I కొరింథీ అధ్యయనం-10 3:18-23
లోకము పట్ల క్రైస్తవ దృష్టి - లోకమును ఏ కన్నులతో చూస్తాం?
అందరికీ, ప్రతి ఒక్కరికీ యేసు క్రీస్తు ప్రభువు పేరట శుభములు! మీరంతా బాగున్నారా? జీవితమంటే అన్నీ అనుకున్నట్టుగా జరగవు. జీవితమంటేనే అర్ధమది! అయినా బాగున్నామని చెప్పవచ్చా? తప్పకుండా. మన జీవితాలమీద సంపూర్ణమైన సర్వాధికారం కలిగిన యేసు క్రీస్తు ప్రభువే మన నిరీక్షణ అయినపుడు అయనకు తెలియకుండా నీ జీవితములో ఏదీ జరగదు. జరగడానికి అనుమతించిన ప్రభువునకు దానిలో ఏదో ఒక మంచి ఉద్దేశ్యము తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి సమస్తమును ఆయన పాదములదగ్గర ఉంచి ప్రార్ధించుకుందాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా నెమ్మదితో కూర్చోండి, బైబిల్, నోట్ బుక్ పెన్ తెచ్చుకున్నారా? ప్రార్థన:
దేవుడు ఎవరు? ఆయన ఏమి చేశాడు? అంతరిక్షం గురించి చేయబడుతున్న పరిశోధనలవల్ల మనకు కలిగే మేలేమైన ఉందా? 21వ శతాబ్దపు నరులైన మనకు ఈ లోకమును ఏ కన్నులతో చూడాలో, రోమా గ్రీకు వేదాంతాలు, తత్వ జ్ఞానములోని లోతుపాతులు ఎరిగిన ఆపో. పౌలు దగ్గర నేర్చుకోవచ్చు. I కోరింథీ 3:18-23 లో ఆయన ఈవిషయాలు విపులీకరించాడు. బైబిల్ ప్రకారము ఏ లోకము ఏమిటి? ఏ కన్నులతో లోకమును చూడాలి? అనే ప్రశ్నలకు సమాధానము ఈ లేఖన భాగములో స్పష్టముగా ఉన్నది. I కోరింథీ 3:18-23
మొదటి తలంపు వ్యక్తిగత మోసమనే కుయుక్తి నుండి విమోచన పొందాలి. 18వ వచనం గమనించండి: “18. ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.” ఆపో. పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఇది జరగడం సర్వసాధారణం. ఒక వ్యక్తి మోసగించబడుతున్నపుడు ఆ విషయం ఆ వ్యక్తికి తెలియదు. ఏమి జరుగుతున్నదో అప్పుడు తెలియదు. తాను తప్పు మార్గములో ఉంటూ, సరియైన మార్గములో ఉన్నానని అనుకుంటాడు. ఇది చాలా సున్నితమైన, సూక్షమైన విషయం. ఒక వ్యక్తి, “చూడు, నేనెంత బాగా ఆలోచించానో, నేను చేసింది ఎంత బాగుందిగదా!” అని తనలో తాను అనుకుంటాడు. ఇప్పట్లో ధైర్యం పిల్లలకు బోధించాలని, తనమీద తనకు నమ్మకం ఉండాలని తల్లి తండ్రులు ఏదీ సరిచేయరు, సరిదిద్దరు. నీకు నీవు, “నేనే నెంబర్ వన్,.... నేనే నెంబర్ వన్…. నేనే నెంబర్ వన్,” అనుకుంటూ “కాన్పిడెంట్” గా ఉండాలని నేర్పుతూ ఉంటారు. జ్ఞానము సంపాదించుకున్నంత మాత్రాన అది శూన్యమే! అంతా తనకు తెలుసు అనుకునే వాళ్ళు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటారు. ఇది అధ్యాత్మిక విషయాల్లో కూడా సత్యమే. ఈ లోకపు జ్ఞానము చుట్టు చుట్టు తిప్పుతూ ఉంటుంది. వ్యక్తిగత జ్ఞానమును విడిచిపెట్టాలి, ఇది మోసపుచ్చేదని గుర్తించి దానిని ప్రక్కకు పెట్టాలి. ఇదే మొదట చేయవలసిన విషయం.
రెండవ తలంపు వ్యక్తిగతమైన ప్రారంభాలను ఎంచుకోవాలి. 19, 20 వచనాలు గమనించండి: “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.” యోబు 5:13లో నుండి ఉటంకించబడిన మాటలివి. ఎక్కడ ఆరంభించాలి? ఆపో. పౌలు హెచ్చరికను స్వీకరిస్తే వ్యక్తిగత జ్ఞానమును విడిచిపెట్టాలి. జ్ఞానుల జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము అని పౌలు తేటపరుస్తున్నాడు. ఈ లోకపు జ్ఞానము దేవుని జ్ఞానమునకు ఎంతగా వ్యతిరేకమైనదో స్పష్టంగా తెలుసుకోవాలి. అది పనికిమాలినది. అంతమాత్రాన మనమేదీ తెలుసుకోవద్దని భావన కాదు. అనుదిన జీవితానికి అవసరమైనవి మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. పౌలు వెర్రితనమనేది అధ్యాత్మికమైన సంగతులగురించి. దేవునిని, ఆయన సంగతులను లెక్క చేయని లోక జ్ఞానమును విడిచిపెట్టాలి. లోకపు జ్ఞానము ‘డెడ్ ఎండ్’ అయిన రోడ్డు లాంటిది. మూసివేయబడ్డ రోడ్డు లాంటిది. ఈ లోకపు జ్ఞానము చుట్టు చుట్టూ తిప్పుతుంది, తిరుగుతుంది. వివాదాలు, చర్చలు, అదే పంధా లో ఉంటాయి. లోకపు జ్ఞానం చుట్టూ చుట్టూ తిరుగుతూఉంటుంది. ఈ లోకపు జ్ఞానులను వారి జ్ఞానములో దేవుడు చిక్కుపరుస్తాడు. ఈ సత్యం రోమా. 1:18-21లో ఎంతో స్పష్టంగా ఉన్నది. ఈ రిఫరెన్స్ వ్రాసుకుని జాగ్రతగా చదవండి, ధ్యానించండి. రోమా. 1:18-21. I కోరింథీ 3:19-20లోని మాటలను జాగ్రతగా పరిశీలిస్తే, అక్కడ జ్ఞానుల జ్ఞానములోని తర్కవాదం, యోచనలు వ్యర్ధమైనవని తేటగా వ్రాయబడింది. ప్రభువు వారిని వారి కుయుక్తిలోనే పట్టుకుంటాడు. వారి మాటలు, వితండవాదములు ప్రభువునకు బాగా తెలుసు. వారి తీవ్ర మైన చర్చలు, తర్కవాదములు ఏ విధమైన తృప్తికరమైన విషయాలను బోధించలేవు. వారు మాట్లాడి, ఇంకా మాట్లాడి, ఇంకా మాట్లాడి, ఎంత మాట్లాడినా, ఏదీ స్పష్టంగా చెప్పలేరు. వారు ఎక్కడ ఆరంభిస్తారో ఎలా ముగిస్తారో తెలియదు. ఒక బైబిల్ పoడితుని మాటల్లో చెప్పాలంటే, దేవుని గురించి, ఆయనతో మన సంబంధం గురించి ఈ లోక జ్ఞానుల పరిశోధనలు, మాటలు, సత్యము లాగా కనిపించినప్పటికీ, అవి వ్యర్ధమైనవి. ఎందుకనగా దేవుని గురించి వారి స్వంత ప్రయత్నాలు, మాటలు, నిష్ఫలమైనవి. పెద్ద సమస్యలగురించి ఎంతో కాలంగా పనిచేసిన వారు, వారి నిష్ఫలత్వమును గ్రహించి దేవుని వాక్యములోని సత్యమును త్వరగా ఒప్పుకుంటారు. ఈ లోకపు జ్ఞానులని ఎంచబడుతున్నవారు ఆ సమస్యలతో పోరాడి, చివరకు వాటికి పరిష్కారము కనిపెట్టకుండానే, వదిలిపెడుతుంటారు. లేదా లోకమును మెరుగుపరచాలని ప్రయత్నించేవారిని కనిపెట్టండి. విద్య, మంచి సాంస్కృతిక కార్యాలు, నీతిబోధ చేయడం, వేరు వేరు మత సూక్తులు, వీటన్నింటినీ చేసినవారు సాధించినది ఏమీ లేదు. వీటిలో ఏవైనా మానవుణ్ణి పాపము నుండి విమోచించలేవు, పోగొట్టుకున్న ఘనతను పొందేలా చేయలేవు. వారు జ్ఞానమును పొందారని తలంచే వారు వేటిగురించి అలా తలస్తారో వాటిలోనే వారి బుద్ధిహీనత బయలుపడుతుంది. కాబట్టి, ప్రియ శ్రోతలారా, దేవుని జ్ఞానముతో ఆరంభించండి. ఇదే మన రెండవ తలంపు.
ఇక మూడవ తలంపు వ్యక్తిగతమైన అవగాహన అనే ఓదార్పు. 21 నుండి 23 వచనాలు గమనించండి. “21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. 22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. 23. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.” ఇక్కడ ఆపో. పౌలు మొత్తానికే క్రొత్తదైన పరిపూర్ణతను బోధిస్తున్నాడు. అదేమిటి? మనుష్యుల విషయం అతిశయించవద్దు, గాని దేవుని విషయము అతిశయించి సంతోషించండి. మనుష్యుల విషయం అతిశయించి సంతోషించడం ఇంతకు ముందు మనము చూచిన “డెడ్ ఎండ్ రోడ్” లాంటిది. సమస్తమును మీవి! ఎంతటి అద్భుతమైన సంగతి!! ఇది ఎంతటి సంతోషాన్ని కలిగించే విషయమో గమనించారా? ఇక మనం మానవుల జ్ఞానంకోసం ఇటు అటు పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు దేవుని జ్ఞానము అందుబాటులో ఉంది. దీనివల్ల మనుషులపార్టీలు కొట్టివేయడతాయి. పౌలు, అపోల్లో, పేతురు మానవులు మాత్రమే, వారి మీద నుండి మీ ధ్యాసను దేవునివైపు మళ్లించమని పౌలు నొక్కిచెబుతున్నాడు. ఇది మనకున్న ఓదార్పు, ఊరట. సమస్తమూ మీవి. లోకము, జీవము, మరణము, ఉన్నవి, రానున్నవి, అన్నీ మనవే! హల్లెలూయ! ఎంత గొప్ప భావన! ఎంత మహత్తర అవగాహన!!
