I కొరింథీ అధ్యయనం-34 10:23-33
నైతికమైన నిర్ణయాలు ఎలా చేయగలం? 2వ భాగం
“సజీవ నిరీక్షణ” క్రమంగా వింటున్నవారందరికీ వందనములు, శుభములు! మీరెలా ఉన్నారు? ఒక ఉత్తరం లేదా మెస్సెజ్, వాట్సప్ ద్వారా, మీ ప్రార్థన మనవులు, బైబిల్ అధ్యయనాల ద్వారా, మీరు పొందిన హెచ్చరిక, మేలు, మార్పులు, సవివరంగా తెలియచేయండి. ఉత్తరాలు రాసే యుగము గతించిపోయిందనుకుంటున్నారా? మనమిప్పుడు ధ్యానిస్తున్న I కోరింథీ పత్రిక, దీనికి ముందు ధ్యానించిన రోమా పత్రిక ఉత్తరాలు కదా! ప్రభువు తన వాక్యమును వ్రాయించి ఉంచినందుకు మనకెంత మేలు కలుగుతున్నది గమనిస్తున్నారా? ఉత్తరాలు వ్రాయాలనుకునే వారు మెస్సెజ్ లో అడ్రసు అడిగినట్లయితే మెస్సెజ్ లో తెలియచేస్తాము.
పోయిన వారములో నైతికమైన నిర్ణయాలు ఎలా చేయగలము అనే అంశములోని మొదటి ఆధారమును క్షుణ్ణంగా అధ్యయనం చేశాము. ఈ పూట మిగిలిన రెండిటినీ నేర్చుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చిప్రశాంతంగా కూర్చోండి, ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే మన కేంద్రం.
నైతిక నిర్ణయాలు చేయడానికి కొన్ని ఆధారాలు పరిశుద్ధ గ్రంధములో ఉన్నాయి. మొదటిది, దేవునికి తోటి వారికి అనుకూలత, సౌలభ్యం, అనే ఆధారమును గతములో తెలుసుకున్నాం కదా! స్వార్ధముతో కాదు. మనకేది మంచిది అని కాదు, ఇతరులకు ఏది మేలుకరమైనది, అది మనము ఆలోచించవలసిన ఆధారం. దేవుని రాజ్యము కట్టబడ్డానికి, మన తోటి సహోదరులు, సహోదరిలు కట్టబడ్డానికి ఏది అనుకూలమో దానికి తగ్గట్టుగా మన నిర్ణయాలు ఉండాలి.
రెండవ ఆధారము, మన మనస్సాక్షి అనే ఆధారం. I కోరింథీ 10: 25-30 వచనాలు మీ బైబిల్లో గమనించండి. “25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. 26. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. 27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించినది ఏదో దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. 28. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. 29. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల? 30. నేను కృతజ్ఞతతో పుచ్చు కొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?”
మనకందరికీ మనస్సాక్షి ఉన్నది. దేవుడే మనకనుగ్రహించిన వరo మనస్సాక్షి. దేవుడు ఆ విధంగా మనలను సృష్టించాడు. మనకు పుట్టుకతోనే మనస్సాక్షి కలిగింది. అంతేకాదు, మన మనస్సాక్షికి మనము నేర్పించుకోవచ్చు. ఆ విధంగా నేర్పించినపుడు అదే మనస్సాక్షి మనకు చాలా విషయాల్లో మనతో మాట్లాడుతుంది. కానీ మనకు ఒక ప్రామాణికత, ఒక నడిపించే నాయకుడు అవసరం. పౌలు మాట్లాడుతున్నది ఒక మార్కెట్ గురించి. ఆయన ఇస్తున్న ఉపదేశమేమిటి? మీరు మార్కెట్ లోనికి వెళ్ళి ఏది కొనుక్కుంటారో అది నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఎవరైనా ఇది విగ్రహాలకు అర్పించబడింది, అని చెబితే అతని మనస్సాక్షి కోసం, మీ మనస్సాక్షి కోసం మానేయండి. ఎందుకంటే అది మాంసపు మార్కెట్.
ఈనాటి తరం “నా” అని చెప్పే తరం. అంతా నాయిష్టం వచ్చినట్టు చేసుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా, నా ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తా, నాకు నచ్చినట్టుగా పాడుకుంటా, ఇలా అన్నీ “నా” అనే వాటికి కేంద్రబిందువుగా జరిగించుకునే పతనమైపోయిన యుగమిది. కానీ దేవుని పరిశుద్ధ గ్రంధం ఏమి సెలవిస్తుంది? “నేను కాను, క్రీస్తే”. కొందరు ఆదివారాన్ని తమ స్వంతపనులు చేసుకోవడానికి, వారింటిలో రిపేర్ పనులు, కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. కొందరు ప్రభువు దినాన్న పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. ఇది సరియైనదేనా? మీ మనస్సాక్షి ఏమని చెబుతుంది? మిమ్మల్ని గద్దించడం లేదా? ప్రభువు దినము అన్నప్పుడు అది ప్రభువు దినమే! నీది నాది కాదు. ఆదివారం మంచి దినం, ప్రయాణం ఈ దినం ఆరంభించుదామని చెప్పేవారున్నారు. మంచి దినం, చెడు దినమని దేనినీ అనడానికి మనకు హక్కులు లేవు. ప్రభువు చేసిన అన్ని దినాలు మంచివే, అన్ని దినాలలో ప్రభువు సర్వాధికారపు కృపలు మనతో ఉంటాయి. కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు, ఆయన చేసిన నిబంధనకు మనము కట్టుబడి ఉన్నామా? లేదా?
మనము మన మనస్సాక్షి చేత కాదు, ఇతరుల మనస్సాక్షి చేత అదుపు చేయబడుతున్నాము. నీవైదనా సేవిస్తున్నపుడు, ఒక వ్యక్తి ‘అది విగ్రహాలకు అర్పించబడింది’ అని నీతో చెబితే, ఆ వ్యక్తి మనస్సాక్షి కోసం నీవు మానేయాలి. అంటే ఎవరి మనస్సాక్షి కోసం నీవు ఆలోచన కలిగిఉండాలి? నీతో చెప్పిన వ్యక్తి మనస్సాక్షి విషయం. జాగ్రతగా వింటున్నారా, శ్రోతలూ? “తీర్పు తీర్చబడనేల?” “దూషింప బడనేల?” అనే ఈ మాటలను జాగ్రతగా అలకించండి. మన నిర్ణయాలు నైతికమైనవిగా ఉండాలంటే వాటి వలన, మనకు ఇతరుల తీర్పులు, దూషణలు కలుగకూడదు. అవి కలుగకుండా ఉండే విధంగా మన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది అతి జాగ్రతగా జ్ఞాపకముంచుకోవలసిన సత్యము. ఇతరులు పడిపోకుండా ఉండడానికి మీరు, నేను ఒక కారణము కాకూడదు. బలహీనమైన కాళ్ళకు మనము అడ్డు బండలు వేయకూడదు. ప్రియ సోదరుడా, సోదరీ, ఒక్క సారి ఆలోచించండి, మన ప్రభువు యేసు క్రీస్తు నీ కోసం నా కోసం ఆలోచించకుండా ఉంటే, ఆయన మానవుడుగా వచ్చేవాడు కాదు, అప్పుడు మనకు, రక్షణ, పాప క్షమాపణ, నిత్యత్వపు నిరీక్షణ ఏమీ ఉండవు. ప్రభువు యేసు క్రీస్తులవారికి మన ఎల్లప్పుడు గురించిన ఆలోచనలే! హల్లెలూయ! మరి నీవు నీ సోదరీ, సోదరులకోసం ఆలోచించవా?
ఇక మూడవ ఆధారము. నిబధ్ద్ధత, సమర్పణ అనే ఆధారం. 31-33 వచనాలు చదువుకుందాం. “31. కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. 32. యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి. 33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజనమునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.” నా ప్రియమైన స్నేహితులారా, మీరు క్రైస్తవ విశ్వాసులైనా, కాకపోయినా, మన జీవితాలు దేవునితో ముడిబడి ఉన్నాయి. సమస్తమైన వారిపైన ఆయనకు అధికారమున్నది. ఒక క్రైస్తవ విశ్వాసి తప్పు, పాపము చేసినందుచేత ఎందరు యేసు క్రీస్తు రక్షకుణ్ణి, ప్రభువు సిలువను తిరస్కరిస్తున్నారో గదా? ఈ విషయం మీకు బాగా తెలుసు. “పాస్టర్ గారూ, నన్ను ఆ గుంపులో కలుపుతున్నారా?” అని మీరనుకునే తలంపులు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. నేను ఎవరిని ఏమీ అనడంలేదుగాని, ఎవరిని వారు పరీక్షించుకోమని ప్రేమతో బ్రతిమాలుతున్నాను. నీవు నేను నిజమైన క్రీస్తు శిష్యులమైతే, ఆయనను సంతోషపెట్టడమే మన పని. అప్పుడే నేను చెప్పే ఈ మాటలు మీకు ఒక బండరాయిలాగా కాకుండా, ఇష్టపూర్వకంగా ఉంటాయి. మన చుట్టూ ఉన్నవారికి అభ్యంతరం, బాధ, శ్రమ, దుఖం కలిగించకుండా జీవించాలి. ముఖ్యంగా దేవుని సంఘములోని వారికి బాధ, దుఖం, అభ్యంతరము కలిగించకూడదు. అనగా ఆపో. పౌలు ఎఫెసీ, 5:15లో బోధించినట్టుగా జ్ఞానముతో, జాగ్రతగా నడుచుకోవాలి. చీకటిలో, గుంతలుండే త్రోవలో, కొండప్రాంతాల్లో ఇతరులకిచ్చే సలహా ఏమిటి? ‘చూసి నడవండి, ‘చూసి అడు గేయండి’ అవును, చుట్టూ చూసి జాగ్రతగా ఇతరులకు బాధ దుఖము, అనుమానము, అవిశ్వాసము కలిగించకుండే రీతిగా మాటలు, క్రియలు, ప్రవర్తన, జీవన విధానము ఉండేలా జాగ్రత పడదాం. ఎందుకు? మన గురి చేరడానికి. మన కేంద్రీయ గురి, ఆశయం, అనేకులు రక్షించబడాలి. 33వ వచనములో ఆపో. పౌలు స్వంత సాక్ష్యం వింటున్నారా? “ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజనమునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.” ప్రభువునందు ప్రియులారా, మన గురి ఏమిటి? మంచి పేరు సంపాదించుకోవడమా? పదవి సంపాదించు కోవడమా? మనకీ గురి, ఆశయం, ఆకాంక్ష ఉంటే, మనము కూడా ఆయన లాగా మార్పు చెందుతాo. అప్పుడు దానికి తగ్గట్టుగా మన నిర్ణయాలు తీసుకుంటాము.
ఒక భక్తుని హెచ్చరిక మాటలు, ఈ విషయములో చాలా భావముతో నిండిఉన్నాయి. మనము చేసే ప్రతి ఒక్క పని, మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుని పట్ల భయముతో, మన రక్షకునిపట్ల ప్రేమతో మన నిర్ణయాలను చక్కటి ఆదరణకరమైన పద్ధతిలో ఎల్లప్పుడు స్థిరమైన పద్ధతి తప్పకుండా, చేయడానికి పూనుకుందాము. మాటలతో స్తుతి ఆరాధన చెల్లించడం కాదు, ఆలాంటి జీవితమును దేవునికి స్తుతి యాగముగా అర్పించుదాము. విధవరాలిచ్చిన రెండు కాసులు, శిష్యుడని ఒక సహోదరునికి మనమిచ్చే గిన్నెడు చన్నీళ్ళు ఈలాటి పనులు నిష్కపటమైన ప్రేమతో, త్యాగపూర్తితమైన మనసుతో చేద్దాం. ఇవి ఆపో. పౌలు సముద్రాలు దాటి, అతి కఠినమైన కష్టం, శ్రమ, హింస భరించి ప్రయాణం చేసి సువార్త ప్రకటించిన దానితో దేవుడు సమానంగా చూస్తాడు. మరి నీవు చేయడానికి సిద్ధమా? మార్టిన్ లూథర్ అతి కిరాతకమైన లౌకిక శక్తులతో పొరాడి, ధైర్యముతో నరకపు శక్తులతో తలపడి పోరాడినట్టుగా మన అనుదిన జీవితములో, మన కుటుంబములో, నీవిప్పుడు ఉన్న చిన్న సంఘములో, నీ ప్రక్కలో ఉన్న సహోదరుని, సహోదరిని నీవు ప్రేమించడం ఎంతో గొప్ప దీవనకరమైన, ప్రభువు మెచ్చే పరిచర్య. అది ఎక్కడో లేదు, నీ ప్రక్కలోనే ఉన్నది.
నైతికమైన నిర్ణయాలు ఎలా తీసుకోగలము? అనే అంశమును ఒక్క సారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకముంచుకొనండి, మనము నైతికమైన జీవులము. మనము చేసే ప్రతి ఒక్క నిర్ణయం మేలైనా, కీడైనా, ఏదో ఒకటి కలిగిస్తుంది. మీ నిర్ణయాలు ఇతరులకు మేలు చేస్తున్నాయా, కీడు, దుఖము బాధ కలిగిస్తున్నాయా? నైతికమైన నిర్ణయాలు చేయాలంటే ఈ మూడు ఆధారాలు మన హృదయాల్లో నాటుకోవాలి.
1. దేవునికి, ఇతరులకు అనుకూలమైనదా? కాదా? అనే ఆధారము. సమంజసమా, కాదా? ఇతరులకు మేలు కరమా, కీడుకరమా? నైతికమైనదా, కాదా? అనే ఆధారమును బట్టి ఆలోచించాలి.
2. మనస్సాక్షి అనే ఆధారము. కేవలం మన మనస్సాక్షి మాత్రమే కాదు, ఇతరుల మనస్సాక్షిని బాధ పెడుతున్నామా? వారి విశ్వాసమును బలహీనపరుస్తున్నామా? అడ్డుబండగా ఉన్నామా?
3. నిబధ్ద్ధత, సమర్పణ అనే ఆధారము. మన గురి, అనేకులు క్రీస్తు రక్షకుణ్ణి స్వీకరించాలి, ఆయన సిలువ ప్రేమను రుచి చూడాలి. రక్షించబడాలి, నిత్య నరకమును తప్పించుకోవాలి.
ప్రార్థన: