I కొరింథీ అధ్యయనం-19 7:1-9 వివాహములో ఒకరికమీద మరొకరు ఆధారపడాలి!

 

I కొరింథీ అధ్యయనం-19   7:1-9

వివాహములో ఒకరికమీద మరొకరు ఆధారపడాలి!

    

    జీవితపు కష్టాలు నీరసింపచేస్తున్నాయా? ఏకాంతంగా ప్రార్థన చేయండి. దానికంటే ముందు దేవుని వాక్యము చదవండి, 

పాపములు ఒప్పుకొనండి. మనసారా పశ్చాత్తాపపడండి, క్షమాపణ పొందండి. అప్పుడే ప్రార్థన ప్రభువు సన్నిధిని 

చేరుతుంది. ఇవన్నీ చేయకుండా, ఎంత ప్రార్థన చేసినా, మానసిక సంతృప్తి తప్ప ఏ ప్రయో జనము ఉండదు.  ఈలాటి  

ప్రార్థన ప్రభువు సన్నిధి చేరినపుడు నమ్మకమైన, సజీవుడైన ప్రభువు తప్పక సమాధానమిస్తాడు. సమాధానమంటే, 

నీవడిగింది చేయడం, ఇవ్వడం కాదు, ఆయన చిత్తమేమిటో అది చేయడం, జరగడం. 

    

    వివాహము అంటే భయపడేవారు చాలామంది ఉన్నారు, లేదా నిర్లక్ష్యంగా ఏ బాధ్యత లేకుండా వివాహము చేసుకున్నవారుకూడ ఉన్నారు. వివాహానికి ఉన్న పవిత్రత, పరిశుద్ధత, పూర్తిగా అంతరించిపోయిన తరములో మనము జీవిస్తున్నాము. కొందరు వివాహము చేసుకోకుండానే కలిసి బ్రతుకుతున్నారు. ఇది జంతువుల ప్రవర్తన. వింటున్న మీరు ఈ స్థితిలో ఉన్నారా? రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చొని దేవుని వాక్యము శ్రద్ధగా వినండి. I కోరింథీ పత్రిక 7వ అధ్యాయము తెరిచి ఉంచుకోండి. ఈ లేఖన భాగములోనుండి వివాహములో ఒకరిమీద మరొకరు ఆధారపడవలసిన సత్యమును జాగ్రత్తగా ధ్యానిద్దాం. మూడు ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం.

         వివాహములో ఒకరిమీద మరొకరు ఆధారపడాలంటే మొదటి సూచన, లైంగిక పవిత్రతలో ఔచిత్యము కాపాడుకోవాలి. మొదటి మూడు వచనాలు గమనించండి: “మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.” మొట్టమొదట్లోనే ఆపో. పౌలు వ్యతిరేక లింగపువారితో సన్నిహితంగా ఉండవద్దని హెచ్చరిస్తున్నాడు.  ప్రత్యేకించి, చనువుతో భార్యతో తప్ప ఏ స్త్రీతోశారీరిక సంబంధము పెట్టుకోకూడదు. గమనించారా? “స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.” వివాహబంధానికి బయట ఏ స్త్రీతో సంబంధం ఉండతగదని హెచ్చరిక. వివాహవ్యవస్థను ప్రభువు స్థాపించాడు. స్త్రీ పురుషులమధ్య ఉండే శక్తివంతమైన సంబంధమును ప్రభువు ఎరిగినవాడు గనుక వివాహవ్యవస్థను ఏర్పాటు చేసి జారత్వమును నిషేధించాడు. ఆ తరువాత ఒక పురుషుడు ఒక భార్య అనే సత్యమును చాలా శక్తివంతంగా బోధిస్తున్నాడు. ఒక పురుషునికి అతని భార్య, ఒక స్త్రీకి ఆమె భర్త ఉండాలి. ఈ సూత్రము ఆది. 2:24లో మొదట ఇవ్వబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” ఇది స్వాభావికమైన, భౌతికమైన మానవ సంబంధం. I ధెస్స. 5:23 ప్రకారము పురుషుడు శరీరము, మనసు, ఆత్మలు కలిసిఉన్నాడు, అలాగే స్త్రీ కూడా, శరీరము, మనసు ఆత్మలు కలిసిఉన్నది గనుక, వారు మూడింటిలో ఐక్యమవ్వాలి. పౌలు ఇస్తున్న బోధ ఏమిటంటే వారు ఒకరి అనుమతితో మరొకరు ఈ ఐక్యతను పొందాలి. పురుషుడు భార్యకు తన బాధ్యతలు, స్త్రీ తన భర్తకు తన బాధ్యతలు నెరవేర్చాలి. ఈ సందర్భములో ఆత్మీయమైన కారణాలకు తప్ప, వారు ఒకరికి మరొకరు దూరం కాకూడదనే సూత్రమును ఆదేశిస్తున్నాడు. వివాహానికి క్రైస్తవ పద్ధతి ఏమిటంటే, ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలి. ఇతర స్త్రీలతో సంబంధం నిషేధించబడింది. అలాగే ఒక స్త్రీ ఒక పురుషునికే భార్యగా ఉండాలి. ఇతర పురుషులతో సంబంధం నిషేధించబడింది. వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందంటే, ఏ దేశపు ప్రజల్లో వివాహానికి కట్టు లేక విచ్చలవిడిగా జీవిస్తారో, ఆ సమాజము కుళ్ళిపోయిన పండువంటిది. అది కలుషితమైన సమాజము. అది బ్రష్టత్వానికి సూచన.

         వివాహములో ఒకరిమీద మరొకరు ఆధారపడి ఉండడానికి రెండవ సూచన, ఒకరికి మరొకరు సర్దుకొని, అణగి ఉండడం. 4-6 వచనాలు గమనించండి: భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి. ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.” వివాహపు సమయములో ఒకరికొకరు “అవును” అనే ప్రమాణము చేసినపుడే ఒకరిమీద మరొకరికి అధికారం ఇచ్చారు. 4వ వచనములో ఉన్న సత్యము ఏమిటి? గమనించారా? భర్తకు తన శరీరముపైన అధికారములేదుగాని ఆ అధికారము ఆయన భార్యకు ఉన్నది. అదే విధంగా భార్యకు తన శరీరముపైన అధికారములేదుగాని, ఆ అధికారము తన భర్తకు ఉన్నది. “అధికారము” అని తర్జుమా చేయబడిన మూల భాష గ్రీకు లోని మాటకు “హక్కు” అని అర్ధం. ఇదే అర్ధం వచ్చే మాట యోహాను సువార్త 1:12లో ఉన్నది. యేసు క్రీస్తును అంగీకరించిన వారికందరికి దేవుని పిల్లలు కావటానికి అధికారము, హక్కు దేవుడిచ్చాడు. వివాహపు ప్రమాణములు చేసినపుడు స్త్రీ పురుషులు వారి అధికారమును ఒకరు మరొకరికి ఇచ్చారు. దయచేసి జ్ఞాపకముంచుకొనండి, వివాహములో ద్రోహము చేయడానికి అనుమతి లేదు. ఒకరు మరొకరు మీద బలాత్కారము, బెదిరింపులు చేయడానికి వీలులేదు. హక్కును దుర్వినియోగము చేయడానికి లేఖనము అంగీకరించదు.  ఆ తరువాత ఆపో. ఒకరినొకరు మోసము చేయడాన్ని ప్రస్తావిస్తున్నాడు. లైంగిక సంబంధమును నిరాకరించడానికి అనుమతిలేదు. వివాహపు ఐక్యతను నెరవేర్చడానికి శారీరక ఐక్యతను దేవుడు ఉద్దేశించాడు. వివాహబంధములో ఐక్యపరచబడినవారిలో ఎవరికి ప్రభువు అనుగ్రహిస్తే వారు, పిల్లలను కని, కుటుంబమును ఏర్పాటు చేయడం దేవుని ప్రణాళిక. ఆది. 1:28 లో దేవుడిచ్చిన ఆజ్ఞ “మీరు ఫలించి అభివృద్ధిపొందుడి.” వ్యక్తిగత సంతోషం కోసం, ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికో, సమాజములో ఉన్నత స్థాయిలో జీవించడానికి గాని, వివాహమయ్యాక కుటుంబమును ఏర్పాటు చేయకపోవడం దేవుని దృష్టిలో సరికాదు. కాబట్టి ఒకరిమీద మరొకరు ఆధారపడి జీవించడములోని రెండవ సూచన, ఒకరికి మరొకరు సర్దుకొని అణిగిఉండడం. ఈలాటి ఆధారపడడం వారి కుటుంబ జీవితాల్లో క్రొత్త సంతోషమును నింపుతుంది. ఒక భక్తుడు ఏమని బోధిస్తున్నాడో జాగ్రతగా నేర్చుకుందాము. సమాజoలో కుటుంబం ఒక చిన్నభాగం. వివాహానికి శత్రువే సమాజానికి శత్రువుకూడా. ఉదాత్తమైన వారు, గౌరవప్రదమైన పౌరులు పెంచబడి, సిద్ధపరచబడేది కుటుంబాల్లోనే కదా! కుటుంబములో వేసే పునాదులు జీవితాలను దేవుని మార్గములో పెట్టి సమాజమును ప్రభావితము చేసే శక్తిని ఆ జీవితాల్లో నింపుతాయి.

         వివాహములో ఒకరిమీద మరొకరు ఆధారపడి జీవించడానికి మూడవ సూచన, దైవికమైన ఉద్దేశ్యమును నెరవేర్చడం కోసం ప్రయత్నించండి. 7-9 వచనాలు చదువుకుందాం. అయినను ఒకడొక విధమునను మరి యొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు. నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.” ప్రతి ఒక్క వ్యక్తి ప్రభువు వారికిచ్చిన వరము, కృప ఏమిటో గ్రహించాలి. “ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు” అనే మాటలు గమనించారా? అనగా ప్రతి ఒక్కరు దేవునియెదుట సంపూర్ణంగా అణిగి ఉండాలి. అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, దేవుడు నాకోసం ఏమి ఉద్దేశించి ప్రణాళిక వేశాడు?’ మనము అడగవలసిన ప్రశ్నలన్నిటిలో ఇది అన్నింటికంటే ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలో ప్రవక్త యిర్మీయాతో ప్రభువు ఏమని సెలవిచ్చాడు? యిర్మీయా 1:5 “గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.” తన పిలుపు గురించి ఆపో. గలతీ పత్రికలోని మొదటి అధ్యాయము 15,16 వచనములలో ఎంతో నిశ్చయంగా ఉన్నట్టు అర్ధమవు తున్నది. అయినను తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలు పరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.”  ఈ లేఖనాల్లో ఉన్న సత్యమును గ్రహించడమును నిర్లక్షం చేయకండి. పౌలు ఒక నిర్దిష్టమైన వరమును దేవునివద్దనుండి పొందినట్లు నమ్మాడు. మీరు, నేను దేవుడు మనకనుగ్రహించిన వరము ఏమిటో తెలుసుకోవాలని భారంగా ప్రార్థించి ఆయన యెదుట వేచిచూడాలి. దేవుని ఉద్దేశమైన ఆ కృపావరమును నిర్దిష్టంగా తెలుసుకున్న తరువాత అత్యంత శ్రద్ధతో మిక్కటమైన జాగ్రత్తతో దాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగాలి.

         ఒక ప్రఖ్యాత దైవజనుడు ఏమంటున్నాడో జాగ్రతగా నేర్చుకుందాము. ప్రియ శ్రోతలూ, ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన తలాంతు, సామర్ధ్యం, ఉన్నవి. ఒకరు ఒక విషయములో నేర్పరి అయితే మరొకరు మరొకవిషయములో ప్రవీణులై ఉండవచ్చు. ఒకరు ఒక సద్గుణమును కలిగిఉంటే, మరొకరు అంతే విలువైన మరొక సద్గుణము కలిగిఉండవచ్చు. జాగ్రత్త తీసుకోవలసిన సంగతేమిటంటే, మనలాగా ప్రతి ఒక్కరూ ఉండాలని అనుకోకూడదు. మనలను బట్టి ఇతరులకు తీర్పు తీర్చకూడదు. మనము ఒక దానిలో శ్రేష్టులమైతే, మరొకరు వేరేదానిలో అయిఉండవచ్చు. మనకున్న సామర్ధ్యం, వరము వారిలో లేదని, వారిని తూలనాడవద్దు, కింకపరచవద్దు. కాబట్టి మూడవ సూచన ఏమిటి? దైవికమైన ఉద్దేశ్యంను కలిగిఉండాలని ప్రయత్నించాలి. అది ఒక్కొక్కరికి వేరు వేరుగా ఉంటుంది. ఇది దంపతులకుకూడా వర్తిస్తుంది.

         వివాహములో ఒకరు మరొకరిమీద ఆధారపడడం నేర్చుకోవాలంటే, పౌలు ఇస్తున్న సూచనలు చేయాలి: 1. లైంగిక పవిత్రత కోసం కష్టపడాలి. ఒక పురుషునికి, ఒక స్త్రీ మాత్రమే. 2. ఒకరికి మరొకరు సర్ధుకొని అణిగి ఉండాలి. దేవుడు ఉద్దేశించినరీతిగా కుటుంబమును నడిపించాలి. 3. దైవికమైన ఉద్దేశ్యమును కలిగి ఉండాలి.  దేవుని పిలుపును నెరవేర్చాలి. నీ తలాంతులను దేవుని కోసం ఉపయోగించాలి. దీనికి దేవుని కృప ఎంతో అవసరం. అదంతా ప్రభువు తన సర్వ సమృద్ధిలోనుండి మనలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహించుగాక!




No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...