రోమా పత్రిక అధ్యయనం – 12 3:27-31 దేవుడు నీతిమంతునిగా తీర్చినవాడు.

ఇదే అధ్యయనం వినడానికి వీలుగా ఏర్పాటు చేశాము. ఈ క్రింది ఆడియో మెసేజ్ వినండి:

 

                    రోమా పత్రిక అధ్యయనం – 12  3:27-31 

                  దేవుడు నీతిమంతునిగా తీర్చినవాడు.

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841


          ఆదివారం రానేవచ్చేసింది గదూ! ఇది ప్రభువు దినం. దేవుని వాక్యము సజీవమైనది, అనగా జీవముకలిగినది, మాట్లాదేశక్తికలది. కారణం, దానికి మూలం సర్వ సృస్త్తికర్త, పరిశుద్ధుడైన ఏకైక పరమతండ్రి. రండి, దేవుని వాక్యమును పారాయణం చేద్దాం!!

          పాపము అనే సమస్య ప్రపంచమంతా ప్రాకిపోయిందని చెప్పడానికి ఏ సందేహము లేదు. పాపమనే  సూత్రoతో అందరూ వ్యాధిగ్రస్తులయ్యారు. మనము ఆదాము సంతతి గనుక మనమందరము అలాగే ఉన్నాము. ఆదాము హవ్వ పాపము చేసిఉన్నారు గనుక దాని ఫలితంగా ప్రతి ఒక్కరిలో పాపమనే సూత్రం పుట్టింది.

          ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే పాపము నుండి కలిగే పర్యవసానాలు, ఫలితాలను ఏ విధంగా అరికట్టగలము? పాపమునకు కలిగే న్యాయతీర్పు నుండి ఏ విధంగా తప్పించుకోగలము? కొందరు ఈ విధంగా మరికొందరు ఆ విధంగా జవాబు చెప్తూఉంటారు. పాపము నుండి కలిగే ఫలితలనుండి మనమెలా తప్పించుకోగలము అనే ప్రశ్నకు సమాధానంగా మనము మంచిపనులు, నీతి క్రియలు చేయాలి అంటారు. మనము చేయగలిగిన మంచి పనులు చేయాలి, మనము చెడుపనులు దుష్ట క్రియలు చేస్తూ ఉంటాము గనుక మంచి పనులు చేయడం మంచిదే. కానీ ఈ ప్రశ్నకు ఇది సరియైన సమాధానామా?

          మరికొందరు మరో విధంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. నిజాయితీగా ఉండాలి అంటారు. నీవు ఏది  చేసినా నిజాయితీగా చేయాలి. ఇది ఈ ప్రశ్నకు నిజమైన సమాధానమా? మరొకరు పాపమునకు కలిగే ఫలితాలనుండి ఎలా తప్పించుకోగలo అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది అనవచ్చు. సమాధానంగా ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు, ఏదో ఒకటి చేసి ఆ బాధ నుండి బయటికి రావచ్చు, అని అంటారేమో.

          నా స్నేహితుడా, సోదరీ? ఈ జవాబులు ఏవి కూడా ఈ ప్రశ్నకు సరియైన సమాధానం కాదు. ప్రశ్న అలాగే ఉన్నది. ఈ జవాబులు కేవలం పైపైన కనపడే రోగలక్షణాలు మాత్రమే తొలగిస్తాయి. మూల సమస్య ఈ జవాబులు తీర్చలేనంత లోతైనది.

          పాపము అనే సమస్యకు బైబిల్ సమాధానమిస్తుంది. ఆపో. పౌలు రోమ్ లో ఉన్న క్రైస్తవులకు వ్రాస్తూ ఆయన నీతిమంతునిగా తీర్చే ఒక దేవుణ్ణి నిర్దిష్టంగా చూపించాడు.  పాపమునకు కలిగే దుష్పలితాలనుండి ఏ విధంగా తప్పించుకోగలమనే ప్రశ్నకు సమాధానం రోమా. 3:27-31 లో కనిపిస్తుంది.

27. కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే.
28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా

తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.
29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.

30 దేవుడు ఒక్కడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని

విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
31 విశ్వాసముద్వారా ధర్మశాస్త్ర మును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మ శాస్త్రమును స్థిరపరచుచున్నాము.

          పౌలు వాదననుబట్టి చూచి, కొన్ని ఖచ్చితమైన ప్రకటనను చేయడానికి నాకు నడిపింపు  కలుగుతున్నది. అవి నీతిమంతుని తీర్చే దేవుణ్ణి మహిమపరుస్తాయి.

అతిశయమునకు స్థానము లేదు.  ఈ లేఖన భాగములోని మొదటి వచనములో ఈ ప్రశ్న లేవెనెత్తబడింది. “అతిశయకారణ మెక్కడ? అది కొట్టివేయబడెను” అనగా ఆ రోడ్డు మీద రావడానికి వీలు లేదు. క్రియలు అతిశయమును కలిగిస్తాయి, అహమును పుట్టిస్తాయి, అవును, మనుషులు వారు చేసినవాటి గురించి అహంభావం చూపిస్తారు. చాలా సార్లు వారు చేసినవాటినన్నిటినీ జాబితా వ్రాస్తారు, వాటిగూర్చి చెప్తూఉంటారు.

          అపోస్టలుడు అతిశయమునకు స్థానము లేదు అంటూ ఉన్నాడు. క్రియల మీద ఆధారపడ్డానికి వీలు లేదు, కానీ విశ్వాసము మీద ఆధారపడవచ్చు. విశ్వాసము క్రియలను కొట్టివేస్తుంది. వాటిని ప్రక్కను నెట్టివేస్తుంది. స్వశక్తి చేత చేసేవి. విశ్వాసము దేవునివైపు చేతులు చాస్తుంది. విశ్వాసము క్రియలపైన ఆధారపడదు. విశ్వాసము దేవుని మీద ఆధారపడుతుంది. దేవునిమీద విశ్వాసముంచిన వ్యక్తి తాను చేసిన క్రియలపైన ఆధారపడడు. కానీ అతడు తన జీవితముకోసం దేవునిమీద ఆధారపడతాడు. విశ్వాసము దేవునిమీద ఆధారపడుతుంది.

            ఆజ్ఞలను పాటించడం తప్పుకాదు. దేవుని మీద ప్రేమతో ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తే మంచిదే, కానీ మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి, అనగా పాప క్షమాపణకోసం క్రియలపైన ఆధారపడడం తప్పు. ఎందుకనగా విశ్వాసము క్రియలను అధిగమించి దాటిపోతుంది. అందుచేత గర్వానికి తావులేదు. గర్వము, ఆహoకారము లేనపుడే నీతిమంతునిగా తీర్చే దేవునికి ఘనత!

          యూదులు కానివారు ఇందులో చేర్చబడ్డారు. దేవుడు అందరికీ దేవుడని అపొస్తలుడు స్పష్టగా చెప్పాడు. ఆయన కేవలం యూదులకు దేవుడు కాడు,  ఆయన యూదులు కానీవారికి కూడా దేవుడు. దేవుడు సార్వత్రికుడు, ప్రపంచమంతటికీ దేవుడు. బైబిల్ లేఖనాల ద్వారా ఆయన యూదులకు తనను ప్రత్యక్షపరచుకున్నాడని మనకు తెలుసు. అది సత్యం. అయినప్పటికీ, ఆయన యూదులకు ప్రత్యక్షమైనంత మాత్రాన యూదులుకాని వారినందరినీ బహిష్కరించలేదు. ఆయన తనంతట తాను యూదులు కాని వారికి కూడా దేవుడుగా ఉండాలని ప్రత్యక్ష పరచుకున్నాడు, ఎందుకనగా ఒక్కడే దేవుడు ఉన్నాడు. 

