రోమా పత్రిక అధ్యయనం - 9 (3:1-8) దేవుడు ఎల్లప్పుడు సత్యవంతుడే!

 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by Whats App to 98663 41841

 రోమా పత్రిక అధ్యయనం - 9 (3:1-8)

దేవుడు ఎల్లప్పుడు సత్యవంతుడే!

ప్రియ శ్రోతలందరికీ క్రీస్తు నామములో శుభములు! ఒక వారము ఎంత త్వరగా గడిచిపోయింది గదూ? ఈ వారములో ఎలాంటి అనుభములు ఎదుర్కొన్నారు? కొన్ని సంతోషం కలిగించేవి, మరికొన్ని బాధ పెట్టినవి కావచ్చు. అన్నిటి కోసం దేవునికి స్తోత్రం! దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలుకోసo మార్చగల శక్తిమంతుడు మన దేవుడు! రండి, ప్రశాంతంగా దేవుని వాక్యం ధ్యానిద్దాం!  

            ఈ రోజు ఒకమాట చెప్పి రేపు ఇంకొక మాట చెప్పేవారంటే ఏ ఒక్కరికీ ఇష్టముండదు. వారు అభద్రతా భావముతో జీవిస్తున్నారని తెలుపుతుంది. వారు ఈ రోజు ఒక పద్ధతిలో రేపు ఇంకొక పద్ధతిలో జీవిస్తున్నారని అర్ధం. మనందరికీ ఎల్లప్పుడూ ఒకే రీతిగా జీవించేవారంటే నమ్మకముoటుంది. తాను ఏది నమ్ముతున్నాడో అది పాటించే వారన్నా, దేనిమీద తన విశ్వాసమును స్థిరముగా ఉంచుతున్నాడో దానిప్రకారం జీవించేవారిని  ఇష్టపడతాము. ఆ వ్యక్తి సత్యము చెప్తాడని మనము ఆశిస్తాము.

          ఎల్లప్పుడు సత్యము చెప్పేవారెవరైన ఉన్నారా? బైబిల్ గ్రంధములో బయలుపరచబడిన దేవుడే ఆయన! ఆయన ఒక్కడే!! దేవుడు ఎల్లప్పుడూ సత్యవంతుడే! ఆయన మాట్లాడినది ఏనాడూ మార్పు చెందలేదు. ఇది సత్యమని దేవుని వాక్యము ఏ ఏ రీతులుగా మనకు చూపిస్తున్నది? లేఖన భాగం రోమా. 3:1-8 ఈ ప్రశ్నకు జవాబు ఇస్తున్నది.

          1. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?

2. ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను.

3. కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు.

4. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లునునీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లునుఅని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.

5. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా? నేను మనుష్యరీతిగా మాటలాడు చున్నాను;

6. అట్లనరాదు. అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును?

7. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?

8. మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.

పౌలు, దేవుడు సత్యవంతుడని చూపించే కొన్ని మార్గాలు ఈ వచనములలో గమనించవచ్చు.  

దేవుడు సత్యవంతుడని ధర్మశాస్త్రము ఇవ్వడం ద్వారా చూపించాడు. నిజానికి ధర్మశాస్త్రముఇవ్వడం ద్వారా దేవుడు తన ప్రేమను ప్రకటించాడు. పౌలు ఈ ప్రశ్న లేవదీస్తున్నాడు. “యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?” 2వ వచనంలో ఆయన జవాబిస్తున్నాడు, “ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను.”  దేవోక్తులు అంటే ఏమిటి? దేవోక్తులు అంటే దేవుని మాటలు. ఇశ్రాయేలీయులు గొప్ప ధన్యత పొందిన ప్రజలు, అందుచేత వారు దేవుని మాటలను, అనగా దేవోక్తులను పొందారు. నా స్నేహితులారా, ఇంతగా ఈ విధంగా దేవుని మాటలను పొందిన ప్రజలు వేరే ఎవ్వరూ లేరు.

దేవుని సత్యము మార్పులేనిదని నిరూపించబడింది. కొందరు నమ్మకపోయినా, వారి అపనమ్మకం దేవుని నమ్మకత్వమును ఏ మాత్రం మార్చలేదు. మరో మాటలో చెప్పాలంటే దేవుని మార్పులేని సత్యం నిరూపించబడింది. మనుషుల అవిశ్వాసమునకు దేవుని మార్చగల  శక్తి లేదు. ఆయన నమ్మకస్థుడుగానే ఉంటాడు. కాబట్టి, నా  స్నేహితులారా, ఈ విషయం మీతో చెప్పాలి, ఆదేమిటనగా దేవుని సత్యమును నీవు నమ్మినా,  నమ్మకపోయినా ఏ భేదము ఉండదు. అది దేవుని సత్యమును ఏ మాత్రము మార్చదు. దేవుని వాక్యపు సత్యము నీవు నమ్మినా,  నమ్మకపోయినా, అలాగే ఉంటుంది. ఈ విషయమును బైబిల్ ఇలాగే వివరిస్తున్నది.

          దేవుని సత్యము స్థిరమైనది. ప్రజలు నమ్మినా, నమ్మకపోయినా, దేవుని సత్యము ఏ మాత్రము మార్పు చెందదు. అపొస్తలుడు “వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా?” అని ప్రశ్నిస్తున్నాడు, ఆ తరువాత ఆయన జవాబిస్తున్నాడు, “అట్లనరాదు.” మరో మాటలో చెప్పాలంటే అలాగు జరుగదు, అలాగు జరగడానికి వీల్లేదు,  అని అర్ధం. “ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు”

          దేవుని న్యాయమునకు ఆయన మార్పులేని సత్యమునకు దగ్గరి సంబంధం ఉంది. అది దేవుని పరిశుద్ధత మీద ఆధారపడి ఉంది. కాబట్టి దేవుడు సత్యమును మార్చే అవసరము ఉండదు, ఆయన పరిశుద్ధత స్థిరముగా ఉన్నట్టే ఆయన తన సత్యములో కూడా స్థిరంగా ఉంటాడు. లేనట్లయితే, దేవుడు తీర్పు తీర్చినపుడు, లేదా ప్రతీకారము చేసినపుడు ఆయన అన్యాయస్థుడవుతాడు. అపొస్తలుడు పాతనిబంధనలో నుండి ఎత్తిరాస్తూ దేవుడు తన మాటలలో న్యాయవంతుడు, ఆయన న్యాయము తీర్చడం ద్వారా విజయము పొందుతాడని వ్రాస్తున్నాడు. ఈ విధంగా దేవుడు  ధర్మశాస్త్రము ఇవ్వడం చేత ఆయన సత్యవంతుడని నిరూపిస్తున్నాడు.

          దేవుడు సత్యవంతుడని లోకమునకు న్యాయము తీర్చడం ద్వారా చూపుతున్నాడు.  ఇక్కడ కొన్ని లోతైన సత్యములు మీరు అర్ధo చేసుకోవడానికి మీకు సహాయపడాలని ఆశిస్తున్నాను. సాధారణంగా ప్రజలు వాదించినట్టు ఇక్కడ పౌలు వాదించి చూపిస్తున్నాడు. ఆయన అంటున్నది ఏమిటనగా “మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము?” మరో మాటలో చెప్పాలంటే మనము చేసే పాపపు క్రియలు దేవుని మంచి క్రియలకు విరుద్ధమైనపుడు, ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కలవగలవా? దేవుని నీతిమంతత్వమును బట్టి మన నీతిమాలినతనం ఇంకెక్కువ ఆవినీతిగా  కనిపిస్తుంది. ఆకుపచ్చని రంగు  నిజంగా ఎలా ఉంటుందో చూడాలంటే, దాన్ని ఎరుపు రంగు ప్రక్కన ఉంచాలి. నీవు పసుపు రంగు వస్తువు  ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, దాన్ని నీలి రంగు వస్తువు ప్రక్కన ఉంచాలి. ఒకదానికొకటి వ్యతిరేకమైనవాటిని ప్రక్క ప్రక్కన ఉంచినట్లయితే అసలు రంగు కనిపిస్తుంది.

          మా పాపపు నీతిమాలిన తనము దేవుని నీతిని విబేధిస్తే, దేవుడు మమ్ములనెoదుకు తీర్పు తీర్చాలి అని కొందరు ప్రశ్నిస్తున్నందుచేత అపొస్తలుడు వారి వాదనకు జవాబిస్తున్నాడు. కారణమేటనగా దేవుని నీతిని బట్టి ఆయన న్యాయముంటుంది, ఆయన నీతి మన అపవిత్రమైన పాపమునకు శిక్ష విధిస్తుంది. ఈనాటి ప్రపంచము  లోని ప్రజల అపవిత్రతను, నీతిమాలిన తనమును నీతిమతుడైన దేవుడు తన న్యాయమునుబట్టి శిక్షించ వలసిఉంటుంది.

          కేవలము దేవునికి మాత్రమే ఆ అధికారం ఉన్నది. 5వ వచనములోని  రెండవ భాగము మీరు గమనించాలి: “ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా?” (నేను మనుష్యరీతిగా మాటలాడు చున్నాను) ఆ తరువాత “అట్లనరాదు” అంటున్నాడు. అలాగు జరగదు.  “అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును?” ఒకరు సత్యవంతులైఉండాలి. దేవుడే సత్యవంతుడు. కాబట్టి దేవుడు లోకమునకు న్యాయము తీర్చుట ద్వారా  తాను సత్యవంతుడని చూపిస్తున్నాడు.

పాపిని దోషిగా తీర్పు తీర్చడం ద్వారా దేవుడు తాను సత్యవంతుడని చూపిస్తున్నాడు. ఈ వాదన ముందుకు సాగుతుంది. అపొస్తలుడు పౌలు 7 వ వచనంలో ఒక ఊహించే రీతిగా మాట్లాడుతున్నాడు. “నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?” ఇది సరియైన వాదనకాదు. మనుషుల పాపము వలన దేవునికి మహిమ కలగదు, ఎన్నటికీ కలగదు. అది నిజమే అయితే, దేవుడు పాపమునకు శిక్ష విధించకూడదు. పౌలు వాదించే విషయం ఇదే. అది నిజము కాదు. అది సరియైన ఊహాగానము కాదు. మనుషుల పాపము వలన దేవునికి మహిమ కలుగదు. మనుషుల పాపము దేవుని బాధ పెడుతుంది, ఆయనకు  కోపము పుట్టిస్తుంది.

ఒక వ్యక్తి మనసులో ఈ రకమైన తలంపులు ఉన్నట్లయితే ఎంత పాపము చేస్తే అంత దేవుని నీతి ప్రబలమవుతుందని తలంచుకుంటాడు. ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పాపము చేస్తే అంత దేవుని మహిమను చూపిస్తాడని అనుకుంటాడు. కాదు, అది సరియైన తలంపు కాదు. అది తప్పుడు స్వేచ్చ, స్వాతంత్రం అవుతుంది. అది తప్పుగా ఆలోచించే పద్ధతి. సరియైన సత్యం ఏమిటంటే, ఎంత పాపము చేస్తే అంత శిక్ష, అంత కఠినమైన శిక్ష  పడుతుంది. 

8 వ వచనము చివరి భాగము మనకు చాలా ప్రాముఖ్యమైనది. “అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే”. ఎంత ఎక్కువ పాపము చేస్తే అంత దేవునికి మహిమ కలిగిస్తామని ఎవరు తప్పుగా ఆలోచిస్తారో వారు దేవుని కఠినమైన శిక్షకు అర్హులు. సరిగ్గా చెప్పాలంటే, దేవుని నీతి న్యాయము మన పాపిష్టితనమును ఎత్తిచూపుతుంది. అనగా అది మరొక రీతిగా పని చేస్తుందని అర్ధం చేసుకోవాలి.

కాబట్టి  దేవుని నీతిని వ్యతిరేకించినపుడు, మనము ఉన్నదున్నట్టు ఆయన ఎదుట ఉన్నప్పుడు, ఆయన మనకు ఉన్నదున్నట్టు తెలిసినపుడు మన పాపపు స్థితిని గూర్చి ఏమి చేయాలో ఆలోచించాలి. దేవుడు దానికి పరిష్కారముగా తన అమూల్యమైన  కుమారుని ద్వారా మార్గం ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు పాపికి  శిక్ష విధించడం ద్వారా ఆయన సత్యవంతుడని చూపిస్తున్నాడు.

దేవుడు ఎల్లప్పుడూ సత్యవంతుడని అపొస్తలుడు ఎంత నిర్దిష్టంగా మనకు చూపిస్తున్నాడో ఆలోచించండి. మొదట, తన  ధర్మశాస్త్రమును ఇవ్వడం ద్వారా, ఆయన వాక్యం ద్వారా,  ఆ తరువాత ప్రపంచమునకు అత్యున్నత న్యాయమూర్తిగా తీర్పు చేయడం, న్యాయవంతుడైన న్యాయమూర్తిగా పాపికి శిక్ష విధించడం. ఎల్లప్పుడు సత్యవంతుడైన దేవుని పిల్లలముగా జీవించి ప్రవర్తించుదాం! అట్టి కృప ప్రభువు మనకనుగ్రహించు గాక! ఆమెన్!!


ప్రార్ధన:  సత్యవంతుడవైన దేవా,నీవు న్యాయవంతుడవు, సత్యవంతుడవు. నీవు ఎప్పుడైనా న్యాయము తప్పవు. సత్యము తప్పవు. నీ ముందు ప్రతి ఒక్కరూ దోషులే. ఈ పరమ సత్యం సజీవ నిరీక్షణ శ్రోతలందరూ తెలుసుకొనుటకు కృప నివ్వండి. మీ కుమారుని కృప కోరుకొని పాప శుద్ధి చేసుకొని మీ నిజమైన బిడ్డలముగా జీవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభువు నామమములో వేడుకుంటున్నాము తండ్రీ, ఆమెన్!!  

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...