I కోరింథీ అధ్యయనం-5 2:1-5
నిజమైన విశ్వాసపు పునాదులు
అందరికీ యేసు నామములో శుభములు వందనములు! రండి, రేడియోకు దగ్గరలో వచ్చికూర్చోండి. ఎలా
ఉన్నారు? మీ కోసం ప్రార్థించడానికి వీలుగా మీ ప్రార్థన అంశములు మాకు తెలియచేయండి. ప్రతి శుక్రవారము
విజ్ఞాపన ప్రార్ధనలో ప్రార్థిస్తాము. ప్రార్థన:
“గిజా” (Giza) అనే పేరుగల ఐగుప్తులోని పిరమిడ్ క్రీస్తుకు పూర్వము 2,500 ఏళ్ల క్రితము నిర్మించబడింది.
13 ఎకరాలలో 23 లక్షల గ్రనైట్, సున్నపురాళ్లతో కట్టారు. ఒక్కొక్క రాయి 2268 కిలోల బరువుగలవి. బహు
బలమైన పునాదితో కట్టబడిన ఈ పిరమిడ్ ఇప్పటికీ కూడా ఉన్నది. జీవితము కూడా అలాంటిదే, బహు బలమైన
పునాది వేయాలి. మానవ జ్ఞానము దానికి సరిపోదు. I కోరింథీ 2:1-5 వచనాల్లో నిజమైన విశ్వాసానికి గల
పునాదులేమిటో వ్రాయబడ్డాయి.
“సహోదరులారా, నేను మీయొద్దకు
వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను
కాను.
2 నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చ యించుకొంటిని.
3 మరియు బలహీనతతోను భయముతోను ఎంతో
వణకుతోను మీయొద్ద నుంటిని.
4 మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును
ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని
యుండవలెనని,
5 నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
నీ జీవితాన్ని నీవు బలమైన పునాది మీద కట్టుకోవాలని ఆశిస్తే, పౌలు మాటలలో 3 బలమైన పునాది రాళ్లు
కనిపిస్తున్నవి.
మొదటిది పునాదిరాయి మొదటి వచనములో ఉన్నది “సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.” అది పౌలు మాటల్లో చెప్పాలంటే, దేవుని మర్మము లేదా దేవుని సాక్ష్యము.
ఆయన మానవుల జ్ఞానమును, మంచి తియ్యని మాటలను కొట్టిపారేశాడు. మాటలు మాటలాడలేదని అర్ధం కాదు.
పౌలు తార్సులోని గ్రీకు విశ్వవిద్యాలయములో వాక్చాతుర్యము, తార్కికవిజ్ఞానము అభ్యాసం చేశాడు. వాటిని
వాడాలనుకుంటే వాడేవాడే, కానీ వాడలేదు. కాని, ఒక్కటే అంశము మాట్లాడాడు. అదే సిలువవేయబడిన యేసు
క్రీస్తు ప్రభువు. పైకి అది చాలా సులభంగా అనిపించవచ్చు. కానీ చాలా క్లిష్టమైనది. అది ఎంత క్లిష్టమైనదంటే, ఏ
మానవ జ్ఞానమునకు అది సాటికాదు. దేవుని మనసులో అది పుట్టింది. మానవజాతి పాపమునుబట్టి దేవుని
కుమారుని మరణము అవసరమయ్యింది. అది చక్కగా పనిచేస్తుంది. శ్రోతలూ, గమనించండి, పౌలు, సీలలు మొదటి
మిషనరీ ప్రయాణములో ఫిలిప్పీ పట్టణములో జైల్లో వేయబడ్డారు. అ. కా. 16లో ఇది వ్రాయబడింది. మధ్యరాత్రిలో
వారు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుచుండగా భూకంపము కల్గింది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి.
నేరస్థులందరి సంకెళ్ళు ఊడిపడ్డాయి. అప్పుడు చెరసాల అధికారి తన ప్రాణము తీసుకోవాలనుకున్నాడు. పౌలు
ఆయనతో, “నీకే అపకారము చేసుకోవద్దు. మేమంతా ఇక్కడే ఉన్నాము.’ అని కేకవేశాడు. అతడు పౌలు
సీలలదగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? 30 వచనం. “రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?” చెరసాల అధికారి
అడిగిన ఆ ప్రశ్నకు పౌలు జవాబు: “ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ
యింటివారును రక్షింపబడుదురు.” 31వ వచనం. ఆ ప్రకటన ఏమి చేసిందో తెలుసా? ప్రతి మానవ ఆలోచన,
సాతాను శక్తులను బద్దలుగా కొట్టేశాయి. వినడానికి చాలా సాధారణంగా అనిపించినప్పటికీ, ఇది దేవుని మనసులో
పుట్టిన గొప్ప శక్తి. దైవకుమారుని సిలువ మరణమునుబట్టి చెరసాల అధికారి రక్షించబడ్డాడు. నీ జీవితాన్ని నీవు
కట్టుకోవలసిన మొదటి పునాదిరాయి యేసు క్రీస్తు ద్వారా దేవుని సందర్శన.
రెండవ పునాదిరాయి దేవుని ధృవీకరణ. 5వ వచనం. “నేను మాటలాడినను సువార్త ప్రకటించినను,
జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే
వినియోగించితిని.” పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముని కుమ్మరింపు దేవుని ధృవీకరణను చూపించింది. అ.కా. 2వ
అధ్యాయములో మొదటి శతాబ్దపు శిష్యులు యెరూషలేములో చేరి ఉన్నారని గమనిస్తాము. వారు ప్రార్ధిస్తున్నపుడు
వేచిఉన్న సమావేశము మీద పరిశుధ్ద్ధాత్ముడు దిగివచ్చాడు. వారు దేనికోసం వేచిఉన్నారో వారికి తెలియకపోవచ్చు.
వారు ఎవరి కోసం వేచిఉన్నారో ఆయన అప్పుడు దిగివస్తాడని వారు ఊహించిఉండకపోవచ్చు. ఆ కుమ్మరింపు
తరువాత, దేవుని ఆ ధృవీకరణ తరువాత, పేతురు ప్రజలు ముందు పెట్టాడు. అ.కా.2:38. “పేతురు __మీరు
మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.” అని చెప్పాడు. అది దేవుని ధృవీకరణ.
I కోరింథీలోని మన లేఖనభాగములో పౌలు తీయని మాటలను, మానవ జ్ఞానమును వినియోగించలేదని
చెప్పాడు. అవి పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనవి. ప్రియ శ్రోతలూ, గమనించండి, మీరు దేవుని సందర్శనను
విశ్వసించినట్లయితే దేవుని ధృవీకరణను దేవుని ఆత్మ ద్వారా అనుభవిస్తారు. అవును, ఇది సత్యం, నీ జీవితములో
ఈ సత్యమును దేవుడు తన పరిశుద్ధాత్మ సన్నిధి చేత చూపిస్తాడు. దీన్ని దేవుని ధృవీకరణ అని మనము
గ్రహించాలి.
మూడవ పునాదిరాయి దేవుని జీవపు చేతనత్వము. 4వ వచనం. “మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని,” దేవుని చేతనత్వము అనగా శక్తిమంతులుగా చేసే శక్తి, మనలను శక్తిమంతులుగా చేస్తుంది. యేసు ప్రభువు పరలోకమునకు ఎక్కి పోకమునుపు “మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.” లూకా 24:49. తండ్రి వాగ్దానము చేసినది జరిగేవరకు వేచిఉండమని వారికి చెప్పాడు. అంతే కాదు, “అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.” అ.కా.1:8 పేతురులాంటి ప్రభువును తిరిస్కరించినవానిని ఈ జీవచేనత్వము రక్షణను ప్రకటించే ధైర్యవంతునిగా మార్చింది. తనను అధికారులు అరెస్ట్ చేసినపుడు “మనుష్యులకు కాదు, మేము దేవునికే లోబడవలెను” అని చెప్పిన సాహసవంతుడు. (అ.కా.4:29) ఆయన చెప్పింది ఈనాడు మనవిషయములో కూడా నిజమే!
ఈ జీవచేతనత్వము పేతురును కొర్నెలి అనే ఒక యూదేతరుని యింటికి నడిపించింది. అన్ని సాంప్రదాయాలను ప్రక్కకు నెట్టేసి ఆయన ఇంటికి వెళ్ళి ఎలా రక్షణ పొందాలో బోధించాడు. ఈ జీవచేతనత్వమే తార్చు వాడైన సౌలును దమస్కుకు పోయే త్రోవలో క్రింద పడవేసి అద్భుతమైన నిర్భయుడైన సువార్తికునిగా మార్చింది. అది నీకైనా నాకైనా ఈవిధంగానే చేస్తుంది. ఈ జీవచేతనత్వమే ఈనాడు “సజీవనిరీక్షణ” ద్వారా సువార్తను వింటున్న మీకందరికీ అందుబాటులో ఉన్నది. లక్షలాదిమంది వింటూ ఉన్నారు. దేవుని వాక్యము ఈ డైనమైట్ లాంటి అత్యద్బుతమైన శక్తిని విడుదల చేస్తుంది. అందుకే “మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని,” ఆపో. బోధిస్తున్నాడు. ఇదే జీవచేతనత్వము. గమనించండి, శ్రోతలూ, దేవుని మర్మమును మనము ఆస్వాదించి అనుసరిస్తే, పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ధృవీకరణ కలుగుతుంది. అప్పుడు దేవుని జీవచేతనత్వము విడుదల అవుతూ మన జీవితాల్లో,సాక్ష్యములో ఈ సత్యము మనలను శక్తిమంతులుగా చేస్తుంది. ఇతరులకు దీనిని అందించడానికి మనమే మార్గమౌతాము. ఎంత గొప్ప ధన్యత క్రీస్తులో ఉందో గమనించాము కదా! పౌలుతో బాటు నేను కూడా మిమ్ములను అభ్యర్ధిస్తున్నాను. మీ విశ్వాసముకు స్థిరమైన పునాదులు వేసుకుంటారా? లేదా మానవుల ఆచారములపైన, వారి మాటలపైన వారి మోసపు మళ్లింపులపైనా ఆధారపడతారా? ఈ అతిశక్తివంతమైన పునాది రాళ్లమీద మీ విశ్వాసమునకు పునాదులు వేసుకోవడానికి అవసరమైనంత మహాకృప ప్రభువే మనకందరికీ అనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment