I కొరింథీ-67 15:35-44
పునరుధ్ధానములోని వింతైన ప్రశ్నకు సమాధానం
రేడియో వద్దకువచ్చిన ప్రతి ఒక్క శ్రోతకు, మీరేవయసువారైనా, ఏ ప్రాంతపువారైన, ఏ కులమైన, ఏ మతమైనా, ప్రతి ఒక్కొక్కరికీ శుభములు, వందనములు! బాగున్నారా? మీ క్షేమ సమాచారం, ప్రార్థన మనవి, ఏదైనా, మీరు పంచుకోవాలని ఆశిస్తీ, ఫోన్ చయండి, మెసేజ్ పెట్టండి. గతించిన కొన్ని వారాలుగా I కొరింథీ 15వ అధ్యాయాన్ని అధ్యయనము చేస్తున్నాము కదా! యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానము ఒక చారిత్రక సత్యమని పరిశుద్ధ గ్రంధం బైబిల్ బోధిస్తున్నది. బైబిల్ బోధించేవన్నీ సత్యమే, కానీ వాటిని అంగీకరించి దానికి తగినట్టుగా మన జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి విశ్వాసము అవసరం. తర్కించి, వివాదాస్పదంగా ఆలోచిస్తే, విశ్వసించలేము. విశ్వాసము చాలా బలమైన శక్తి. నమ్మలేనివి నమ్మడానికి విశ్వాసం అవసరం. విశ్వాసము తర్కము, వివాదమును దాటి ముందుకు పోతుంది. ఈ దినాన్న I కొరింథీ 15:35-39 వచనాలు ధ్యానించి, అధ్యయనం చేసి వింతైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము. రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ముందుగా లేఖన భాగము చదువుదాము. 35. అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. 36. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. 37. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. 38. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. 39. మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు.తనకు తాను గొప్పవాడనని అనుకునే ఒక మేధావి పౌలును పడేస్తానని ఒడిస్తానని అనుకున్నాడు. అతడు, అలాటివారు ఈనాడుకూడా, ఇదే ప్రశ్న అడుగుతునారు. ఏమిటది? చనిపోయిన వారు ఎలా లేస్తారు? ఏ శరీరంతో తిరిగి లేస్తారు? ఈ ప్రశ్నతో అపో.పౌలు కుప్ప కూలిపోతాడని అతడనుకున్నాడు. ఈ ప్రశ్నలు సమంజసమైనవే! మనకు తెలిసినంతవరకు పునరుధ్ధానమైన శరీరము ఎలాగుంటుందో మనకు తెలియదు, మనము చూడలేదు. మరెలా దీన్ని నిరూపిస్తాము? చనిపోయినవాళ్లు ఏ విధాగా తిరిగి సజీవులౌతారు? వారికి ఎలాంటి శరీరము ఉంటుంది? దీనికి సమాధానం అపో. పౌలు దీటుగా ఇస్తున్నాడు. గమైనిస్తున్నారా? విత్తనానికి మొక్కకు తేడా ఉంటుందా? మీలో వ్యవసాయం చేసేవారు చాలమందే ఉంటారని నా అభిప్రాయం. ప్రభువైన దేవుడు ఆదిలో సృష్టిని సృష్టించినపుడు, ఏమన్నాడు? ఆది. 1:11 గమనించండి: “దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.” దేవుని అద్భుతమైన సృష్టిలో ఉన్న ఒక విత్తనమును మీరు తీసుకొని దాన్ని భూమిలో విత్తుతారు, కొద్ది రోజుల్లో మొక్కై మొలిచి త్వరలో అది మహావృక్షమౌతుంది. అవునా? ఆ చిన్ని వితనములో నుండి ఇంత పెద్ద వృక్షము ఎలా వచ్చిందో మనకు తెలుసా? ఇంకాస్త ముందుకు అపో. పౌలు సాగిపోతూ మాంసం చాలా రకాలుగా ఉంటుందని తెలియ చెబుతున్నాడు. మనుష్యుల మాంసం, జంతువుల మాంసం, చేపల మాంసం, పక్షుల మాంసం. ఇన్ని రకాల మాంసము సృష్టిలో ఉన్నప్పుడు మరెన్నో రకాల మాంసము సృష్టికర్త చేయగలడా? లేదా? ఆలోచించండి. కాబట్టి ఈ ప్రశ్న వింతైన ప్రశ్న. ఇన్ని రకాల మాంసములు దేవిని అద్భుతమైన సృష్టిలో ఉన్నపుడు ఈ అనుమానం కొట్టి పారేయాల్సిందే! చిన్న వితనములోనుండి వృక్షము, మళ్ళీ దానిలో నుండి విత్తనాలు ఇదెంత అద్భుతం? శ్రోతలూ, జాగ్రత్తగా గమనించండి, పునరుధ్ధానములో దేవుని ప్రజలకు కలిగే శరీరం వేరే రకమైనది, పాపము చేత నిండిన ఈ లోకములో ఉన్నప్పుడు, పాపమునుబట్టి సైతాను అధికారములో ఉన్న ఈ లోకములో ఇన్ని రకాల శరీరాలు ఉన్నప్పుడు, మరో క్రొత్తరకమైన శరీరము మనకివ్వడం దేవునికి అసాధ్యమా? ఇంతవరకు మన కళ్ళతో మనము చూడనంత మాత్రాన పునరుధానములో ఉండే శరీరము విషయం ఊహ పోహలు అవసరం లేదు. ఎవరినైతే పౌలు “అవివేకీ” అని సంబోధిస్తూ త్రోసి పారేస్తున్నాడో, ఆ వ్యక్తి గురించి ఒక బైబిల్ పండితుడు ఎలా వ్యాఖ్యానిస్తున్నాడో తెలుసుకుందామా? జాగ్రతగా వినండి మరి!! ఎందుకు ఇది బుద్ధిహీనతగా అవుతుందంటే, మనము అనుదినము కళ్ళతో చూసే ప్రతి మాంసములో ఇన్ని రకాలు కళ్ళకు కనిపిస్తున్నపుడు, ఈలాంటి సమంజసము కాని అభ్యంతరం లేవనెత్తడం బుద్ధిహీనత కాక మరేమవుతుంది? ఏ రకమైన శరీరాము పునరుధ్ధానములో కలుగుతుందో ప్రస్తుతం మన కళ్ళకు కనిపించనంత మాత్రాన, మన కళ్ళకు ఇప్పుడు కనిపిస్తున్న ఇన్ని రకాలైన శరీరాలు ఉన్నాయన్న సత్యమును త్రోసిపుచ్చలేము కదా? ఒకవేళ మానమెప్పుడూ ఒక చిన్న విత్తనం భూమిలో విత్తి అది త్వరలో కుళ్ళిపోయి అందులోనుండే ఒక లేత మొక్క, అది మెల్ల మెల్లగా పెరిగి పెద్దై పెద్ద వృక్షముగా మారడం చూడకపోతే ఈలాంటి ప్రశ్నలు ప్రశ్నలు రావడం సహజమే! ఇవేవి చూడని వ్యక్తికి ప్రశ్నలు రావడం సహజమే! ఎందుకంటే అతడు విత్తనం భూమిలో చీకిపోవడం, అందులోనుండే నిండు జీవము కలిగిన మొక్క మొలవడం చూశాడు కాబట్టి, ఈలాంటి గొప్ప సంగతులు జరుగుతాయని నమ్ముతాడు. అందుచేత అపో. పౌలు కొత్త విషయం ప్రస్తావించడం మనము గమనించాలి. రెండవ అంశము, న్యాయమైన తగినట్టి సలహా. I కొరింథీ 15:40-44 చదువుకుందాం. 40 మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. 41 నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు గదా 42 మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; 43 ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; 44 ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది. అపో. ఇంకా వివరిస్తూ, వేరు వేరు వేరు రూపములు, వాటి మహిమను గూర్చి వివరిస్తున్నాడు. ఆకాశ వస్తువులు, భూమికి చెందిన వస్తువులు. వేటికి చెందిన గుణము, మహిమ వాటికి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి ప్రస్తావిస్తున్నాడు. సూర్యుని ప్రకాశము, వెలుతురు, మహిమ వేరు. మన శాస్త్రజ్ఞులు దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరమునుండి సూర్యుని విషయం