I కొరింథీ-66 15:29-34
తప్పుడు జీవిత విధానం ప్రవర్తన వైపు నడిపించే దురాశలు
మన విశ్వాసానికి మన జీవిత విధానానికి, విలువలకు, మనము తీసుకునే నిర్ణయాలకు సంబంధం ఉంటుందా?
ఈ రెండింటికి పొంతన, సామరస్యం సమతుల్యం లేకపోతే, మనము వేషధారుల లెక్కలోనికి వస్తాము. లోక రక్షకుడు
యేసుక్రీస్తు ప్రభువు, పరలోకపు తాళపుచెవులు కలిగిన దేవుని గొర్రెపిల్ల, లోకమంతటి న్యాయాధిపతి, వేషధారులైన
పరిసయ్యులు, శాస్త్రులు, మొదలైనవారిని మత్తయి 23వ అధ్యాయములో ఎంతో యధార్ధంగా ముక్కుసూటిగా వారి
మీద ఆయన తీర్పులను భూమిమీద ఉన్నపుడే వెలిబుచ్చారు. వారికి పరలోకములో స్థానము లేదని తేటగా
సెలవిచ్చారు.
ఈనాటి బైబిల్ అధ్యయనం I కొరింథీ 15:29-34 వచనల్లో అపో. పౌలు తప్పుడు జీవిత విధానం ప్రవర్తన వైపు మనలను నడిపించే దురాశలు ఏమిటో వివరించాడు.
మొదట మనము విడిచిపెట్ట వలసిన దురాశ, నిష్ఫలమైన క్రియలు, ప్రవర్తన. 29,30 వచనాలు “ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల? మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?” చనిపోయినవారి కోసం బాప్టిస్మం తీసుకోవడం ఘోరమైనసంగతి. ఈ సందర్భములో అపో. ఈ దుష్టప్రవర్తనను ప్రోత్సహిస్తు న్నాడని దయచేసి అనుకోవద్దు. ఆయన తేటపరుస్తున్న విషయమేమిటి? జాగ్రత్తగా వినాలి. అసలు పునరుధ్ధానమే లేదని వాదించేవారు ఎందుకు ఈ దుష్టప్రవర్తన చేస్తున్నారు?’ అని వారిని నిల దీస్తున్నాడు. వారి మాటలకు వారి ప్రవర్తనకు పొంతన లేకపోవడం గమనిస్తున్నారా, శ్రోతలూ? ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. ఏ ఒక్కరు ఎల్లప్పుడు ఈ భూమ్మీద బ్రతకలేరు. ప్రశ్న ఏమిటంటే, మరణం తరువాత ఏమిటి? పరిశుద్ధ గ్రంధం బైబిల్ మరణం తప్పించుకోలేని సత్యమని స్పష్టం చేస్తుంది. హెబ్రీ. 9:27: “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.” అపో. కొరింధుకు వెళ్ళినపుడు ఈ దుష్ట ప్రవర్తనను సరిదిద్దడo జరిగిఉండాలి. చనిపోయినవారికోసం బాప్టిస్మం తీసుకోవడమనే తప్పుడు ప్రవర్తన ఆ దినాల్లో ఉన్నoదుచేత దాన్ని రూపుమాపడానికి పౌలు ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఆ విధంగా చేయడo వల్ల ఆదురాచారం అడుగంటింది. ఈనాడు చాలామంది చనిపోయినవారి ఆత్మశాంతికోసం ప్రార్థించమని అడుగుతూ ఉంటారు. చనిపోయినవారికోసం ఏమి చేయలేము. బ్రతికి ఉన్నపుడే యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, ఆత్మకు, మనసుకు, శరీరానికి విమోచన దొరుకుతుంది.
విడిచిపెట్టవలసిన రెండవ దురాచారం, దుష్టత్వం, దురాశ, శారీరిక సుఖాలను తృప్తిపరచుకోవడాన్ని వెంటాడడం. 31,32 వచనాలు. “సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసు నందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.” ఇక్కడ అపో. పౌలు ఒక బలమైన సత్యమును బోధిస్తున్నాడు. నేను ప్రతిదినము “చనిపోతున్నాను” అనే మాటలు అర్ధం చేసుకుంటున్నారా? పౌలు దృష్టిలో జీవితం ఖర్చుపెట్టవలసింది. ఎంత కాలము బ్రతికింది ముఖ్యము కాదు గాని ఎంత అర్థవంతంగా, దేవునికి ఉపయోగకరంగా బ్రతికింది ముఖ్యం. వృద్ధాప్యము వరకు బ్రతకడం అందరి కోరికే కానీ బ్రతుకుతున్న ప్రతి దినము ప్రభువు కోసం, ఆయనకు సాక్షిగా బ్రతకడం అవసరo.
ఎఫెసులో తాను మృగములతో పోరాడినట్టు సాక్షమివ్వడం గమనించారా? రోమా పౌరులు మృగములతో స్టేడియంలో పోరాడడమును ప్రోత్సహించదు. ఇదొక అలంకారరూపము. మృగములంత క్రూరమైనవారితో ఆయన పోరాడాడు. తప్పించబడి సువార్త పరిచర్యలో ముందుకు సాగిపోయి, దేవుని చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చాడు. పునరుధ్ధానమే లేకపోతే ఇంత పోరాడడం దేనికి? పునరుధ్ధానము ఆయనను ఎంతైనా శ్రమ పడ్డానికి, హింస భరించడానికి, క్రూరమైనవారితో పోరాడడానికి స్ఫూర్తి నిచ్చింది. మరో కోణములో చూస్తే ఆ దినాల్లో నిశ్చింతగా నిర్లిప్తంగా ఏ బాధ్యత లేకుండా పనీపాటు లేకుండా తింటూ త్రాగుతూ జీవితాన్ని వృద్ధా చేసినవారున్నారు. వారిని. “ఎపిక్యూరియనులు” అని పిలిచేవారు. అదొక తత్త్వము. ఆ పేరు ఇప్పుడు కానరాకపోయినా, ఆ జీవిత విధానము మనమధ్యలో కనిపిస్తూఉంది. ఎంతోమంది ఏ పనిచేయకుండా ఇతరుల కష్టం మీద వారి అవసరాలు తీర్చుకుంటారు. పౌలు II ధెస్స.3:10లో ఈ ఆజ్ఞ ఇచ్చారు. “ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా.” నా జీవితములో చిన్న వయసులో పనిచేయడం, నా చదువునకు తగిన పని కాకపోయినా, చిన్న చిన్న పని చేయడం ఆరంభించాను. కేవలం వంద రూపాయల జీతానికే పనిచేశాను. ప్రియ యువతీ యువకులారా, తండ్రులారా, దేవుని వాక్యం ప్రకారం పనిచేయకుంటే భోజనం చేసే అర్హత మనకు ఉండదు. ఎంత చిన్న పనైనా, ఎక్కడైనా, ఎంత దూరమైన వెళ్ళి పని చేయడానికి సిద్ధంగా ఉండండి. ఏ పనైనా చేయడానికి సంతోషంగా ఉండండి. ప్రభువు మెచ్చేది ఆ దీనమనస్సు. సుఖ భోగాల కోసం ఆశపడవద్దు. శ్రమ పడడానికి నడుము బిగించండి. యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ఢాను డయ్యాడు, ఆయన జీవిస్తున్నాడు అనే సత్యము ప్రభువు అపోస్తలులందరిని, ఆదిమ విశ్వాసులందరిని చాలా గొప్ప త్యాగాలు చేయడానికి ప్రోత్సహించాయి. ఎంతటి శ్రమ, హింస, బాధలు, నిందలు, అపనిందలు, ప్రభుత్వమునుండి హింస ఎదురైనప్పుడు కూడా వారు వేరొక చోటికి వెళ్లిపోయారేతప్ప ప్రభువునకు సాక్షులుగా ఉండడం మాత్రం ఎంత మాత్రం మానలేదు. తినుము, త్రాగుము సుఖించుము, రేపు బ్రతుకుతామో లేదో తెలియదు అనే ఎపిక్యూరియనుల మనస్తత్వము ఏ క్రైస్తవ విశ్వాసికి తగినది కాదు. పనిచేయకుండే జీవిత విధానం, ప్రవర్తన, సోమరితనము, ఈ దురాచారమును రూపు మాపుదాం! ఏ విధమైన శారీరిక సుఖ భోగములకోసం జీవితాన్ని ఖర్చు చేయవద్దు. మన పితరులు అపోస్తలులలాగా, ఆదిమ విశ్వాసులలాగా, సుఖ భోగములను విడిచిపెట్టి ప్రభువు కోసం శ్రమ పడడానికి మనసారా ప్రతివిధమైన కష్టం, నష్టం, శ్రమ, హింస, బాధ, వేదన, నిందలు, అన్నిరకాలైన త్యాగాలు ప్రభువు కోసం చేయడానికి మనమంతా పట్టుదల కలిగి జీవించాలి.
ఇక విడిచిపెట్టవలసిన మూడవ దురాచారం, మలినకరమైన సూత్రాలు, సిద్ధాంతాలలో కొనసాగకూడదు. 33,34 వచనాలు. “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకుసిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.”
మీ స్నేహాలు, సాంగత్యాలను పరీక్షించుకోండి. అపోస్తలుని హెచ్చరిక ఏమిటంటే, చెడు స్నేహాలు, సాంగత్యాలు, కలయికలు పరిశుద్ధమైన జీవితాన్ని నశింపచేస్తాయి. ఇద్దరు బైబిల్లోని వ్యక్తుల జీవితాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. అపో. పేతురు యేసు ప్రభువు కోసం తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమని చెప్పాడు, కానీ ఆయన సరైన సమయములో తప్పుడు గుంపుతో ఉన్నాడు. యేసు ప్రభువునకు తీర్పు జరుగుతున్న సమయములో ఆయన సైనికులతో బాటు చేతులు వేడిచేసుకుంటూ, చలికాచు కుంటున్నాడు. మూడు సార్లు బొంకి తన ప్రభువును కాదన్నాడు, మూడవసారి ఒట్టుపెట్టుకొని ప్రభువును ఎరుగనన్నాడు. పేతురు తప్పుడు స్నేహములో, తప్పుడు గుంపుతో ఉన్నాడు. ఆ సహచర్యము ఆయనను చెరిపింది.
మరోప్రక్కన పాత నిబంధనలో దానియేలు వేరే రీతిగా ఉన్నాడు. ఆయన రాజు ఇచ్చే అపవిత్రమైన ఆహారంతో తనను అపవిత్రపరచుకోలేదు. రాజు ఆస్థానములో ఆయన గొప్ప ఘనత వహించిన ఉద్యోగి అయ్యాడు. నెబుకద్నెజరు అనే చక్రవర్తి దానియేలు లాంటి వాడు తన ఆస్థానమంతటిలో, తన రాజ్యమంతటిలో లేడని సిఫారసు చేశాడు. దానియేలు తన స్నేహాలు తప్పుడు గుంపుతో పెట్టుకోలేదు, ఆయన ప్రవర్తన తప్పుడు ప్రవర్తన కాదు.
ప్రియ సోదరులారా, మనమంతా నిద్ర మేల్కొని నీతి ప్రవర్తనను కాపాడుకొమ్మని పౌలు హెచ్చరిస్తున్నాడు. పాపమును విడిచిపెట్టమని దేవుని పరిశుద్ధ లేఖనపు ఆజ్ఞ. మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు మత్తయి 6:33లో ఇచ్చిన హెచ్చరిక దీనిలాగే ఉన్నది. “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” ఈనాటి మన ఆత్మీయ జీవితాలకు ఎన్నో ఆటంకాలు, ఎదురవుతూ ఉన్నవి. ఎవరి వ్యక్తిగతమైనవి వారికేతెలుసు. ఆ గుంతలలో పడకుండా ఎవరికి వారు జాగ్రత పడాలి. ఒక వేదాంత పండితుడు ఈ మాటలతో మనలను హెచ్చరిస్తున్నాడు. కొరింథీ క్రైస్తవులు ఈ పాటికి నాయకులుగా ఉండవలసిన్ వారు కాని వెoబడించేవారిలెక్కలో ఉన్నారు. క్రైస్తవుడని పేరు పెట్టుకున్నవారికి దేవునితో ఉండవలసిన సాన్నిహిత్యము లేకపోవడం, దేవుని పరిశుద్ధ లేఖనముల విషయములో వారిoకా పసిపిల్లలుగా ఉండడం సిగ్గుపడవలసిన విషయం. పౌలు వారికి సిగ్గు కలగాలని, దీని ద్వారా వారి జీవిత విధానం, ప్రవర్తన, విలువలు, మార్చబడాలని ఈ విధంగా వ్రాస్తున్నాడు. వారు పునరుధ్ధానము విషయము వారి అవగాహన పరిపూర్ణమై చెడు స్నేహాలు, సాంగత్యాలు మానివేసి దేవుడు మెచ్చే గొప్ప సుగుణాలతో ప్రవర్తనతో, జీవితపు ప్రవర్తన విలువలతో వారు రూపాంతరం చెందాలని ఆశిస్తున్నాడు. వారి విషయమే ఆ ఆశయం పౌలుకుంటే, ఈనాడు మనగురించి, ఆయనకు, అంతే కాదు, యేసు ప్రభువునకు మన విషయములో ఎన్ని ఆశయాలు, గొప్ప తలంపులు ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మనకు కావలసినది దేవునితో సంబంధములో సన్నిహితంగా ఎదగడం. మనలను బలపరిచే స్నేహాలు చేసుకుందాం. అప్పుడు ఈ మలినమైన సూత్రాలు, సిద్ధాంతాలలో స్నేహాలలో కొనసాగము. **------**ప్రభువు మహాకృప చేత ఆయనకిష్టమైన వారుగా రూపాంతరం చెందడానికి మనకందరికీ శక్తిని అనుగ్రహించుగాక ! ప్రార్థన:
**విడిచిపెట్టవలసిన మూడింటిని జ్ఞాపకం చేసుకుందాం. నిష్ఫలమైన క్రియలు, మృతులకోసం బాప్టిస్మమము తీసుకోవడము లాంటి నిర్జీవమైన, నిష్ఫలమైన క్రియలను విడిచిపెట్టాలి. శారీరక సుఖ భోగములతో జీవితమును వృధా చేసుకోవద్దు, తరువాత చింతించి ప్రయోజనముండదు. మలినమైన సూత్రాలు, స్నేహాలు, సాంగత్యాలు విడిచిపెట్టాలి.**
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment