతున్నారో నాకు తెలియదు గాని, నా మట్టుకైతే, దేవుని వాక్యం నన్ను కదిలిస్తున్నది. ప్రభువునకు ఇంకొంచెం 

సమీపంగా చేరడానికి లేఖనాల వెలుగు నన్ను జీవింపచేస్తున్నది. మరి మీ సంగతేమిటి? మీరు పొందుతున్న దీవెన, 

మేలు, హెచ్చరిక, ఆదరణ, ప్రార్థన మనవి చెప్పడానికి సంకోచించవద్దు. ఏ విధంగానైనా, మెస్సెజ్, ఉత్తరం, ఫోన్ కాల్, 

వాట్సప్ మెస్సెజ్ ద్వారా మీరు కూడా వివరంగా పంచుకోండి.

ఒక ముఖ్య ప్రకటన: చదువు లేనందున, లేదా మరే కారణము చేతనైనా పరిశుద్ధ గ్రంధం బైబిల్ చదవలేకపోతున్నారా? ఆది కాండం నుండి ప్రకటన వరకు, వినాలని ఆశపడుతున్నారా? మీ కోసం “ఆడియో బైబిల్” అనే చిన్న ఉపకరణం అందుబాటులో ఉన్నది. దీనికి అదనంగా, ఈ ఉపకరణములో రోమా పత్రిక అధ్యయనాలన్నీ మెమొరీ కార్డ్ లో పొందుపరచబడ్డవి.  కావలసినవారు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు. ముగింపులో ఫోన్ నంబర్ ఇవ్వబడుతుంది.

ప్రార్థన:

ఈనాటి ధ్యానాంశం: పరిశుద్ధాత్ముని సజీవత్వం, జీవశక్తి.  I కోరింథీ 12:8-11 గమనించండి:

            “8 ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును,

            9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

            10. మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును,           మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల  అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. 11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.”

అపో. బోధిస్తున్న ఆత్మ వరములు గ్రహించాలంటే, వీటిని మూడు గుంపులుగా విభాగించాలి.

మొదటిది, మనసు అనే విషయమునుగూర్చి ఆలోచించాలి. ఒకరికి “బుద్ధి వాక్యము” ఇవ్వబడింది. పౌలు జీవిoచిన కాలములో ఈ మాట చాలా వాడుకలో ఉండేది. బుద్ధిని ఎంతో ప్రేమించే వారుండేవారు. వారిని జ్ఞాస్టిక్స్ అని పిలిచేవారు. “సోఫియా” అనే మాట చాలవాడుకలో ఉండేది, అనగా బుద్ధి. “బుద్ధి” అనే మాటకు అసలైన అర్ధం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంధంలో ఇవ్వబడ్డ దేవుని ప్రత్యక్షతలను, సత్యమును, క్షుణ్ణంగా గ్రహించి, మన జీవితానికి వాటిని అన్వయించే అవగాహనశక్తి, దాని కాపాడే శక్తి, సంపాదించు కోవడం. ఈ వరము చాలా అత్వసరమైన వరము. అన్నీ కాలములకంటే, ఈ కాలములో ఇది చాలా అవసరము. ఆ తరువాత “జ్ఞాన వాక్యము” అనే వరము. బుద్ధి వాక్యానికి జ్ఞానవాక్యానికి భేదమున్నది. అనుభవమునుబట్టి కలిగే జ్ఞానమిది. మరో మాటలో చెప్పాలంటే మనకు కలిగే అనుభవాలను సంతరించుకుని నేర్చుకున్న జ్ఞానము. ఈలాటి జ్ఞానము సంపాదించుకునేలా మనము నిర్మించబడ్డాము. మన జ్ఞానమును వృద్ధి చేసుకోవచ్చు. ఇది లోతైన పరిపక్వమైన, విశాలమైన క్రైస్తవ విశ్వాసజీవితములో ఒక అనుభవజ్ఞుడు, జాగ్రత్తపరుడు నేర్చుకునే జ్ఞానము. దీనికి మంచి ఉదాహరణ, యాకోబు కుమారుడు యోసేపు. మరోమాటలో చెప్పాలంటే, ఎల్లప్పుడు ప్రతి విషయములో జాగ్రతగా నేర్చుకుంటూ, ఈ అనుభవ జ్ఞానమును ఇతరులకు సాయపడేలా ఉపయోగించాలి. దీని ద్వారా మనకు మనము, ఇతరులకుకూడా సాయం చేయవచ్చు. కాబట్టి, జ్ఞానము, బుద్ధి, రెండింటినీ మనసుతో నేర్చుకొని వినియోగించండం.

         రెండవది, ఆత్మకు చెందినది. మరొకనికి విశ్వాసం అనే వరం ఉన్నది. ఇక్కడ విశ్వాసం అనేది ఒక ప్రత్యేకమైన వరమని గ్రహించాలి. ఆలోచనలు సవ్యంగా, స్పష్టంగా, నిమ్మళంగా, ఉద్దేశపు నెరవేర్పు కోసం, వివేకముగా ఆలోచించగలగాలి. ఎందుకంటే, దేవుడు ప్రతి ఒక్కరికీ ఆలోచించే శక్తినిచ్చాడు. ఆలోచించి నమ్మే శక్తిని దేవుడు మనకనుగ్రహించాడు. ఇక్కడ ఈ లేఖన భాగములు ఆపో. ఒక ప్రత్యేకమైన విశ్వాసము గూర్చి, దాన్ని ఏ విధంగా ఒక సహాయము రూపములో ప్రభువు అనుగ్రహిస్తాడో బోధిస్తున్నాడు. కొందరికిది ఎక్కువ, మరి కొందరికి తక్కువ. ఆ తరువాత పౌలు స్వస్థత అనే వరము ఇవ్వబడ్డట్టు బోధిస్తున్నాడు. దేవుడు ఏ ఒక్కరికైనా ఈ వరమును నమ్మి ఇవ్వగలడా? దీనిలో ఒక వ్యక్తి తన స్వంత స్వార్ధపు అభివృద్ధి కోసం వాడుకునే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇక మరో ప్రశ్న ఏమిటంటే, దేవునియందు విశ్వాసముంచిన వారు అనారోగ్యంగా ఉండడం దేవుని చిత్తమా? తన ఇద్దరు సహచరులు, తోటి సేవకులు అనారోగ్యం పాలైనట్టు వ్రాశాడు. 1. ఎఫప్రోదితు. దాదాపు మరణపు అంచులవరకు ఆయన వెళ్ళాడు. ఫిలిప్పీ 2:25-27. 2. త్రోఫీము. పౌలు ఈయనను రోగి అయినపుడు మిలేతులో విడిచి వెళ్ళాడు. II తిమోతి. 4:20. ఇవి స్వయానా పౌలు మాటలు.

         మూడవది, సేవ చేసే అంశము. మొదటిగా పౌలు అధ్బుతముల విషయం ప్రస్తావించాడు. మానవ ప్రమేయం లేకుండా, కేవలం దైవికంగా జరిగే అద్భుతములు. సృష్టి క్రమమును గట్టిగా నమ్మేవారు, దీన్ని చట్టమని కూడా అనుకోవచ్చు. ఈ చట్టాములో మార్పులు ఉండడానికి వీలు లేదని వాదించే వారున్నారు. మీరు కూడా అందులో ఒకరెమే! సరిగ్గా అధ్బుతమంటే అదే! సృష్టి చట్టములో అసాధ్యమైనవి జరగడం. దైవికంగా సృష్టి చట్టములో ఎన్నడూ జరగనివి జరగడం. సాధారణంగా జరుగు తుందనుకునే వారికి ఆశ్చర్యo కలిగించే విధంగా ఈ చట్టమును అధిగమించి ఒక అసాధ్యమైన అద్భుతం జరగడం. ఆ తరువాత మరొకరికి ప్రవచన వరమని చెప్పబడింది. అనగా జరగబోయేవి చెప్పడమనే  భావన కన్నా వాక్యపు హెచ్చరిక, లేదా బుద్ధి బోధన అని కూడా అనవచ్చు. వ్యక్తిగతమైన బుద్ధిబోధన కంటే దేవుని సంఘమునకు అవసరమైన బుద్ధిబోధన అని అర్ధం. ఆ తరువాత ఆత్మల వివేచన అనే వరము . ఏది సత్యమూ, యధార్ధమో తెలుసుకోవడం. శ్రోతలూ, ఈ దినాల్లో అత్యవసరమైన, అతి ప్రముఖ్యమైన వరమిది. బైబిల్ గ్రంధమును విశదీకరించి బోధించడములో విపరీతమైన గందరగోళము, కలవరం, కంగారు ఉన్న ఈ రోజుల్లో సరియైన బోధ, సరియైన బోధకులు, సత్య వాక్యమును సరిగా అన్యయించడమే కాకుండా, మాదిరిగా జీవించే బోధకులను, బోధలను కనిపెట్టే వివేచన వరము ఈ నాడు చాలా అవసరము.

