Sajeeva Nireekshana సజీవ నిరీక్షణ
2వ కొరింధీ-14 – 1:23-2:11 మూడవ భాగము #173 దైవభక్తి గల నాయకుని హృదయము – మూడవ భాగము
2వ కొరింధీ-14 – 1:23-2:11 మూడవ భాగము #173
దైవభక్తి గల నాయకుని హృదయము – మూడవ భాగము
శ్రోతలూ, ఈ వారమంతా గడిచింది? ఈ మధ్యలోగాని, లేదా ఈ కార్యక్రమము జరుగుతుండగా గాని, లేదా మరెప్పుడైనా, అనుకోకుండా అకస్మాత్తుగా మీరైనా, నేనైనా ప్రాణం విడిస్తే ఏమవుతుంది? నా మట్టుకైతే, నేను పరలోకపు బాటలో నడుస్తూ ప్రభువుతో నా వ్యక్తిగత సంబంధమును సమాధానమును పొందానని, ఎప్పటికప్పుడు ప్రభువు నన్ను గద్దించినప్పుడల్లా నా జీవితమును, ప్రవర్తనను సరిచేసుకుంటున్నానని చెప్పగలను. మీరు చెప్పగలరా? కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అనుకుంటున్నారా? అకాల మరణాలు క్రొతకాదు. ఎప్పుడైనా, ఎవరినైనా మరణం సమీపించవచ్చు. లోతు భార్యకు పశ్చాత్తాపంతో ప్రభువు వైపు తిరిగే సమయము కూడా లేదు. ఆమె వెనుకకు చూచిన మరుక్షణమే సొదోమగొమోర్రాలను దహించిన తీర్పు అగ్ని ఆమెను కూడా కబళించి నిత్యనరకానికి పంపించింది. మీకు అలాంటి పరిస్థితి కలుగకముందే పాపము గురించి పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు ప్రభువు సిలువవద్ద క్షమాపణ మారుమనసు పొందమని మీలో ప్రతి ఒక్కరిని, ఏ భేదములేకుండా బ్రతిమాలుతున్నాను. ప్రార్ధించుకుందాం, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ప్రార్థన:
ఈ పూట మన ధ్యానాంశం, దైవభక్తి గల నాయకుని హృదయము – మూడవ భాగము. లేఖన భాగము: 1:23-2:11 మీ బైబిల్ అక్కడ తెరిచి సిద్ధంగా ఉండండి. గతించిన పాఠములో దైవభక్తి గల క్రైస్తవుడు, లేదా నిజమైన క్రైస్తవ విశ్వాసి , నాయకుని హృదయములో ఎటువంటి గుణములు ఉంటాయో పౌలు జీవితము ద్వారా తెలుసుకున్నాము. ఈ పాఠములో ఆ శీర్షికలోని మూడవ భాగమును తెలుసుకుందాం.
మూడవ గుణము, అతడు లేదా ఆమె మిక్కటమైన దయతో క్షమిస్తాడు, క్షమిస్తుంది.
II కొరింథీ 1:9 వచనo గమనించండి. అపో. పౌలు కొరింథీ సంఘస్తుల విధేయతను పరీక్షించాలని ఆశపడుతున్నాడు. వారు దోషము చేసిన సహోదరుణ్ణి క్షమించినట్టే, తాను కూడా ఆయనను క్షమిస్తున్నానని వారికి తన హృదయమును వెలిబుచ్చుతున్నాడు. తాను చెప్పినవిధంగా వారు చేసినా, చేయకపోయినా, సమావేశమై చేరివచ్చిన విశ్వాసుల సహవాసమునకు ఉన్న అధికారమును పౌలు గుర్తిస్తున్నాడు. దైవభక్తిగల నాయకుడు, లేదా విశ్వాసి అయినా, తాను చెప్పినట్టు ఇతరులు చేయాలని పట్టుపట్టడు, గాని, తగినంత స్వేచ్ఛతో సంఘస్తులు సరైన నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తాడు. ముఖ్యమైన విషయమేమిటంటే, తన దోషముగూర్చి పశ్చాత్తాప పడిన సహోదరుడు తిరిగి సంఘ సహవాసములోనికి వచ్చిన తరువాత, పరిపూర్ణమైన ఆదరణ, అభిమానము పొందాడా? లేదా? అంతే కాదు ఆయనను సంఘపు సహవాసములోనికి పరిపూర్ణమైన ప్రేమతో చేర్చుకున్నారో లేదో చూడడం. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇది సంఘ క్రమశిక్షణ విషయమైన అంశం. ఇది చాలా కఠినమైన, క్లిష్టమైన అంశం. అందుచేత పౌలు కొంచెం సున్నితంగా ఆలోచిస్తున్నాడు. ఆయన మాటల్లో కొంచెం సందిగ్ధత, స్పష్టత లేనట్టు కనిపిస్తున్నా దోషం చ్సిన సహోదరుడు పశ్చాత్తాప పడినందు చేత అతణ్ణి క్షమించమని బోధిస్తున్నాడు. కొరింథీ సంఘస్తులు తన మాట వినకపోయినా, వారిని కూడా క్షమిస్తున్నాడు. అపో. పౌలు ఒక క్రైస్తవ నాయకునిగా, తన ప్రజలకు శ్రేష్టమైనదాన్ని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము ప్రకారము ఎక్కడ నిజమైన విశ్వాసులు, యేసయ్య శిష్యులు కూడిఉంటారో అక్కడ యేసయ్య సన్నిధి ఉంటుంది. పౌలు వారితో భౌతికంగా లేకపోయినా, ఆత్మలో వారితో ఉండి, వారు చేస్తున్న వాటిని చూస్తూ ఉన్నాడు.
