I కొరింథీ అధ్యయనం-12 4:6-9
సరిదిద్దుకోవలసిన ఆత్మాభిమానం
మీకందరికీ, ప్రతి ఒక్కరికీ వందనములు, యేసు నామములో శుభములు. ‘జీవితములో ఇన్ని కష్టాలు,
శ్రమలు, విశ్వాసానికి ఇంత కఠిన పరీక్షలు ఉంటాయని బాప్తిస్మము తీసుకున్నపుడు అనుకోలేదే’ అనుకుంటున్నారా?
దేవుని వాక్యములో చాలా స్పష్టమైన హెచ్చరిక ఇవ్వబడింది. “మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని
యెరిగి, మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” యాకోబు పత్రిక
1:2వ వచనం. పరీక్షలు, శోధనలు రెండూ కలుగుతూనే ఉంటాయి, ఇప్పుడే కాదు సుమా, జీవితాంతము వరకు
వస్తూనే ఉంటాయి. వీటన్నిటిద్వారా, ఓర్పు, సహనము, నిరీక్షణ కలుగుతాయి. కాబట్టి, నిరాశపడకండి, భయపడకండి,
మీరు ఆయనను విశ్వాసముతో ఆశ్రయిస్తే, ప్రభువే స్వయంగా మిమ్మల్ని ఆదుకొని, బలపరుస్తాడు. ప్రార్థన చేద్దాం,
రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. బైబిల్, నోట్ బుక్, పెన్ తెచ్చుకోవడం అలవాటు చేసుకొనండి.
దీనమనసుతో ధైర్యంగా ప్రభువును వేడుకుందాం.
ఆత్మ గౌరవానికి అహంకారానికి చాలా భేదమున్నది. ఈనాటి ప్రపంచములో దేనికి ఆత్మ గౌరవమని పేరు పెడుతున్నా అందులో, అహంకారం, పగ, ప్రతీకారం, గర్వం, అసూయ, ఈర్ష్య, మత్సరం, అన్నీ కలిసిఉంటున్నాయి.
అందుకే ఈ నాటి బైబిల్ అధ్యయనం లో ఆత్మ గౌరవాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, నేర్చుకుందాం. సరియైన, నిజమైన
ఆత్మ గౌరవమైతే, అది కలిగి ఉండడములో ఏ తప్పులేదు. కానీ సరిదిద్దుకోవలసిన అవసరం చాలా ఉన్నది. I కోరింథీ
4:6-9 మన లేఖన భాగము. సరిదిద్దబడిన ఆత్మ గౌరవమును అనుభవించాలంటే, క్రీస్తు శరీరములోని సంఘ
జీవితములో కొన్ని షరతులు తెలుసుకోవాలి.
సరిదిద్దుకోవలసిన మొదటి పరిస్థితి, విపరీతమైన విభజన. 6,7 వచనాలు జాగ్రతగా గమనించండి. “సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశ యింపనేల?” ఎక్కువ మంది పరిచర్య చేస్తూఉంటారు. ప్రజలు బోధకులను గొప్ప వారని, అంత గొప్ప వారు కాదని ఇలా విభజన చేస్తూ ఉంటారు. ఆపో పౌలు దానిని తన మీద, అపోల్లో మీద పెట్టుకొని సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. ఎక్కువ మంది పరిచర్య చేయడము ద్వారా విపరీతమైన విభజన జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభువు శిష్యులు సహితము తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారుగదా! మార్కు. 9:34లో ఈ సంఘటనఉన్నది. మనలో ప్రతి ఒక్కరికి వేరు వేరు పాత్రలు పోషించవలసి ఉంటుందని ఆపో. జ్ఞాపకము చేస్తున్నాడు. ఒకరు మరొకరిలాగా ఉండరు. మనమంతా ఒకే మానవజాతి అయినా, ఒకరు మరొకరిలాగా ఉండరు. క్రీస్తు శరీరములో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. 7వ వచనములోని ప్రశ్నలు గమనించండి. ఒక చిత్రకారుడు బొమ్మ గీసినట్టు నేను గీయలేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఈ రోజుల్లో వరములగురించి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభువు మీకు అనుగ్రహించిన వరమేదో, పరిచర్య ఏదో పరీక్షించి, ప్రార్థించి తెలుసుకొనండి. చాలా సార్లు కొందరికి ఆ వరము ఇవ్వబడకపోయినా, ఆ పరిచర్య, పని చేసే శక్తి వారికి లేకపోయినా, అది చేయాలని ఆశపడేవారుంటారు. కొందరికి ప్రభువు ఆ శక్తి వరము ఇచ్చినపుడు వారు సునాయాసంగా, చక్కని పద్ధతిలో అది చేయగలుగుతారు. కాబట్టి దీని విషయం చాలా జాగ్రతగా ఉండాలి. ఆత్మ గౌరవమును సరిదిద్దుకోవాలి. ఒక వేదాంతపండితుని ఉపదేశం ఇచ్చాడు. ఈ లేఖన భాగములో ఒక సామాన్య సిద్ధాంతము దాగి ఉన్నది. మనలో ప్రతి ఒక్కరూ వేరు వేరు రీతులుగా ఉండడం దేవునివలన కలిగినది. కాబట్టి ఏ విధమైన గర్వమునకు, అహంకారమునకు, గొప్పలు చెప్పుకోవడానికి అవకాశము లేదు. సరికదా, మనలో దీనమన్సును, తగ్గింపు స్వభావమును కలిగించాలి. మేధాశక్తిలో, ఆరోగ్యములో, ధనధాన్యాలలో, స్వేచ్ఛ స్వాతంత్రాలలో, అన్నిట్లో వేరు వేరు రీతులుగా ఉంటాము. అయినా, మన స్వయంశక్తితో రక్షణ, పాపక్షమాపణ సంపాదించుకోలేము. ఇదే సూత్రాలతోనే ప్రభువు లోకమంతటా జరిగిస్తాడు. సమస్తమునకు ఆయనే మూలమని, ఆయన నుండి సమస్తము మనకు ప్రాప్తించినవని మనమంతా గ్రహించాలి, ఆయన సహాయం లేకుండా ఏ పనిని, వ్యాపారమును, దేన్నికూడా మనము చేయలేమని ఒప్పుకొని విపరీతమైన విభజన, అనగా ఒకరు గొప్ప మరొకరు తక్కువ అనే విభజన చేయడం మానేయాలి.
సరిదిద్దుకోవలసిన రెండవ పరిస్థితి, అర్హతలేని సంతృప్తి. ఇదేమిటో జాగ్రతగా వింటే అర్థమవుతుంది. 8వ వచనం. “ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తు లైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?” ఈ వచనములో బైబిల్ అంతటిలో హాస్యాస్పదమైనమాటలు కనిపిస్తున్నవి. ఈ మాటలు నొక్కి చెబుతున్నది ఏమిటి? “తృప్తులైతిరి.” అనగా సుష్టుగా భోంచేసి ఏక ఏమీ అవసరము లేని స్థితిలో ఉన్నారని అర్ధం. “ఇదివరకే మీరేమియు కొదువలేక” అనే మాటలు జాగ్రతగా గమనించాలిసుమా! మీరు బాగా తిని తృప్తి చెందారు, చాలా ధనవంతులయ్యారు.
ఈ నాడు కొందరు బోధకులు ధనాశ చూపించడం లేదా? “దేవుడు మిమ్ములను ధనవంతులుగా చేస్తాడు” అని చెప్పి మోసగించే బోధకులున్నారుగదా! ప్రభువుతో ఎల్లప్పుడు ఒక కోశాధికారి ఉండేవాడు, అలాగే మీకు కూడా కోశాధికారి ఉండాలని మీరు కురుకుంటున్నారా” అని బోధించే బోధకులు ఎంతమంది లేరు? ప్రియ శ్రోతలూ, జాగ్రతగా వినండి, యేసు ప్రభువు, తనకు తలవాల్చుటకు కూడా స్థలము లేదని చెప్పడాని మర్చిపోకండి! పౌలు ఇక్కడ అంటున్నదేమిటి? మీరు ధనవంతులయ్యారు, ఇంకా మీరు రాజులయ్యారని కోరింథీ సంఘస్తులను ఎద్దేవా చేస్తున్నాడు. మొదట ఆహారాము విషయములో సమృద్ధిగా ఉన్నట్టు, ఆ తరువాత, ఐశ్వర్యం విషయములో కొరతలేని వారని, ఇప్పుడు అధికారము కూడా కలిగిన వారని చెబుతున్నాడు. కోరింథీ క్రైస్తవులు భౌతికమైన లౌకికమైన వాటిలోనే తృప్తి చెందారు. శ్రోతలూ, ఇక్కడే ఆత్మ గౌరవమును సరిదిద్దుకోవాలి. వారిని వారే అధికారములో పెట్టుకోవడమిది. ప్రభువు వద్దకు సలోమి అనే స్త్రీ వచ్చి, అయ్యా, నా ఇద్దరు కుమారులు నీ రాజ్యములో కుడి వైపున ఒకరు ఎడమ వైపున మరొకరు కొర్చోవాలని మనవి చేసినప్పుడు ప్రభువు ఏమన్నాడు?దేవుని సేవలో అధికారానికి తావులేదు. ప్రభువు ఎక్కడ ఉంచితే అక్కడ, ఏమి చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి.
సరిదిద్దుకోవలసిన మూడవ పరిస్థితి, సంపూర్ణంగా ఆధీనములో ఉండవలసింది. 9వ వచనం. “మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూత లకును మనుష్యులకును వేడుకగా నున్నాము.” ఆపో. పౌలు అతిదీనమైన స్థానములో ఉంటున్నట్టు తెలుస్తున్నది. దేవుదూ అపోస్తలులను అందరికంటే చివరలో ప్రభువు ఉంచాడని చెప్పడం గమనించారా? భాధ్యతగల స్థానాల్లో ఉండే వారికి హాని, అపాయం, నిందలు కలిగే అవకాశం ఎక్కువ. అన్ని బాణాలు వారిమీద సంధిస్తూఉంటారు. వెనుకలో ఉన్నవారిలాగా వారుండలేరు. వారు శత్రువుతో యుద్ధములో ముందుంటారు గనుక పౌలు బోధిస్తున్నట్టుగా వారు మరణానికి అప్పగించబడ్డట్టుగా ఉంటుంది. అపోస్తలులు యుద్ధములో ముందుండి పోరాడతారు కాబట్టి అవసరమైతే మరణించడానికైనా వారు సిద్ధంగా ఉన్నారని ఆపో. పౌలు తేటపరుస్తున్నారు. “మేము లోకమునకును దేవదూత లకును మనుష్యులకును వేడుకగా నున్నాము.” అంటూ వారు ఏ స్థానములో ఉన్నారో జ్ఞాపకం చేస్తున్నారు. ఒక యుద్ధభూమిలో ఉన్నపుడు ఏదైనా జరగవచ్చు. మరణమైనా కలుగవచ్చు, బ్రతకదమైనా జార్గవచ్చు. అందరూ చూస్తున్నపుడు, మనుష్యులైనా, దేవదూతలైనా, లోకములోని ప్రజలైనా, అందరిముందు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నామని తన నిశ్చయమైన మనసును వ్యక్తం చేస్తున్నాడు. అధిపతి ఆధీనములో ఉన్నపుడు దేనికైనా సిద్ధపడి ఉండాలి. భీకర యుధ్ధము జరిగే దినాల్లో రక్తం కారుతూ ఉన్న సైనికుని చూచి చక్రవర్తి మరణమని నిర్ణయించవచ్చు, లేదా జీవమని నిర్ణయించవచ్చు. ఈ కఠినమైన సంగతులు పౌలునకు బాగా అనుభవమే! చాలా వేదన చెంది మూడు సార్లు ఆ బలహీనత నుండి విడుదల చేయమని వేడుకున్నాడు. అప్పుడు ప్రభువు వద్దనుండి వచ్చిన జవాబు: నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.” (II కోరింథీ 12:9). కాబట్టి సరిదిద్దుకోవలసిన మూడవ పరిస్థితి సంపూర్ణంగా ఆధీనములో ఉండాలి.
ఇన్నాళ్ళు గర్వమును, అహంకారమును ఆత్మాభిమానమని భ్రమించి, మనసాక్షికి సర్ది చెప్పుకొని, కాలము వెళ్ళబుచ్చామేమో! సరిదిద్దుకోవడానికే ప్రభువు ఇంకా మనలను సజీవులుగా ఉంచాడేమో! కాస్త ఆలోచించండి, సమయం తీసుకొని, ప్రార్థించండి:
1. సరిదిద్దుకోవలసిన మొదటి పరిస్థితి, విపరీతమైన విభజన.
2. సరిదిద్దుకోవలసిన రెండవ పరిస్థితి, అర్హతలేని సంతృప్తి.
3. సరిదిద్దుకోవలసిన మూడవ పరిస్థితి, సంపూర్ణంగా ఆధీనములో ఉండవలసింది.
ప్రియ శ్రోతలూ, దేవునిపట్ల ప్రేమతో నిండిన నిజమైన ఆత్మాభిమానం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. కానీ పౌలు జీవించిననాటి దినాల్లోనైనా, ఈ దినాల్లోనైనా ఆత్మాభిమానాన్ని సరిదిద్దుకోవాలి. దీనంతటికి అవసరమైనత మహా కృప సర్వశక్తిగల మన ప్రభువు యేసుక్రీస్తు మనకందరికీ, మనలో ప్రతి ఒక్కరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment