రోమా పత్రిక అధ్యయనం – 17 5:1 - 5 నిరీక్షణలో ప్రకాశించడమెలాగు?

 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by Whats App to 98663 41841

 

రోమా పత్రిక అధ్యయనం – 17 

నిరీక్షణలో ప్రకాశించడమెలాగు?

     హల్లెలూయ! ఆనందంగా ఉన్నారా? పరిస్థితులను, ప్రజలను చూస్తే ఆనందం కలుగదు. దేవుని కృప, ఆయన ఆయన ప్రేమను అనుమానములేకుండా విశ్వసించినట్లయితే, ఎట్టి పరిస్థితులలోనైనా ఆనందంగా ఉండగలము. పౌలు జైల్లో ఉండి ఆనందించాడు, ఆనందించమని హెచ్చరించాడు. నీవు జైల్లో ఉండి చదువుతూ ఉండచ్చు. ప్రభువులో ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందం ఉంటుంది. మీ మెసేజెస్, వాట్సప్ మెసేజెస్, ఫోన్ కాల్స్ పంపుతున్నవారికి వందనాలు. మీ బైబిల్, నోట్ బుక్ పెన్, తెచ్చుకొని ప్రశాంతంగా రోమా పత్రిక అధ్యయనం చేసుకుందాం. 

     మన అంతరంగంలోనికి మనము చూసుకుంటూ, జరిగినవాటిని గూర్చి తలపోసుకుంటూఉంటే క్రుంగిపోవచ్చు. మన చుట్టూ చూసి, దేశములలో, సమాజములలో, కుటుంబాలలో జరుగుతున్నవాటినికి గమనిస్తే, మనసులో ఒత్తిడి, నిరాశ కలుగుతుంది.

     కానీ మనము దేవుని వైపు చూస్తే మనకు ఆశ, నిరీక్షణ కలుగుతుంది. ప్రియ స్నేహితుడా, సోదరీ, ఉన్నదంతా ఈ లోకమే కాదని నీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే మనము దేవుని వైపు చూచి నిరీక్షణ పొందుదాం. యేసులో నమ్మిక ఉంచినవారు దేవునివైపు చూసినపుడు ఉజ్వలమైన నిరీక్షణ పొందుతారు. ఆయన మనకు దుష్టుని కీడు నుండి విమోచన, వానిపై విజయమును వాగ్దానము చేశాడు. యేసు క్రీస్తు ప్రభువు తన వద్ద మనకు నివాసమును వాగ్దానము చేశాడు. అందుకే మనకు ఉత్సాహపు నిరీక్షణ ఉంది. కాబట్టి మనము నిరీక్షణతో ప్రకాశించవచ్చు.

ఈ నాటి మన అంశం నిరీక్షణతో ప్రకాశించడం ఎలాగు?

     ఈనాటి లేఖన భాగం రోమా. 5:1 - 5 ద్వారా ఆపో. పౌలు క్రైస్తవ అనుభమును వివరిస్తున్నాడు. దాని ఫలితమే నిరీక్షణలో ప్రకాశించడమంటే! 

1.     కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము

       2  మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో  నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.

       3 అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి

       4 శ్రమలయందును అతిశయపడుదము.

   5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని   ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.    

        క్రైస్తవ జీవితములోని వేరువేరు స్థాయిలను బోధిస్తూ నిరీక్షణలో ప్రకాశించుటకు ఆపో.పౌలు మనలను నడిపిస్తున్నాడు.

     దేవుని కృపలో ప్రవేశించడం క్రైస్తవ జీవనంలోని మొదటి స్థాయి. మొదటి వచనం ప్రకారం ఇది సమాధానమునకు, నెమ్మదికి మూలాధారము. “మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము”  ఇది అద్భుతం కదూ! నీతిమంతులముగా తీర్చబడడం మూలాన సమాధానం పొందగలము. మరో ముఖ్యమైనమాట, దానికిది ఒక్కటే మార్గము. సమాధానము, నెమ్మది పొందటానికి ఒకే ఒక్క మార్గము విశ్వాసము. గమనించండి, మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానము కలుగుతుంది అని మనకు చెప్పబడుతూఉంది. యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వసించడం ద్వారా పాపక్షమాపణ పొందడం, శాంతి నెమ్మది పొందటానికి మూలాధారం.

