మట్టలాదివారము/శుభ శుక్రవారము 10-03-2022
సిలువ మరణమే ఎందుకు! రక్తము చిందించడం అవసరమా?
దేవునికి స్తోత్రం! మీరంతా మట్టలాదివారపు ఆరాధనలో పాల్గొన్నారా? ఇది అద్భుతమైన పండుగ, మన
రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తుప్రభువు విజయపు ఉత్సాహముతో రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించిన
శుభదినము. ప్రభువు ఈ లోకపు రాజులాగా గుర్రము మీద కాదు గాని, దీనత్వానికి, శాంతికి గుర్తుగా గాడిదమీద
ఆసీనుడై యెరూషలేములో ప్రవేశించాడు. ఆనాటి యూదు ప్రజలు, వారిని రోమా ఇనుప హస్తపు క్రూరాధికారము
నుండి విడిపించే విమోచకుడుగా ప్రభువు ఉండాలని వారు కోరుకున్నారు. కానీ ప్రభువు పాపమునుండి విమోచించే
రక్షకుడుగా వచ్చానని బోధించడానికి గాడిదమీద కూర్చొని వచ్చారు. ప్రకటన గ్రంధము లోని 21:2లో ఉండే నూతన
యెరూషలోములోనికి తన నిజమైన విశ్వాసులతో బాటు, ప్రభువు రాజాధిరాజుగా పరిశుద్ధ పట్టణములో
ప్రవేశించడానికి మట్టలదివారపు ఈ ప్రవేశము ముంగుర్తుగా ఉన్నది. ఆ సమయములో ప్రభువుతో ఉండాలనే కోరిక
మీకుందా? అయితే సిద్ధపడదాం. పాపము, అవిధేయత, తిరుగుబాటు, ప్రతివిధమైన దుష్టత్వమునుండి క్రీస్తు
పరిశుద్ధ రక్తములో శుద్ధి చేయబడి, క్రీస్తులో అనుదినం జీవించేవారే ఆ లెక్కలో ఉంటారు. దానికోసం ఇప్పుడే,
ఇప్పటినుండే సిద్ధపడాలి. నీవు దేవుని కృపనుత్రోసివేసిన స్థితిలో ఉన్నట్లయితే, లేదా ఈ నిర్ణయాన్ని వాయిదా
వేస్తున్నట్లయితే, ఇక ఆలస్యము చేయవద్దని మిమ్ములను ప్రేమతో ప్రాధేయపడుతున్నాను.
ఈ వారమును పరిశుద్ధ్ధవారమని పిలుస్తారు. కొన్ని సంఘాల్లో ప్రతిదినము ధ్యానాలు, మీటింగ్ ఉండవచ్చు.
మీ స్థానిక సంఘములోని ధ్యానాల్లో మీరు పాలుపొందండి. ఇక శుక్రవారము శుభశుక్రవారము గుడ్ ఫ్రైడే ఆరాధన
ఉంటుంది. సిలువ మరణం ఒక క్రిమినల్ కు రోమా నిరంకుశ ప్రభుత్వము ఇచ్చే శిక్ష. ఈ శిక్షను వారే కనిపెట్టారు.
నేరాలను ఘోరాలను అరికట్టడానికి వారు చేసిన శిక్షపధ్ధతి.
ప్రభువు సిలువమీద అత్యంత కిరాతకమైన క్రూరాతిక్రూరమైన సిలువమ్రానుకు మేకులతో కొట్టబడి ఆ
ఘోరమైన మ్రానుమీద వ్రేలాడి, తన రక్తమును కార్చి మరణించి మూడవనాడు తిరిగి సజీవుడుగా లేచాడు. ఈ
రోజున మనమంతా కలిసే చేసే ధ్యానము ఏమిటంటే, ఎందుకు సిలువమరణమే అవసరం? ఎందుకు రక్తము కార్చి
మ్రానుమీద వ్రేలాడి ప్రభువు మరణించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దేవుని పరిశుద్ధగ్రంధం బైబిల్లోనుండి వెతికి
వెలికి తీద్దాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి.
మొదటిది, యేసు క్రీస్తు ప్రభువు మన శాపమును మ్రానుమీద “మోసుకొన్నాడు” I పేతురు 2:24 చూడండి:
“మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన
పాపములను మ్రానుమీద మోసి కొనెను. “మోసికొనెను” అనే మాటకు అర్ధం ఏమిటి? ఆయన పొందిన
గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.” మోసికొనెను” అనే మాటను గమనించారా? యేసు క్రీస్తు ప్రభువు ఈ
కిరాతకమైన మ్రానును మనస్ఫూర్తిగా హృదయమంతటితో సంపూర్ణమైన మోశాడని ఆ మాటకు అర్ధం. ప్రియ
స్నేహితుడా, సహోదరీ, అది నీవు, నేను మోయవలసిన మ్రాను అని దయచేసి గుర్తించండి, ప్రియ శ్రోతలూ!
గలతీ 3:13,14 వచనాలలో ఈ విషయం స్పష్టంగా ఉన్నది. “క్రీస్తు మనకోసము శాపమై మనలను
ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను; “ఆత్మనుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు
లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము
శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను; ఇందునుగూర్చి–
మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.” ఎక్కడ వ్రాయబడియున్నది? ద్వితీ.
21:23నుండి ఉటంకించబడిన దేవుని శక్తిగల మాటలివి.” ఇందునుగూర్చిమ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును
శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.” ధర్మశాస్త్రము యొక్క శాపము ఏమిటి? “అతని శవము రాత్రి వేళ ఆ
మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు” మన పాపము మనలను దేవుని
పరిశుద్ధమైన దృష్టిలో శాపగ్రస్తునిగా చేసింది. నీ మీద ఉన్న దేవుని శాపము, మరే రీతిగానూ నీవు తొలగించుకోలేని
శాపమును ప్రభువు తన శాపముగా భావించి మోసికొన్నాడు. అందుకు అత్యంత కిరాతమైన క్రూరమైన సిలువ
మరణము అవసరమయ్యింది.
రెండవది, రక్తము ఎందుకు చిందించబడాలి? సాధారణ మరణాల్లో రక్తము చిందించబడదు. యేసు క్రీస్తు
ప్రభువును రోమా సైనికులు కొరడాలతో కొట్టినపుడు, ఆయన రక్తం చెందింది. వారి కొరడాల చివరలో మూడు
పదునైన ఇనుప కొంకిలు ఉంటాయి. ఒక్కొక్క సారి జాడించి కొరడాతో ప్రభువును కొట్టినపుడు ఆ ఇనుప కొంకిలు
ప్రభువు శరీరమును చీరి రక్తము మాంసమును చిందించేవి. పాపమునకు ప్రాయశ్చిత్తము కలగాలంటే రక్తము
చిందించబడాలి. హెబ్రీ, 9:22 “మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయ
బడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.” శ్రోతలూ,
జాగ్రతగా వింటున్నారా? నీ మనస్సాక్షి నీ పాపముగూర్చి నిన్ను గద్దిస్తుందా? పరిశుధ్ద్ధాత్ముడు నీ పాపము
విషయము నిన్ను ఒప్పించాడా? నీ పాపములన్నింటికీ ఒకేసారి, సంపూర్ణంగా, శుద్ధి, క్షమాపణ కలిగే మార్గము
ఉన్నది. హెబ్రీ 9:13,14 “మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే
పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద
ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, నిత్యుడగు ఆత్మద్వారా
తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని
సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.” హల్లెలూయ! యేసు క్రీస్తు ప్రభువు నూటికి
నూరుపాళ్లు దేవుడు. నూటికి నూరు పాళ్ళు పాపములేని మానవుడు. ఆయనలోనే నీ పాపమoతటికీ సంపూర్ణమైన
క్షమాపణ, విమోచన ఉన్నవి.
మూడవది, సిలువ మరణం ఎందుకు అవసరమయ్యిందంటే, దేవునితో మానవునికి తెగిపోయిన సంబంధం.
ఘోరమైన హృదయ విదారకమైన యుద్దము చూస్తుంటే, ఈ విషయం మనకు తెలియడం లేదా? ప్రస్తుతమున్న
క్రూరత్వము, పగ ప్రతీకారాలు, అహంకారాలు, అవినీతి, మోసము, హత్యలు, అక్రమ సంబంధాలు, ఇలాంటివన్నీ
చూస్తుంటే రుజువు కావడం లేదా? ఇంతెందుకు? మీ హృదయాన్ని మీరు పరీక్ష చేసుకుంటే, యధార్ధంగా
ఒప్పుకుంటే అదే అన్నిటి కంటే గొప్పరుజువు. “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన
వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” యిర్మీయా 17:9 దేవుని వాక్యము విన్నపుడు, చదివినపుడు,
బోధించినపుడు, అది ఇతరులకు అనుకోవడం చాలా పెద్ద మోసం, శోధన. ఇది సైతాను దారి మళ్లించే పద్ధతి. ప్రియ
స్నేహితుడా, సోదరీ, ఇది మనలో ప్రతి ఒక్కరికీ వర్తించే సత్యం. అద్దముముందు నిలుచున్నపుడు కనిపించేది
మనముఖమా, ఇతరుల ముఖమా? దేవునివాక్యము అద్దములాంటిదని యాకోబు 1:23 తేటపరుస్తుంది.
“ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన
సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి
తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా?” ఈలాంటి దేవుని వాక్యము చెప్పే మాట ఏమిటంటే, “ఏ భేదమును
లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” రోమా. 3:23
దేవునితో తెగిపోయిన మన సంబంధము మనలను దేవునికి శత్రువులను చేసింది. దేవుడు పరిశుద్ధుడు,
పాపమును సహించలేడు, తప్పక శిక్షిస్తాడు. మానవులతో, అధికారులతో, రాజులతో మనకు శత్రుత్వము ఉంటే అది
చిన్న సంగతే, కానీ దేవాది దేవునితో మనకున్న శతృత్వాన్ని సమాధానపరచాలంటే, మధ్యవర్తి కావాలి. ఆయన
పరిశుద్ధుడైన దేవునికి, పాపి అయిన నీకు మధ్యలో నిలవాలి. I తిమోతి 2:5 “దేవుడొక్కడే, దేవునికిని నరులకును
మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.” గమనించారా? యేసు క్రీస్తు తప్ప ఎవ్వరూ మధ్యవర్తిత్వం
చేయలేరు. ఎందుకు? పాపము ఎంతమాత్రములేని పరిశుద్ధమైన రక్తము “విమోచన క్రయధనముగా” చెల్లించాలి. ఆ
రక్తము చిందించడానికే యేసు క్రీస్తు మానవుడుగా శరీరము ధరించి జన్మించాడు. అందుకే, ప్రభువు తన రక్తమంతా
కార్చి ప్రాణము విడిచిన తరువాత, అతి పరిశుధ్ద స్థలములో, దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డుతెర పైనుండి
క్రిందికి దానంతట అదే చినిగిపోయింది. “యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు
తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను;” ఈ తెర దేవుని పరిశుద్ధ సన్నిధికి మానవునికి నిరంతరం మధ్యలో
ఉండేది. అది 60 అడుగుల ఎత్తు, 4 అంగుళాల దళసరిగా ఉండేది. దీన్ని దేవుడే స్వయంగా చించివేశాడు. ఇక
అప్పటినుండి దేవునివద్దకు రావడానికి ప్రతి ఒక్కరికీ తలుపు తెరిచి ఉన్నది. ప్రియ స్నేహితుడా, సోదరీ, నీవు
దేవునితో నీకున్న శత్రుత్వమును, నీకు దేవునితో తెగిపోయిన సంబంధమును బాగు చేసుకుంటావా? “ఏలయనగా
శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల
సమాధానపరచబడినవారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.” రోమా 5:10 ప్రభువు
నిన్ను పిలుస్తున్నాడు. ఆయనతో సమాధానపడి దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీవు దేవుని కుటుంబములో
ఇప్పుడే జన్మించవచ్చు. ప్రభువు మహా కృప మిమ్ములను ఆ అనుభవములోనికి నడిపించుగాక! అమెన్!!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment