I కోరింథీ-44 12:21-26
సంఘము ఒక్క ఉద్దేశం చేత చక్కపెట్టబడి, సరిదిద్దబడుతుంది
హల్లెలూయ! దేవునికి మహా స్తోత్రం! ఈ నాడీ సజీవంగా ఉంది ప్రభువు సన్నిధిలో ఆయన సజీవ వాక్యములోని
వెలుగును పొందడానికి రేడియో చుట్టూ మన బైబిల్, నోట్ బుక్ పెన్ తో కలిసి రావడం ఎంత సంతోషంగా ఉంది కదూ!
ప్రార్ధించుకుందాం, తలలు వంచండి:
ఒక ముఖ్య ప్రకటన: చదువు లేనందున, లేదా మరే కారణము చేతనైనా పరిశుద్ధ గ్రంధం బైబిల్
చదవలేకపోతున్నారా? ఆది కాండం నుండి ప్రకటన వరకు, వినాలని ఆశపడుతున్నారా? మీ కోసం “ఆడియో
బైబిల్” అనే చిన్న ఉపకరణం అందుబాటులో ఉన్నది. దీనికి అదనంగా, ఈ ఉపకరణములో రోమా పత్రిక
అధ్యయనాలన్నీ మెమొరీ కార్డ్ లో పొందుపరచబడ్డవి. కావలసినవారు ఉదయం 10 నుండి సాయంత్రం 6 లోపల
ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు. ముగింపులో ఫోన్ నంబర్ ఇవ్వబడుతుంది.
యేసయ్య శరీరమైన సంఘములో ఐక్యత కలిగించడానికి పౌలు ఉపదేశిస్తున్న చర్యలు లేదా క్రియలు
ధ్యానిస్తున్నాము. ఈ పూట మూడవ చర్యను అధ్యయనం చేద్దాం, రండి. ఈ నాటి అంశం: సంఘము ఒకే ఉద్దేశము చేత
చక్కపెట్టబడుతుంది, సరిదిద్దబడుతుంది. I కోరింథీ 12:21-26 గమనించండి:
“21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
22. అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.
23. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.
24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.
25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదాని నొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.
26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.
ఏ అవయవము మరో అవయవమును నిరాకరించకూడదు, త్రోసివేయకూడదు. కన్ను చేయితోటి నీవు నాకవసరం లేదు అని చెప్పడానికి వీలులేదు. చేయి కాలుతో నీవు నాకవసరం లేదని చెప్పలేదు. మరో మాటలో చెప్పాలంటే, సామరస్యం, కలివిడిగా జీవించాలి. ప్రతి ఒక్కటి దాని స్థానములో అవసరమే! ఎక్కువగా కనిపించనివి చాలా అవసరం. నిజానికి ఎంతో ప్రాముఖ్యమైన మన అవయవాలు కనిపించవు: గుండె, ఊపిరితిత్తులు, కడుపు మొదలైనవి. ఈలాటి అవయవాలు దేవుడు వాటిని ఉంచిన స్థానములో ఉండి ఎంతో అవసరమైన పని చేస్తున్నాయి, కానీ కళ్ళకు కనిపించవు. అయినప్పటికీ ఈ ఆంతరంగిక అవయవాలు మన జీవనానికి అత్యవసరమైనవి. ఈ సాదృశ్యము యేసయ్య శరీరానికి అన్వయించుకుందాం. కొందరు కనిపించనే కనిపించరు. వారెవరో కూడా మీకు తెలియకపోవచ్చు. వారు ఎంతో అవసరమైన ప్రార్థన యోధులు. వీరు దేవుని కృపాసనం వద్దకు వెళ్ళి ఆయన సన్నిధానములో విజ్ఞాపనలు చేసేవారు. వీరు అందరిముందు కనిపించరు కానీ అత్యంత ప్రాముఖ్యమైనవారు. మీరు ఈ లెక్కలో ఉన్నారా? “సజీవ నిరీక్షణ” పరిచర్య కోసం, నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించడం మర్చిపోకండి. దేవుడు తన అనంత జ్ఞాన వివేకములతో శరీరమును గుణపరచి, సంధించి తీర్చిదిద్దాడు. మీకు తెలిసిన మీ సంఘస్తులు ఒకరితో మరొకరు ఎలా కలిసి ఉంటారో ఆలోచించండి. సంఘములోని ఒకరు మరొకరు విషయం శ్రద్ధ, ప్రేమతో సంబంధాలు కలిగిఉండడం ఎంత మంచిది? ఏ ఇద్దరు సంఘస్తులు ఒకే పని చేయరు. ఒకరితో మరొకరు సామరస్యంగా కలిసిమెలిసి జీవించాలి. ఒక విశ్వాసి బాధ పడితే అందరూ బాధ పడాలి. ఒకరు సంతోషిస్తే అందరూ సంతోషించాలి.
మన శరీరమంతటిలో ఏ భాగమునకు గాయమైనా, ఇబ్బంది, అనారోగ్యం సోకినా, శరీరమంతా బాధ పడుతుంది. అంతటికీ వేదన కలుగుతుంది. అన్నీ అవయవాలు ఆరోగ్యంగా ఉంటే శరీరమంతా సంతోషంగా ఉంటుంది. సంఘమంతటికీ ఒకే ఉద్దేశం ప్రభువు నిర్దేశించాడు. ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభువు ఒక ఉద్దేశముతో సంఘములో సరియైన స్థానములో ఉంచాడు. అన్నిటినీ చక్కబెట్టి సరిదిద్ది తన ఉద్దేశమును నెరవేర్చడానికి ప్రభువు శరీరమంతటినీ వాడుకుంటాడు. ఇంత అద్భుతమైన దేవుని సంఘములో భాగము కావడానికి ఒక్కటే మార్గము! యేసు క్రీస్తు ప్రభువు నీ పాపముల పరిహారం చెల్లించి నీ పాపమoతటి కోసం తన పరిశుద్ధ రక్తముతో ప్రాయశ్చిత్తం చేశాడని మనసారా ఒప్పుకొని, హృదయ పూర్వకంగా నమ్మి ఆయనను నీ వ్యక్తిగత రక్షకునిగా హృదయములోనికి ఆహ్వానించడమే! అంతే కాదు, ఆయన సిలువ మీద నీ స్థానములో మరణించి, మూడవనాడు తిరిగి సజీవంగా లేచి ఎంతో మందికి, తన శిష్యులకు కనిపించి, రుజువులతో సహ తన సజీవమైన, మహిమ శరీరమును చూపించి, పరలోకములోని తన స్థానమునకు, అనగా దేవుని కుడిప్రక్కలో రాజ్యము చేస్తున్న సర్వాధికారి అని నీవు నమ్మాలి! నీ విశ్వాసము నీకు ఎంత విలువైనదిగా ఉంటే, ప్రభువు నిన్ను అంతగా ప్రేమిస్తాడు. యేసయ్యను నీవు అన్నింటికంటే అందరికంటే ప్రేమించి ఆయనకోసం దేన్నైనా, ఎవరినయినా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటావా? అప్పుడు నీవు నిజమయిన జీవముగల దేవుని సంఘములో భాగమవుతావు. యేసయ్య జీవము, వెలుగు, శక్తి, ప్రేమ, నీలో ప్రతిబింబము లాగా ఉంటాయి. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించి దాన్ని నీవు ఇతరులకు చూపించగలుగుతావు. అంతటి మహాకృప శక్తిగల సర్వ సమృద్ధిగా ప్రభువు నీ పైన వర్షింపచేయుగాక!