కొంత తెలుసుకోలిగారు. వాళ్ళు తెలుసుకున్నది చాలా తక్కువే! ఒక్క విషయం మాత్రం తెలిసింది. సూర్యుని నుండి భూమి కొన్ని డిగ్రీల దూరం జరిగితే మనమంతా గడ్డ కట్టుకుపోతాము. కాస్త దగ్గరికి జరిగితే, మాడి మాసిబొగ్గైపోతాము. చంద్రునిలో వేరైనా మహిమఉందని లేఖనములు బోధిస్తున్నాయి. ఖగోళ శాత్రజ్ఞులు చంద్రమండలం వెళ్ళ్తున్న సంగతి మనకు తెలుసు. అదో వింత అనుభూతి. అక్కడ చేరిన వ్యక్తి “మానవాళికి ఇదొక ముందడుగు” అన్నాడట! వాళ్లనుకున్నవి అక్కడ వాళ్ళకు కనపడలేదు గాని, కొన్ని ఆసక్తికరమైనవి చూశారట! ఇక నక్షత్రాలకు వేరే మహిమ ఉందని పౌలు వర్ణించడం గమనించారా? ఒక నక్షత్రానికి ఉన్న మహిమ మరో నక్షత్రానికి ఉండదు. “నాసా” అనే సంస్థ ఇంకా ఇతర గ్రహాల గురించి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా, అంతు పట్టడం లేదు. ఈ విధమైన వర్ణనలతో అపో. పౌలు 42వ వచనములో అంటున్న మాటలేమిటి? “మృతుల పునరుత్థానమును ఆలాగే” నశించిపోయే విత్తనము ఏ విధంగా భూమిలో విత్తబడిన తరువాత చనిపోయి అందులోనుండే క్రొత్త జీవము ఎలా పుట్టుకొస్తుందో, అలాగే పునరుధ్ధానములో కూడా ఈ శరీరము భూమిలో పాతిపెట్టిన తరువాత, కుళ్ళిపోయి మళ్ళీ అందులోనుండే నశించిపోని శరీరం పుట్టుకొస్తుంది! హల్లెలూయ! యేసు క్రీస్తు అద్భుతమైన సృష్టికర్త కదూ! ఘనత లేని శరీరముగా మరణము తరువాత విత్తబడుతుంది. మహిమతో తిరిగిలేస్తుంది! బలహీనతలతో పూడ్చిపెట్టబడుతుంది. గొప్ప బలముతో తిరిగి లేస్తుంది. ఇది ఎంతటి అద్భుతం గమనిస్తున్నారా? మనమంతా పులకించవలసినంత సంతోషకరమైన సువార్త! సాధారణమైన స్వాభావికమైన శరీరము విత్తబడుతుంది, ఆత్మీయ శరీరముతో తిరిగి లేస్తుంది. మట్టి శరీరం, దీనమైనది, నశించిపోయేశ్వభావము గల ఈ శరీరము ఘనత లేనిది, బలహీనమైనది, పునరుధ్ధానమైన తరువాత అత్యంత అద్భుతమైన శరీరముగా మహిమతో, ఘనతతో, శక్తితో ఆత్మీయమైన శరీరముగా తిరిగిలేస్తుంది! ప్రియ సోదరీ, సోదరులారా, ఈ నిరీక్షణ మీకు ఉన్నదా? లేనట్లయితే, మీ విశ్వాసమును పరీక్షించుకొని పటిష్టపరచుకోండి. హృదయమును ప్రభువునందు దిట్టపరచుకోండి. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువుతో మీకు సంబంధం ఇంకా లేకపోయినట్లయితే, విశ్వాసముతో ఆయనను ఇప్పుడే సమీపించండి. ప్రార్థన:
I కొరింథీ-66 15:29-34
తప్పుడు జీవిత విధానం ప్రవర్తన వైపు నడిపించే దురాశలు
మన విశ్వాసానికి మన జీవిత విధానానికి, విలువలకు, మనము తీసుకునే నిర్ణయాలకు సంబంధం ఉంటుందా?
ఈ రెండింటికి పొంతన, సామరస్యం సమతుల్యం లేకపోతే, మనము వేషధారుల లెక్కలోనికి వస్తాము. లోక రక్షకుడు
యేసుక్రీస్తు ప్రభువు, పరలోకపు తాళపుచెవులు కలిగిన దేవుని గొర్రెపిల్ల, లోకమంతటి న్యాయాధిపతి, వేషధారులైన
పరిసయ్యులు, శాస్త్రులు, మొదలైనవారిని మత్తయి 23వ అధ్యాయములో ఎంతో యధార్ధంగా ముక్కుసూటిగా వారి
మీద ఆయన తీర్పులను భూమిమీద ఉన్నపుడే వెలిబుచ్చారు. వారికి పరలోకములో స్థానము లేదని తేటగా
సెలవిచ్చారు.