          30వ వచనం ఇలా చెబుతుంది: “దేవుడు ఒక్కడే”  కాబట్టి దేవుడు ఒక్కడే, మార్గము ఒక్కటే, ఇది ప్రాముఖ్యం. మనసులో స్పస్టంగా గ్రహించండి. యూదులకు దేవుడైన వాడే యూదులు కానివారందరికీ దేవుడు. ఎందుకనగా ఒక్కడే దేవుడు యూదులనైనా, యూదులు కానివారినైనా, నీతిమంతులుగా తీర్చగలడు. సున్నతి అనే మాట యూదులకు వర్తిస్తుంది, సున్నతిలేకపోవుట అనే మాట యూదులు కానివారికి వర్తిస్తుంది.

          ఒక్కటే త్రోవ ఉన్నది. అది విశ్వాసమనే త్రోవ. దేవుడు యూదులను విశ్వాసమువలన నీతిమంతులుగా తీరుస్తాడు. యూదులుకాని వారిని కూడా విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ సంగతి మీ మనసుల్లో లోతుగా నాటనీయండి. దేవుడు ఒక్కడే, మార్గము ఒక్కటే. దేవుడు ఒక్కడే కాబట్టి, యూదులు కానివారు, యూదులు కూడా ఇందులో చేర్చబడ్డారు. ఆయన ఏర్పాటు, ప్రణాళికలో నీతిమంతులుగా తీర్చడానికి అందరూ చేర్చబడ్డారు. యూదులు వారి విశ్వాసములో నుండి వస్తారు, యూదులు కానివారు విశ్వాసము ద్వారా వస్తారు. అందరూ విశ్వాసము అనే మార్గములోనే వస్తారు. అవును, దేవునికి స్తోత్రం! యూదులు కానివారు చేర్చబడ్డం చేత నీతిమంతులుగా తీర్చే దేవునికి ఘనత కలుగుతుంది.

          ధర్మశాస్త్రము సమాప్తమయ్యింది  ధర్మశాస్త్రమునకు దాని ఉద్దేశము ఉన్నది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవడం ప్రాముఖ్యము. ప్రజలకు వారి పాపములు దోషములు చూపించడానికి ధర్మశాస్త్రము ఇవ్వబడిoది. ఈ అధ్యాయములోని 19వ వచనములో ఆపో. పౌలు ఖచ్చితంగా స్పష్టపరిచిన విషయం ఏమిటంటే ప్రపంచములోని వారందరూ దేవునిసన్నిధిలో దోషులు, నేరస్థులని నిరూపించడానికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది.  ధర్మశాస్త్రమునకు ఈనాడు కూడా అదే ఉద్దేశ్యము ఉన్నది. దేవుని గురిని మనము ఎక్కడ తప్పామో అది ధర్మశాస్త్రము చూపిస్తుంది. అందుకే దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఆయన అక్కడ తన పరిశుద్ధతను ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధ దేవుని ప్రతిబింబం ధర్మశాస్త్రములో కనిపిస్తుంది. అంతే కాదు, ప్రజలు ఆయన అత్యున్నత పరిశుద్ధ ప్రమాణాలను వారి స్వంత ప్రయత్నాలచేత చేరలేమని ధర్మశాస్త్రము చూపిస్తుంది. క్రియలు దాన్ని బహిర్గతం చేస్తాయి.   

          31వ వచనములో పౌలు ఈ ప్రశ్న లేవదీస్తున్నాడు. “విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? ఆయన లేదని జవాబు చెపుతూ, నిజానికి దాని ద్వారా ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాము  అంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రము ఖండించి, మరణశిక్ష విధిస్తుంది, విశ్వాసము మట్టుకే విడుదల, నెమ్మదినిస్తుంది. విశ్వాసమునకు మరణశిక్షనుండి విడుదల నిచ్చి మరణశిక్షను ప్రక్కకు నెట్టివేసే శక్తిఉన్నది. విశ్వాసము  ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నది. ఎందుకనగా దేవుడు మనకు ఇవ్వటానికి సిద్ధపడ్డ పాప క్షమాపణను మన క్రియలచేత సాధించలేమని ధర్మశాస్త్రము చూపిస్తుంది.

