రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 41 11:13-24 అవిశ్వాసం అనే విషాదం

 

రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 41  11:13-24

అవిశ్వాసం అనే విషాదం

     క్రుంగిపోయి నిరాశలో ఉన్నారా? యేసు క్రీస్తులో నిరీక్షణ ఉన్నది. ప్రభువు నీ నిరాశ నుండి నిన్ను ఇప్పుడే విడిపించగల శక్తిమంతుడు. యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు  కీర్తన 145: 14. “అందరిని” అన్నప్పుడు అందులో నీవు కూడా ఉన్నావుకదా! ఈ వాక్యము కంఠస్థం చేయండి. నీవు లేచి ఆయనతో నీ సంబంధమును సరిచేసుకొని, ఆయనచేతిలో నీ చేయి వేసి నడవడానికి సిద్ధమా? లేచి మీ బైబిల్, నోట్ బుక్ పెన్ తెచ్చుకొనండి, దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం.

     ప్రతి ఒక్కరికీ ఒక పరిమాణములో విశ్వాసము ఉంటుందని బైబిల్ గ్రంధం సెలవిస్తుంది. దీని అర్ధం ఏమిటంటే మనము విశ్వసించగల శక్తితో దేవుడు సృష్టించాడు. ఏది విశ్వసిoచాలో నిర్ణయించుకుంటారు. విశ్వసించ వద్దనికూడా ఎంచుకోవచ్చు. మనము ఒక అబద్ధమునైనా విశ్వసించవచ్చు, కానీ అప్పుడు మోసపోతాము.

విశ్వసించినపుడు ప్రతిఫలము ఉంటుంది. బైబిల్ బంగారు వాక్యం ఏమంటున్నది? విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” యోహాను సువార్త 3:16  యేసు ప్రభువును విశ్వసించినవారికి నిత్యజీవము బహుమానము. విశ్వసించకపోవడమునకు కూడా ప్రతిఫలము ఉన్నది. విశ్వసించని వారు నిత్య నరకములో వేయబడతారు. విశ్వసించడమైనా, విశ్వసించక పోవడమైనా, రెండూ మనకు సాధ్యమే. విశ్వసించడమునకు మంచి ప్రతిఫలము, విశ్వసించకపోవడానికి చెడు ప్రతిఫలము ఉంటుంది. పౌలు రోమా పత్రిక 11:13-24 లో అవిశ్వాసమనే విషాదము గురించి బోధించాడు.

            13. అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,

14. వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను.

15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.  

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

20. మంచిది; వారు అవిశ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్హమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా?

అవిశ్వాసమనే విషాదమును మనము అర్ధం చేసుకోవాలంటే, ఈ లేఖన భాగములో దానికి సంబంధించిన మూడు మాటలను మనము పరీక్షించాలి:

మొదటిది, అవిశ్వాసానికి సంబంధించి తిరస్కరించుట ప్రాముఖ్యమైన మాట. పౌలునకు రెండు గుంపులు మనసులో ఉన్నారు. 13వ వచనములో అన్యజనులగురించి వ్రాశాడు: “అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను.” అనే మాటలు గమనించారా? ఆ తరువాత తన ప్రజలైన యూదుల గురించి 14వ వచనములో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవునికి దూరస్థులైన అన్యజనులు ఉన్నారు. వారిలో విశ్వసించినవారు సమీపస్థులైనారు. యూదులు కూడా ఉన్నారు, వారు దేవుని ప్రజలు, కానీ అవిశ్వాసమునుబట్టి వెలివేయబడ్డారు. 15వ వచనములో ఈ వెలివేత గురించి అపోస్తలుడు  మాట్లాడుతున్నాడు. ఈ తిరస్కరించుటను రెండు గుంపులు నిరూపించిన విధమిదే! సమీపస్తులైన అన్యజనులు, వెలివేయబడ్డ యూదులు. యూదులకు దేవునితో దగ్గరి సంబంధం, చాలా దగ్గరి సంబంధం ఉన్నది. ఎందుకంటే దేవుడు అబ్రహామును అనేక సంవత్సరాలక్రితమే యూదులకు తండ్రిగా ఉండాలని, వారు హెబ్రీయులనే జాతి గా ఏర్పాడాలని  ముందే ఏర్పాటు చేసిఉన్నాడు. ఆ తరువాత వారిని ఐగుప్తు నుండి విమోచించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఆయన ద్వారానే వారికి ధర్మశాస్త్రమును ఇచ్చి, పది ఆజ్ఞలను అనుగ్రహించి, బైబిల్లోని  మొదటి ఐదు గ్రంధాల్లో ఉన్న ఆజ్ఞలన్నీ వారికిచ్చాడు.

     ఆ తరువాత దేవుడు దావీదును ఎన్నుకొని వారిని ఒక్క జాతి, ఒక్క ప్రజగా చేశాడు. దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని వారిని తన వాక్కుతో పంపించి తన ప్రజలవద్దనుండి ఆయన ఏమి కోరుతున్నాడో, ఎలా వారు జీవించాలని ఆశిస్తున్నాడో తెలియచేశాడు. తిరస్కరించడం యొక్క అర్ధం 15వ వచనములో అది తెలియపర్చబడింది. “వారిని విసర్జించుట….”   అన్న మాటలు గమనించండి. తిరస్కరించడo వారు చేసిన పని. దేవుని మాటకు విధేయత చూపలేదు, ఆయన మాటను లెక్క చేయలేదు. ఇది విషాదకరమైన సంగతి. ఈ విషయం చాలా జాగ్రతగా గమనించండి. ఆయనకు విధేయత చూపని వారిని దేవుడు తిరస్కరిస్తాడు. ఈ విషయం గ్రహించినపుడే తిరస్కరించుట యొక్క విషాదము ఏమిటో మనకు అర్థమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే, అవిధేయులు, అనగా దేవునికి విధేయత చూపనివారు మొదట దేవుని తిరస్కరించారు. గనుక దేవుడు వారిని తిరస్కరించకతప్పదు.

     అవిశ్వాసమునకు సంబంధించి రెండవ మాట తీసివేయడం.  ఇక్కడ కూడా రెండు తలంపులు అనగా రెండు ఒలీవ చెట్లు ఉన్నవి. ఒకటి మంచి ఒలీవ చెట్టు, రెండవది అడవి ఒలీవ చెట్టు. అడవి ఒలీవచెట్టు కొమ్మలు మంచి ఒలీవ చెట్టుతో అంటు కట్టబడినట్టు గమనిస్తున్నాము. గమనించండి, మంచి ఒలీవ చెట్టు సేద్యముచేయబడుతున్న చెట్టు. నాకు తెలిసినంతమట్టుకు సేద్యముచేయబడుతున్న ఒలీవ చెట్టు పెద్దగా ఏపుగా పెరుగుతుంది, బలంగా ధృడంగా ఉంటుంది, అడవి ఒలీవచెట్టుకంటే ఎక్కువ పళ్ళు కాస్తుంది. ఇక్కడ పోలిక ఏమిటి? యూదులు సేద్యముచేయబడిన ఒలీవ చెట్టు. ఈ చెట్టునుండి పళ్ళు కాయని కొన్నికొమ్మలు విరిగిపోయాయి. అప్పుడు వాటి స్థానంలో అడవి ఒలీవచెట్టు కొమ్మలు మంచి ఒలీవచెట్టుతో అంటుకట్టబడ్డాయి. ఈ అడవి ఒలీవ చెట్టు సేద్యముచేయబడిన ఒలీవచెట్టు అంత పళ్ళు కాయలేదు. అది చిన్న చెట్టు, అంత బలమైనది కాదు. అడవి ఒలీవ చెట్టు కొమ్మలు అనగా ఏమిటి? అన్యజనులు. యూదులు కాని వారందరూ అన్యజనులే. వారు సేద్యము చేయబడిన ఒలీవ చెట్టుతో అంటుకట్టబడ్డారు.

     స్వాభావికమైన కొమ్మలు, స్వాభావికం కాని అడవి కొమ్మలు ఉన్నాయి. కొన్ని స్వాభావికమైన కొమ్మలు విరిగిపోయాయి. ఆపో. 20వ వచనములో అవి ఎందుకు విరిగిపోయాయో వివరిస్తున్నాడు “అవిశ్వాసమునుబట్టి”. సేద్యము చేయబడిన మంచి ఒలీవ చెట్టుతో అంటుకట్టబడిన అడవి ఒలీవచెట్టు కొమ్మలు విశ్వాసమునుబట్టి నిలిచిఉన్నాయి. ఏ అనుమానము లేకుండా, ప్రశ్నలు లేకుండా ఈ సత్యమును మనము గమనించాలి. అవిశ్వాసము అనే విషాదమును  తీసివేయబడడం అనే మాట వివరిస్తున్నది. స్వాభావికమైన కొమ్మలు అవిశ్వాసమునుబట్టి తీసివేయబడ్డాయి, లేదా విరిగిపోయాయి.

     అవిశ్వాసమునకు సంబంధించిన మూడవ మాట, ఖచ్చితమైన, ప్రాముఖ్యమైన మాట సరి అయిన స్థానములో ఉండుట. ఇక్కడ దేవునినుండి రెండు స్పందనలు కనిపిస్తున్నాయి. 22వ వచనములో ఈరెండు కలిపి వ్రాయబడ్డాయి. అవేమిటో తెలుసుకుందాం. “ దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును,  అనుగ్రహము అంటే దేవుని దయ. దేవుడు మనలను కరుణతో చూస్తున్నాడు. కాఠిన్యము అంటే దేవుడు ఖచ్చితమైన న్యాయదృష్టితో చూస్తాడు.  జాగ్రతగా గమనించవలసిన అంశం ఇది. ఎవరు అవిశ్వాసముతో, అవిధేయతతో ఆయన మాటను లెక్కచేయక తిరస్కరిస్తారో, వారిని కఠినంగా చూచి తగిన శిక్ష వేయడం దేవుని తపనిసరి స్పందన. దేవునికి విధేయత చూపనివారిని ఆయన తిరస్కరిస్తాడు. తీసివేయబడినవారు ఎవరు అనగా ఆయనయందు విశ్వసముంచనివారు. ఆయన తన నిత్య న్యాయము తప్పడు, ఆయన వ్యక్తిత్వము ప్రకారమే చేస్తాడు. విశ్వాసముంచక అవిధేయత చూపిన వారిమీద ఆయన కఠినత్వము కనబరుస్తాడు. విశ్వాముంచి విధేయత చూపినవారికి మంచితనము కనుబరుస్తాడు.  దేవుని ఈ రెండు స్పందనలను జాగ్రతగా గమనిస్తున్నారా?

     ఇక ఇప్పుడు ఆపో. వివరించేదేమిటంటే, మంచి ఒలీవచెట్టులో నిలిచిఉండడానికి ఒకే ఒక్క మార్గము దేవుని దయలో కొనసాగిపోవడమే! 22వ వచనములో ఆయన ఏమంటున్నాడు?నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల....”  అప్పుడు దేవుడు నీ పట్ల మంచితనము, దయ కనుబరుస్తాడు. పట్టుదలతో నిలిచిఉండడం తప్పనిసరి. మన క్రైస్తవ  జీవితాల్లో సడలింపు, మినహాయింపు ఉండవు. మంచి ఒలీవ చెట్టు తనతో అంటుకట్టబడిన అడవి ఒలీవచెట్టు కొమ్మల భారమును వారు దేవుని అనుగ్రహములో నిలిచినoతసేపు భరిస్తుంది. ఇంకొంచం వివరణ చూద్దాం. మంచి ఒలీవచెట్టు లోని తీసివేయబడిన కొమ్మలు వారి అవిశ్వాసం, అవిధేయతలో కొనసాగకుండా ఉన్న్ట్లట్లయితే వారిని మళ్ళీ అంటుకట్టడం దేవునికి సాధ్యమని  పౌలు భక్తుడు బోధిస్తున్నాడు. ఇది 23వ వచనములో స్పష్టంగా ఉంది. “వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.”   అవును, ఆయన మంచితనమునుబట్టి, కఠినత్వమును బట్టి  దేవునికి స్తోత్రం! వారిని మళ్ళీ అంటుకట్టడములో దేవుని మంచితనము కనిపిస్తున్నది. దేవుని కరుణ, ఆయన మంచితనము, ఆయన కఠినత్వము ద్వారానే సరి అయిన స్థానములో ఉండడం సాధ్యం.

      అవిశ్వాసమనే విషాదం నీ జీవితములో జరగకూడదని ఆశిస్తే, ఈ మూడు మాటలను అర్ధం చేసుకోవాలి. అవిధేయతను బట్టి 

తిరస్కారం కలుగుతుంది. అవిశ్వాసమును బట్టి తీసివేయడం జరుగుతుంది. దేవుని దయ, కరుణనుబట్టి సరయిన స్థానములో 

ఉండడం జరుగుతుంది. ప్రియ మిత్రమా, యేసు క్రీస్తునందు విశ్వాసముంచమని నిన్ను బ్రతిమాలుతున్నాను. అప్పుడే 

అవిశ్వాసమనే విషాదమును నీవు తప్పించుకోగలవు! ఇప్పుడే ప్రభువును వేడుకో!!

రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 40 11:7-12 అందరికోసం రక్షణ, పాప క్షమాపణ

 గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!

రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 40  11:7-12

అందరికోసం రక్షణ, పాప క్షమాపణ

సజీవనిరీక్షణ రేడియో శ్రోతలందరికీ యెసయ్య పరిశుద్ధనామములో శుభములు! మీరు చెప్పిన ప్రతి ప్రార్థన మనవి కోసం ప్రార్థిస్తున్నాము. కానీ మీకు బదులుగా కాదు, మీతో బాటు. అంటే ఏమిటి? మీరు దేనికోసమైనా పట్టుదలతో ప్రార్ధిస్తున్నట్లయితే, మీతో బాటు మేము విజ్ఞాపన చేస్తాము. మీరు ప్రార్థన చేయకుండా కేవలం ఇతరులపైన ఆధారపడే వారైతే అది సరికాదు. ప్రభువు నమ్మకమైన వాడు, మాట తప్పడు, న్యాయం విడువడు, కృపాతిశయము గలవాడు, అనగా కృపచూపించడంలో సంతోషించేవాడని అర్ధం. క్రుంగిన వేళలో, లేదా రాత్రి నిద్రపట్టకపోయినపక్షంలో కీర్తనలగ్రంధం చదవండి. దేవుని శక్తిగల మాటలు, ధైర్యము, నిబ్బరము, ఆదరణను కలిగిస్తాయి, ఇది నా స్వానుభవము కూడా! 

ముందుగా ప్రార్ధించుకుందాం, తలలు వంచండి:   ప్రార్థన:

బైబిల్ గ్రంధం సమస్య ఏమిటో విశ్లేషించి తెలిపే గ్రంధం. మనమందరమూ, మినహాయింపు  లేకుండా, దేవుని యెదుట, ప్రతి ఒక్కరమూ పాపము చేసినవారమని చెబుతుంది. అందుచేత, న్యాయబద్ధంగా దేవుని కోపానికి అర్హులము. మీరు నేను, యేసు క్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా నమ్మి, హృదయములో చేర్చుకునేవరకు దేవుని కోపానికి పాత్రులమే! ఆ ఘోరమైన ప్రచండమైన ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడు కరుణతో ఒక మార్గం ఏర్పాటు చేశాడు. మన స్వంత ఇష్టపూర్వక మార్గాలు పని చేయవు. కేవలం దేవుని మార్గమే పనిచేస్తుంది, అదొక్కటే మార్గం!! అవును, దేవునికి స్తోత్రం, ప్రభువు ఏర్పాటు చేసిన మార్గమే, అదొక్కటే మార్గం! దేవుడు అందరి రక్షణ, పాపక్షమాపణ కోసం ఏర్పాటు చేశాడు, అందులో నీవు, నేను ఉన్నాము. హల్లెలూయ!  దేవునికే మహాస్తోత్రo కల్గుగాక!

ఈ నాటి లేఖన భాగము: రోమా 11:7-12.

            7   ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు, ఏర్పాటు   నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.

              8   ఇందువిషయమైనేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను,          వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

              9   మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు   ప్రతిఫలముగాను ఉండును గాక.

            10  వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును    వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.

              11  కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు.

              12  వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి         తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును       అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

     

     దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాలని ఉద్దేశించినందుచేత ఏ ఏ ప్రక్రియల ద్వారా మానవులందరికీ తన రక్షణ ఏర్పాటు చేసిఉన్నాడో అది ఈ పూట అధ్యయనం చేద్దాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి నెమ్మది నిచ్చే దేవునివాక్యం వినండి.