     దేవుని కృపలో  ప్రవేశించడానికి ఒకేఒక్క మార్గం. అది యేసు క్రీస్తు ద్వారా.  ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి...” అని చదువుకున్నాము కదా!  యేసు ప్రభువునందు విశ్వసించడం ద్వారా నీవు దేవుని కృపలో ప్రవేశిస్తావు. ఒక గేట్లో గుండా ఇంటిలోనికి వెళ్ళినట్టు, విశ్వాసము ద్వారా దేవుని కృపలో ప్రవేశిస్తాము.  దేవుని కృపలో ప్రవేశించడమే కాదు, అందులో నిలిచి ఉంటాము. ఈ కృపలో  జీవించడానికి స్థానము, అవకాశము ఉన్నాయి. యేసులో ఆనందము కూడా ఉన్నది.  దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము”  "అతిశయ పడుచున్నాము"  అనగా ఆనందిస్తున్నామని అర్ధం. గమనించండి, యేసు నందు విశ్వాసముంచుతాము, ఆయనలో జీవిస్తూ ఉంటాం, ఆయనలోనే ఆనoదిస్తూఉంటాము. క్రైస్తవ జీవనంలోని మొదటి స్థాయి ఇదే! అది ఆయన కృపలో ప్రవేశించడం.    

     క్రైస్తవ జీవనంలోని రెండవ స్థాయి శ్రమలు సహించడం. 3-4 వచనాలలో ఈ తలంపు తేటతెల్లమవుతుంది. “అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము.”  విశ్వాసపు జీవితములో శ్రమలు కూడా ఉన్నాయి. విశ్వసిoచిన ప్రతి ఒక్కరూ త్వరలోనే కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కుంటారు. వాటిలో కూడా ఆనందిస్తామని పౌలు అంటున్నారు.

          ఈ సందర్భములో పౌలు గారు వాడిన గ్రీక్ మాట ఏమిటో తెలుసుకుందామా? ఆయన వాడిన మాట “థ్లిప్సిస్.”  దాని అర్ధం కొరడా ఝలిపించడం. మన రక్షకుడు కొరడా దెబ్బలు సహించడం మర్చిపోకండి! యోహాను సువార్త 16:33లో ప్రభువు తన శిష్యులతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాంలోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.”  విశ్వాసపు జీవితములో శ్రమలు, హింసలు ఉంటాయి.

     శ్రమలను ప్రభువు తన క్రియ చేయటానికి ఉపయోగించుకుంటాడు గనుక క్రైస్తవ విశ్వాసి శ్రమలలో ఆనందించవచ్చు. శ్రమ ఓర్పును కలిగుస్తుందని నేర్చుకున్నాము కదూ! ఓర్పు అనగా సహించుట. హృదయములో నిశ్చలముగా ఉండి, పట్టుకున్నదాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. ప్రియా సోదరుడా, సోదరీ! శ్రమలు సహిస్తున్నావా? ధైర్యముగా ఉండు! విశ్వాసమును విడిచిపెట్టవద్దు! ఓర్పు పరీక్షను కలిగుస్తుందని తెలుసుకుంటున్నాం. పరీక్ష అనే మాటకు మూలభాషలో అర్ధం శీలం లేదా గుణం. శ్రమలు సహిస్తే కలిగే శ్రేష్టమైన మేలు స్వభావము మార్చబడుతుంది. శ్రమలు అనే మాటకు అంతరార్ధం మామూలుగా జీవితంలో ఎదుర్కొనే బాధలు కాదు, అతి బలమైన శ్రమ. ద్రాక్షలను త్రోక్కి రసము తీసినట్టు ఒత్తిడి సహించడం. మన భాషలో చెప్పాలంటే, మిక్సీలోవేసి పిండిచేయడం వంటి శ్రమలు. గానుగలో వేసి నూనె తీయడంలాంటి కఠినమైన బాధలు, క్లిష్టమైన వేదనలు. వీటన్నిటి ద్వారా కలిగే శ్రేష్టమైన ఫలితం నిరీక్షణ.

     సోదరీ సోదరులారా, యేసు క్రీస్తునందు విశ్వసించడం ద్వారానే ఇది సాధ్యమని మీకు మళ్ళీ చెప్పాలని ఆశిస్తున్నాను. “ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో  నిలిచియుండి…….”  ఈ మాటలు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. జీవితపు శ్రమలు, హింసలు, కష్టాలు, ఇబ్బందులు దేవుని కృపను పొందడానికి మచి అవకాశాలు. క్రైస్తవ జీవనంలోని ఈ రెండవ స్థాయి జీవితపు శ్రమలు ఎదుర్కొని జయించడం. మేలు కలుగడానికి ఇది దారి చూపుతుంది. ఎదగడానికి ఇది దోహదపడుతుంది. నిరీక్షణలో ప్రకాశించడానికి చక్కని అవకాశం. “థ్లిప్సిస్” ద్వారా నిరీక్షణలో ప్రకాశించుదామా మరి!    

     క్రైస్తవ జీవిత అనుభవములోని మూడవ స్థాయి, కిరీటంలాంటిది. అది పరిశుద్ధాత్మ అనే వరముతో ఆనందించడం. ఇది అద్భుతమైనది, నిరీక్షణ అనే శ్రేష్టమైన కానుక. గమనించారా? సోదరీ సోదరులారా, ఈ శ్రమలన్నిటికి నిరీక్షణ ముగింపుగా ఉంటుంది అని చెప్పడమే కాకుండా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని పౌలు నిర్ధారిస్తున్నాడు. చాలామంది దేవునిని ఎరుగనివారు  ఈ శ్రమలు, హింసలు, పోరాటాలు, వేదనలు దుఖ:ములు సహించటం

నిష్ప్రయోజనమని భావిస్తారు. కానీ ఈ అనుభవాలు నిరీక్షణ అనే వరమును మనకు అందిస్తాయని మనకు తెలుసు.

విశ్వాసులు వీటిలో ఆనందాన్ని కనుక్కుంటారు.

     మనకున్న నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈలాటి నిరీక్షణ ఉన్నందుచేత మనము సిగ్గుపడనవసంర లేదు, ముఖము దాచుకోనవసరం లేదు. మన నిరీక్షణ దేవుని శ్రేష్టమైన వాక్యము, వాగ్దానములమీద ఆధారపడిఉంది. వీటన్నిటికి పైగా మన నిరీక్షణ దేవుని ప్రేమమీద ఆధారపడిఉంది. “మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.”

     నా స్నేహితులారా, దేవుడు తన ప్రేమతో మనలను సమీపించి, మనవరకు దిగిరావడం ఎంతో అద్భుతమైన సంగతి. క్రైస్తవ జీవితంలోని ఈ మూడవ స్థాయిలో ఉన్నవారిని, నీవు, నేను అనే తారమమ్యం లేకుండా ప్రభువు  గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడిoది. కుమ్మరించుట అనే మాటకు ఒక నీటిఊటలో నుండి నీరు ఉబికివచ్చినట్టు అని అర్ధం. ధారావాహికంగా ప్రవహించినట్టే నదిలాంటిది. మనకు అనుగ్రహించబడిన పరిశుధ్ద్ధాత్ముని వల్ల ఇది కలుగుతుంది. మన జీవితాల్లో పరిశుద్ధాత్ముని శక్తికి దేవుని ప్రేమకు విడదీయరానిసంబంధం ఉన్నది. దేవుడు మనకు తన ఆత్మను వాగ్దానము చేశాడు, యెసయ్య మనకు ఆత్మను వాగ్దానము చేశాడు. మనము పరిశుద్ధాత్మ వరమును పొంది ఆ ఆనందముతో నిండిఉండడం సాధ్యమా? సాధ్యమే!

     మూడవ స్థాయిలో మనము ఉప్పొంగే దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూఉంటాము. దేవుని నిరీక్షణలో ఆనందముతో సంతోషించండి, నిరీక్షణలో ప్రకాశించండి! క్రైస్తవ జీవితంలోని ఈ స్థాయిలను లోతుగా ధ్యానించండి: దేవుని కృపలో ప్రవేశించండి, జీవితపు శ్రమలను సహించండి, పరిశుద్ధాత్మ అనే వరములో ఆనందించండి. ఈ జీవితంలో నిరీక్షణలో ప్రకాశించండం మనలను నిత్యత్వానికి సిద్ధపరుస్తుంది. మీ శ్రమల్లో దేవుని వాక్యమేలాగు ధైర్యపరుస్తుందో మాతో పంచుకోండి.

     మన పరమతండ్రి దేవుని నిత్య ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు శాశ్వతమైన కృప, పరిశుధ్ద్ధాత్ముని ద్వారా దేవునితో సహవాసము, నిత్య ఆదరణ, ధైర్యము, కంచె కాపుదల మనకందరికీ తోడుగా ఉండుగాక! అమెన్!!



రోమా పత్రిక అధ్యయనం – 16 4:19 - 25 విశ్వాసము ఎలా పని చేస్తుంది?

 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841

 

రోమా పత్రిక అధ్యయనం – 16 (4:19-25)

విశ్వాసము ఎలా పని చేస్తుంది?

     Praise The Lord! మీ తలంపులు తడబడుతూ ఎటుతోచని స్థితిలో ఉన్నారా? హృదయ వేదన, బాధ, శాంతి నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో! “ఎవని మనస్సు నీమీద అనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగల వానిగా కాపాడుదువు” అని సర్వశక్తిగల సత్యదేవుడు పరిశుద్ధ గ్రంధం బైబిల్లో సెలవిచ్చాడు. కొంచెం కాదు, పూర్ణ శాంతి. మెసేజెస్, వాట్సప్, ఫోన్ ద్వారా, మీరు పంచుకుంటున్న ప్రార్ధన అంశాలను ప్రభువు కృపాసనంవద్ద జ్ఞాపకం చేస్తున్నాం. మీరు కూడా ప్రార్ధనలో పట్టుదలగా ఉండండి.   

     ప్రతి దినం, ప్రతి క్షణo, మనము ఏదో ఒక నిర్ణయం చేయవలసి ఉంటుంది, అవునా? మన భవిష్యత్తు మనము చేసే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుoది. మనము ఈదినము చేసే నిర్ణయాలను బట్టి రేపటి ఫలితాలు ఉంటాయి. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు గనుక మనము అనుమానపడుతూ ఉంటాము. కానీ సరియైన నిర్ణయం తీసుకుంటే మనము దాని ఫలితాలగురించి సoతోషిస్తాము. సాధారణ జీవితంలో ఉన్నట్లే, అధ్యాత్మికజీవితం, నడవడిలో కూడా అంతే. మంచి నిర్ణయాలు తీసుకున్నపుడు మనకు నెమ్మది కలుగుతుంది.

     మన తండ్రి అబ్రహాము చాలా సంవత్సరాలక్రితం తన జీవితములో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆపో. పౌలు ఈ నిర్ణయాలగురించి వ్రాశాడు. రోమా. 4:19-25 చదివి, అధ్యయనం చేసి విశ్వాసము ఎలా పని చేస్తుందో మనము గ్రహించటానికి తగిన సహాయము పొందుదాo, రండి. బైబిల్, నోట్బుక్, పెన్ తెచ్చుకున్నారా? రోమా 4:19-25.

19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడుకాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి,  అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20 అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21 దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

23 అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని

24 మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను.

25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

     ఈ లేఖన భాగములో విశ్వాసము పనిచేసి కొన్ని గూఢమైన మార్గాలు స్పష్టపరచబడ్డాయి. ఈ సుబోథ మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సాయపడుతుంది.  

     మొదటి మార్గం, శరీరపు బలహీనత ద్వారా విశ్వాసము పని చేస్తుంది: మనమంతా మరణించేవారమే. వయసు మీదపడుతూఉండగా శరీరము ఉడిగిపోతుంది, మరణం సమీపమౌతుంది. ఈ శరీరంలో మనము ఎల్లకాలం జీవించలేము. తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు చివరి ఘడియ రానేవస్తుంది.

     ఇక్కడ మనకు అబ్రహాము ఆయన భార్య శారా కనిపిస్తున్నారు. వారు శరీరంలో బలహీనులైనాగాని, విశ్వాసములో బలహీనులు కాలేదు. అబ్రహాము శారాలు శరీరమును బట్టిచూస్తే, పిల్లలుకనే వయసులో లేరు. మన లేఖన భాగములో అబ్రహాము వయసు నూరేళ్ళు అని చెప్పబడింది. శారమ్మ 90ఏళ్ల వయసులో ఉంది, ఎప్పుడూ పిల్లలు కనని గొడ్రాలు. వారి శరీరాలు బలహీనముగా ఉన్నందుచేత వారి విశ్వాసము బలముగా ఉండవలసిన అగత్యత ఉన్నది. ఆ శరీరపు బలహీనత అబ్రహామును జయించలేకపోయింది. బైబిల్ గ్రంధం 19వ వచనంలో  అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక... తన శరీరము మృతతుల్యమైనట్టును …. ఆలోచించెను”  అని సెలవిస్తుంది. ఆయన శరీరము బలహీనమైనప్పటికీ, ఆయన విశ్వాసము బలహీనము కాలేదు. విశ్వాసము పనిచేసే మార్గమిది.  

     గమనించండి, మన బలహీనతలు నిజమైనవే, అయినగాని, అవి మనలను బలహీనపరచగూడదు. అబ్రహాము బలహీనత ఆయన విశ్వాసమును బలహీనపరచలేదు. ఆయన విశ్వాసము బలమైనది. ఆయన దేవుని వాగ్దానము విషయములో తొణకలేదు. ఆయన శరీరము బలహీనమైనా, తన విశ్వాసము మట్టుకు బలమైనది.

     హృదయపుసమ్మతి విశ్వాసము పనిచేసే రెండవ మార్గము.  అబ్రహాము విశ్వాసమును ఎలా స్వంతం చేసున్నది గమనించండి. ఆయన దేవుని వాగ్దానమును నమ్మడంలో తటపటాయించలేదు, కానీ ధృఢoగా నమ్మాడు. వారి శరీరపు శక్తిని బట్టి చూస్తే, ఏమాత్రం దేవుని వాగ్దానానికి విరుద్ధమైనా, అబ్రహాము ఊగిసలాడలేదు, తొణకలేదు. అబ్రహాము అనుమానించలేదు, గాని దేవుని వాగ్దానమును స్వంతం చేసుకొన్నాడు. తాను వాగ్దానము చేసినదానిని దేవుడు చేస్తాడని విశ్వసించాడు. ఇదే అబ్రహాము హృదయపు సమ్మతి అంటే అర్ధం.

     21వ వచనంలో వ్రాయబడ్డట్టు, “రూఢిగా” విశ్వసించాడు. ఆ మాటను గమనించండి. అనగా అనుమానమునకు ఏమాత్రం అవకాశము లేదు. తన మనసులో ఇసుమంత అనుమానమునకు తావియ్యలేదు. దేవుడు వాగ్దానము చేసిన దాన్ని ఆయన చేయగల “సమర్ధుడని” సంపూర్ణంగా నమ్మాడు. ఈ మాటనుకూడా మీ బైబిల్లో గమనించండి. సమర్ధుడే కాదు గాని చేస్తాడని రూఢిగా నమ్మాడు. అబ్రహాము మనసులో ఏ విధమైన అనుమానము, ఆందోళన లేదు. ఆ సిద్ధమనసులో విశ్వాసము పని చేసింది.

     ఆయన విశ్వాసము నీతిగా ఎంచబడిందని 22వ వచనంలో పౌలు స్పష్టంగా చెబుతున్నాడు. “అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను”  అబ్రహామునకున్న విశ్వాసము ఆయనకు లేని నీతికోసం ఎంచబడింది. దేవుడు పనిచేసి పధ్ధతి, విధానము ఇది. హృదయపు సమ్మతి, సంసిధ్ద్ధత ద్వారా పనిచేస్తుంది. అబ్రహామునకున్న అవసరత అది, అదే ఆయన కోరుకున్నది కూడా! ఆయన సిద్ధమైన హృదయంను బట్టి అది సాధ్యమయ్యింది. దేవుడు అబ్రహాము విశ్వాసమును ఆయనకు నీతిగా ఎంచాడు.

     గమనించండి, అబ్రహాము హృదయపు సంసిధ్ద్ధత దేవునియందు ధృడంగా ఉన్నట్టు, మన హృదయపు సంసిద్ధత దేవునియందు ధృడంగా ఉండాలి. దేవుడు వాగ్దానము చేసినది ఆయన తప్పనిసరిగా నెరవెర్చే విషయంలో అబ్రహాము మనసులో ఇసుమంత కూడా అనుమానము, సందేహము లేదు.

    మూడవది, అద్భుతమైన  ప్రణాళిక ద్వారా విశ్వాసము పనిచేస్తుంది. దేవుని ప్రణాళికలో అబ్రహాము విశ్వాసము పనిచేసిన క్రమమును ఆపో. పౌలు వివరించిన పద్ధతి చాలా ఆశాజనకంగా ఉంది. దేవుడు అబ్రహామును గూర్చి వ్రాసింది ఆయనకోసమే కాదు, మనకోసం కూడా అని పౌలు బోధ. ఇది ఎందుకు రాయబడిందంటే, మనము ఈనాడు దేవుని ప్రణాళికను క్షుణ్ణంగా పరీక్షించి, నేర్చుకోవాలనే!

     ఎందుకంటే, విశ్వాసము ఎలా పనిచేస్తుందో మనము తెలుసుకోవడానికి అబ్రహాము విశ్వాసమును నిరూపించాడు. అది అద్భుతమైన ప్రణాళిక. దాని ఫలితము 24వ వచనములో స్పష్టంగా ఉన్నది. “  మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను”  సోదరీ సోదరులారా? విన్నారా? మనము విశ్వసిస్తే, అబ్రహామునకు చేసినట్టే మనకు కూడా దేవుడు చేయగలడు. మనము యేసు క్రీస్తును మృతులలోనుండి లేపిన దేవుని విశ్వసించినట్లయితే, మన విశ్వాసము మనకు నీతిగా ఎంచబడుతుంది. దేవుని అద్భుతమైన ప్రణాళికలో యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానము ప్రాముఖ్యమైన పునాది.

     25వ వచనములో పౌలు రక్షించబడే పద్ధతిని వివరిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు “ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప”బడ్డాడు. అనగా మన పాపములకోసం. “మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను”  ఇది దేవుని అద్భుతమైన ప్రణాళిక. ఇది ఆశ్చర్యమును కలిగిస్తున్నది. ఇది ఎలా సాధ్యపడిందో అని మనము అనుకుంటాముగాని, అయినా, దేవుడు అది చేశాడు.

     ఈ గూఢమైన సత్యాలు మన విశ్వాసమును మేల్కొలపాలి. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, విశ్వాసము శరీరపు బలహీనతల ద్వారా పనిచేస్తుంది. ఇది సత్యం. రెండవది, హృదయపు సంసిధ్ద్ధత ద్వారా విశ్వాసము పనిచేస్తుంది, దీనికి నిర్ణయం అవసరం. మూడవది, దేవుని అద్భుతమైన ప్రణాళిక ద్వారా విశ్వాసము పనిచేస్తుంది. ఇది ప్రభువుతో మన జీవితమును బలపరుస్తుంది. ఈ విశ్వాసపు ప్రక్రియ మహత్తరమైన సత్యం. ప్రియ స్నేహితుడా, సోదరీ, దీని ఔన్నత్యము నీవు గ్రహించాలని ఆశిస్తూన్నాను. 

      మన పరమ తండ్రియైన దేవుని నిత్య ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు శాశ్వతమైన కృప, పరిశుధ్ద్ధాత్ముని నిత్య ఆదరణ, నెమ్మది, సహవాసము, కంచె, కాపుదల మనకందరికీ సదకాలము తోడుగా ఉండుగాక!

రోమా పత్రిక అధ్యయనం -15 అబ్రహాము విశ్వాసము నిజమైనది

 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841

రోమా పత్రిక అధ్యయనం -15 

అబ్రహాము విశ్వాసము నిజమైనది

    మీరంతా బాగున్నారా? ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుందా? మీకే కాదు, దావీదు మహారాజు అని మనము సంబోధించే మన పితరుడు కూడా  అనుకున్నాడు. ఎక్కడికీ వెళ్ళవద్దు, పాట వింటూ, బైబిల్, నోట్ బుక్, పెన్ తీసుకొని దేవుని వాక్యం ధానించుదాం, రండి.  ఫోన్ కాల్స్, వాట్సప్ మెస్సేజెస్, ఉత్తరాలు, పంపిస్తున్న వారందరికోసం ప్రత్యేకంగా ప్రార్ధిస్తున్నాము. రోమా పత్రిక అధ్యయనాలద్వారా మీరు మేలు, ప్రోత్సాహం, ధైర్యం పొందినట్లయితే, మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. మీరు ఏ విషయంలో మేలు పొందారో అది మాకు దయచేసి తెలియచేయండి.    

      వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చేవారిని మనము మెచ్చుకుంటాము కదూ! ఒక వాగ్దానము చేసి వాటిని నెరవేర్చేవారిని మనం అభినందిస్తాము. బైబిల్లో ప్రత్యక్షమయ్యే దేవుడు తాను చేసిన వాగ్దానములను తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చని వాగ్దానమును చేయడు. దేవుడు తన వాగ్దానమును నెరవేర్చే విషయంలో అబ్రహాము అద్భుతమైన ఉదాహరణ. రోమా 4:13-18లో దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానము ఎంత నిజమైనదో మీకు చూపించాలని ఆశిస్తున్నాను. లేఖన భాగమును నాతోబాటు మీరు కూడా చందవండి:

           13 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని      సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.౹ 14ధర్మశాస్త్రసంబంధులు వారసులైనయెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును.౹ 15ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేక పోవును.౹ 16ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.౹ 17తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు– ఇందునుగూర్చి18నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. ౹  –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹

     అపోస్తలుడు విశ్వాసము యొక్క శ్రేష్ట గుణములను నిర్వచిస్తూ ఉన్నపుడు అబ్రహాము విశ్వాసము ఎంత నిజమైనదో తేటగా కనిపిస్తున్నది. ఈ శ్రేష్ఠ గుణములను మీకు నేను వివరిస్తూ ఉండగా నాతో బాటు ఆనందించండి.         

       వాగ్దానము నిర్దిష్టమైనది.  “ అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని  సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.”  13వ వచనం. నిజముగా ఇది చాలా మహత్తరమైన వాగ్దానము. మనుష్య కుమారుడు తప్ప వేరెవ్వరికీ ఇట్టి వాగ్దానము ఇవ్వబడలేదు. కీర్తన 2:8లో “నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.” అని ప్రకటించబడినది. ఈ మాటలు మనుష్య కుమారునితో చెప్పబడ్డాయి. ఇక్కడ రోమా. 4:13లో బైబిల్ గ్రంధం అబ్రహామును లోకమునకు వారసునిగా చేస్తున్నట్టు సెలవిస్తున్నది. అంచేత దీన్ని మహత్తరమైన వాగ్దానము అని నేనంటున్నాను.

     అపోస్తలుడు అబ్రహాము సంతానము గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ మాటలు ప్రత్యేకమైన రీతిలో సంతానమైన యేసు క్రీస్తునకు వర్తించే మాటలు. ఎందుకంటే భూమి మీది సమస్తవంశములు నీ యందు ఆశీర్వదించబడును అని ప్రభువు అబ్రహామునకు వాగ్దానము చేశాడు. ఆది. 12:3. ఇది నిర్దిష్టమైన వాగ్దానము.

     వాగ్దానము చేయబడిన సంతానము సినాయి పర్వతము మీద ఇవ్వబడ్డ ధర్మశాస్త్రము మూలాన కాదు. కానే కాదు, ఎందుకంటే అబ్రహామునకు ఇవ్వబడిన ఈ వాగ్దానము సీనాయి పర్వతము మీద దేవుడు మోషేకు ధర్మశాస్త్రము ఇవ్వడానికి  430 సం|| ముందే ఇవ్వబడినది. ఇది సుస్పష్టంగా ఉంది.

     ఇక్కడ రోమా. 4:13లో ఆపో. అబ్రహామునకివ్వబడిన వాగ్దానపు శ్రేష్టగుణమును చూపిస్తూ ఉన్నాడు. అది నిర్దిష్టమైనది. అది విశ్వాసపు మార్గము. అబ్రహామునకు సంతానము లేదు గాని ఆయన సంతానము గురించి వాగ్దానము చేయబడింది. అబ్రహామునకు నమ్మడం తప్ప వేరే మార్గము లేదు. అది విశ్వాసము వలన కలిగిన నీతి. ఈ వచనములో “విశాసమువలననైన నీతి మూలముగానే” అనే మాటలను గమనించారా?

     దైవికమైన గుణం ఈ నిర్దిష్టమైన వాగ్దానములో వ్యక్తమవుతుంది. అబ్రహాము లోకమునకు వారసుడు అయ్యాడు అంటే అర్ధం ఇదే.

     వాగ్దానము భావగర్భితమైనది. 14వ వచనం బోధించే ధర్మశాస్త్రము కంటే విశ్వాసము గొప్పది అనే విషయాన్ని దీర్ఘంగా ఆలోచిద్దాo. ధర్మశాస్త్రం మానవుడు చేయలేని వాటిని ఆజ్ఞాపించింది, ఆజ్ఞాపిస్తుంది. ధర్మశాస్త్రము చేయలేని వాటిని విశ్వాసము చేస్తుంది. ఈ అంశం ప్రాముఖ్యమైంది గనుక మళ్ళీ తెలుసుకుందాం.  ధర్మశాస్త్రము చేయలేనివాటిని విశ్వాసము చేస్తుంది. ఎందుకనగా ధర్మశాస్త్రము తీర్పుతీర్చడం తప్ప మరొకటి చేయలేదు. ధర్మశాస్త్రం మనకు ఉగ్రతను తీసుకొచ్చింది. 15వ వచనం ప్రకారం “ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును” అనగా ధర్మశాస్త్రము ఖండిస్తుంది. అపరాధిమీద ధర్మశాస్త్రము దేవుని న్యాయతీర్పును ప్రకటిస్తుంది. ధర్మశాస్త్రము మరణ శాసనమును శాశిస్తుంది, అందుకే  పాపము చేయువాడే మరణము నొందును” అని ధర్మశాస్త్రం ఘోషిస్తుంది. యెహే.18:20.

 కానీ విశ్వాసము కనికరమును కోరుకుంటుంది; కనికరమును, క్షమాపణను ఆర్ధిస్తుంది. “ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేకపోవును,” అంటూ పౌలు దీన్ని 15వ వచనంలో చక్కగా బోధించారు. ఇది సులభంగా కనిపించినా, సత్యమైన సంగతి. ధర్మశాస్త్రము ఇవ్వబడినందుచేత దేవుని పరిశుద్ధ ప్రమాణాలు ఎలా మనమందరము కాల రాశామో, దాన్నిబట్టి ఎంత ఘోర అపరాధం చేశామో మనకు అర్ధమయ్యింది.

     లోకమునకు వారసుడు కావడం అబ్రహామనకు ఇవ్వబడిన భావగర్భితమైన వాగ్దానము. అది దేవుని శ్రేష్టమైన గుణం. ఇతర వాగ్దానములన్నిటికంటే ఇది భిన్నమైనది, ఎందుకనగా అది విశ్వాసముపైన ఆధారపడినది.

     వాగ్దానము ఖచ్చితమైనది. దేవుని వాగ్దానములు ఖచ్చితమైనవి,  మార్పులేనటువంటివి. దేవుడు తాను చేసిన వాగ్దానములు తప్పక నెరవేర్చి తీరుతాడు. 16వ వచనంలో ఉన్నట్టు “కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను”  అనగా దేవుని ఈ వాగ్దానము ఆయన కృపద్వారా జన్మించింది. ఇది దేవుని ప్రేమ ప్రవాహము. ఇది విశ్వాసపు సంతానమంతటికీ అనుగ్రహించబడుతుంది. “ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాస మూలమైనదాయెను” ఓ! ఇది ఎంత అద్భుతం కదూ! వాగ్దానము ఖచ్చితమైనది. సంతానమంతటికీ అది నిశ్చయమైన వాగ్దానము. విశ్వాసము వలన అబ్రహాము సంతానమైతే మనకు కూడా ఈ వాగ్దానము ఉన్నది. ఇది గొప్ప సంగతి!!

     ఇది దేవుని గొప్ప శక్తివలన సాధ్యమయ్యింది. దేవుడు జీవదాత. చనిపోయినట్టు కనిపించే వాటికి జీవమిచ్చే వాడు ఆయనే. లేనివాటిని ఉన్నట్టు పిలవగలవాడు దేవుడే! ఇదే క్రమములో అబ్రహాము గురించి ఆలోచిస్తే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా ఆయన జనములకు తండ్రి అవుతానని దేవుని వాగ్దానమును నమ్మాడు. కానీ ఆ ఖచ్చితమైన వాగ్దానము దేవుని అపరిమితమైన శక్తియందు ముడివేయబడిఉంది. ఆయన ధర్మశాస్త్రపు కర్త, జీవితపు నిర్వాహకుడు, సంరక్షకుడు.

     దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 18వ వచనంలో నీ సంతానము ఈలాగు ఉంటుంది అని చెప్పాడు. దేవుడు చెప్పేది సత్యం. నీవు దాన్ని గట్టిగా నమ్మవచ్చు. నీవిశ్వాసము దానిపైన స్థిరముగా ఉంచవచ్చు. దేవుడు చెప్పినదానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడని ధైర్యంగా ఉండవచ్చు. వాగ్దానము ఖచ్చితమైనది, ఎందుకనగా అది దేవుని నమ్మకత్వముమీద ఆధారపడిఉంది. అది దేవుని కృపనుబట్టి నిలుకడగా ఉంటుంది.

     ఈ లేఖన భాగము ప్రకారము అబ్రహాము వాగ్దానము శ్రేష్టమైన దైవికగుణములనుబట్టి స్థిరమైనది. వాగ్దానము నిర్దిష్టమైనది. అందులో అనుమానం లేదు. వాగ్దానము భావగర్భితమైనది. అది ఒక్కటే వాగ్దానము ఎన్నో వాగ్దానముల కలయిక కాదు. వాగ్దానము ఖచ్చితమైనది, అందులో ఏ అనుమానము లేదు. దేవుడు అబ్రహామునకిచ్చిన వాగ్దానపు మేళ్ళు మనము ఈనాడు అనుభవిస్తున్నాము. నా స్నేహితుడా, సోదరీ, యేసుక్రీస్తులో ఈనాడు మనకు నిరీక్షణ ఆదరణ ఉన్నవి. దేవుని వాగ్దానములను నమ్మి వాటిని నీ జీవితములో అనుభవించే కృప సర్వకృపానిధిఅయిన దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక!   

ప్రార్ధన: నమ్మదగిన దేవా, పరలోకపు తండ్రీ, నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. నీ వాగ్దానము నిశ్చలమైనది. నీ అపరిమితమైన కృపనుబట్టి నీకెంతో స్తోత్రము. అబ్రహామునకిచ్చి నెరవేర్చిన మీ వాగ్దానములో మాకు కూడా భాగమిచ్చినందుకు వందనములు. మా విశ్వాసమును మీ వాగ్దానమందు స్థిరముగా ఉంచేలా కృప చూపండి. అబ్రహాము అడుగు జాడలలో నడచుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రీ, అమెన్!


II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...