శ్రోతలూ, ఈ సందర్భములో క్షమాపణ గురించి క్రైస్తవ లోకంలో ఉన్న అపోహలు కొన్నింటిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. క్షమాపణ హస్తం అందించగానే క్షమించినవారు అంతా మరిచిపోయి క్షమాపణ పొందిన వ్యక్తిని మునుపటిలాగా చూడాలని అందరూ అపోహపడుతుంటారు. క్షమించబడ్డ వ్యక్తి తన పశ్చాత్తాపమును, మారిన ప్రవర్తనను చూపించడం అత్యవసరం. క్షమించవద్దని నేను చెప్పడం లేదు. అపార్థం చేసుకోవద్దు. పరిశుద్ధ గ్రంధం మనకు బోధించేది క్షమాపణ. కాని, క్షమాపణకు షరతులు ఉన్నవి. పాపము ఒప్పుకోవాలి. నీ పాపమునకు నీవు బాధ్యుడవని ఒప్పుకోవాలి. దీనముగా యధార్ధముగా నిష్కపటంగా హృదయపూర్వకంగా అడిగేవారిని ప్రభువు తప్పనిసరిగా క్షమిస్తాడు. సుంకరి ఎంత దీనముగా, తగ్గించుకొని క్షమాపణ వేడుకున్నాడో జ్ఞాపకముంచుకుందాం. దేవుని క్షమాపణ వేడుకుంటే, ప్రభువు తప్పక క్షమిస్తాడు. దేవుడు ఒక పాపిని, నిన్ను, నన్ను క్షమించిన తరువాత ఇష్టానుసారం జీవించడానికి అనుమంతించలేదు. పాపములనుండి క్షమాపణ పొందినవారు పరిశుద్ధపరచబడడానికి ఆతురతతో జీవిస్తూ ఉంటేనే అది నిజమైన మారుమనసు అవుతుంది. చాలా మంది క్రైస్తవులు అపార్థం చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంధములో కోకొల్లలు. మచ్చుకు ప్రభువును ధిక్కరించి వ్యభిచారమునకు సమానమైన విగ్రహారాధన చేయడం. ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఇశ్రాయేలీయులు. వారిని ప్రభువు ఎంత శిక్షించాడో లేఖనాలు స్పష్టంగా సాక్షామిస్తున్నాయి. ఈనాడు ఎంతోమంది బాప్టిస్మము తీసుకొని, ప్రభువు బల్లలో పాలు పొందుతూ విగ్రహారాధనలో పాలు పొందేవారు ఉన్నారు. జాగ్రత సుమీ! ఏదో ఒకవైపు, పరిశుద్ధుడైన దేవుని వైపో, లేదా నీకు తోచిన విగ్రహాలవైపో ఉండు గాని, రెండిట్లో ఉన్నట్లయితే నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. మరోమాట, ఒక విశ్వాసి పాపములో పడిపోతే, దేవుడు క్షమిస్తాడు కాని, కొంత ఆ పాపముయొక్క ఫలితాలు అనుభవింప చేస్తాడు. కారణం? ఎంత ఘోరమైన పాపములో పడ్డావో నీవు తెలుసుకోవాలని. క్షమాపణ ఉచితమైనా, మన రక్షకుడు తన ప్రాణము, రక్తము ఘోరమైన అవమానము, మనము గ్రహంచలేనన్ని శ్రమలు, హింస భరిస్తే కాని ఆ క్షమాపణ మన పక్షంగా మన స్థానములో సంపాదించాడని మనము గ్రహించాలి. క్షమాపణ చులకన కాదు. అత్యంత విలువైనది.
ఇక మన పాఠం నేర్చుకుందాం. పౌలు కొరింధీ విశ్వాసులకు ఒక తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నాడు. ఇది మీకు, నాకు, జాగ్రతగా తెలుసుకోవలసిన అవసరముంది. ఏమిటది? ఒక విశ్వాసి, యేసయ్య శిష్యుడు యధార్ధంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడినట్లయితే, ఆ వ్యక్తిని అంగీకరించి సహవాసములో మునుపటిలాగే చేర్చుకొని ప్రేమ అభిమానము అందించాలి. లేనట్లయితే, మన శత్రువు సైతానుకు అవకాశమిచ్చి, సంఘములో భేదాభిప్రాయాలు, చీలికలు, పార్టీలు కలుగడానికి మనము దారి చూపుతున్నాము.
దయతో క్షమించడమంటే, న్యాయానికి, కరుణకు సమతుల్యత తెలుసుకోవడం. పౌలు బోధిస్తున్న సత్యమేమిటంటే, శిక్ష హద్దుకు మించితే, యేసయ్య శరీరానికి శాశ్వతంగా నష్టం కలుగవచ్చు. సైతాను తంత్రములు మనము తెలుసుకొని ఉండాలి. వాడి ఒక బలమైన ఆయుధం ఏమిటంటే, మనలను విడదీసి, జయించడం. ఈ తంత్రమును వాడు చాలా రీతులుగా మన మధ్యలో చేస్తున్నాడు. మీ గ్రామములోని సంఘములో చేస్తుండవచ్చు. మీ కుటుంబములో చేస్తుండవచ్చు. సైతాను తంత్రము మనము తెలుసుకోకపోవడమే వాడికి తావిచ్చినట్టు. ఒక్కొక్కరికి ప్రభువు ఏ వరము ఇచ్చాడో, అది గ్రహించక పోవడం వల్ల సైతాను ఈ అజ్ఞానమును వాడుకుంటున్నాడు. కొందరు న్యాయబద్ధంగా అనగా కఠినoగా మాటలాడతారు. మరికొందరు దయతో కరుణతో మాట్లాడగలుగుతారు. ఇద్దరు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేస్తే, సమస్యలు ఏర్పడతాయి. కాని ఇద్దరు కలిసి ఒకరిని మరొకరు అర్ధం చేసుకొని, ఒద్దికతో మన్నికతో పనిచేస్తే క్రికెట్ టీం లో అందరూ కలిసి పనిచేసినట్టు విజయము సంపాదించవచ్చు. ఒక క్రైస్తవ నాయకుడైనా, సంఘ పెద్ద అయినా, పాస్టర్ అయినా, సువర్తికుడైనా, ఒక యేసయ్య శిష్యుడైనా, ఈ మూడు లక్షణాలు, గుణగణాలు మనకు అత్యవసరం. ‘నీ గురించి వారేమనుకుoటున్నారు’ అనే ప్రశ్నకు నీవు సమాధానం వెతుక్కోకూడదు. వారికి శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఏమిటో అది జరిగేలా చూడడం నీ బాధ్యత. నీ నోటిలోనుండి మాట బయటికి రాక ముందు దానిద్వారా ఎంత బాధ, వేదన, హింస నొప్పి ఇతరులకు నీవు కలుగచేస్తావో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ శీర్షిక ముగింపులో మూడు గుణలక్షణాలు జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఇతరులను మిక్కటంగా ప్రేమిస్తావా? లేదా ‘నా గురించి వారేమనుకుంటున్నారు’ అని ఆలోచిస్తావా? ఇతరుల మేలు కోరతావా, నీ మేలు, నీ క్షేమమే నీకు ప్రాముఖ్యమా? మన సంఘాల్లో అసలు ప్రేమ కనిపించదే! ఎంత ఘోరమైన స్థితిలో మనమున్నాము? నీ కంటే ఇతరులను మిక్కటంగా ప్రేమిస్తావా? నీ ప్రతి పనిలో, తలంపులో, ఆలోచనలో, మాటలో ఆ బలమైన ప్రేమ ఇతరులకు కనిపిస్తుందా? నీవు ఇతరులను దయతో, కరుణతో క్షమిస్తావా? “అభ్యంతరములు రాక తప్పవు” అని ప్రభువు సెలవిచ్చారు? అవి కలిగినపుడు నీవేలా స్పందించావు? ఎలా స్పందించబోతున్నావు? ధారాళంగా మనస్ఫూర్తిగా క్షమిస్తావా? సంఘము సరియైన తీర్మానాలు చేస్తుందా? ఒక్కరే అన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారా? ఈ గుణగణాలు, లక్షణాలు మనకు బాగానే అర్థమవుతూ ఉంటాయి. సమస్య ఎక్కడ ఉందంటే, ఇవి మన జీవితములో కలగాలంటే, నీవు నేను తగ్గించుకొని నేర్చుకోగలమా? అట్టి కృప ప్రభువు మనకందరికీ సమృధ్ధిగా అనుగ్రహించుగాక!
2వ కొరింధీ-13 - 1:23-2:11 - దైవభక్తి గల నాయకుని హృదయము – రెండవ భాగము
2వ కొరింధీ 1:23-2:11 రెండవ భాగము
దైవభక్తి గల నాయకుని హృదయము – రెండవ భాగము
రేడియో వద్ద బైబిల్, పెన్, నోట్ బుక్ తెచ్చుకొని కూర్చొన్న వారికందరికి వందనములు! అంతే కాదు హృదయములను సిద్ధపరచుకొని ప్రభువు నాతో ఏమి చెబితే అది చేస్తానని సంపూర్ణ దీనమనసుతో వచ్చిన మీ అందరినీ శక్తిగల దేవుడు, సజీవుడు మన హృదయములను తన ఆత్మతో నింపుగాక! దైవభక్తి గల నాయకుని హృదయము – రెండవ భాగమును ఈ పూట అధ్యాయనం చేద్దాం. రండి రేడియో కు దూరంగా ఉండి పనిపాటులతో అలిసిపోయినవారు కూడా రండి! మీ అలసట దేవుని వాక్యపు అధ్యయనములో సేద దీరుతుంది. లేఖన భాగము II కొరింధీ 1:23-2:11. ప్రార్థన:
దైవభక్తిగల నిజాయితీ పరుడైన క్రైస్తవ నాయకుని గుణ లక్షణాలు నేర్చుకుంటున్నాము. అపో. పౌలు స్వంత జీవితములో ఈ గుణాలక్షణాలు మనము చూస్తున్నాము. నేర్చుకుందాము. మొదటిది, అతడు జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తూ ఉంటాడు.
రెండవది, అతడు గాఢంగా, త్యాగసహితంగా ప్రేమిస్తాడు. మొదట్లో మనము నేర్చుకున్నట్టుగా II కొరింధీ పత్రిక చాలా వ్యక్తిగత విషయాలతో నిండింది. 2:4లో చూచినట్లయితే పౌలు సంఘపు వారితో ఏ విధంగా మెలగాలో తెలుసుకోవడానికి కొంచెం కష్టపడుతున్నట్టు అర్థమవుతుంది. ఆ మాటల్లో ఆయన వ్యక్తం చేస్తున్న విషయం అది. ఆయన మాట్లాడే భాషలో చాలా తీవ్రమైన లోతైన భావావేశాలు కనిపిస్తున్నవి. ఆయన మొదటి పత్రిక ఎంతో కన్నీటితో ఆ పత్రికను ఈ సంఘస్తులు ఎలా అర్ధం చేసుకుంటారో అనే భయముతో వ్రాసినట్టుగా చెబుతున్నాడు. పౌలు ఉపయోగించిన మాటల్లో ఆయన హృదయ వేదన, భారము స్పష్టమవుతున్నాయి. దాదాపు ఆయన హృదయము తడబడుతున్నట్టు మూగబాధ అనుభవిస్తున్నాడు. భయానక దాడి జరుగుతున్నపుడు ఏ విధంగా ఫీలవుతామో పౌలు ఆ విధంగా ఫీలవుతున్నట్టు కనిపిస్తున్నది.
కాని, లోతైన, తీవ్రమైన భావావేశాలు తన పత్రిక చదువరులను బాధ పెట్టకూడదని ఆయన ఆశ పడుతున్నాడు. ఆయన భావాలను బట్టి తాను వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది వారు తెలుసుకుంటారని ఆశపడుతున్నాడు. తన మొదటి పత్రికలో జారత్వములో ఉన్న వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో సంఘానికి రాశాడు. దాని విషయం మళ్ళీ 2:5 లో ప్రస్తావిస్తూ సున్నితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కాక, ఆయనకు తిరుగుబాటు చేస్తున్న గుంపు నాయకుడి విషయం కూడా ప్రస్తావిస్తూ ఉండవచ్చు. ఈ రెండు సందర్భాల్లో దొషులను గాని, దోషములను గాని ఆయన ప్రస్తావించడం లేదు. ఆ ఒక్కడి పాపమును బట్టి సంఘమంతా వేదన చెందుతుంది. కాని, సంఘస్తులకు గాని, ఆ దోషికి గాని బాధ కలుగుగుండా చూసుకుంటూ, కఠినమైన మాటలు మాట్లాడడం లేదు. దోషము చేసిన వాని దోషమును ఎత్తి చూపుతున్నప్పటికి, సంఘస్తులకు వేదన బాధ ఎక్కువ చేయడం ఆయనకిష్టం లేదు. ఆలాటి పరిస్థితుల్లో నేనున్నట్లయితే, వారి పాపములో పట్టుబడ్డ వారికి కలిగే అవమానము గూర్చి సంతోషిస్తానేమో! వ్యభిచారములో పట్టుబడ్డ స్త్రీని యేసు క్రీస్తు ప్రభువు వద్దకు తెచ్చిన పరిసయ్యులు అలాగే ఫీలయ్యారు. కాని పౌలు అలా చేయలేదు. సరిదిద్ది, క్రమశిక్షణ చేసే సమయములో కూడా కొరింధీయులను ఆయన మిక్కటంగా ప్రేమించాడు. ఈ రీతిగా పాపములో చిక్కుకున్న సహోదర సహోదరీలను ప్రేమించడానికి నాకు, మీకు దేవుని కృప అత్యధికంగా అవసరo.
దోషము చేసిన ఈ వ్యక్తి ఎవరైనప్పటికి, సంఘములో ఎక్కువ శాతము ప్రజలు ఆయనను క్రమశిక్షణలో పెట్టినారు. మత్తయి సువార్త 18వ ఆద్యాయములో మన ప్రభువు బోధించిన సత్యమును గమనించి చూస్తే, పాపమును ఖండించవలసిన క్రమము ఇదే! క్రమశిక్షణ చేయడం సంఘపు బాధ్యత. సంఘ నాయకులు ఆ విషయములో సంఘమును నడిపిస్తారు, కాని వారు తుది నిర్ణయము చేయకూడదు. పౌలు చెబుతున్నదేమిటంటే, సంఘము చేసిన క్రమశిక్షణ సరైనది. అది చాలు. దానివల్ల జరగవలసిన మేలు జరిగింది. మరో మాటలో చెప్పాలంటే, దోషము చేసినవాడు పశ్చాత్తాపపడి తన పాపమును గ్రహించాడు, ఒప్పుకున్నాడు. ఇది జరిగిందని మనకెలా తెలుసు?
ఒకవేళ అది జరగకుండా ఉంటే, పౌలు స్పందన వేరుగా ఉండేది. ఆయన ఇచ్చే ఉపదేశం, బోధ వేరుగా ఉండేది. మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయమేమిటంటే, ఆ గుంపులోని కొందరు దోషము చేసిన సహోదరుణ్ణి క్షమించలేక పోతున్నారు. అతణ్ణి ఆ విధంగా చూడడం వల్ల ఆయనకు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తాము కాబట్టి అలా చేయవద్దని పౌలు వారికి బుద్ధి చెబుతున్నాడు. దానికి బదులు, ఆ సహోదరుణ్ణి క్షమించి, ఆదరించి, ప్రోత్సహించమని వారిని హెచ్చరిస్తున్నాడు. అవును, ప్రియులారా, ఆ సహోదరుణ్ణి కొంత కాలం సంఘములోనుండి బహిష్కరించారు. కాని ఇప్పుడు ఆయనను మళ్ళీ చేర్చుకొని ఆదరించాలి, లేనట్లయితే అతడు క్రుంగిపోయి, విశ్వాసములో నుండి పడిపోయే ప్రమాదమున్నది. ఈ సహోదరుడు తన దుఖ:ములో మునిగిపోవడం పౌలునకు ఇష్టం లేదు. ఆ సహోదరుడు పశ్చాత్తాపపడి మారుమనసు పొందినందుచేత, ఆయనను సంఘ సహవాసములోనికి సంపూర్ణంగా స్వీకరించి, వారి ప్రేమను ఆయనకు చూపించాలి. దాని ద్వారా, ఆయనకున్న ఆత్మీయ అధికారమునకు వీరు లోబడుటను నిర్ధారించాలి.
క్రీస్తునందు ప్రియులారా, ఈ అంశమును అధ్యయనం చేస్తుండగా, నేను ఈ విషయములో ఎంత ఇంకా ఎదుగవలసి ఉన్నదో నాకు అర్ధమయ్యింది. ప్రత్యేకించి సంఘములో క్రమము, క్రమశిక్షణ, దిద్దుబాటు, చేసే విషయము చాలా సున్నితమైనది. దైవభక్తిగల నిజాయితి పరుడైన క్రైస్తవ నాయకుని రెండవ గుణము ఇక్కడ పౌలు జీవితములో మనకు స్పష్టమవుతుంది. అది పౌలునకు కొరింధీ సంఘస్తుల పట్ల ఉన్న ప్రగాఢమైన, మిక్కటమైన ప్రేమ. ఈ గుణమును మనమంతా అలవరచు కోవడానికి, నేర్చుకోవడానికి శ్రమించాలి. కాబట్టి దైవభక్తిగల నిజాయితి పరుడైన క్రైస్తవ నాయకుడు లోతుగా జాగ్రత్తగా ఆలోచిస్తాడు, అతడు లోతైన ప్రగాఢమైన ప్రేమను కలిగి ఉంటాడు.
ప్రియ సోదరీ సోదరులారా, మన సంఘాల్లో పరిశుద్ధత కనిపిస్తుందా? ఈ విధమైన ప్రేమ కనిపిస్తుందా?? ఇతరులపట్ల పౌలునకున్న ప్రేమ, ఆలోచన, జాగ్రత్త మనలో కనిపిస్తుందా? దోషములో పడిపొయిన విశ్వాసిని ప్రేమతో గద్దిస్తారా? తప్పు దిద్దుతారా? “ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు” అని I యోహాను పత్రిక 4:8లో స్పష్టంగా పరిశుద్ధ గ్రంధం బైబిల్ బోధిస్తున్నది. కుటుంబములో, సంఘములో, మరెక్కడైనా, దేవుని పిల్లలు ప్రేమతో నిండి ఉంటారు. చివరికి క్రమశిక్షణ చేసినా, తప్పు దిద్దినా, గద్దించినా, ప్రేమతో చేయాలి. ఇది దేవుని వాక్యపు హెచ్చరిక. ప్రియ సంఘ కాపరులారా, సువార్తికులారా, సంఘ పెద్దలారా, పరిచారకులారా, విశ్వాసులారా, మన సంఘాల్లో ప్రేమ, దయ, పరిశుద్ధత, కనికరం, క్షమాపణ, క్రమము, క్రమశిక్షణ, దిద్దుబాటు, గద్దింపు కనిపించేదెప్పుడు? అది నీతో, నాతో ఆరంభం కావాలి.
ప్రార్థన: దేవుని వాక్యపు వెలుగులో మన జీవితములను, హృదయములను పరీక్షించి చూసుకొని, ప్రభువు ప్రేరేపించిన విధంగా మీ స్వంత మాటలలో ప్రార్ధన చేసుకొనండి.
2వ కొరింధీ-12 1:23-2:11 మొదటి భాగము దైవభక్తి గల నాయకుని హృదయము - మొదటి భాగము
2వ కొరింధీ-12 1:23-2:11 మొదటి భాగము
దైవభక్తి గల నాయకుని హృదయము - మొదటి భాగము
శ్రోతలందరికి యేసు క్రీస్తు ప్రభువు నామములో శుభములు! ఈ దినము II కొరింధీ పత్రికలో
క్రొత్త శీర్షిక ఆరంభిస్తున్నాము. లేఖన భాగము II కొరింధీ 1:23-2:11. ఈ శీర్షిక “దైవభక్తిగల నాయకుని
హృదయము” క్రమము తప్పకుండ ప్రతి వారము రేడియో వినండి! మీ ప్రార్థన మనవి ఏమిటో,
మీరే పరిస్థితిలో ఉండి ప్రార్థన చేయమని కోరుతున్నారో ఆ విషయమును స్పష్టంగా
తెలియచెప్పడం మంచిది. ప్రార్థన చేయండి, అంటే సరిపోదు. సరికాదు.