ఇక ముగింపులో పౌలు అన్యభాషలు మాట్లాడే వరమును ప్రస్తావించాడు. అనగా ఆవేశంగా ఉద్రేకపూరితగా ఏదో మాట్లాడము కాదు. క్రొత్త భాషను త్వరగా నేర్చుకునే వారు కొందరుంటారు. ఇటీవల ఒక తెలుగు మాట్లాడే కుటుంబము క్రొత్త ఢిల్లీలో హింది మాట్లాడే వారి మధ్య సువార్త సేవ ఆరంభించడం తెలిసింది. ఎంతో మండి మనలాంటి వారు వారి కుటుంబాలను గ్రామాలను విడిచిపెట్టి అడవి ప్రాంతాల్లో వారెరుగని భాషను నేర్చుకొని ఆదివాసీల మధ్యలో సువార్త ప్రకటిస్తున్నారు, వారి మధ్యలోనే జీవిస్తున్నారు. ఇది కేవలం దేవుని శక్తితోనే సాధ్యం. అతి జాగ్రతగా విని, గ్రహించి, విన్నది విన్నట్టు మళ్ళీ చెప్పి ఆ ప్రజల్లో మాట్లాడ్డం ఎంత కష్టమో మీకు తెలుసా? ఇది వింటున్న మీరు అలాంటి వారిలో ఒకరైఉండవచ్చు! ఆ తరువాత భాషల అర్ధము చెప్పే శక్తి ఉన్నది. రానున్న అధ్యాయాల్లో పౌలు దీని గురించి వివరంగా బోధించారు. అన్నింటినీ అజమాయిషీ చేసి అదుపుచేసేవాడు పరిశుద్ధాత్ముడే! ఈ విధమైన వరములన్నీ పరిశుద్ధాత్ముని జీవశక్తిని బయలు పరుస్తున్నాయి. వీటన్నిటి ఉద్దేశం సంఘము క్షేమముగా ఉంది, అభివృద్ధి చెందడమే! వీటి ద్వారా దేవుని ప్రజాలైన విశ్వాసుల మధ్యలో, సంఘములో, పరిశుద్ధాత్ముని పరిచర్య, జీవశక్తి, కేంద్రీయత బహిర్గతమవుతుంది. మరో సారి జ్ఞాపకం చేసుకుందాం, 12వ అధ్యాములోని మొదటి మూడు వచనల్లో, పరిశుద్ధాత్ముని అగత్యత ఏమిటో అధ్యయనం చేశాం, ఆయన ద్వారా మాత్రమే యేసు క్రీస్తునకు మన జీవితము, హృదయము మీద ప్రభుత్వము, అధికార మివ్వగలుగుతున్నాము. 4-7 వచనాల్లో పరిశుద్ధాత్ముని కేంద్రీయతను అధ్యయనం చేశాం. ఒక్కడే పరిశుద్ధాత్ముడు, ప్రభు యేసు, తండ్రి  దేవుడు సంఘములో కార్యములు, ప్రక్రియలు చేస్తూ ఉంటారు. 8-11 వచనాల్లో పరిశుద్ధాత్ముని జీవశక్తిని అధ్యయనం చేశాం. అవసరమని ఆయనకు తోచినట్టు, తన చిత్త ప్రకారం, పరిశుద్ధాత్ముడు వేరు వేరు వరములు ఒక్కొక్కరికి పంచి ఇస్తాడు. ఈ గొప్ప మర్మము, సత్యమును గ్రహించడానికి అవసరమైనత మహా కృప ప్రభువే మనకందరికీ  సర్వ సమృద్ధిగా అనుగ్రహించుగాక!              

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...