అందరికోసం రక్షణ, పాపక్షమాపణ ఏర్పాటు చేయడములో ఉండే మొదటి ప్రక్రియ నిష్ఫలమైన వెతుకులాట.  7వ వచనము ప్రశ్నతో ఆరంభమౌతుంది. “ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు  వారు వెతుకుతున్నది, ఇశ్రాయేలీయులకు ఎందుకు దొరకలేదు? వారు స్వనీతితో వెతికారు కాబట్టి. వారికి క్రియలు ప్రాముఖ్యమైనవి. క్రియలు ముఖ్యమైనవే, కానీ దేవుని కృపను వారి క్రియలచేత పొందాలని ఆశించారు. మోషే ద్వారా దేవుడు మాట్లాడినందుచేత వాళ్ళకువాళ్లు గొప్పవాళ్లు అనుకుని గర్వించారు. దానిలో వారు అహంకారము చూపారు. ఈ విధంగా దేవుని కృపను స్వనీతితో, నీతిక్రియలచేత పాప క్షమాపణపొందాలని ప్రయత్నము చేసినారు. అది నిష్ప్రయోజనమైనదని ఆపో. స్పష్టపరుస్తున్నాడు. అందుకే వారు వెతికినది, వారు ఆశించినది, వారు పొందలేదు. అది వారిని అపజయము పాలు చేసింది. కృపలోని ఏర్పాటు ప్రకారం స్పందించినవారు మాత్రమే పొందారు, మిగిలిన వారు గుడ్డివారిలాగా చూడలేకపోయారు. వారికి ఆటంకాలు ఎదురయ్యాయి. కారణం? వారు సరిగా వెతకలేదు. దేవుడు చేస్తున్న దాన్ని జాగ్రతగా చూడలేకపోయారు. దేవుడు చెప్పేదాన్ని వారు వినలేకపోయారు. అది వ్యర్ధ ప్రయత్నం, నిష్ఫలమైన వెతుకులాట. గమనిస్తున్నారా, శ్రోతలూ? నిష్ఫలమైన వెతుకులాట స్వనీతితో ఆరంభమై స్వీయఓటమితో ముగుస్తుంది. మరోసారి గమనిద్దామా?   నిష్ఫలమైన వెతుకులాట స్వనీతితో ఆరంభమై స్వీయఓటమితో ముగుస్తుంది.   

     అందరికీ రక్షణ, పాపక్షమాపణ ఏర్పాటు చేయడములోని రెండవ ప్రక్రియ ప్రాణాంతకమైన అడ్డుబండ. 9వ వచనములో “...వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక”  అని దావీదు ఎందుకు అంటున్నాడని ఆలోచిస్తున్నారా? వారి మతపరమైన పద్ధతులు, భక్తిపరమైన క్రియలు, వారి మతమును వారు చూపించేవిధానమును గూర్చి దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బల్ల సహవాసమునకు గుర్తు. వారు దేవునితో సహవాసము కలిగిఉన్నారని చెప్పడానికి అది సూచన. కానీ దావీదు అంటున్నదేమిటి? వారి భోజనము వారికి ఉరి కావాలని కోరుతున్నాడు. ఎందుకంటే వారు దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండానే కేవలం పైపైన కనిపించేవి చేస్తున్నారు. బైబిల్ తెరచి ఉంచారా? 10వ వచనం గమనించండి.

ప్రజలు పక్షులను పట్టుకోవడానికి వల వేస్తారుకదా! చిన్న జంతువులను పట్టుకోవడానికి బోను పెడుతూఉంటారు. వారి భోజనం వారికి వలలాగా, బోనులాగా, ఒక అడ్డుబండలాగా ఉంటుందని అర్ధం. మరోమాటలో చెప్పాలంటే, వారి భోజనమే వారికి దోషభరితంగా, అపనిందగా, గాయపరిచేటట్టు మారుతుందని భావము. వారి భోజనమే వారికి కీడు కలిగించేదిగా ఉండి, వారి చేసినవాటికి వచ్చే ప్రతిఫలముగా ఉంటుందని హెచ్చరిక! అవును, సోదరీ సోదరులారా, పైపైకి కనిపించే భక్తి ప్రార్ధన, అడ్డుబండలుగానే ఉంటాయి.

     దాని తరువాత ఉటంకించబడిన వాక్యంలో వీటియొక్క ఘోరమైన ఫలితం కనిపిస్తుంది. 10వ వచనం. “  వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము...”  అడ్డుబండకు ఎంత భయంకరమైన పరిణామమో గమనిస్తున్నారా, శ్రోతలూ? పైపైకి కనిపించే భక్తి, ప్రార్ధనలకు దేవుడు ఎంత భయంకరమైన తీర్పు చేస్తాడో తెలుసుకుంటున్నారా? వారి కన్నులు చూడలేవు, వారి వీపు మోయలేనంత భారంగా ఉంటుంది. ఇంత భయంకరమైన అడ్డుబండ ఆరంభమయ్యేది పైపైకి కనిపించే భక్తి, విశ్వాసము, ప్రార్థనతోనే.

     ఇక మూడవ ప్రక్రియ ఈ క్రమములోని కిరీటము లాంటిది. అది అందరికీ నిత్యమైన రక్షణ అనుగ్రహించే ఏర్పాటు. ఈ లేఖన భాగములోని చివరి రెండు వచనాలు నాకు చాలా ఇష్టమైనవి. అపోస్తలుడు “వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా?  అనే ప్రశ్న లేవదీస్తున్నాడు. సమాధానం “అట్లనరాదు”.  ప్రియ సోదరీ సోదరులారా, ఇక్కడ దేవుని ఉద్దేశ్యం మీరు గమనించాలని ఆశిస్తున్నాను. మన చెవులకు ఇది వింతగా అనిపించినా, పౌలు విపులీకరిస్తున్నాడు. “వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను.”  మనము దేవుని ఉద్దేశ్యము ఏమిటో తెలుసుకుందాం. సర్వశక్తిగల దేవుడు ఏమి చేసిఉన్నాడో, ఏమి చేయబోతున్నాడో మనము స్పష్టంగా గ్రహించాలి.

     ఇశ్రాయేలీయుల తొట్రుపాటు అన్యజనులు రక్షించబడడానికి ద్వారం తెరిచింది. అందుకే ఈ అధ్యాయనానికి “అందరికీ రక్షణ” అనే శీర్షిక ఇచ్చాము. అన్యజనులు అంటే అందరూ, మీరు నేను, ఈ భూమ్మీద ఉన్న ప్రతి జాతి, ప్రతి జనము, ఒక్క యూదులు లేదా ఇశ్రాయేలీయులు తప్ప. ఆపో. చెబుతున్నదేమిటంటే, యూదులలో పౌరుషము కలిగించడానికి దేవుడు ఇది చేస్తున్నాడు. అందరికీ ద్వారము తెరవడంద్వార, ఇశ్రాయేలీయులు ఎక్కడ తప్పిపోయారో తెలుసుకోవాలని. ఇది దేవుని ఉద్దేశ్యం. దేవుని క్రమము కూడా ఉన్నది. 12వ వచనములో దేవుడు చేస్తున్నదాని సారాంశము ఉన్నది. గమనిస్తున్నారా, శ్రోతలూ?  వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!”  అన్యజనులైన మనకు సువార్త, రక్షణ పాప క్షమాపణ అందడానికి దేవుని క్రమము, ప్రణాళిక ఎలా ఉందో తెలుసుకుంటున్నారా? యూదుల పడిపోవడం ప్రపంచమంతటికీ దేవుని ఐశ్వర్యం అనుగ్రహించాడానికి ద్వారo తెరిచింది. వారు పోగొట్టుకున్నది మనకు దొరుకుతున్నది. ఇది దేవుని ప్రణాళిక. చివరలో పౌలు ఒక వాక్యం ఇస్తున్నారు.వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!” అవును, ప్రియ సోదరీ సోదరులారా, దేవుని బృహత్తర ప్రణాళిక అందరి రక్షణ కోసం జగత్తు పునాది వేయకముందే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం! ఇక స్వనీతికి, నీతిక్రియలకు ఏ ఫలితం ఉండదని గుర్తుంచుకోండి.  పైపైకి భక్తి, ప్రార్థన విశ్వాసము చూపించడం అడ్డు బండే అవుతుంది. దేవుని ప్రణాళికలో నీవు రక్షించబడడం ఉన్నది. విశ్వాసంతో స్పందించి ఆమూల్యమైన రక్షణ పొందుతావా? అట్టి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించుగాక! 

 

 

    

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...