2వ కొరింధీ-14 – 1:23-2:11 మూడవ భాగము #173
దైవభక్తి గల నాయకుని హృదయము – మూడవ భాగము
శ్రోతలూ, ఈ వారమంతా గడిచింది? ఈ మధ్యలోగాని, లేదా ఈ కార్యక్రమము జరుగుతుండగా గాని, లేదా మరెప్పుడైనా, అనుకోకుండా అకస్మాత్తుగా మీరైనా, నేనైనా ప్రాణం విడిస్తే ఏమవుతుంది? నా మట్టుకైతే, నేను పరలోకపు బాటలో నడుస్తూ ప్రభువుతో నా వ్యక్తిగత సంబంధమును సమాధానమును పొందానని, ఎప్పటికప్పుడు ప్రభువు నన్ను గద్దించినప్పుడల్లా నా జీవితమును, ప్రవర్తనను సరిచేసుకుంటున్నానని చెప్పగలను. మీరు చెప్పగలరా? కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అనుకుంటున్నారా? అకాల మరణాలు క్రొతకాదు. ఎప్పుడైనా, ఎవరినైనా మరణం సమీపించవచ్చు. లోతు భార్యకు పశ్చాత్తాపంతో ప్రభువు వైపు తిరిగే సమయము కూడా లేదు. ఆమె వెనుకకు చూచిన మరుక్షణమే సొదోమగొమోర్రాలను దహించిన తీర్పు అగ్ని ఆమెను కూడా కబళించి నిత్యనరకానికి పంపించింది. మీకు అలాంటి పరిస్థితి కలుగకముందే పాపము గురించి పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు ప్రభువు సిలువవద్ద క్షమాపణ మారుమనసు పొందమని మీలో ప్రతి ఒక్కరిని, ఏ భేదములేకుండా బ్రతిమాలుతున్నాను. ప్రార్ధించుకుందాం, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ప్రార్థన:
ఈ పూట మన ధ్యానాంశం, దైవభక్తి గల నాయకుని హృదయము – మూడవ భాగము. లేఖన భాగము: 1:23-2:11 మీ బైబిల్ అక్కడ తెరిచి సిద్ధంగా ఉండండి. గతించిన పాఠములో దైవభక్తి గల క్రైస్తవుడు, లేదా నిజమైన క్రైస్తవ విశ్వాసి , నాయకుని హృదయములో ఎటువంటి గుణములు ఉంటాయో పౌలు జీవితము ద్వారా తెలుసుకున్నాము. ఈ పాఠములో ఆ శీర్షికలోని మూడవ భాగమును తెలుసుకుందాం.
మూడవ గుణము, అతడు లేదా ఆమె మిక్కటమైన దయతో క్షమిస్తాడు, క్షమిస్తుంది.
II కొరింథీ 1:9 వచనo గమనించండి. అపో. పౌలు కొరింథీ సంఘస్తుల విధేయతను పరీక్షించాలని ఆశపడుతున్నాడు. వారు దోషము చేసిన సహోదరుణ్ణి క్షమించినట్టే, తాను కూడా ఆయనను క్షమిస్తున్నానని వారికి తన హృదయమును వెలిబుచ్చుతున్నాడు. తాను చెప్పినవిధంగా వారు చేసినా, చేయకపోయినా, సమావేశమై చేరివచ్చిన విశ్వాసుల సహవాసమునకు ఉన్న అధికారమును పౌలు గుర్తిస్తున్నాడు. దైవభక్తిగల నాయకుడు, లేదా విశ్వాసి అయినా, తాను చెప్పినట్టు ఇతరులు చేయాలని పట్టుపట్టడు, గాని, తగినంత స్వేచ్ఛతో సంఘస్తులు సరైన నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తాడు. ముఖ్యమైన విషయమేమిటంటే, తన దోషముగూర్చి పశ్చాత్తాప పడిన సహోదరుడు తిరిగి సంఘ సహవాసములోనికి వచ్చిన తరువాత, పరిపూర్ణమైన ఆదరణ, అభిమానము పొందాడా? లేదా? అంతే కాదు ఆయనను సంఘపు సహవాసములోనికి పరిపూర్ణమైన ప్రేమతో చేర్చుకున్నారో లేదో చూడడం. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇది సంఘ క్రమశిక్షణ విషయమైన అంశం. ఇది చాలా కఠినమైన, క్లిష్టమైన అంశం. అందుచేత పౌలు కొంచెం సున్నితంగా ఆలోచిస్తున్నాడు. ఆయన మాటల్లో కొంచెం సందిగ్ధత, స్పష్టత లేనట్టు కనిపిస్తున్నా దోషం చ్సిన సహోదరుడు పశ్చాత్తాప పడినందు చేత అతణ్ణి క్షమించమని బోధిస్తున్నాడు. కొరింథీ సంఘస్తులు తన మాట వినకపోయినా, వారిని కూడా క్షమిస్తున్నాడు. అపో. పౌలు ఒక క్రైస్తవ నాయకునిగా, తన ప్రజలకు శ్రేష్టమైనదాన్ని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము ప్రకారము ఎక్కడ నిజమైన విశ్వాసులు, యేసయ్య శిష్యులు కూడిఉంటారో అక్కడ యేసయ్య సన్నిధి ఉంటుంది. పౌలు వారితో భౌతికంగా లేకపోయినా, ఆత్మలో వారితో ఉండి, వారు చేస్తున్న వాటిని చూస్తూ ఉన్నాడు.
శ్రోతలూ, ఈ సందర్భములో క్షమాపణ గురించి క్రైస్తవ లోకంలో ఉన్న అపోహలు కొన్నింటిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. క్షమాపణ హస్తం అందించగానే క్షమించినవారు అంతా మరిచిపోయి క్షమాపణ పొందిన వ్యక్తిని మునుపటిలాగా చూడాలని అందరూ అపోహపడుతుంటారు. క్షమించబడ్డ వ్యక్తి తన పశ్చాత్తాపమును, మారిన ప్రవర్తనను చూపించడం అత్యవసరం. క్షమించవద్దని నేను చెప్పడం లేదు. అపార్థం చేసుకోవద్దు. పరిశుద్ధ గ్రంధం మనకు బోధించేది క్షమాపణ. కాని, క్షమాపణకు షరతులు ఉన్నవి. పాపము ఒప్పుకోవాలి. నీ పాపమునకు నీవు బాధ్యుడవని ఒప్పుకోవాలి. దీనముగా యధార్ధముగా నిష్కపటంగా హృదయపూర్వకంగా అడిగేవారిని ప్రభువు తప్పనిసరిగా క్షమిస్తాడు. సుంకరి ఎంత దీనముగా, తగ్గించుకొని క్షమాపణ వేడుకున్నాడో జ్ఞాపకముంచుకుందాం. దేవుని క్షమాపణ వేడుకుంటే, ప్రభువు తప్పక క్షమిస్తాడు. దేవుడు ఒక పాపిని, నిన్ను, నన్ను క్షమించిన తరువాత ఇష్టానుసారం జీవించడానికి అనుమంతించలేదు. పాపములనుండి క్షమాపణ పొందినవారు పరిశుద్ధపరచబడడానికి ఆతురతతో జీవిస్తూ ఉంటేనే అది నిజమైన మారుమనసు అవుతుంది. చాలా మంది క్రైస్తవులు అపార్థం చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంధములో కోకొల్లలు. మచ్చుకు ప్రభువును ధిక్కరించి వ్యభిచారమునకు సమానమైన విగ్రహారాధన చేయడం. ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఇశ్రాయేలీయులు. వారిని ప్రభువు ఎంత శిక్షించాడో లేఖనాలు స్పష్టంగా సాక్షామిస్తున్నాయి. ఈనాడు ఎంతోమంది బాప్టిస్మము తీసుకొని, ప్రభువు బల్లలో పాలు పొందుతూ విగ్రహారాధనలో పాలు పొందేవారు ఉన్నారు. జాగ్రత సుమీ! ఏదో ఒకవైపు, పరిశుద్ధుడైన దేవుని వైపో, లేదా నీకు తోచిన విగ్రహాలవైపో ఉండు గాని, రెండిట్లో ఉన్నట్లయితే నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. మరోమాట, ఒక విశ్వాసి పాపములో పడిపోతే, దేవుడు క్షమిస్తాడు కాని, కొంత ఆ పాపముయొక్క ఫలితాలు అనుభవింప చేస్తాడు. కారణం? ఎంత ఘోరమైన పాపములో పడ్డావో నీవు తెలుసుకోవాలని. క్షమాపణ ఉచితమైనా, మన రక్షకుడు తన ప్రాణము, రక్తము ఘోరమైన అవమానము, మనము గ్రహంచలేనన్ని శ్రమలు, హింస భరిస్తే కాని ఆ క్షమాపణ మన పక్షంగా మన స్థానములో సంపాదించాడని మనము గ్రహించాలి. క్షమాపణ చులకన కాదు. అత్యంత విలువైనది.
ఇక మన పాఠం నేర్చుకుందాం. పౌలు కొరింధీ విశ్వాసులకు ఒక తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నాడు. ఇది మీకు, నాకు, జాగ్రతగా తెలుసుకోవలసిన అవసరముంది. ఏమిటది? ఒక విశ్వాసి, యేసయ్య శిష్యుడు యధార్ధంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడినట్లయితే, ఆ వ్యక్తిని అంగీకరించి సహవాసములో మునుపటిలాగే చేర్చుకొని ప్రేమ అభిమానము అందించాలి. లేనట్లయితే, మన శత్రువు సైతానుకు అవకాశమిచ్చి, సంఘములో భేదాభిప్రాయాలు, చీలికలు, పార్టీలు కలుగడానికి మనము దారి చూపుతున్నాము.
దయతో క్షమించడమంటే, న్యాయానికి, కరుణకు సమతుల్యత తెలుసుకోవడం. పౌలు బోధిస్తున్న సత్యమేమిటంటే, శిక్ష హద్దుకు మించితే, యేసయ్య శరీరానికి శాశ్వతంగా నష్టం కలుగవచ్చు. సైతాను తంత్రములు మనము తెలుసుకొని ఉండాలి. వాడి ఒక బలమైన ఆయుధం ఏమిటంటే, మనలను విడదీసి, జయించడం. ఈ తంత్రమును వాడు చాలా రీతులుగా మన మధ్యలో చేస్తున్నాడు. మీ గ్రామములోని సంఘములో చేస్తుండవచ్చు. మీ కుటుంబములో చేస్తుండవచ్చు. సైతాను తంత్రము మనము తెలుసుకోకపోవడమే వాడికి తావిచ్చినట్టు. ఒక్కొక్కరికి ప్రభువు ఏ వరము ఇచ్చాడో, అది గ్రహించక పోవడం వల్ల సైతాను ఈ అజ్ఞానమును వాడుకుంటున్నాడు. కొందరు న్యాయబద్ధంగా అనగా కఠినoగా మాటలాడతారు. మరికొందరు దయతో కరుణతో మాట్లాడగలుగుతారు. ఇద్దరు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేస్తే, సమస్యలు ఏర్పడతాయి. కాని ఇద్దరు కలిసి ఒకరిని మరొకరు అర్ధం చేసుకొని, ఒద్దికతో మన్నికతో పనిచేస్తే క్రికెట్ టీం లో అందరూ కలిసి పనిచేసినట్టు విజయము సంపాదించవచ్చు. ఒక క్రైస్తవ నాయకుడైనా, సంఘ పెద్ద అయినా, పాస్టర్ అయినా, సువర్తికుడైనా, ఒక యేసయ్య శిష్యుడైనా, ఈ మూడు లక్షణాలు, గుణగణాలు మనకు అత్యవసరం. ‘నీ గురించి వారేమనుకుoటున్నారు’ అనే ప్రశ్నకు నీవు సమాధానం వెతుక్కోకూడదు. వారికి శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఏమిటో అది జరిగేలా చూడడం నీ బాధ్యత. నీ నోటిలోనుండి మాట బయటికి రాక ముందు దానిద్వారా ఎంత బాధ, వేదన, హింస నొప్పి ఇతరులకు నీవు కలుగచేస్తావో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ శీర్షిక ముగింపులో మూడు గుణలక్షణాలు జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఇతరులను మిక్కటంగా ప్రేమిస్తావా? లేదా ‘నా గురించి వారేమనుకుంటున్నారు’ అని ఆలోచిస్తావా? ఇతరుల మేలు కోరతావా, నీ మేలు, నీ క్షేమమే నీకు ప్రాముఖ్యమా? మన సంఘాల్లో అసలు ప్రేమ కనిపించదే! ఎంత ఘోరమైన స్థితిలో మనమున్నాము? నీ కంటే ఇతరులను మిక్కటంగా ప్రేమిస్తావా? నీ ప్రతి పనిలో, తలంపులో, ఆలోచనలో, మాటలో ఆ బలమైన ప్రేమ ఇతరులకు కనిపిస్తుందా? నీవు ఇతరులను దయతో, కరుణతో క్షమిస్తావా? “అభ్యంతరములు రాక తప్పవు” అని ప్రభువు సెలవిచ్చారు? అవి కలిగినపుడు నీవేలా స్పందించావు? ఎలా స్పందించబోతున్నావు? ధారాళంగా మనస్ఫూర్తిగా క్షమిస్తావా? సంఘము సరియైన తీర్మానాలు చేస్తుందా? ఒక్కరే అన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారా? ఈ గుణగణాలు, లక్షణాలు మనకు బాగానే అర్థమవుతూ ఉంటాయి. సమస్య ఎక్కడ ఉందంటే, ఇవి మన జీవితములో కలగాలంటే, నీవు నేను తగ్గించుకొని నేర్చుకోగలమా? అట్టి కృప ప్రభువు మనకందరికీ సమృధ్ధిగా అనుగ్రహించుగాక!