          మొదటినుండి దేవుని ఏర్పాటు విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చడమే. కానీ అది ఆ విధంగా చేయడానికి ధర్మశాస్త్రము ఇయ్యవలసి వచ్చింది. దేవుని పరిశుద్ధ ప్రమాణాలను మానవులమైన మనముస్వంత క్రియల చేత ఎన్నటికీ సాధించలేమని అర్ధం చేసుకోవడానికి ధర్మశాస్త్రం అవసరమయ్యింది. దేవుని పరిశుధ్ధ ప్రామాణికాలు యూదులైనా, యూదులుకానివారైనా అందరూ ఇది గ్రహించడానికి ధర్మశాస్త్రం అవసరమయ్యింది.

          కాబట్టి, నా స్నేహితుడా, సోదరీ, ఈ ఖచ్చితమైన ప్రకటనలను జ్ఞాపకముంచుకొని, అర్ధం చేసుకొనండి. నీతిమంతులుగా తీర్చే ఒక్కడే దేవుడున్నాడు. గర్వమునకు  అహoభావమునకు స్థానం లేదు. యూదులు కానివారుకూడా  ఇందులో చేర్చబడ్డారు, బహిష్కరించబడలేదు. ధర్మశాస్త్రము సమాప్తమయ్యింది. దేవుడు క్షమాపణను అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చడానికి అధ్బుతమైన,  దివ్యమైన త్రోవ ఏర్పాటు చేసిఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన త్రోవలో నడవడం మొదలు పెట్టవచ్చు. దానికోసం అవసరమైన దైవ కృప, పరిశ్దుద్ధాత్మ సహాయము మనకందరికీ ప్రభువు అనుగ్రహించుగాక!   


రోమా పత్రిక అధ్యయనం 11 3:21-26 - క్షమాపణ ఉన్నది

 

         రోమా పత్రిక అధ్యయనం-11   3:21-26  -  క్షమాపణ ఉన్నది


  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841

         

           Praise the Lord! మీరంతా క్షేమoగా ఉన్నారు గదూ! “సజీవ నిరీక్షణ” శ్రోతలందరి కోసం ప్రార్ధిస్తూ ఉన్నాము. దేవుని వాక్యము మన హృదయములను తెప్పరిల్ల చేస్తుంది. నా మట్టుకు నేను ఈ ధ్యానాల ద్వారా ఎంతో విశ్వాసములో బలపడుతున్నానని సాక్ష్యమిస్తున్నాను. మీ సాక్ష్యం వినాలని ఆశిస్తున్నాను. ఇక వాక్య ధ్యానం లోనికి వెళ్దాం!  


          ఆపో. పౌలు రోమీయులకు వ్రాస్తూ ప్రపంచమంత దోషభరితమైనదని, అందుచేత ప్రజలందరూ మరణపు శిక్ష క్రింద ఉన్నారని తేట పరిచాడు. దేవుని మార్గమునకు బయట ఏ నిరీక్షణ ఆశ లేదు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు, వ్యతిరేకత జరిగినది. ఈ సత్యం మన క్రైస్తవ విశ్వాసమును ఇతర మతాలకు భిన్నమైనదిగా చేస్తుంది. దేవునికి  వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబడినా, మనము ఆయన వద్దకు తిరిగిరావడానికి ఆయన మార్గం ఏర్పాటు చేసిఉన్నాడు. కేవలం బైబిల్లోనే క్షమాపణకు ఖచ్చితమైన నిశ్చయమైన మార్గం మనకు కనిపిస్తున్నది. బైబిల్ క్షమాపణకు చూపించే పధ్ధతిలో వెళ్తేనే మనము క్షమించబడ్డామని తెలుసుకోవచ్చు.

          బైబిల్ తప్ప వేరే ఎక్కడ కూడా అందరూ పాపం చేసిఉన్నారనే దైవికమైన తీర్పు కనిపించదు. దీన్ని బట్టి బైబిల్ ప్రత్యేకమైనది. బైబిల్ లో తప్ప వేరే ఎక్కడా కూడా క్షమాపణ కనిపించదు. క్షమించబడవచ్చు అనే విషయం అందరికీ సంతోషము కలిగుస్తుంది, అందరూ స్వాగతిస్తారు. క్షమాపణ ఒక అద్భుతమైన సత్యం.

