రోమా పత్రిక అధ్యయనం - 13 4:1-5 -- అబ్రహాము దేవుని నమ్మాడు

 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841

రోమా పత్రిక అధ్యయనం - 13   -- అబ్రహాము దేవుని నమ్మాడు 

     అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? జీవితం సాఫీగా ఎన్నడూ సాగిపోదు. ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా, కష్టనష్టాలున్నా, సుఖదుఖాలు ఉన్నా, దేవుని కృప మనకు చాలు. దేవుని మాటయందు విశ్వాసమే మన ఆయుధం. దిగులు పడకండి, చింతతో దినాలు గడవనీయకండి, మీ సమస్తమైన చింత, దిగులు ఆందోళన అంతటినీ దేవుని సన్నిధిలో కుమ్మరించుదాం. మీలో చాలామంది మీ ప్రార్ధనఅంశాలు పంపుతూ ఉన్నారు. ఉత్తరాలు, వాట్సప్ మెసేజెస్ పంపిస్తున్నారు. మీరు పంచుకున్న వాటన్నింటి కోసం ప్రార్ధిస్తూఉన్నాము. మీరు కూడా మా కోసంప్రార్ధించoడి.

          రోమా పత్రిక 4:1-5 వచనముల ద్వారా మనము అబ్రహామును, దేవునితో ఆయనకున్న సంబంధమును గమనించాలని ఆపో. పౌలుగారు హెచ్చరిస్తున్నారు. మీ బైబిల్, నోటబుక్, పెన్, తెచ్చుకున్నారా? విన్నవి రాసుకున్నపుడు ఎక్కువ కాలం గుర్తుంటాయి. రోమా 4:1-5 మీ బైబిల్లో గమనించండి:

          1. కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమిదొరికెనని అందుము.

            2. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.

            3. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను

            4. పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు.

            5. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.    

          అబ్రహాము అనుభవము ద్వారా మనజీవితం కోసం కొన్ని విలువైన పాఠాలు నేర్చుకోవాలని మనవిచేస్తూఉన్నాను. మొదటిది, క్రియలమీద ఆధారపడుటను మనము తిరస్కరించాలి. ఆపోస్థలుడు ఈ అధ్యాయమును “శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రహాముకేమి దొరికెనని అందుము?” అనే ప్రశ్నతో ఆరంభిస్తున్నాడు. అబ్రహాము మంచిజీవితం జీవించాడని మనకు తెలుసు. అబ్రహాము దేవుని పిలుపును విని ఆయనను వెంబడించాడు. అబ్రహామును దేవుడు చేయమన్నవాటిని చేశాడు. అబ్రహాము కొన్నిసార్లు దేవుని చిత్తమును విడిచిపెట్టి దారితప్పినప్పటికీ మొత్తంమీద దేవుని చిత్తము ప్రకారము జీవించాడని చెప్పవచ్చు.

          అబ్రహామునకు దేవుడు చూపిస్తానని చెప్పిన దేశములోనికి వెళ్ళిన తరువాత ఆదేశములో దేవునికి బలిపీఠములు కట్టాడు. ఆదికాండము మనకు ఈవిషయమును బోధిస్తుంది. అబ్రహాము బలిపీఠములు ఎందుకు

కట్టాడు? సత్యదేవుణ్ణి ఆరాధించడానికి. ఆయన నిజమైన దేవుని మెప్పుపొందాలని ఆశించాడు గనుక తనకు తెలిసినంతమతమటుకు, ఆయనకు దేవుడు చూపించినంతమట్టుకు అతడు జాగ్రతగా చేశాడు. 

          అబ్రహాము తన క్రియలనుబట్టి నీతిమంతుడిగా తీర్చబడినట్లయితే, అంటే పాపము నుండి విమోచింపబడ్డాడని నిర్ధారణఅయితే, ఆయన దాని గురించి గర్వించవచ్చేమోగాని, దేవుని ముందు మాత్రం గర్వించలేడుఅని  ఆపో. పౌలు మనకు చెబుతున్నాడు. ప్రియ సోదరీ, సోదరులారా, గమనించండి! ఆయన క్రియలు మంచివైనా, అవి దేవునియెదుట పనికిరావు. ఆయన తన క్రియలు ఎంత జాగ్రతగా చేసినప్పటికీ, వాటివలన దేవునిసముఖంలో పాపములేనివాడుగా నిలువలేడు. దేవుడు చేయమన్నది చేయడం ఆయనవిధి గనుక దానివలన దేవుని సముఖoలో ఏమాత్రం గర్వించలేడు. 

          కాబట్టి, నా స్నేహితుడా, సోదరీ, క్రియలనుబట్టి, పుణ్య కార్యములను బట్టి, దానధర్మములనుబట్టి, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగదు. వాటివలన ఎవ్వరూ పాపములేనివారని గాని, పాపమునుండి విమోచింప బడ్డారని చెప్పడం అసాధ్యం. దేవుని సముఖంలో మనము సరిగా ఉండాలంటే, ఈ పాఠము నేర్చుకొనితీరాలి. క్రియలను త్రోసివేయాలి. వాటి మీద ఆధారపడకూడదు. పరీక్షలో అవి నెగ్గవు.

          రెండవది, మనము విశ్వాసము యొక్క అవశ్యకతను గ్రహించాలి. లేఖనము 3వ వచనములో “అబ్రహాము దేవుని నమ్మెను. అది ఆయనకు నీతిగా ఎంచబడెను” అని సెలవిస్తుంది. ఆపో. పౌలు ఆది. 15:6 నుండి ఉన్నదున్నట్టు ఎత్తిరాశాడు. “అతడు యెహోవాను నమ్మెను: ఆయన (దేవుడు) అది అతనికి (అబ్రహామునకు) నీతిగా ఎంచెను.” అనగా అవసరమైనది విశ్వాసము అని మనము గ్రహించాలి.       

     ఇప్పుడు ఆదికాండము 15లో వివరించబడిన పరిస్థితిని పరిశీలిద్దాం. అబ్రహామునకు సంతానం లేదు, ఆయన భార్య శారాగర్భము పండనేలేదు. కానీ దేవుడు ఏ దేశములోనికి అబ్రహామును తీసుకుని వచ్చాడో, ఆ దేశమును ఆయనకు ఆయన సంతానమునకు ఇస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. అప్పటికే అబ్రహాము ఆ దేశములో చాలా సంవత్సరాలు ఉన్నాడు, అయినా ఆయనకు సంతానం లేదు. అబ్రహాము దేవునికి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టాడు. దేవుడు అబ్ర్హాహామును బయటికి తీసుకువచ్చి ఆకాశనక్షత్రములను చూడమనిచెప్పి, తనకు వశమైతే వాటిని లెక్కపెట్టమని చెప్పాడు. అబ్రహాము సువిశాలమైన ఆకాశమండలమును తేరిచూస్తుండగా, “నీ సంతానము ఆలాగవునని” చెప్పాడు. ఆ తరువాత వ్రాయబడిన మాట : ”అబ్రహాము దేవుని నమ్మెను: ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.”

     కంటికి కనిపించే ఏ ఆధారము లేనప్పటికీ, దేవుడుతన మాటను చెప్పినందుచేత, అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన ప్రతి స్పందన దేవుని వద్దకు క్రొత్త మార్గము ఏర్పాటు చేసింది. అదే విశ్వాసమనే బాటఅది విశ్వాసమనే అవశ్యకతను చూపించింది, క్రియలను కొట్టి పారేసింది, ప్రక్కకు నెట్టేసింది.

మనము దేవునితో సరియైన సంబంధం గలిగి ఉండాలంటే, తెగిపోయిన సంభంధం మళ్ళీ బాగు కావాలంటే,

మనకు దేవునియందు విశ్వాసము ఉండడం తప్పనిసరి ఆవశ్యకత.

          మూడవది, మనము కృప అనే బహుమానము గురించి నేర్చుకోవాలి.  ఆపో. పౌలు  ఇంకా ఏమి ఉపదేశం ఇస్తున్నాడో తెలుసుకోవాలంటే, 4వ వచనం గమనించాలి. “పనిచేయు వానికి జీతము రుణమే గాని, దానముగా ఎంచబడదు.” ఒకవేళ క్రియలవలన పాపపరిహారం, నీతి మంతులుగా తీర్చబడడం సాధ్యమైతే, రుణం తీర్చుకోవడమే అవుతుంది. కానీ కృప క్రియలను కొట్టి పారేస్తుంది, వాటిని నిర్వీర్యం చేస్తుంది. నిజానికి ఆపో. పౌలు  బోధించేది ఏమిటంటే క్రియలు మనకు రుణము లేదా అప్పుగా మారుతాయి. మన క్రియలు మనకు పాప పరిహారము చేసినట్లయితే, దేవునికి మనలను నీతిమంతులుగా లేదా పాపములేని వారుగా చేయడం తప్పనిసరి అవుతుంది, బాధ్యత అవుతుంది.

          కానీ కృప అలాంటిదికాదు. 5వ వచనం “పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి, వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.” అని ప్రకటిస్తుంది.  కాబట్టి, మన నిర్ధారణ ఏమిటంటే కృప విశ్వాసమును లెక్కలోకి తీసుకుంటుంది, ఒప్పుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే, కృప విశ్వాసమును పరిగణనలోకి తీసుకుంటుంది. కృప పాపపరిహారపు పధ్ధతిను నిర్వచిస్తుంది. కృప అనగా దేవుని ఉచితమైన కానుక, ఆయన మనకు అనుగ్రహించే వరమే! దేవుడు తప్పనిసరిగా కృప చూపించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయనను ఎవ్వరు కృప చూపించమని బలవంత పెట్టలేరు. ఆయన తన ప్రేమను బట్టి కృప చూపిస్తున్నాడు, ఆయన దయ, జాలినిబట్టి, అలా చేస్తున్నాడు. మనకు ఆయనతో సంబంధం నేరుగా, వ్యక్తిగతంగా కలగాలని, పాపమును బట్టి తెగిపోయిన సంబంధం తిరిగి బాగుకావాలని, ఆయన చూపించే కృప ఇది!

     ఈ కృప అనే వరము లేదా కానుకను, విశ్వాసము ద్వారా పొందడం సాధ్యం. కృప ఉన్నది, అది దేవుని వద్ద ఉన్నది. దాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిధ్ధంగా ఉన్నాడు. ఆ పాప పరిహారమును నీవు నేను అనుభవించ డానికి, విశ్వాసముతో ముందడుగు వేయాలి, అభ్యసించాలి.  మనలను పాపము లేని వారుగా చేయటానికి దేవుడనుగ్రహించే వరమే ఆయన కృప!

          కాబట్టి, అబ్రహాము మనకు నేర్పించే ఈ పాఠములను క్షుణ్ణంగా నేర్చుకుందాం. మొదటి పాఠం క్రియలు ప్రక్కకు పెట్టాలి: మన దాన ధర్మముల మీద గాని, పుణ్య కార్యాలమీద ఆధారపడి దేవుని సముఖంలో నిలువలేము. రెండవ పాఠము విశ్వాసము అనే ఆవశ్యకత. దేవునితో తెగిపోయిన మనసంభంధమును బాగు చేసుకొని, విశ్వాసముద్వారా పాపములేనివారముగా తీర్చబడతాము. మూడవ పాఠము కృప అనే వరము లేదా కానుక. అబ్రహాములాగా మనము కూడా ఆయనను విశ్వసించినట్లయితే ఆయన మనలను కూడా పాపము లేని వారుగా తీరుస్తాడు. అబ్రహాము దేవుని వెదికినట్టు మనముకూడా దేవుని వెదకుదాం, విశ్వసిద్దాం!

          ప్రార్ధన: నీతిమంతుడవైన దేవా, మీ కృప ఎంత ఉన్నతమైనది, అమూల్యమైనది! పాపము చేసి, మీతోఉన్న సంబంధము పోగొట్టుకున్నప్పటికీ, మీ కరుణతో, వాత్సల్యతతో యేసు క్రీస్తు రక్తము ద్వారా మీతో మాసంభంధము బాగుచేసుకోవడానికి ఏర్పాటుచేసిన మార్గమును బట్టి వందనములు. మా నీతిక్రియలు మురికి గుడ్డపేలికల వంటివే. వాటిని విడిచిపెట్టి, మీరనుగ్రహించే వరమును విశ్వాసముతో స్వీకరించడానికి కృపనిమ్మని, క్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రీ! అమెన్!! 

            

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...