మీ బైబిల్ తెరిచి ఉంచండి. రేడియో దగ్గరే కూర్చొని ప్రశాంతంగా దీనమనసుతో ప్రభువు తన
పరిశుధ్ద్ధాత్ముని ద్వారా మీతో మాట్లాడాలని మీ హృదయాల్లో ప్రార్ధనతో విన్నట్లయితే పరిపూర్ణమైన
మేలు పొందగలుగుతారు.
ప్రార్థన:
ముందుగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. దైవభక్తిగల ఒక నాయకుడు
ఆ స్థానములో పనిచేయాలంటే, ఏవిధమైన గుణ లక్షణాలు కలిగి ఉండాలి? మేము చెప్పే కొన్ని
ఏమిటంటే, నిష్కాపట్యము, న్యాయబుద్ధి, జాగ్రత్తగా వినేశక్తి ఈలాటివి. మీరు కూడా ఈ లిస్ట్ లో
మరికొన్ని కలపగలరు. ఈ దినాల్లో యధార్ధమైన, సజ్జనులైన నాయకులు కావాలని అందరూ
చూస్తూ ఉంటారు. వారి బలహీనతలను ఒప్పుకునే వారు, వారి లోటుపాట్లను తెలుసుకున్నవారు,
అపజయము, ఓటమిని అంగీకరించేవారు కావాలని చూస్తూ ఉంటాము. ఇతరులవి కాదు సుమా!
ఇతరుల పోరాటాల్లో, శ్రమల్లో వారితో సహకరించి, నిలువబడి, పరానుభూతి చూపేవారికోసం
చూస్తూ ఉంటాం. నేనే నీకంటే గొప్పవాణ్ణి, పరిశుధ్ధుడ్ని, అన్ని చేయగలవాణ్ణి అని చూపించే వారు,
చెప్పుకునేవారు అవసరo లేదు. ఇది దేవుని సంఘపు నాయకత్వము విషయములో కూడా నిజమే!
మనమందరం కలిసి దేవుని పరిశుద్ధ లేఖనాలు అధ్యయనం చేస్తున్నాము కాబట్టి క్రైస్తవ
జీవన విధానం, పద్ధతి ఏమిటో తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ సమయములో
“దైవభక్తిగల క్రైస్తవ నాయకుని హృదయము” అనే శీర్షిక అధ్యయనం చేద్దాం. ఒకవేళ మీరు వెంటనే
అనుకోవచ్చు. నేను నాయకుణ్ణి కాదు, నాకిది అవసరం లేదు అని. ఆగండి! ఎందుకంటే ఈ గుణ
లక్షణాలు ప్రతి యేసయ్య శిష్యునికి అవసరం. కేవలం నాయకులు అని పిలువబడుతున్న పాస్టర్,
సువార్తికుడు, సంఘ పెద్ద, పరిచారకుడు ఇలా పదవుల్లో ఉన్నవాళ్లకు మాత్రమే కాదు, కాబట్టి
జాగ్రతగా మనమంతా వినాలని కోరుతూ ఉన్నాము. మన లేఖన భాగము: II కొరింధీ 1:23 - 2:11. ఈ
లేఖన భాగములో అపో. పౌలు దైవభక్తిగల నమ్మకమైన క్రైస్తవ నాయకుని హృదయమును తన
జీవితము ద్వారా మనము నేర్పిస్తూ ఉన్నాడు.
మొదటి గుణం, అతడు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాడు. పౌలు ఒక సంఘపెద్దగా,
అపోస్తలునిగా కొరింధీ సంఘములో కొన్ని జటిల సమస్యలు ఎదుర్కుంటూ ఉన్నాడు. తానే ఈ
సంఘమును స్థాపించాడు. కాని అనుదినపు తీర్మానాల్లో, నాయకత్వపు నిర్ణయాల్లో ఆయనకు పాత్ర
లేదు. మొదటి కొరింధీ పత్రిక ద్వారా ఈ సంఘములో పార్టీలు ఏర్పడ్డట్టుగా మనకు
అర్ధమయ్యింది. కొందరు పౌలు పార్టీ, మరికొందరు అపోలో పార్టీ, ఇంకా కొందరు పేతురు పార్టీ, ఈ
విధంగా పార్టీలు సంఘములో ఏర్పడ్డాయి. మీ సంఘములో కూడా పార్టీలు ఉన్నాయా? అయితే
జాగ్రత్తగా అలకించండి. పౌలు వ్యక్తిగతంగా కొరింధుకు వెళ్ళి, తన అపోస్తలుని అధికారంతో వాటిని
సరిచేయగలడు. కానీ వెళ్లలేదు. ఎందుకు వెళ్లలేదు? ఎందుకంటే ఉన్న అవకాశాలన్నిటిని
కూలంకషంగా క్షుణ్ణంగా ఆలోచించడానికి సమయం తీసుకున్నాడు. తొందరపడలేదు.
ఉత్తమమైన శ్రేష్టమైన పద్ధతిలో ఈ జటిల సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. నామట్టుకు ఒక
సమస్యకు మొదట్లోనే శ్రేష్టమైన ప్రతిస్పందన నేను చేయలేను. క్లిష్ట పరిస్థితుల్లో, జటిల
సమస్యలు ఎదురైనపుడు ఒక దైవభక్తిగల నిజాయితీపరుడైన క్రైస్తవ నాయకుడు సరైన పద్ధతి,
సమయము, ఇలాటివన్ని ఆలోచిస్తాడు.
అబధ్ధపు నిందలు వేసినపుడు ఇంకా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరము ఉంటుంది.
మీమీద, నామీద, అసత్యపు, అబద్ధపు నిందలు మోపినపుడు మొదటిగా మనపేరు చెడిపోకుండా
ఉండాలని వెంటనే వాటిని అరికట్టడానికి, ఆపి వేయడానికి, సమర్ధించుకోవడానికి
ప్రయత్నిస్తాము. ఇవి స్వానుభవము కూడా! కొన్ని ఉత్తరాలు, ఈమెయిల్స్ వ్రాసిన నేను
పంపలేదు. ఎందుకు? నా తలంపులు బాగానే వెళ్లగక్కి ఉండవచ్చు. నన్ను నేను బాగానే
సమర్ధించుకొని ఉండవచ్చు. నా పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఆపిఉండవచ్చునేమో!
కాని, నన్ను నిందించిన వాని క్షేమం సంగతేమిటి? కొన్ని సందర్భాల్లో వేయబడ్డ నిందలకు
సమాధానం, సమర్ధన చెప్పే అవసరo కూడా ఉండదు. ఒక దైవభక్తిగల నిజాయితీ గల క్రైస్తవుడు,
లేదా ఆమాటకొస్తే క్రైస్తవ నాయకుడు ఆచితూచి, ఆలోచన తీవరంగా చేసి స్పందిస్తాడు.
భావోద్రేకాలతో స్పందించడు. ఆవేశానికి బానిస కాడు. అపో.పౌలు ఆయనను విమర్శిస్తున్న వారికి
కొరింధుకు తాను ఎందుకు వెళ్ళడం లేదో వివరిస్తున్నాడు. తన నిజాయితీకి దేవుణ్ణి ఆయన
సాక్షిగా పెట్టడం గమనించారా? ప్రమాణం చేసి చెబుతున్నట్టు. బాగా ఆలోచించిన తరువాత తాను
వ్యక్తిగతంగా అక్కడికి వెళితే కోప తాపాలతో ఎంత వేడిగా వాతావరణం మారుతుందో పౌలు
ఊహించుకున్నాడు. పౌలు తనంతట తాను ఆగిపోవడం వల్ల, తమాయించుకోవడ వల్ల దయను
ఓపికను చూపుతూ ఉన్నాడు. స్వయానా యేసు ప్రభువు ఆయనకు ఇచ్చిన అపోస్తలుని
అధికారము ఆయనకు ఉన్నది. కావాలనుకుంటే, ఆయన తన అధికారమును ఉపయోగించి
గుంపులు గుంపులుగా వీడిపోయిన ఈ సంఘాన్ని చక్కబెట్టగలడు. వారి మీద అపో. పౌలుకు
అధికారము ఉన్నప్పటికి, దాని ఉపయోగించడం లేదు. వారిమీద పెత్తనం చేయాలని తనకు
కోరిక లేదని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కాని, వారు క్రీస్తులో స్థిరపదాలని, వారి జీవితల్లో
సంతోషం ఆనందం ఉండాలని కోరుకుంటున్నట్టు సాక్ష్యమిస్తున్నాడు. ఈ లేఖన భాగమంతటిలో
‘ఆనందం’ అనే అంశం అల్లుకుపోయినట్టుగా ఉన్నది. కొరింధు సంఘస్తుల్లో ఎన్ని సమస్యలు,
భేదభావాలు ఉన్నా, వారు విశ్వాసముతో దేవుని శక్తి చేత కాపాడబడుతూ ఉన్నారు. అది నిజమైన
విస్వాసమంటే! దీని ఆధారంగా పౌలు వారితో ముచ్చటిస్తూ బుజ్జగిస్తూ ఉన్నాడు.
దీర్ఘంగా ఆలోచించిన తరువాత వ్యక్తిగతంగా స్వయానా అక్కడికి రాకుండా, ఒక పత్రిక ద్వారా
వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న అందరి మేలు కోరి, ఈ నిర్ణయం తెసుకున్నట్టు
పౌలు చెప్పడం గమనించాలి. వ్యక్తిగతంగా సంఘమును దర్శించి ఈ కఠినమైన విషయాలు
మాట్లాడితే, కొంత ఆందోళన, కఠినమైన మాటలు, కోప తాపాలు ఒకరినొకరు మనసులను కష్ట
పెట్టుకోవడం జరుగుతుందని ఊహించిన పౌలు అది జరగకుండా చూసుకున్నాడు. 2:2వ వచనం
గమనించండి. “నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి
ఎవడు నన్ను సంతోషపరచును?” దీనిలో దాగి ఉన్న ప్రశ్న ఏమిటంటే, “ఇదేవిధంగా
జరుగుతుంది?” ఆయనను దుఖపరచిన ఒకడే కాదు, ఇంకా చాలామంది ఆయనకు తిరిగుబాటు
చేస్తున్నవారు కొరింధులో ఉన్నారు. ఈ సంఘమునకు క్రమశిక్షణ, గద్దింపు అవసరమైనప్పుడు
ఆయనకు వారేవిధంగా సంతోషము కలిగించగలరు? ఇక్కడ పౌలు తాను వ్యక్తిగతంగా వెళ్లవద్దని
నిశ్చయించుకోవడమే కాకుండా, తన మాటలు జాగ్రతగా ఎన్నుకుంటున్నాడు. తన సంతోషానికి
కారణము కావలవసినవారు దుఖపడడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన క్రమబద్ధీకరించ
వలసిన విషయాలను దూరమునుండి బాగు చేయడానికి సున్నితంగా ప్రయత్నం చేస్తున్నాడు.
అప్పుడు ఆయన వ్యక్తిగతంగా దర్శించినపుడు ఇంత ఘర్షణ కలగక పోవచ్చని ఆయన భావన.
దాని ద్వారా ఒకరిద్వారా మరొకరికి సంతోషం కలుగుతుంది. సాధారణంగా గద్దింపు, క్రమశిక్షణ
చేయడానికి వ్యక్తిగతంగా దర్శించడం మేలు. కాని, ప్రతి సారి కాదు. పౌలు జాగ్రత్తగా ఆలోచించి,
పరిశుధ్ద్ధాత్ముని నడిపింపుకోసం కనిపెట్టుకున్నందు చేత శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. 1:24
నుండి 2:3 వరకు ఉన్న లేఖన భాగము సారాంశం గమనించండి. కొరింధు సంఘపు వారి
సంతోషము పౌలు సంతోషం ముడిపడి ఉంది. ఒకటి మరొకదానిమీద ఆధారపడి ఉంది. వారి
విధేయత, విశ్వాసము ద్వారా ఆయనకు ఆనందం కలుగుతుంది. జటిల సమస్యలను గూర్చి,
సంఘపు విశ్వాసులను గూర్చి అపో. పౌలు జాగ్రత్తగా ఆలోచించడం దైవభక్తిగల క్రైస్తవ నాయకుని
ఒక గుణమును మనకు చూపిస్తున్నది. సంఘమే కాదు, మనమంతా ప్రతి రోజు కుటుంబములో
బయటి ప్రపంచములో, సంఘములో, బజారులో మార్కెట్లో ఇతరులతో సంబంధాలు చేస్తూ
ఉంటాం. ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితిలో జాగ్రత్తగా, దైవభక్తిలో ఆలోచించి అప్పుడు సరిగా
స్పందించడం, మాట్లాడడం, మనమంతా నేర్చుకోవాలి. టెన్షన్ కలిగినపుడు, భేదభావాలు
కలిగినపుడు, కోపతాపాలు, ఉద్రేకాలు, కలిగినపుడు ఏ విధంగా స్పందిస్తాము? పౌలు మాదిరిగా
మనము కూడా చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయుగాక!
2 కొరింధీ 11~15-22 మూడవ భాగము - క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? మూడవ భాగము
2 కొరింధీ 1: 15-22 మూడవ భాగము
క్రీస్తులో
వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? మూడవ భాగము
రేడియో దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ శుభములు! మీలో ప్రతి ఒక్కరికోసం ప్రార్థిస్తున్నాము. మీ ప్రార్థన మనవి
లేదా క్లిష్ట పరిస్థితి, బాధ, వేదన, వేదన, భయముల, ఆందోళన మాకు తెలియచేస్తే, ఆ పరిస్థితి, మనవి కోసం ప్రార్థన
చేస్తాము. మీరు యేసు క్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం కలిగినవారైతే, మీగురించి మీరే ఎక్కువ భారంగా,
వేదనతో ప్రార్థన చేసుకోవాలి. ఎంత ప్రార్థన జీవితములో ఎదిగితే అంతగా బలపడి క్రీస్తులో వేరుపారి స్థిరపడతారు.
ప్రార్థన:
క్రీస్తులో వేరుపారి స్థిరపడాలంటే మార్గాలు, పద్ధతులు అధ్యయనం చేస్తున్నాము. మొదటి మార్గం దేవుని
ప్రణాళిక ద్వారా, రెండవ మార్గం, దేవుని వాగ్దానముల ద్వారా. ఇక మూడవ మార్గం, దేవుని సన్నిధి
ద్వారా. లేఖన భాగము II కొరింధీ 1:15-22 ఈ భాగములోని చివరి 2 వచనాలు, 21-22 వచనాలు గమనించండి:
“మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు
ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.” పౌలు వాదన
ఏమిటి? దేవుడు తన ప్రణాళికనుబట్టి నా ప్రణాళికలను మార్చాడు. మీరు నన్ను నిలుకడ లేనివాడని,
నమ్మకత్వము లేనివాడని నా మీద ముద్ర వేశారు. కాని, నేను మీ వద్దకు తీసుకు వచ్చిన సువార్త దేవుని మారని
నమ్మకత్వము మీద ఆధారపడి ఉంది. ఈ సువార్త పరిచర్య చాలా జీవితాలను మార్చివేసింది. అంతేకాదు, దేవుడు
నా పరిచర్యమీద తన ముద్ర వేశాడు. పరిశుధ్ద్ధాత్ముని ముద్ర నా మీద వేశాడు. మీలో ప్రభువును నిజముగా నమ్మే
వారిమీద కూడ ఆ ముద్ర వేశాడు. కాబట్టి మీరు నా మీద వేసిన ఈ అబద్ధపు అభియోగం దేవుడు మీ మధ్యలో నా
ద్వారా చేసిన సువార్త పరిచర్యను బట్టి వీగిపోయింది. దేవుని ఈ క్రియద్వారా, నాలోను, ప్రభువు శిష్యులుగా
ఉండాలని ఆయన పిలుపును అంగీకరించి ప్రభువును వెంబడించి నడుస్తున్న వారిద్వారా ఈ ముద్ర
స్పష్టమవుతుంది. ఇది
పౌలు కొరింధీయులతో చెబుతున్న సమర్ధన.
ఇక్కడ పౌలు క్రీసులో వేరుపారి స్థిరపడాలని బలమైన చివరి విన్నపము చేస్తున్నాడు. మొదటిగా
అభిషేకమునుబట్టి. అనగా దేవుని ప్రజలు పరిచర్యచేయడానికి శక్తి పొందాలని పరిశుధ్ద్ధాత్ముడు ఇచ్చిన వరములు.
రెండవది, దేవుడు మమ్ములను ముద్రించాడు. అనగా మేము తనకు చెందినవారమని దేవుడు ఆమోదించి మేము
ఆయన సొత్తు అని దానికి గుర్తుగా తన
పరిశుద్ధాత్ముని అనుగ్రహించాడు.
మన నిత్యత్వపు స్వాస్థ్యమునకు బయానాగా, గ్యారంటీగా తన పరిశుద్ధాత్మనే దేవుడు అనుగ్రహించాడు. ఈ
బయానాను బట్టి అసలైన స్వాస్థ్యమును తప్పనిసరిగా ఇవ్వవలసిన బాధ్యత బయానా ఇచ్చినవారి మీద
ఉంటుంది. అది ఒక న్యాయబద్ధమైన బాధ్యత. మనకు క్రీస్తులో అనుగ్రహించిన మహిమకు, అనుగ్రహించబోతున్న
మహిమకు, స్వాస్థ్యమునకు పరిశుధ్ద్ధాత్ముడే దేవుని గ్యారంటీ, బయానా! హల్లెలూయ! మన దేవుడు ఎంత
నమ్మకమైనవాడు! ప్రియ సోదరీ సోదరులారా! నిరాశలో కుమిలిపోతున్నారా? బాధలు వేదనలతో అలిసి పోయారా?
ఇవి సైతాను చేస్తున్న విఫల ప్రయత్నాలు. మీరు విశ్వాసముతో లేచి నిలువబడి సైతానును వెంబడించడం వాడి మాటలు వినడం మానేసి, ప్రభువు యేసును సమీపించి ఆయన వాక్యమును ఆశ్రయిస్తే, విజయం, విడుదల
నిరీక్షణ, మీదే!
ప్రియ స్నేహితులారా, మీకు దేవునితో అనగా యేసు క్రీస్తు ప్రభువుద్వారా సంబంధం లేకపోతే, ఆయన సిలువ
రక్తము చేత నీ పాప దోషములు శుద్ధి చేయబడకపోతే, ఇవన్నీ మీకు అర్ధం కావు, మీకు వర్తించవు. కారణం?
దేవునికి మీకు ఏ సంబంధము లేదు. క్రైస్తవ పేరు మీకుందా? దానివల్ల మానసిక తృప్తి తప్ప ఏమి కలుగదు. ప్రతి
మానవునికి ఏ కులమైన, మతమైనా, ఏ భాష, రంగు, అంతస్తు, ఏ భేదములేకుండా దేవునితో సంబంధం అవసరం
ఎందుకంటే మనము జన్మించినపుడే దేవునికి శత్రువులము. దేవుని తీర్పు అప్పటికే మనమీద ఉన్నది. ఎన్ని సార్లు నీ పాపము, నిత్యనరకము, దేవుని తీర్పు దానినుండి విమోచన పొందడానికి దేవుని మార్గము గురించి
విన్నప్పటికి, నీ హృదయం కత్తినపరచుకుంటున్నావా? దానికి కారణం “పాపము వలన కలుగు భ్రమ” అని హెబ్రీ.
3:15 లో పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఉద్ఘాటిస్తుంది. “పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును
కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినము ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి” నేడు
అనే సమయము ఎల్లప్పుడు నీకు ఉండకపోవచ్చు. జాగ్రతగా ఆలోచించండి. యేసు క్రీసు ద్వారా మాత్రమే నీవు
నేను దేవునితో సమాధానపడగలము. నేను సమాధానపడ్డాను. నీ సంగతేమిటి? దీని విషయం మీకు ఆత్మీయ
సహాయం కావాలని ఆశిస్తే చెప్పబడిన టైమ్ ప్రకారం మాకు ఫోన్ చేయండి.
ప్రియ సోదరీ, సోదరులారా, మీరు పరిశుద్ధాత్ముని అభిషేకమును పొందారా? ఇది వినగానే ఎవరో ఒకరు
మీవైపు తన చేయి చూపగానే క్రిందపడిపోవడమని ఊహించుకోకండి. భాషల్లో మాట్లాడమేమో అని అపోహపడకండి.
ఇది ఎవరో నీ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే వచ్చే వరము కాదు. నీవు అమాంతం క్రిందపడి పోవడం అసలే కాదు.
చప్పట్లు కొడుతూ చేతులు
చరుచుకొని చేసే విన్యాసాలు చేయడం కాదు.
I యోహాను పత్రిక 2వ అధ్యాయం 20 వచనం గమనించండి. “అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము
పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.” ఇక్కడ పరిశుద్ధుడు అంటే పరిశుద్ధాత్ముడు అని అర్ధం. ఆయన
అభిషేకం ఏ మానవునివలన కలుగదు. అది కేవల దేవుని పరిశుద్ధ గ్రంధం బైబిల్లోని దేవుని మాటలకు నీవు, నేను
చూపే విధేయత మీద ఆధారపడి ఉంటుంది. 27వ వచనం చూడండి. “అయితే ఆయనవలన మీరు పొందిన
అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే
గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన
ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు.” పరిశుద్ధాత్ముని అభిషేకము నిలిచిఉండేది అనే సత్యము
జాగ్రతగా గమనించండి. ఈ అభిషేకము ఆయనకు ఆయన మాటకు విధేయత చూపే వారిలో ఉంటుంది.
పరిశుద్ధాత్ముడు దేవుని సేవకులను, ప్రవక్తలను, అపోస్తలులను తన ఆధీనములోనికి తీసుకొని వారి చేత
లేఖనాలను వ్రాయించాడని II పేతురు 3:16లో స్పష్టంగా ఉన్నది. పరిశుద్ధాత్ముని అభిషేకము, సత్యము,
యధార్ధము కూడా! ఈ అభిషేకము అన్నిటిని గూర్చి బోధిస్తుందని ఈ వచనములో చదువుతున్నాము. మీ
బైబిల్లో గమనించారా? అన్ని ఎవరు మనకు బోధిస్తారు. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంధం బైబిల్లోని ప్రతి మాట
మనకు బోధిస్తుంది. మన ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యములో సమాధానము ఉన్నది. మన విశ్వాసము ఈ
విషయములో చాలా తక్కువ ఆని చెప్పక తప్పదు. చదేవేకొద్ది, వినేకొద్ది గనిలోనుండి నిధులు బయట పడ్డట్టు
పరిశుద్ధ గ్రంధం బైబిల్లోనుండి ప్రశ్నలకు సమాధానాలు, సత్యాలు బహిర్గతమవుతున్నాయి. ఇది నా వ్యక్తిగత
అనుభవము. మనము సరిగ్గా చదవము, జాగ్రతగా చదవము, అర్ధం చేసుకోము, పద్ధతి ప్రకారము అధ్యయనం
చేయమని వేరే చెప్పనవసరములేదు. ఇంకా చెప్పాలంటే, మనము అర్ధము చేసుకున్నట్టు బైబిల్
ఉండాలనుంటాము. ‘దేవుడు నాకేమి బోధిస్తున్నాడు?’ అనే దీనమనసుతో, ఒక ఖాళీ పాత్రలో నీళ్ళు పోస్తినట్టుగా
మనము పరిశుద్ధ వాక్యమును అంగీకరించము. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకుంటే ఈ సత్యం ఒప్పుకోక
తప్పదు. పరిశుద్ధాత్ముని అభిషేకము పొందడానికి అన్నింటికంటే ముఖ్యమైన గుర్తు, రుజువు ఏమిటో
తెలుసుకోవాలి. గలతీ 5:22లోని ఆత్మఫలము ఫలము ఫలించడం. ప్రేమ సంతోషం, సమాధానము మొదలైన
గుణములు మనలో ఫలించడము మొదటి రుజువు. క్రీస్తులో వేరు పారి స్థిరపడాలని ఆశిస్తే మనలో ప్రతి ఒక్కరము
పరిశుధ్ద్ధాత్ముడు వ్రాయించి, భద్రపరచి ఉంచిన లేఖనములను దేవుని మాటలని, ఒప్పుకొని, దేవునికి మన
జీవితాలమీద ఉన్న అధికారమునకు ఒప్పుకొని, పరిశుద్ధమైన ప్రవర్తన, జీవితం, క్రియలు, ఆత్మ ఫలము
ఫలించడానికి అనువైన దీనమనసు, దేవుని వాక్యమునకు విధేయత, పరిశుద్ధాత్మ నడిపింపు శక్తిని బట్టి నూతన
పరచబడుతూ ఉండాలి. అపో పౌలు మాటలు గమనించండి: “మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా
మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ
అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు. సంచకరువు లేదా గ్యారంటీ అయిన పరిశుద్ధాత్ముడు మీలోని మీ
ఆత్మతో లేదా మనస్సాక్షితో సాక్షమిస్తున్నాడా? రోమా 8:16 “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో
కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.” ప్రియ సోదరీ సోదరులారా, ఇది మీకు క్రొత్తగా వింతగా అనిపిస్తున్నట్లయితే మీకు
దేవునితో సంబంధం లేదని అర్ధం. మీ సంబంధం దేవునితో నిశ్చయం చేసుకోవడానికి యేసు క్రీస్తు ప్రభువు, ఆయన
పరిశుద్ధ రక్తం మార్గం. మీకు అధ్యాత్మిక సహాయం కావాలంటే, మీకు పరిశుద్ధ గ్రంధం బైబిల్ కావాలంటే మాకు 10
నుండి 6 లోపల ఫోన్ చేయండి.
ప్రార్థన: మీ స్వంత మాటల్లో మీకు తోచినట్టుగా ప్రార్ధన చేయండి.
II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
-
> ఇదే ఆడియో మెసేజ్ లింక్: ప్రభువు బల్లను సరిగా ఆచరించి అవలంబించడం -మొదటి భాగము I కోరింథీ-37 11:17-34 మీకందరి...
-
చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీర...