I కొరింథీ అధ్యయనం-33 10:23-33
నైతికమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?
మీలో ప్రతి ఒక్కరికీ యేసయ్య మహిమగలిగిన నామములో వందనములు! మీలో ప్రతి ఒక్కరి కోసం ప్రతి శుక్రవారము విజ్ఞాపన ప్రార్థన చేస్తూఉన్నాము. మీ ప్రార్థన మనవి మాకు స్పష్టంగా తెలియచేయండి. ఉత్తరంద్వారానైనా, మెస్సెజ్ ద్వారగాని, వాట్సప్ ద్వారగాని, మీకు వీలైన పద్ధతిలో మీ ప్రార్థన మనవి, దేవుని వాక్యము మీలో తెస్తున్న మార్పు సాక్ష్యం తెలియచేయండి. ఈ బైబిల్ అధ్యయనాలు మీ జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో, సాక్ష్యరూపకంగా తెలియచేయండి. ఈరోజు మనమంతా కలిసి ధ్యానించే I కోరింథీ అధ్యయనం మనకందరికీ మేలుకరంగా ఉండేటట్టు ప్రార్థన చేసుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి.
మానవుని అతి అద్భుతమైన వరములలో ఆలోచనాశక్తి, మేధాశక్తి గొప్పవి. సృష్టిలోని ఇతర జీవములకు ఈ శక్తిలేదు. కొన్నింటిని తర్ఫీదు చేయవచ్చు, కానీ వాటికి సృజనాత్మకత, చొరవ ఉండవు. ఈ శక్తి వల్ల మనము తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. మనకు ఆదేశాలు అవసరం. స్వాభావికంగా ప్రతి నిర్ణయముతో నైతికమైన ఫలితాలు ముడిబడిఉంటాయి. దాని నుండి మనము తప్పించుకోలేము. ప్రియ శ్రోతలూ, మనము నైతిక జీవాలమని చెప్పక తప్పదు. అందుచేత మనకు సహాయం అవసరం. మరి ఎవరివైపు చూద్దాం? మన చుట్టూ ఉన్న ప్రజలు, శక్తులవైపా? మీ ప్రశ్నలకు మీ చుట్టూ ఉన్న ప్రజలు ఇచ్చే ఆదేశాలు, సలహాలవైపు చూస్తారా? ఆచారలవైపా? ఎక్కడికి వెళ్తాము?
మనకు సరియైన ఆదేశాలు కావాలంటే మార్పులేని ప్రామాణికం కావాలి. అదే మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధగ్రంధం బైబిల్. గమనించండి, బైబిల్ ఎన్నడూ, మారదు. మన తాత, ముత్తాతలనుండి ఏ మార్పు లేకుండా ఉన్నది పరిశుధ్ద్ధగ్రంధం. కానీ సమస్య ఏమిటో తెలుసా, శ్రోతలూ? చాలమందికి పరిశుద్ధగ్రంధం ఏమి ఆదేశాలిస్తుందో తెలియదు. దాన్ని క్షుణ్ణంగా చదవరు. ఒకవేళ తెలిసినా, ఆ సత్యములను నిర్లక్ష్యం చేస్తారు, లెక్క చేయరు. లేదా, వాళ్ళ ప్రవర్తనకు, నిర్ణయాలకు తగ్గట్టుగా పరిశుద్ధగ్రంధపు ఆదేశాలను మలచుకునే ప్రయత్నము చేస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంధం బైబిల్ బోధించే ఆదేశాలకు సరిగ్గా వ్యతిరేకంగా వారి ప్రవర్తన నిర్ణయాలు ఉంటాయి. అంచేత, ఈ దినమున ఆపో. పౌలు I కోరింథీ 10:23-33 వచనాల్లో ఇచ్చే హెచ్చరికలు అధ్యయనం చేసి “నైతికమైన నిర్ణయాలు ఎలా చేయాలి?” అనే ప్రాముఖ్యమైన అంశమును కూలంకషంగా అధ్యయనం చేద్దాం.
ఈ లేఖన భాగములో నైతిక నిర్ణయాలు తీసుకోవడానికి ఆపో. పౌలు కొన్ని ఆధారాలు ఉపదేశించాడు. వాటిలో మొదటిది, సౌలభ్యం, అనుకూలం అనే ఆధారం. 23, 24 వచనాలు గమనించండి:
“23. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. 24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.” “చేయదగినవి” అనే మాటకు సరి యైనది, లేదా సమాజసమైనది అని అర్ధం. అందుకే సౌలభ్యం, లేదా అనుకూలమైనది అనే మాటను వాడుకుంటున్నాము. నైతికమైన నిర్ణయాలు చేసే సమయములో “అనుకూలమైనవా?” అనే ప్రశ్న కలుగుతుంది. దేనికి అనుకూలం? మనకు అనుకూలం కాదు. ఆపోస్థలుని ఆలోచన ఏమిటంటే, స్వాతంత్రమున్నంత మాత్రాన, కొన్ని అనుకూలమైనవి, సరియైనవి, సమoజసమైనవి కావు. చట్టబద్ధవైనంత మాత్రాన నైతికమైనవి కావు. కొన్ని క్రియలు, న్యాయబద్ధమైనవి కావచ్చు, చట్టం అంగీకరించవచ్చు, కానీ అవి నైతికమైనవి కావు. ఉదాహరణలు ఎన్నోన్నో ఉన్నాయి. చిన్న ఉదాహరణలు చూపాలంటే, ప్రభుత్వము మద్యపు దుకాణాలను ప్రోత్సహించినంత మాత్రాన, నైతికంగా, మద్యపానం సరైనది కాదు.
మరో ప్రశ్న మీకు. సరైనది చేయడం ఎప్పుడైనా తప్పవుతుందా? ముఖ్యమైన మాట. మనము చేయగలిగినవన్నీ చేయనవసరం లేదు. ఉదాహరణకు, సైతాను యేసు క్రీస్తు రక్షకుణ్ణి దేవాలయపు శిఖరము మీదికి తీసుకొనివెళ్ళి, ‘నీ పాదములకు రాయి తగలకుండా నిన్నుకాపాడాలని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు, గనుక దుంకమని చెప్పాడు.’ కానీ ప్రభువు దుంకలేదు. ప్రభువునకు దుంకడo సాధ్యమే, ఆయనను తండ్రి రక్షించేవాడు. యేసయ్య సముద్రం మీద నడిచాడు. మన ప్రభువు తాను చేయగలిగినవన్నీ చేయలేదు. మనము కూడా మనము చేయగలిగినవన్నీ చేయనవసరం లేదు. దానికి బదులుగా ఇతరులకు సహాయం చేయడానికి మనసును మళ్లించుదాం. కట్టలేకపోయినా, కనీసం ఆ సహోదరుని సాక్ష్యమును, వ్యక్తిత్వమును కూలగొట్టకండి. 24వ వచనములో దేవుని పరిశుద్ధాత్ముడు ఏమని హెచ్చరిస్తున్నాడో, గమనించండి: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.” అంతేకాదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అనే మూలసత్యమును మరిచిపోకండి. 26వ వచనములో ఉన్నట్టుగా, సర్వ భూమి, ఇందులోని సర్వము, సమస్తము, ఆయనవే అని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి, మనము నిర్ణయాలు తీసుకొనేటప్పుడు మొదటిదిగా ఆలోచించవలసింది, అనుకూలమైనది ఏమిటి? ఎదుటి వారికి మేలుకరమైనది ఏమిటి? ఒక బైబిల్ పండితుడు ఏమని హెచ్చరిస్తున్నాడో, తెలుసుకుందామా? శ్రోతలూ, జాగ్రతగా వింటున్నారా? ఒక వ్యక్తి, అనగా నీవు నేను, లోకము రక్షించబడాలని, మనుషులు యేసయ్యవైపు మళ్లాలని ఆకాంక్షను హృదయములో
ఉంచుకున్నట్లయితే, తమ ప్రవర్తనను దానికి తగ్గట్టుగా మలచుకుంటారు. ప్రతి చిన్న విషయములో మన ప్రవర్తనను ఆదేశించే మాటలు ఉండకపోవచ్చు, కానీ ఈ ఉద్దేశానికి తగ్గట్టుగా వేసుకునే బట్టలు, డబ్బు ఖర్చు పెట్టే పద్ధతి, జీవన విధానం, వినోదం కలిగించడానికి ఏ ఏ మార్గాలను ఎంచు కుంటారు, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకములో మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి క్రియ అన్నింటినీ, ఆ ఉద్దేశం కోసం మార్చుకుంటారు. ఫలానా విషయములో ఏమని వ్రాయబడింది అని వ్రేలు పెట్టి చూపించే వాక్యము ఉండకపోవచ్చు, ఈ వేషం, ఈ భాష, చివరకు ఈ కుర్చీ, సోఫా అవసరమా? మన దేవుడు మనకిచ్చిన చట్టము ప్రకారము పరీక్షిస్తే ఇది సమంజసమా, సరైనదా, ఈలాంటి రీతిగా ఆలో చించడం అవసరం. మన దృష్టికి అది సబబే అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది ఇష్టమేనా? లేదా దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైన పద్ధతిలో మన జీవిత విధానముందా? ఇతరుల మేలు కోరుతున్నామా, మన మేలు మాత్రమే ఆలోచిస్తున్నామా? ప్రభువు దృష్టిలో అనవసరమైనవి, అవివేకమైనవి ద్రోహకరమైనవాటిని చేస్తున్నామా? దేవుని రాజ్యపు ఉద్దేశానికి విరుధ్ధంగా మనము జీవిస్తున్నమేమో? మన జీవితాలు, ముగించక ముందే, పరీక్షించుకుంటే మంచిది. ప్రభువు మహా కృప మనకందరికీ తోడుగా ఉండుగాక! అమెన్!!
No comments:
Post a Comment