I కొరింథీ అధ్యయనం-25 9:1-18(మొదటి భాగము)
దైవ సేవకుని గుణ గణములు ~ మొదటి భాగము ~
మీలో కొందరు ఎంతో దీన స్థితిలో ఉండవచ్చు. చూపులేక ఉండవచ్చు. మరికొందరు కదలలేక పడకలోనే ఎల్లప్పుడూ ఉండవచ్చు. మరికొందరు వికలాంగులై ఉండవచ్చు. ఇంకా కొందరు చాలా వృద్ధులైనందుచేత, లేదా అనారోగ్య కారణంగా ఎక్కడికీ పోలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. నిరాశ చెందవద్దు, మీ ధైర్యం విడిచిపెట్టవద్దు. మీకు యేసు క్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం ఉంటే, ఆయనే స్వయంగా మీతో ఉన్నాడు. ఉంటాడు కూడా. నిత్యజీవములో చేర్చుకుంటాడు. హెబ్రీ. 13:5 లో ప్రభువు ఇచ్చిన మాట వినండి: “నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయను.” అనగా ‘కొంచెము సేపు కూడా నిన్ను విడిచిఉండను, ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టను,’ అని అర్ధం. ప్రస్తుతం మీరున్న పరిస్థితిలో ప్రభువే స్వయంగా మీతో ఉన్నారు. ఈ మాటలను కంఠస్థం చేసి క్రుంగిపోయినప్పుడల్లా వీటిని ధ్యానం, మననం చేసుకొనండి, దేవుని మాటను మీరు గట్టిగా నమ్మితే మీ హృదయములో నిరీక్షణ నిండి ఉంటుంది.
దేవుని సేవకుడు అంటే ఎవరు? ఎలా ప్రవర్తిస్తాడు? అతని గుణగణాలు ఏమిటి? ఈ ప్రశ్నల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఏదో ఒక సమయములో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, మాట్లాడు కుంటారు. ఈ దినము దేవుని పరిశుద్ధ లేఖనముల ద్వారా, నిజమైన దేవుని సేవకుడు, దైవజనుడు ఎలా ఉండాలో నేర్చుకుందాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. రాలేని స్థితిలో ఉంటే, ఉన్నచోటనే జాగ్రతగా వినండి: లేఖన భాగము I కోరింథీ 9:1-18 అంశం: దైవసేవకుని గుణగణములు, నియామకం. ఒక దైవసేవకుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే, ఈ లేఖన భాగములోని దేవుని మాటలను పౌలు ఏ విధంగా వివరిస్తున్నాడో గ్రహించాలి.
మొదటిగా అతని వ్యక్తిగత పిలుపు. మొదటి 5 వచనాలు చదువుకుందాం. “నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?” ఒక దైవసేవకునికి దేవునితో చాలా దగ్గరి వ్యక్తిగత సంబంధం ఉండాలి. నేను ప్రభువును చూడలేదా అని పౌలు అంటున్నపుడు, అ. కా. 9లోని దమస్కులోని తిన్ననివీధిలో జరిగిన అనుభవమును ఎత్తి చూపుతున్నాడు. పౌలు క్రైస్తవులను హింసించాలని దమస్కుకు ప్రయాణిస్తూ ఉన్నపుడు యేసు ప్రభువు ఆయనకు మధ్యాన్నము సూర్యునికంటే ప్రకాశమనమైన తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు. ఆ వెలుగును బట్టి ఆయన మూడు దినములు చూడలేకపోయాడు. కానీ ఆయన “నేను ప్రభువును చూశాను” అంటున్నాడు. ప్రభువుతో ఇంత సన్నిహిత సంబంధం ఒక దైవసేవకునికి అవసరము. దేవుని పిలుపును దైవసేవకుడు వ్యక్తిగతముగా అనుభవించియుండాలి. ప్రభువుతో నా ప్రయాణం నేను యవ్వన కాలములో ఉండగా ప్రారంభమయ్యింది. గతించిన 43 ఏళ్లుగా ప్రభువుతోనాకు వ్యక్తిగత సంబంధం ఉన్నది. దినాలు గడిచే కొద్దీ ఇది తీయని అనుబంధం. ప్రభువుతో నడుస్తున్నపుడు అనేకమైన అనుభవములు రుచిచూస్తున్నాను. గద్దింపులు, హెచ్చరికలు, ఆదరణ, శిక్షణ, క్షమాపణ, ఇంకా ఎన్నెన్నో అనుభూతులు ప్రభువు అనుగ్రహించాడు. ప్రభువు తన అపరిమితమైన కృపనుబట్టి వందలాది, వేలాదిమందికి ఆశీర్వాదకరముగా నన్ను నా కుటుంబమును తీర్చి దిద్దాడు. ఆయనకే నిత్యము మహా ఘనత, మహిమ కలుగునుగాక! నేను యేసుక్రీస్తు ప్రభువు పాదముల ధూళికి కూడా సరిపోను.
ఆ తరువాత పౌలు తన సేవకు ఒక రుజువును చూపిస్తున్నాడు. “మీరే నా అపోస్తలత్వానికి రుజువు” అని నిర్ధారిస్తున్నాడు. పౌలు కోరింథు పట్టణములో సేవ చేశాడు. ఏథెన్స్ పట్టణములో ఘనులైన విద్వాంసులకు, విద్యాధికులకు సువార్త బోధించిన తరువాత ఇక్కడికి వచ్చాడు. సంఘమును ఏర్పాటు చేశాడు. అందుకే మీరే నా అపోస్తలత్వానికి రుజువు అంటున్నాడు. ఒక్క కోరింథులోనే కాదు, రోమా సామ్రాజ్యములోని చాలా పట్టణాల్లో, మహా పట్టణాల్లో, చిన్న ఊళ్లలో అంతటా తిరిగి సువార్తను ప్రకటించాడు. ఎన్ని ప్రసంగాలు చేశాడనేది కాదు గాని, ఎందరు పాపులు మారుమనసు పొందారు అనేది రుజువు. అందుచేత ఆపో. పౌలు మీరే నా అపోస్తలత్వానికి రుజువు, నాకు రుజువు మీరే, నాకు ప్రభువు పిలుపు ఉన్నదని చెప్పడానికి మీరే రుజువు, సాక్ష్యమని నిర్ధారిస్తున్నాడు. పౌలు దినాల్లో బైబిల్ బడులు లేవు, వేదాంత కళాశాలలు లేవు. అప్పట్లో ఒక వ్యక్తియొక్క వ్యక్తిగత పిలుపు, అతనికి ప్రభువుతోగల వ్యక్తిగత సంబంధం ముఖ్యమైనవి. ఆ దినాల్లో దేవుని సేవ అంటే, చావో, రేవో అన్నంతగా శ్రమలు, హింస, బాధలు ఉండేవి. కాబట్టి, దైవసేవకుని గుణగణములు అతని పిలుపు, ప్రవర్తన, త్యాగములో వ్యక్తిత్వములో కనిపించేవి. శ్రమలు, నిందలు, హింస, అవమానము, ఆకలిదప్పులు సహించడమే దేవుని సేవకు ప్రతీకలు. వింటున్న మీలో దైవసేవకులు, సంఘాపెద్దలు, సంఘ పరిచారకులు ఉన్నారా? మన జీవితాలను పరీక్షించుకుందాం. మనమెక్కడ ఉన్నాము?
రెండవది, ఆయన వ్యక్తిగతoగా నష్టపోవడానికి సిద్ధంగా ఉండే మనస్తత్వం. 6-14 వచనాలు చదువుకుందాం, మీ స్వంత బైబిల్లో గమనించండి. “మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోటవేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పు చున్నదిగదా? కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా? కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నా రనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించి యున్నాడు.”
ఆపో. పౌలు కొన్ని సాధారణమైన అనుభవాలను వాడుతూ బోధిస్తున్నాడు. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన స్వంత ఖర్చుతో వెళ్ళడు. ఒక సైనికుడు జీతం కోసమే కదా పనిచేసేది? ఒక తోట యజమాని తోటవేసినపుడు దాని పళ్ళు తినే ఆశతోనే కదా పని చేసేది? గొర్రెమేకలు, ఆవులు మేపే గొర్రెల కాపరి వాటి ద్వారా జీవనం చేస్తూ ఉంటాడు. వాటి కాపరికి ప్రతిఫలం కావాలనే ఆశ ఉంటుంది. పౌలు పాత నిబంధన, ద్వితీ. 25:4 లోనుండి “నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు” అనే మాటలు ఉటంకించి, ఉదహరిస్తున్నాడు. తప్పనిసరిగా ఆయనను నమ్మకంగా సేవిస్తున్న సేవకుణ్ణి నిర్లక్ష్యం చేయడు. ప్రియ తోటి దైవసేవకుడా, మీరు మీ కుటుంబములో, సంఘములో, సమాజములో మన యజమాని యేసు క్రీస్తు ప్రభువు పిలుపును అనుసరించి ఆయన సేవకునిగా సేవ చేస్తున్నారా? లేదా ఒక వృతిలాగా, పొట్ట పోషణ కోసం చేస్తున్నారా? సంఘ పెద్దలైనా, సంఘ పరిచారకులైనా, విశ్వాసులైనా, అందరికీ హబక్కుకు 2:4 వర్తిస్తుంది. ఆ మాటలు జాగ్రతగా ఆలకించి విశ్వసించండి. “నీతి మంతుడు విశ్వాసమూలముగా జీవించును” మీరు నేను, ప్రభువు పిలుపునుబట్టి ఆయన అధికారము క్రింద పని చేస్తున్నామా?మన సేవకు ముద్రలు కలిగియున్నామా? కాలము అతి సమీపంగా ఉన్నది. రాబోయే కాలము ఇంకా చీకటికాలము. తలుపులు సంపూర్ణంగా మూయబడవచ్చు. తెరిచియుండగానే, జాగ్రతగా మెళకువగా ప్రభువును సేవించడానికి సర్వ కృపానిధి, మన యజమాని, మన న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభువే తన మహాకృపతో మనలో ప్రతి ఒక్కరినీ, ఒక్కొక్కరినీ తన ఆత్మచేత సిద్ధపరచుగాక! అమెన్!