          ఆపో. పౌలు రోమీయులకు వ్రాసినపుడు వారికి క్షమాపణ ఉన్నది అని నిశ్చయపరిచాడు. దాని ఏర్పాటు, నిబంధనలు రోమా. 3:21-26 లో విశదపరిచాడు. 

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

          క్షమాపణ పొందటానికి వీలు కల్పించే నిబంధనలు కేవలం అవసరమైనవి, మాత్రమే దేవుడు ఏర్పాటు చేసిఉన్నాడు. ఆయనకు స్తోత్రం!

క్షమాపణ కోసం యేసు క్రీస్తు నందు విశ్వసించడం అనేది ఒక నిబంధన. దేవుని నీతి తేటగా ధర్మశాస్త్రము లోనూ,  ధర్మశాస్త్రమునకు మించికూడా దేవుడు  స్పష్టపరిచాడు అనే సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలిసిన అవసరత ఉన్నది. దేవుని నీతికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నాయని ఆపో. పౌలు మనకు చెబుతున్నాడు. ఇక్కడ సత్యమున్నది. దేవుని నీతి  ధర్మశాస్త్రమునకు మించి, దాటి,  ఉన్నది. అయినప్పటికి, దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యామిస్తున్నాయి. ఇది మనకెలా తెలుసు? 22వ వచనంలో ఉన్న విషయమేమంటే “దేవుని నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనది..”.  ఇక్కడ ఒక పద్ధతి తెలుస్తుంది. నా స్నేహితుడా, సోదరీ, దేవుని మార్గము తప్ప వేరే మార్గము లేదు. అది యేసు క్రీస్తు  నందు విశ్వసించుట.

          ఈ విశ్వాసము అందరికీ అందుబాటులో ఉంది. ఏ బేధము లేదు. 22వ వచనము ఏ బేధము లేదని ప్రకటిస్తుంది. “యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి” అది వర్తిస్తుంది. ఇది ప్రాముఖ్యం. ఇది ఎంత ప్రాముఖ్యమంటే నీవు దీన్ని మనసులో భద్రంగా పట్టుకోవాలి, పెట్టుకోవాలి.  యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణ సిద్ధపరచబడింది. నీవు ఎక్కడ ఏ ప్రాంతములో  ఉన్నా.  నీ తల్లితండ్రులు ఎవరైనా, నీ నేపధ్యమేదైనా, బేధం ఏమిలేదు. నీ జీవితపు పరిస్థితులు క్షమాపణకు నిన్ను దూరం చేయలేవు.

          ఈ క్షమాపణ అసమానమైనది, అద్వితీయమైనది. నీవు ఇతరులకోశం విశ్వసించలేవు, ఇతరులు నీ కోసం విశ్వసించలేరు. నీకోసం నీవే విశ్వసించాలి.  నీయంతట నీవే నీ కోసం విశ్వశిస్తే, తప్పక క్షమాపణ పొందుతావు.

          అవును, యేసు క్రీస్తు నందు విశ్వసిచుటద్వారా నీవు క్షమాపణ పొందగలవు. యేసు క్రీస్తునందు విశ్వసించడం ద్వారా క్షమాపణ పొందగల ఈ ఏర్పాటు, నిబంధన, విశ్వాసముంచాలని నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికీ ఉన్నది. ఈ సత్యం ఈ లేఖన భాగములో ఎంతో స్పష్టంగా ఉంది. కాబట్టి మనము యేసు క్రీస్తు నందు విశ్వసించడం వలన క్షమాపణ పొందడo దేవుడు చేసిన ఏర్పాటు అని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. 

          యేసు క్రీస్తు నందలి కృప చేత అనేది క్షమాపణ కోసం చేయబడిన మరొక ఏర్పాటు, నిబంధన. తరువాతి రెండు వచనములలో రెండు గొప్ప ప్రకటనలు ఉన్నవి. 23 వ వచ్చనములో ఒక ప్రకటన ఉన్నది. “ ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” వారి స్వేచ్చను బట్టి ప్రతి ఒక్కరూ పాపము చేసిఉన్నారు. ఏ ఒక్కరూ వారి పాపమునుబట్టి దేవుణ్ణి నిందించలేరు. ఎందుకనగా ప్రతి ఒక్కరూ వారి ఇష్టానుసారముగా పాపము చేసిఉన్నారు. ఆపో. పౌలు అందరూ పాపము చేసి గురి తప్పి ఉన్నారని చెబుతున్నారు. దేవుడు మనలను  తన మహిమకోసo సృష్టించాడు. కానీ మనము ఆ మహిమను పొందలేకపోతున్నాము. మనమంతా పొందలేక పోతున్నాము,  గురి తప్పిఉన్నాము, మనమంతా  పాపము చేసిఉన్నాము. అది మొదటి ప్రకటన.

          24వ వచనములో రెండవ ఆశీర్వాదకరమైన ప్రకటన ఉంది. “ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.” తనoతట తానే దేవుడు ఈ క్రియ చేసి విమోచనను ఏర్పాటు చేసిఉన్నాడు. ఏ ధర నిర్ణయించకుండానే! ఉచితముగా నీతిమంతులుగా తీర్చి, ఏ ధర మనవద్ద అడగకుండానే, ఏ విలువ చెల్లించకుండానే! దేవుడు తన కృప చేత క్రీస్తు యేసు నందున్న విమోచన నిచ్చి నీతిమంతులుగా తీరుస్తాడు. ఇది ఎంత మహిమకరంగా ఉందికదూ! అది చేయవలసిన ఆగత్యత ఆయనకు లేదు. ఆయన స్వంత ఇష్టపూర్తిగా మనకు రక్షణ ఏర్పాటు చేసిఉన్నాడు, క్షమాపణ మనకు విస్తరింపచేసి ఉన్నాడు. క్రీస్తు యేసు నందున్న విమోచన ద్వారా కృప చేత దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చుతాడు.

          మిత్రమా,  మరొక మార్గము లేదనే సంగతి నేను మీకు తప్పక మళ్ళీ చెప్పాలి. యేసు క్రీస్తు కృప చేత  క్షమాపణ కోసం ఏర్పాటు అందరికీ అందుబాటులో ఉంది. దేవుడు చేసిన ఈ ఏర్పాటు అందరి కోసం. 

         క్షమాపణ కోసం చేయబడిన ఏర్పాటులలో మరొకటి యేసు క్రీస్తు రక్తం. ఈ ప్రశస్తమైన సత్యం ముందున్న వచనములలో తేటపడుతుంది. మొదటిగా ఇది అవసరమైనది: దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తును నిర్దేశించాడు. దేవుడు ఆయనను తన రక్తము చేత ప్రాయశ్చిత్తం చేయడానికి నిర్దేశించాడు. యేసు ప్రపంచములోని అందరి పాపమును మోసుకొని వెళ్ళడానికి దేవుని గొర్రెపిల్లగా మారాడు.

ప్రాయశ్చిత్తము అనే ఈ మాటను జాగ్రత్తగా పరీక్షించాలి. ప్రాయశ్చిత్తం అంటే అర్ధం ఏమిటి? ఒకవేళ అది కఠిన మైన మాట  అనుకోవచ్చు గనుక నన్ను వివరించనీయండి. ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలములో  ఉండే కరుణాపీఠమునకు ప్రాయశ్చితమునకు సంభంధం ఉంది. మోషే సీనాయి కొండపైకి ఎక్కి దేవునినుండి ఆదేశాలను పొందాడు. ఆయన ఒక మందసమును నిర్మించాలని దేవుడు ఆదేశించాడు. అది దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. ఆయనమందసమునకు మూత చేయాలి. ఆ మూతను కరుణాపీఠం అని పిలిచారు. రెండు కెరూబులు ఒక్కొకటి ఒక్కొక్క వైపున దాన్ని కమ్ముకోవాలి. సంవత్సరమునకొకసారి ప్రధాన యాజకుడు ఆ కరుణాపీఠం మీద బలిరక్తం ఏడు సార్లు చిలకరించాలి. దేవుడు తన ప్రజల పాపమును కప్పివేయడానికి రక్తమును అంగీకరిస్తాడాని ఈ క్రియకు అర్ధం. ఎందుకనగా ఆ కరుణాపీఠం క్రింద ఉన్న మందసములో పాపమునుబట్టి ఉల్లంఘించబడిన దేవుని ఆజ్ఞలు ఉన్నవి.

రెండవ అంశము దాని ఉద్దేశ్యము. “ఆయన తన నీతిని కనువరచవలెనని పూర్వము చేయబడిన పాపములను  ..” యేసు సిలువ మీద రక్తము కార్చి మరణించకముందు చేయబడిన ప్రతి పాపము ఆయన చిందించిన రక్తము ద్వారా క్షమించబడ్డాయి. ఇది మనం అర్ధం చేసుకోవడం ప్రాముఖ్యం. దేవుడు క్షమించడానికి ఒక్కటే మార్గము యేసు క్రీస్తు చిందించిన రక్తమే. 

ఇంకా చూస్తే, పాత నిబంధన లోని బలులు దేవుని చిత్తమునకు అనుగుణంగానే  ఉన్నాయి. కానీ  ఆ జంతువుల బలులు కేవలం తాత్కాలికమైనవని లేఖనములు బోధిస్తున్నవి. అవి సంపూర్ణమైనవి కావు. కల్వరి సీలువ మీద యేసు క్రీస్తు చిందించిన రక్తము పరిపూర్ణమైనది, చివరిది. దేవుడు ఈనాడు పాపము క్షమించే మార్గమిది.

యేసు రక్తము ఏర్పాటు అందరికోసం చేయబడింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. కాబట్టి, మిత్రమా, ఇది నీకోసం, నా కోసం.

క్షమాపణ ఉన్నది, కానీ దేవుడు చేసిన ఏర్పాట్లు, నిబంధన ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ఏర్పాట్లు, నిబంధనలు ఏమిటనగా యేసునందు విశ్వసించడం ద్వారా, యేసు క్రీస్తు ప్రభువు కృప ద్వారా, యేసు రక్తము ద్వారా, ఆయన మన కోసం చేసిన ఈ క్రియ సరిగ్గా సరిపోతుంది. మరి ఏ రక్తము వలన కాదు. నేను చేసేది  ఏదైనగాని, దేవుని పరిశుధ్ధ నీతి ప్రమాణాలకు సరిపోవు. మనకోసం ఆయన చేసిన దాన్ని మనము ఒప్పుకొని, అంగీకరించాలి.   

నీ పాపము క్షమించబడాలని ఆశ  పడుతున్నావా? నీవున్న చోటనే ప్రార్ధించు. నీ స్వంత మాటలతోనే ప్రార్ధించు. యేసు క్రీస్తు ప్రభువు హృదయమును ఎరిగిన వాడు గనుక నీ పాపమును తప్పక క్షమించి నిన్ను శుద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.

 

ప్రార్ధన: శాశ్వతమైన ప్రేమతో నిండిన తండ్రీ, మేమంతా  పాపులమే. మా పాపము నుండి మేము ఏమి చేసినా విడుదల పొందలేము. అందుచేత మీ కుమారుడు యేసు క్రీస్తు పరిశుద్ధ బలిని ఏర్పాటు చేసి ఆయన సిలువ మీద కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం చేసినందుకు వందనములు. సజీవ నిరీక్షణ శ్రోతలందరు, వారి పాపము నుండి క్షమాపణ పొందడానికి మీ పరశుద్ధాత్మ సహాయము అనుగ్రహించమని క్రీస్తు నామమున ప్రార్ధిస్తున్నాము తండ్రీ, ఆమెన్!!

    

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...