ఈనాటి బైబిల్ అధ్యయనం I కొరింథీ 15:29-34 వచనల్లో అపో. పౌలు తప్పుడు జీవిత విధానం ప్రవర్తన వైపు మనలను నడిపించే దురాశలు ఏమిటో వివరించాడు.
మొదట మనము విడిచిపెట్ట వలసిన దురాశ, నిష్ఫలమైన క్రియలు, ప్రవర్తన. 29,30 వచనాలు “ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల? మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?” చనిపోయినవారి కోసం బాప్టిస్మం తీసుకోవడం ఘోరమైనసంగతి. ఈ సందర్భములో అపో. ఈ దుష్టప్రవర్తనను ప్రోత్సహిస్తు న్నాడని దయచేసి అనుకోవద్దు. ఆయన తేటపరుస్తున్న విషయమేమిటి? జాగ్రత్తగా వినాలి. అసలు పునరుధ్ధానమే లేదని వాదించేవారు ఎందుకు ఈ దుష్టప్రవర్తన చేస్తున్నారు?’ అని వారిని నిల దీస్తున్నాడు. వారి మాటలకు వారి ప్రవర్తనకు పొంతన లేకపోవడం గమనిస్తున్నారా, శ్రోతలూ? ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. ఏ ఒక్కరు ఎల్లప్పుడు ఈ భూమ్మీద బ్రతకలేరు. ప్రశ్న ఏమిటంటే, మరణం తరువాత ఏమిటి? పరిశుద్ధ గ్రంధం బైబిల్ మరణం తప్పించుకోలేని సత్యమని స్పష్టం చేస్తుంది. హెబ్రీ. 9:27: “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.” అపో. కొరింధుకు వెళ్ళినపుడు ఈ దుష్ట ప్రవర్తనను సరిదిద్దడo జరిగిఉండాలి. చనిపోయినవారికోసం బాప్టిస్మం తీసుకోవడమనే తప్పుడు ప్రవర్తన ఆ దినాల్లో ఉన్నoదుచేత దాన్ని రూపుమాపడానికి పౌలు ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఆ విధంగా చేయడo వల్ల ఆదురాచారం అడుగంటింది. ఈనాడు చాలామంది చనిపోయినవారి ఆత్మశాంతికోసం ప్రార్థించమని అడుగుతూ ఉంటారు. చనిపోయినవారికోసం ఏమి చేయలేము. బ్రతికి ఉన్నపుడే యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, ఆత్మకు, మనసుకు, శరీరానికి విమోచన దొరుకుతుంది.
విడిచిపెట్టవలసిన రెండవ దురాచారం, దుష్టత్వం, దురాశ, శారీరిక సుఖాలను తృప్తిపరచుకోవడాన్ని వెంటాడడం. 31,32 వచనాలు. “సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసు నందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.” ఇక్కడ అపో. పౌలు ఒక బలమైన సత్యమును బోధిస్తున్నాడు. నేను ప్రతిదినము “చనిపోతున్నాను” అనే మాటలు అర్ధం చేసుకుంటున్నారా? పౌలు దృష్టిలో జీవితం ఖర్చుపెట్టవలసింది. ఎంత కాలము బ్రతికింది ముఖ్యము కాదు గాని ఎంత అర్థవంతంగా, దేవునికి ఉపయోగకరంగా బ్రతికింది ముఖ్యం. వృద్ధాప్యము వరకు బ్రతకడం అందరి కోరికే కానీ బ్రతుకుతున్న ప్రతి దినము ప్రభువు కోసం, ఆయనకు సాక్షిగా బ్రతకడం అవసరo.
ఎఫెసులో తాను మృగములతో పోరాడినట్టు సాక్షమివ్వడం గమనించారా? రోమా పౌరులు మృగములతో స్టేడియంలో పోరాడడమును ప్రోత్సహించదు. ఇదొక అలంకారరూపము. మృగములంత క్రూరమైనవారితో ఆయన పోరాడాడు. తప్పించబడి సువార్త పరిచర్యలో ముందుకు సాగిపోయి, దేవుని చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చాడు. పునరుధ్ధానమే లేకపోతే ఇంత పోరాడడం దేనికి? పునరుధ్ధానము ఆయనను ఎంతైనా శ్రమ పడ్డానికి, హింస భరించడానికి, క్రూరమైనవారితో పోరాడడానికి స్ఫూర్తి నిచ్చింది. మరో కోణములో చూస్తే ఆ దినాల్లో నిశ్చింతగా నిర్లిప్తంగా ఏ బాధ్యత లేకుండా పనీపాటు లేకుండా తింటూ త్రాగుతూ జీవితాన్ని వృద్ధా చేసినవారున్నారు. వారిని. “ఎపిక్యూరియనులు” అని పిలిచేవారు. అదొక తత్త్వము. ఆ పేరు ఇప్పుడు కానరాకపోయినా, ఆ జీవిత విధానము మనమధ్యలో కనిపిస్తూఉంది. ఎంతోమంది ఏ పనిచేయకుండా ఇతరుల కష్టం మీద వారి అవసరాలు తీర్చుకుంటారు. పౌలు II ధెస్స.3:10లో ఈ ఆజ్ఞ ఇచ్చారు. “ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా.” నా జీవితములో చిన్న వయసులో పనిచేయడం, నా చదువునకు తగిన పని కాకపోయినా, చిన్న చిన్న పని చేయడం ఆరంభించాను. కేవలం వంద రూపాయల జీతానికే పనిచేశాను. ప్రియ యువతీ యువకులారా, తండ్రులారా, దేవుని వాక్యం ప్రకారం పనిచేయకుంటే భోజనం చేసే అర్హత మనకు ఉండదు. ఎంత చిన్న పనైనా, ఎక్కడైనా, ఎంత దూరమైన వెళ్ళి పని చేయడానికి సిద్ధంగా ఉండండి. ఏ పనైనా చేయడానికి సంతోషంగా ఉండండి. ప్రభువు మెచ్చేది ఆ దీనమనస్సు. సుఖ భోగాల కోసం ఆశపడవద్దు. శ్రమ పడడానికి నడుము బిగించండి. యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ఢాను డయ్యాడు, ఆయన జీవిస్తున్నాడు అనే సత్యము ప్రభువు అపోస్తలులందరిని, ఆదిమ విశ్వాసులందరిని చాలా గొప్ప త్యాగాలు చేయడానికి ప్రోత్సహించాయి. ఎంతటి శ్రమ, హింస, బాధలు, నిందలు, అపనిందలు, ప్రభుత్వమునుండి హింస ఎదురైనప్పుడు కూడా వారు వేరొక చోటికి వెళ్లిపోయారేతప్ప ప్రభువునకు సాక్షులుగా ఉండడం మాత్రం ఎంత మాత్రం మానలేదు. తినుము, త్రాగుము సుఖించుము, రేపు బ్రతుకుతామో లేదో తెలియదు అనే ఎపిక్యూరియనుల మనస్తత్వము ఏ క్రైస్తవ విశ్వాసికి తగినది కాదు. పనిచేయకుండే జీవిత విధానం, ప్రవర్తన, సోమరితనము, ఈ దురాచారమును రూపు మాపుదాం! ఏ విధమైన శారీరిక సుఖ భోగములకోసం జీవితాన్ని ఖర్చు చేయవద్దు. మన పితరులు అపోస్తలులలాగా, ఆదిమ విశ్వాసులలాగా, సుఖ భోగములను విడిచిపెట్టి ప్రభువు కోసం శ్రమ పడడానికి మనసారా ప్రతివిధమైన కష్టం, నష్టం, శ్రమ, హింస, బాధ, వేదన, నిందలు, అన్నిరకాలైన త్యాగాలు ప్రభువు కోసం చేయడానికి మనమంతా పట్టుదల కలిగి జీవించాలి.
ఇక విడిచిపెట్టవలసిన మూడవ దురాచారం, మలినకరమైన సూత్రాలు, సిద్ధాంతాలలో కొనసాగకూడదు. 33,34 వచనాలు. “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకుసిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.”
మీ స్నేహాలు, సాంగత్యాలను పరీక్షించుకోండి. అపోస్తలుని హెచ్చరిక ఏమిటంటే, చెడు స్నేహాలు, సాంగత్యాలు, కలయికలు పరిశుద్ధమైన జీవితాన్ని నశింపచేస్తాయి. ఇద్దరు బైబిల్లోని వ్యక్తుల జీవితాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. అపో. పేతురు యేసు ప్రభువు కోసం తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమని చెప్పాడు, కానీ ఆయన సరైన సమయములో తప్పుడు గుంపుతో ఉన్నాడు. యేసు ప్రభువునకు తీర్పు జరుగుతున్న సమయములో ఆయన సైనికులతో బాటు చేతులు వేడిచేసుకుంటూ, చలికాచు కుంటున్నాడు. మూడు సార్లు బొంకి తన ప్రభువును కాదన్నాడు, మూడవసారి ఒట్టుపెట్టుకొని ప్రభువును ఎరుగనన్నాడు. పేతురు తప్పుడు స్నేహములో, తప్పుడు గుంపుతో ఉన్నాడు. ఆ సహచర్యము ఆయనను చెరిపింది.
మరోప్రక్కన పాత నిబంధనలో దానియేలు వేరే రీతిగా ఉన్నాడు. ఆయన రాజు ఇచ్చే అపవిత్రమైన ఆహారంతో తనను అపవిత్రపరచుకోలేదు. రాజు ఆస్థానములో ఆయన గొప్ప ఘనత వహించిన ఉద్యోగి అయ్యాడు. నెబుకద్నెజరు అనే చక్రవర్తి దానియేలు లాంటి వాడు తన ఆస్థానమంతటిలో, తన రాజ్యమంతటిలో లేడని సిఫారసు చేశాడు. దానియేలు తన స్నేహాలు తప్పుడు గుంపుతో పెట్టుకోలేదు, ఆయన ప్రవర్తన తప్పుడు ప్రవర్తన కాదు.
ప్రియ సోదరులారా, మనమంతా నిద్ర మేల్కొని నీతి ప్రవర్తనను కాపాడుకొమ్మని పౌలు హెచ్చరిస్తున్నాడు. పాపమును విడిచిపెట్టమని దేవుని పరిశుద్ధ లేఖనపు ఆజ్ఞ. మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు మత్తయి 6:33లో ఇచ్చిన హెచ్చరిక దీనిలాగే ఉన్నది. “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” ఈనాటి మన ఆత్మీయ జీవితాలకు ఎన్నో ఆటంకాలు, ఎదురవుతూ ఉన్నవి. ఎవరి వ్యక్తిగతమైనవి వారికేతెలుసు. ఆ గుంతలలో పడకుండా ఎవరికి వారు జాగ్రత పడాలి. ఒక వేదాంత పండితుడు ఈ మాటలతో మనలను హెచ్చరిస్తున్నాడు. కొరింథీ క్రైస్తవులు ఈ పాటికి నాయకులుగా ఉండవలసిన్ వారు కాని వెoబడించేవారిలెక్కలో ఉన్నారు. క్రైస్తవుడని పేరు పెట్టుకున్నవారికి దేవునితో ఉండవలసిన సాన్నిహిత్యము లేకపోవడం, దేవుని పరిశుద్ధ లేఖనముల విషయములో వారిoకా పసిపిల్లలుగా ఉండడం సిగ్గుపడవలసిన విషయం. పౌలు వారికి సిగ్గు కలగాలని, దీని ద్వారా వారి జీవిత విధానం, ప్రవర్తన, విలువలు, మార్చబడాలని ఈ విధంగా వ్రాస్తున్నాడు. వారు పునరుధ్ధానము విషయము వారి అవగాహన పరిపూర్ణమై చెడు స్నేహాలు, సాంగత్యాలు మానివేసి దేవుడు మెచ్చే గొప్ప సుగుణాలతో ప్రవర్తనతో, జీవితపు ప్రవర్తన విలువలతో వారు రూపాంతరం చెందాలని ఆశిస్తున్నాడు. వారి విషయమే ఆ ఆశయం పౌలుకుంటే, ఈనాడు మనగురించి, ఆయనకు, అంతే కాదు, యేసు ప్రభువునకు మన విషయములో ఎన్ని ఆశయాలు, గొప్ప తలంపులు ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మనకు కావలసినది దేవునితో సంబంధములో సన్నిహితంగా ఎదగడం. మనలను బలపరిచే స్నేహాలు చేసుకుందాం. అప్పుడు ఈ మలినమైన సూత్రాలు, సిద్ధాంతాలలో స్నేహాలలో కొనసాగము. **------**ప్రభువు మహాకృప చేత ఆయనకిష్టమైన వారుగా రూపాంతరం చెందడానికి మనకందరికీ శక్తిని అనుగ్రహించుగాక ! ప్రార్థన:
**విడిచిపెట్టవలసిన మూడింటిని జ్ఞాపకం చేసుకుందాం. నిష్ఫలమైన క్రియలు, మృతులకోసం బాప్టిస్మమము తీసుకోవడము లాంటి నిర్జీవమైన, నిష్ఫలమైన క్రియలను విడిచిపెట్టాలి. శారీరక సుఖ భోగములతో జీవితమును వృధా చేసుకోవద్దు, తరువాత చింతించి ప్రయోజనముండదు. మలినమైన సూత్రాలు, స్నేహాలు, సాంగత్యాలు విడిచిపెట్టాలి.**
I కొరింథీ-65 15:25-28
యేసు క్రీస్తునకు ఎవ్వరు జయించలేని విజయము ఉన్నది
రేడియో వద్ద చేరిన ప్రతి ఒక్కరికి శుభములు, వందనములు. ఈ వారమంతా ఎలా గడిచిపోయింది? బాధలు, వేదనలు, సమస్యలు, నిందలు చుట్టు ముట్టాయా? ఇది క్రొతకాదు, ప్రతి ఒక్కరు ఈలాటి పరిస్థితులను అనుభవిస్తూ ఉంటారు. కొందరు ఎక్కువ, మరికొందరు తక్కువ. ఎంతైనా భారము భారమే కదా! యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మనలను ధైర్యపరుస్తాయి. “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.” యోహాను సువార్త 16:33 ఈ మాటలు కంఠస్థం చేస్తే ఇంకామంచిది. దేవుని వాక్యము ఎవ్వరు ఇవ్వలేనంత ధైర్యం, ఆదరణ, సమాధానము ఇస్తాయి. ప్రార్థన: ఈ దినము మన ధ్యానంశo : యేసు క్రీస్తునకు కలిగినది ఎవ్వరు జయించలేని విజయము. I కొరింథీ 15:25-30. 25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. 26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. 27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే. 28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును. 29. ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల? 30. మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల? యేసు క్రీస్తు ప్రభువునకు కలిగిన విజయము ఎవ్వరు జయించలేని విజయమని పరిశుధ్ధ గ్రంధం బోధిస్తున్నది. అదెలాగో తెలుసుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ఆయన ఆధిపత్యానికి అన్ని లోబడి ఉంటాయి. ఆయన శత్రువులందరూ ఆయన అధికారము క్రిందికి వస్తారు. 25వ వచనం గమనించండి: “తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.” యేసు క్రీస్తు ప్రభువు రానున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయనకు సర్వాధికారమును పరమ తండ్రి, సర్వ సృష్టికర్త సర్వమునకు మూలమైన పరిశుద్ధుడు ప్రభువు మరణ పునరుధ్ధానముల తరువాత ఇచ్చాడు. మత్తయి 28: 18 “అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.” అనే గొప్ప సత్యమును ఉద్ఘాటించాడు. మానమారాధిస్తున్న ప్రభువు ఎవరో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ సత్యమును మీ మనసులో నిలుపుకొని, నమ్మారా? ఈ సత్యమును మీరు నమ్మినట్లయితే, ఎంత ధైర్యం, ఆదరణ, నెమ్మది, సమాధానము మీరు వ్యక్తిగతముగా పొందగలరో ఆలోచించండి. హల్లెలూయ!26వ వచనం. “ కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” చిట్ట చివరలో ప్రభువు నశింపచేసే శత్రువు మరణము! దేవునికి స్తోత్రం, హల్లెలూయ! ఈ ప్రాముఖ్యమైన సత్యము మీ మనసుల్లో ధృదంగా నాటనీయండి. ఏదేను నాటినుండి మానవజాతినంతటిని బంధించింది మరణము. పాపము ప్రవేశించినప్పటి నుండి మనందరినీ భయపెట్టేది మరణము. యేసు క్రీస్తు ప్రభువు తన పునరుధ్ధ్దానంను బట్టి మరణమును దాని సింహాసనము నుండి పడద్రోశాడు. ఆయన కుళ్లిపోని శరీరముతో, ఇక పతనము కాలేని మహిమ శరీరముతో తిరిగి లేచాడు. “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” యేసు క్రీస్తు ప్రభువునకు ఎవ్వరు జయించలేని విజయమున్నది. యుధ్ధములో ప్రభువు విజయము సంపాదించాడు. అవును, ఆయన వచ్చాడు. ఆయన చూచాడు, ఆయనే జయించాడు.
దేవుని అత్యున్నతమైన అతిశ్రేష్టమైన ప్రణాళిక ప్రకారం యేసు క్రీస్తు ప్రభువు భూమి ఆకాశముల విమోచన, ప్రతి విశ్వాసి విమోచన ఆయన మరణ పునరుధ్ధానములద్వార జరిగించాడు. తండ్రి సమస్తమును ప్రభువు పాదములక్రింద ఉంచాడు. సమస్తమును తండ్రి తన పాదముల క్రింద ఉంచిన తరువాత కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు సమస్తమను తన పాదముల క్రింద ఉంచిన తండ్రికి లోబడి ఉంటాడని 28వ వచనం స్పష్టపరుస్తుంది. 28వ వచనం గమనించండి. “మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.” “మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు....” లోపరచబడినప్పుడు అనే మాటలో అదొక సమయములో జరుగబోతుంది అనే అర్ధం ఇమిడిఉంది. ఈ సమయం దేవునికే తెలుసు. దేవుడు ఏ విషయమును జరిగి జరగనట్టుగా అవుతుందో లేదో అన్నట్టుగా ప్రణాళిక వేయడు. ఇది ఎప్పుడు జరగబోతున్నదో దేవునికి తేటగా తెలుసు. సంఘటనలు ఎలా జరుగుతాయో భావిషద్ జ్ఞానములో ఆయనకు బాగా తెలుసు. అప్పుడు ఎవరు ఉంటారో ఆయనకు బాగా తెలుసు. సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన నిత్యదేవుడు యేసు క్రీస్తు ప్రభువునకు ఎవ్వరు జయించలేని విజయమునిచ్చాడు! చిట్ట చివరి విజయము ఎప్పుడంటే, అన్నిటిని ప్రభువు పాదములక్రింద ఉంచినపుడు. సమస్తమును ఆయనకు లోపరచినపుడు అంతిమ విజయం! మరణమును నశింపచేసినపుడు చిట్ట చివరి విజయం! దేవుడు జగత్తుకు పునాది వేయకముందు ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారం, ఆయన తిరుగులేని సంకల్పం ప్రకారం అన్నిటిని సరియైన సమయములో సరియైన క్రమములో జరిగిస్తాడు. ఎంత శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడో మీరు గ్రహించారా, మనసారా నమ్మారా?
యేసు క్రీస్తు పునరుధ్ధానo తప్పించుకోలేని సత్యమనే అంశమును మూడు చిన్న భాగాలుగా గత సోమవారపు అధ్యయనం, ఈ దినపు అధ్యయనములలో తేటగా తెలుసుకున్నాము. జాగ్రత్తగా విని మనసులో భద్రం చేసుకుంటున్నారా? I కొరింథీ 15: 20-28 వచనాలలో ఈ అంశములను అధ్యయనం చేశాము. మొదటిది, యేసు క్రీస్తు ప్రభువునకు పోటీలేని అధికారమున్నది. ఆదాము వలన మన మీద వ్రాయబడిన మరణ శాసనమును తన పునరుధ్ధానము వలన ఆయనే కొట్టివేశాడు. 20-22వ. రెండవది యేసు క్రీస్తు ప్రభువునకు వివాదంలేని ఆధిక్యత ఉన్నది. మరణమును జయించి తిరిగి సజీవుడుగా లేచి నిరంతరం జీవించే వారిలో ఆయనే మొదటివాడు. 23,24 వ. మూడవది, యేసు క్రీస్తు ప్రభువునకు ఎవ్వరు జయించలేని విజయమున్నది. ఆయన పాదములక్రింద సమస్తము ఉన్నవి. సమస్తము మీద ఆయనకు సర్వాధికారమున్నది. 25-28వ.
యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానానికి ఎంత శక్తి ప్రాముఖ్యత ఉన్నాయో గమనించారా? ప్రభువు పునరుధ్ధానుడైనందుచేత ఆయనను విశ్వసించిన వారందరూ మరణమును జయించి తిరిగి లేచి దేవుని రాజ్యములో నిత్యము జీవిస్తారని, ఎంత నిరీక్షణ మనకున్నదో మీరు తెలుసుకుంటున్నారా? మీరే స్థితిలో ఉన్న, ఏ బాధతో ఇబ్బందులతో సతమతమౌతు ఉన్నా, ఈ నిరీక్షణ మీకు ధైర్యం విశ్వాసం, బలము, నెమ్మది కలిగిస్తుంది. ప్రార్థన:
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...