లోకము పట్ల పౌలు భక్తుని దృష్టి అన్నిటినీ లెక్కలోకి తీసుకొని వాటిని క్రీస్తులో దేవునిలో పెట్టింది. ఇది గొప్ప విమోచన కదూ! ప్రియ శ్రోతలూ, మీరు నిజమైన విశ్వాసి అయితే ఈ సత్యమును బట్టి ఆనందముతో నాతో బాటు పరవసిస్తారు. దీని ద్వారా మీరు లోకపు విశ్వాసములోని బుద్ధిహీనతనుండి విమోచింపబడి, దేవుని అద్భుతమైన జ్ఞానములోనికి అడుగుపెడతారు.
ఏదేను తోటలో హవ్వ సర్పము మాట విన్నది. ఆనాటినుండి తన సరియైన స్థానములో నుండి మానవుడు పడిపోయాడు. మానవజాతి లోకముమీద అధికారమును ఎక్కువ ప్రత్యక్షంగా దగ్గరగా చేయగలిగిన ప్రణాళిక పడిపోకముందు ఉండేది. సర్పము మాట విన్నoదుచేత ఆ మంచి అధిక్యతను మానవ జాతి పోగొట్టుకున్నది. కానీ ఇప్పుడు గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ప్రభువు ద్వారా దాన్ని సంపాదించుకున్నాము. పాపములేని పరిశుద్ధమైన, పరిపూర్ణమైన దైవమానవుడు యేసు క్రీస్తు ప్రభువు, “నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక” అని లూకా 22:42లో చెప్పారు. అందుచేత, ప్రియ శ్రోతలూ, మన స్థానము క్రీస్తునందు తిరిగి సంపాదించుకున్నాము, దేవునికి స్తోత్రం! ఇప్పుడు ఈ స్థానమును ఆత్మీయ రీతిగా మనము అనుభవిస్తున్నాము. రానున్న కాలములో మనము సంపూర్ణంగా అనుభవిస్తాము. కానీ, ఒక ప్రాముఖ్యమైన మాట, గమనించండి, శ్రోతలూ! అన్నీ మనవి అయ్యేది మనము క్రీస్తునకు చెందిఉంటేనే! మానవుడు పోగొట్టుకున్న అధికారమును యేసు క్రీస్తు తిరిగి సంపాదించాడు. ఆయన మనకోసం గెలుచుకున్నవాటిని ఆయన ద్వారానే మనము పొందగలము. ఆయన ద్వారానే మన తలమీద కిరీటం ఉంచబడుతుంది. రోమా. 8:17లో ఉన్న రీతిగా మనము యేసు ప్రభువుతో “తోడి వారసులము”. ఆయన సమస్తమునకూ వారసుడని హెబ్రీ, 1:2లో స్పష్టంగా ఉన్నది. అయనకు బయట ఉన్నట్లయితే అంతా శూన్యమే, వ్యర్ధమే. ఎందుకంటే సమస్తమూ యేసు క్రీస్తు ప్రభువునకు చెందినవి, ఆయన వారసుడు. మనము ఆయనకు చెంది ఉంటే, దేవునికి చెందినవారము, ఎందుకనగా క్రీస్తు దేవునికి చెందినవాడు, ఆయన దేవుని కుమారుడు. ఈ అవగాహనను బట్టి ఎంతో ఆదరణ, ఓదార్పు ఊరట కలుగుతుంది. లోకము పట్ల క్రైస్తవుని దృష్టి ఎలా ఉండాలో ఆపో. పౌలు, ఈ మూడు తలంపుల ద్వారా తేటపరిచాడు. ఒక్కసారి ఈ మూడు తలంపులను జ్ఞాపకము చేసుకుందాం.
1. వ్యక్తిగత మోసమనే కుయుక్తి, మొదట దీని నుండి విడిపించబడాలి, ఇదొక్కటే మార్గము.
2. వ్యక్తిగత ప్రారంభాలను ఎంచుకోవాలి, మనము దేవుని మార్గమును ఎంచుకోవాలి.
3. వ్యక్తిగత అవగాహన అనే ఓదార్పును గ్రహించాలి. మనము యేసు క్రీస్తునకు చెందినవారము.
దేవుణ్ణి, ఆయనకు చెందవలసిన సరియైన స్థానములో ఉంచండి. దానిద్వారా మీరు గొప్ప విమోచన పొందుతారు. అప్పుడు సమస్తమూ మీవని మీరు ఆశ్చర్యముతో పరవసిస్తారు. అట్టి కృప సర్వాధికారి యేసు క్రీస్తు ప్రభువు మనకందరికీ అనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment