రోమా పత్రిక అధ్యయనం 22 6:14-23 స్వేచ్ఛపూరిత జీవితం

 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by Whats App to 98663 41841

 

రోమా పత్రిక అధ్యయనం 22  6:14-23 

 స్వేచ్ఛపూరిత జీవితం

    2020 సంవత్సరం ముగిపులోకే వచ్చేశాము కదూ! ఆరంభంలో ఉన్న చాలామంది ఇప్పుడు మనతో లేరు. కొందరు ప్రభువద్దకు వెళ్లారు. మరికొందరు నిత్యనరకాగ్ని పాలయ్యారు. మన ఆప్తులు, దగ్గరివారు ప్రభువుసన్నిధికి వెళ్లిఉంటే సంతోషం. అదే నిత్యమైన సంతోషపు సన్నిధి. కానీ నిత్యనరకాగ్నిలోకి వెళ్లిఉంటే, ఇక నిరీక్షణే లేదు. ఎంతటి అత్యవసర పరిస్థితుల్లో మనమున్నామో గ్రహిస్తున్నామా? మనలను ప్రభువు సజీవులుగా ఉంచాడు. ఆయనను ప్రేమించడంలో ఎంత వెనకబడి ఉన్నామో ఇప్పటికైనా గుర్తించి, మన రక్షకుడు యేసు క్రీస్తును వెంబడించడానికి ముందుకు శరవేగంతో పరుగెత్తే సమయమిది. 

     వచ్చే రెండు వారాలు క్రిస్మస్ ప్రత్యేక సందేశం విందాం. ఈ పూట రోమా పత్రిక అధ్యయనం చేసుకుందాం, రండి, బైబిల్, పెన్, నోట్ బుక్ తెచ్చుకొని నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చోండి, శ్రద్ధగా అలకించండి. బైబిల్ అధ్యయనo వినాలనుకుంటే, www.sajeevanireekshana.org అనే websiteను దర్శించండి. కార్యక్రమమం చివర్లో మరోసారి చెప్తాను. పెన్ దగ్గర పెట్టుకొనండి. లేదా 9866 341 841 మాకు ఫోన్ చేయండి.

     రాజకీయంగా, సమాజికంగా, అణగారినవారు, వేధించబడుతూ ఉన్నవారు ఉన్నారు కానీ, ఆత్మలో వేధించబడడం చాలా భయంకరమైనది. వారు విడుదలను, స్వేచ్చను కోరుకుంటారు. నిజమైన స్వేచ్చ దేవునితో సంబంధం కలిగినవారికే ఉంటుంది. అదికూడా, నిజమైన దేవునితో, ప్రత్యక్షమైన దేవునితో సంబంధం కలిగిన వారికే ఉంటుంది, ఆయనే పరిశుద్ధ గ్రంధం బైబిల్లో కన్పించే దేవుడు. ఆలోచించే ప్రతిఒక్కరూ ఈ స్వేచ్ఛను కోరుకుంటారుగానీ, అది ఎలా పొందాలో అందరికీ తెలియదు.

     దేవుడు మానవునికి ఎందుకు స్వేచ్చనిచ్చాడో ఆపో. పౌలు అనుభవమునుబట్టి, దైవప్రత్యక్షతద్వారా తెలుసుకున్నాడు. స్వేచ్ఛాపూరిత జీవితము గురించి ఆయన రోమా 6:14-23లో వివరించాడు. ఇది లేఖనం: శ్రద్ధగా చదవండి :


      14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

        15 అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా?    

అదెన్నటికిని కూడదు.

        16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?

        17 మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

      18 పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

      19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

     20 మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

     21 అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,

    22 అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

    23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.”

     ఈ లేఖనభాగములో ఆపో. పౌలు స్వేచ్ఛాపూరిత జీవితమును వివిరిస్తూ మూడు సంగతులను ఎత్తి చూపుతున్నాడు:

    

      మొదటిది, మన జీవితాల్లో స్వేచ్ఛ నివ్వడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. మనమీద పాపము ఇక ప్రభుత్వము చేయదని పౌలు స్పష్టపరుస్తున్నాడు. పాపమునకున్న నిరంకుశత్వము ద్వంసమయ్యింది. మనము ధర్మశాస్త్రము క్రిందలేము కానీ, దేవుని కృపయొక్క ఏర్పాటులో ఉన్నాము.

          ఇప్పుడు దీన్ని అతి జాగ్రత్తగా పరిశీలిద్దాం, సావధానంగా చదవండి. ధర్మశాస్త్రము ఎందుకు వచ్చింది, దాని పని, విధి ఏమిటంటే శిక్ష విధించటం. ఎవరైనా ధర్మశాస్త్రమును మీరినపుడు, వాళ్ళకు శిక్షించింది. ఆలాగు మీరినవారు మరణపు శిక్షకు అర్హులయ్యారు. ఆమాటకొస్తే, ఎక్కడైనా ఏ చట్టం ఉల్లంఘిచినా, శిక్ష తప్పదు.

     కానీ ఇప్పుడేమంటున్నాడు? మీరు ధర్మశాస్త్రము క్రింద లేరు, కానీ కృప క్రింద ఉన్నారు. ప్రతి చట్టానికి శిక్ష ఉందని చెప్పుకున్నాము కదా! కానీ కృప దానికి సరిగ్గా విరుధ్ధమైనది చేస్తుంది. కృప క్షమిస్తుంది, విమోచిస్తుంది. అపరాధము చేసినపుడు క్షమాపణ అవసరమని మనము జ్ఞాపకముంచుకోవాలి. మనమంతా  దేవుని ధర్మశాస్త్రమును చట్టమును ఉల్లంఘించాము గనుక దేవుణ్ణి క్షమాపణ వేడుకోవాలి. కాబట్టి పాపము చేయాలనే తలంపు, యోచన కలిగినపుడు దాన్ని త్రోసివేయాలి, చంపివేయాలి.

     ఆపో. ప్రశ్న లేవదీస్తున్నాడు. “కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా?” అదెన్నటికిని కూడదు.”  లేదు, స్నేహితుడా, సోదరీ, పాపము చేయడానికి మనకు స్వేచ్చ లేనేలేదు. కృప క్షమిస్తుంది కానీ పాపమును అనుమతించదు. జాగ్రతగా గమనిస్తున్నారా? కృప క్షమిస్తుంది కానీ పాపమును అనుమతించదు.

     కాబట్టి కృప ఏమి చేస్తుందో, దానికి అర్ధం ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్ధమయ్యిందా? కృపనుబట్టి క్షమాపణ సాధ్యమయ్యింది, దానిద్వారా మనకు స్వేచ్ఛ దొరికింది. దేవుని మహోన్నత కృపక్రింద మనమున్నాము గనుక మనము క్షమించబడతాము, దానిద్వారా మనకు స్వేచ్చ దొరుకుతుంది.

     రెండవది, మనము ఎంత విధేయత చూపిస్తే, అంతగా ఈ స్వేచ్చను మనము పొందగలము. ఆపో. పౌలు 16వ వచనములో బోధిస్తున్న విషయాన్ని జాగ్రతగా గమనించాలి. “ లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, ……….దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?”   ఏమి చేయాలో స్పష్టంగా ఎంచుకోవాలి. విధేయత చూపనైనా చూపవచ్చు, లేదా లెక్క చేయకుండా పాపమునకు బానిస కావచ్చు. సోదరీ సోదరులారా, మీరు నేను, పాపమునకు అప్పగించుకుంటే, మరణమును తెచ్చుకుంటాం. నీతికి, పరిశుధ్ద్ధతకు అప్పగించుకుంటే, బానిసత్వమునుండి బయటికి వచ్చేసి, పాపపు సంకెళ్ళు తెంపేస్తాం.

           17, 18 వచనాల్లో ఆపో. ఏమంటున్నాడు?  మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.”   హల్లెలూయా!   గట్టిహృదయముతో, మనఃపూర్వకంగా పాపముతో సంబంధం తెంచుకోవాలి. ఏకహృదయముతో నిర్ణయించుకొని తుదిశ్వాసవరకు, ఊపిరిఉన్నంతవరకు ప్రభువును మనమంతా వెంబడించాలి. అటు ఇటు రెండువైపులా ఉండడానికి ఎంతమాత్రము వీలులేదు. నీవు పాపమునకు బానిసగానైనా ఉండాలి, లేదా నీతికి దాసుడుగానైనా ఉండాలి.

     ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున...” అనే మాటలు 22వ వచనములో గమనించండి. సంపూర్ణంగా అప్పగించుకొంటే పాపమునుండి విడుదల కలుగుతుంది. జాగ్రతగా వింటున్నారా? ఒకప్పుడు పాపమునకు ఎంత దాసులమో ఇప్పుడు నీతికి అంత దాసులము కావాలి. ఎంత సంపూర్ణoగా నీతికి, పరిశుధ్ద్ధతకు దాసునివి, దాసురాలవు అవుతావో అంత స్వేచ్చ కలుగుతుంది.

     మూడవది, దైవికమైన స్వేచ్చకు గుర్తు పరిశుధ్ద్ధత. మొదట గతము ఎలా ఉండేనో గమనించుకోండి. 20వ వచనములో ఉంది. “మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.”  పాపము నీతి ఒకదానికొకటి విరుద్ధo, ఒకదానిలో మరొకటి ఇమడదు. నీవు రెంటిలో ఒకేసారి ఉండలేవు. నీవు పాపమునకు బానిసగా జీవిస్తూ నీతిని పరిశుధ్ద్ధతను పొందలేవు. నీవు దేవునికి విధేయత చూపిస్తూ, నీతికి దాసుడవుగా ఉంటూ, అదే సమయములో పాపముచేస్తూ ఉండలేవు. ఇవి ఒకదానికొకటి పొందికలేనివి. నీవు గతములో చేసినవాటిగూర్చి ఇప్పుడు సిగ్గుపడడంలేదా? వాటిని గుర్తు చేసుకున్నపుడు నీవు బాధపడతావా? లేదా? వాటిలోనే ఇంకా జీవించి ఉండినట్లయితే చివరికి చేరేది నిత్యనరకానికే అని నీకు తెలుసుకదా?

    ఇప్పుడు ముందుకు భవిష్యత్తు వైపు చూడు. 22వ వచనం. “ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.”   

ఆయన నిన్ను పాపమునుండి విమోచించింది దేవునికి దాసులుగా, విధేయులుగా జీవిస్తూ

ఆయనకు “జీవితపు బానిస”గా ఉండడానికి. దీన్ని గ్రీక్ భాషలో “డూలస్” అంటారు. పౌలు తనను తాను అంతగా క్రీస్తుకు అప్పగించుకున్నాడు. అలాగే అందరికీ పత్రికలలో పరిచయం

చేసుకున్నాడు. ఇసుమంతకూడ తనకోసం దాచుకోకుండా  ప్రభువుకు అప్పగించుకొనేవారు ప్రభువుకు కావాలి. ఫలితం? పరిశుధ్ద్ధత. అవును, దేవునికి మనలను మనము సంపూర్ణంగా అప్పగించుకున్నపుడు, మనము ఆయనలాగ జీవిస్తాం, ప్రవర్తిస్తాం. అప్పుడే నిత్యజీవం దొరుకుతుంది. అది మన భవిష్యత్తు.

     23వ వచనంలో మనకు సహజంగా దొరికే జీతం ఏమిటో ఉన్నది. “పాపమునకు వచ్చు జీతం మరణం.” పాపములోనే మరణిస్తే, మరణం తరువాత తీర్పు, నిత్య నరకం అనుభవించక తప్పదు.  నిత్యత్వoలో దేవునినుండి ఎడబాటు తప్పదు.  మరోవైపు యేసు క్రీస్తు వలన కలిగే నిత్య జీవం, దేవుని ఉచితమైన కానుక. నీకేది కావాలి? నీ గమ్యమమేది? నీ నిర్ణయం ఏమిటి? నిత్య జీవమును కోరుకొనే మనసు ప్రభువు నీకనుగ్రహించుగాక!

మా ఫోన్ నెంబర్; 9866 341 841. మళ్ళీ ఈ అధ్యయనాలు వినాలని ఆశిస్తే, www.sajeevanireekshana.org అనే websiteను దర్శించండి.  మీ బంధువులు స్నేహితులకు, తోటి విశ్వ్వాసులకు, ఈ రేడియొ కార్యక్రమాన్ని పరిచయం చేయండి

మన పరమతండ్రి సత్య దేవుని నిత్య ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు రంక్షించే కృప, పరిశుధ్ధాత్మ వలన ఆదరణ, సమాధానం, నెమ్మది, సహవాసం మన అందరికీ తోడుగా ఉండుగాక! అమెన్

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...