2వ కొరింధీ-13 - 1:23-2:11 - దైవభక్తి గల నాయకుని హృదయము – రెండవ భాగము

2వ కొరింధీ 1:23-2:11 రెండవ భాగము 

దైవభక్తి గల నాయకుని హృదయము – రెండవ భాగము 

రేడియో వద్ద బైబిల్, పెన్, నోట్ బుక్ తెచ్చుకొని కూర్చొన్న వారికందరికి వందనములు! అంతే కాదు హృదయములను సిద్ధపరచుకొని ప్రభువు నాతో ఏమి చెబితే అది చేస్తానని సంపూర్ణ దీనమనసుతో వచ్చిన మీ అందరినీ శక్తిగల దేవుడు, సజీవుడు మన హృదయములను తన ఆత్మతో నింపుగాక! దైవభక్తి గల నాయకుని హృదయము – రెండవ భాగమును ఈ పూట అధ్యాయనం చేద్దాం. రండి రేడియో కు దూరంగా ఉండి పనిపాటులతో అలిసిపోయినవారు కూడా రండి! మీ అలసట దేవుని వాక్యపు అధ్యయనములో సేద దీరుతుంది. లేఖన భాగము II కొరింధీ 1:23-2:11. ప్రార్థన:

దైవభక్తిగల నిజాయితీ పరుడైన క్రైస్తవ నాయకుని గుణ లక్షణాలు నేర్చుకుంటున్నాము. అపో. పౌలు స్వంత జీవితములో ఈ గుణాలక్షణాలు మనము చూస్తున్నాము. నేర్చుకుందాము. మొదటిది, అతడు జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తూ ఉంటాడు. 

రెండవది, అతడు గాఢంగా, త్యాగసహితంగా ప్రేమిస్తాడు. మొదట్లో మనము నేర్చుకున్నట్టుగా II కొరింధీ పత్రిక చాలా వ్యక్తిగత విషయాలతో నిండింది. 2:4లో చూచినట్లయితే పౌలు సంఘపు వారితో ఏ విధంగా మెలగాలో తెలుసుకోవడానికి కొంచెం కష్టపడుతున్నట్టు అర్థమవుతుంది. ఆ మాటల్లో ఆయన వ్యక్తం చేస్తున్న విషయం అది. ఆయన మాట్లాడే భాషలో చాలా తీవ్రమైన లోతైన భావావేశాలు కనిపిస్తున్నవి. ఆయన మొదటి పత్రిక ఎంతో కన్నీటితో ఆ పత్రికను ఈ సంఘస్తులు ఎలా అర్ధం చేసుకుంటారో అనే భయముతో వ్రాసినట్టుగా చెబుతున్నాడు. పౌలు ఉపయోగించిన మాటల్లో ఆయన హృదయ వేదన, భారము స్పష్టమవుతున్నాయి. దాదాపు ఆయన హృదయము తడబడుతున్నట్టు మూగబాధ అనుభవిస్తున్నాడు. భయానక దాడి జరుగుతున్నపుడు ఏ విధంగా ఫీలవుతామో పౌలు ఆ విధంగా ఫీలవుతున్నట్టు కనిపిస్తున్నది. 

కాని, లోతైన, తీవ్రమైన భావావేశాలు తన పత్రిక చదువరులను బాధ పెట్టకూడదని ఆయన ఆశ పడుతున్నాడు. ఆయన భావాలను బట్టి తాను వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది వారు తెలుసుకుంటారని ఆశపడుతున్నాడు. తన మొదటి పత్రికలో జారత్వములో ఉన్న వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో సంఘానికి రాశాడు. దాని విషయం మళ్ళీ 2:5 లో ప్రస్తావిస్తూ సున్నితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కాక, ఆయనకు తిరుగుబాటు చేస్తున్న గుంపు నాయకుడి విషయం కూడా ప్రస్తావిస్తూ ఉండవచ్చు. ఈ రెండు సందర్భాల్లో దొషులను గాని, దోషములను గాని ఆయన ప్రస్తావించడం లేదు. ఆ ఒక్కడి పాపమును బట్టి సంఘమంతా వేదన చెందుతుంది. కాని, సంఘస్తులకు గాని, ఆ దోషికి గాని బాధ కలుగుగుండా చూసుకుంటూ, కఠినమైన మాటలు మాట్లాడడం లేదు. దోషము చేసిన వాని దోషమును ఎత్తి చూపుతున్నప్పటికి, సంఘస్తులకు వేదన బాధ ఎక్కువ చేయడం ఆయనకిష్టం లేదు. ఆలాటి పరిస్థితుల్లో నేనున్నట్లయితే, వారి పాపములో పట్టుబడ్డ వారికి కలిగే అవమానము గూర్చి సంతోషిస్తానేమో! వ్యభిచారములో పట్టుబడ్డ స్త్రీని యేసు క్రీస్తు ప్రభువు వద్దకు తెచ్చిన పరిసయ్యులు అలాగే ఫీలయ్యారు. కాని పౌలు అలా చేయలేదు. సరిదిద్ది, క్రమశిక్షణ చేసే సమయములో కూడా కొరింధీయులను ఆయన మిక్కటంగా ప్రేమించాడు. ఈ రీతిగా పాపములో చిక్కుకున్న సహోదర సహోదరీలను ప్రేమించడానికి నాకు, మీకు దేవుని కృప అత్యధికంగా అవసరo.

దోషము చేసిన ఈ వ్యక్తి ఎవరైనప్పటికి, సంఘములో ఎక్కువ శాతము ప్రజలు ఆయనను క్రమశిక్షణలో పెట్టినారు. మత్తయి సువార్త 18వ ఆద్యాయములో మన ప్రభువు బోధించిన సత్యమును గమనించి చూస్తే, పాపమును ఖండించవలసిన క్రమము ఇదే! క్రమశిక్షణ చేయడం సంఘపు బాధ్యత. సంఘ నాయకులు ఆ విషయములో సంఘమును నడిపిస్తారు, కాని వారు తుది నిర్ణయము చేయకూడదు. పౌలు చెబుతున్నదేమిటంటే, సంఘము చేసిన క్రమశిక్షణ సరైనది. అది చాలు. దానివల్ల జరగవలసిన మేలు జరిగింది. మరో మాటలో చెప్పాలంటే, దోషము చేసినవాడు పశ్చాత్తాపపడి తన పాపమును గ్రహించాడు, ఒప్పుకున్నాడు. ఇది జరిగిందని మనకెలా తెలుసు? 

ఒకవేళ అది జరగకుండా ఉంటే, పౌలు స్పందన వేరుగా ఉండేది. ఆయన ఇచ్చే ఉపదేశం, బోధ వేరుగా ఉండేది. మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయమేమిటంటే, ఆ గుంపులోని కొందరు దోషము చేసిన సహోదరుణ్ణి క్షమించలేక పోతున్నారు. అతణ్ణి ఆ విధంగా చూడడం వల్ల ఆయనకు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తాము కాబట్టి అలా చేయవద్దని పౌలు వారికి బుద్ధి చెబుతున్నాడు. దానికి బదులు, ఆ సహోదరుణ్ణి క్షమించి, ఆదరించి, ప్రోత్సహించమని వారిని హెచ్చరిస్తున్నాడు. అవును, ప్రియులారా, ఆ సహోదరుణ్ణి కొంత కాలం సంఘములోనుండి బహిష్కరించారు. కాని ఇప్పుడు ఆయనను మళ్ళీ చేర్చుకొని ఆదరించాలి, లేనట్లయితే అతడు క్రుంగిపోయి, విశ్వాసములో నుండి పడిపోయే ప్రమాదమున్నది. ఈ సహోదరుడు తన దుఖ:ములో మునిగిపోవడం పౌలునకు ఇష్టం లేదు. ఆ సహోదరుడు పశ్చాత్తాపపడి మారుమనసు పొందినందుచేత, ఆయనను సంఘ సహవాసములోనికి సంపూర్ణంగా స్వీకరించి, వారి ప్రేమను ఆయనకు చూపించాలి. దాని ద్వారా, ఆయనకున్న ఆత్మీయ అధికారమునకు వీరు లోబడుటను నిర్ధారించాలి. 

క్రీస్తునందు ప్రియులారా, ఈ అంశమును అధ్యయనం చేస్తుండగా, నేను ఈ విషయములో ఎంత ఇంకా ఎదుగవలసి ఉన్నదో నాకు అర్ధమయ్యింది. ప్రత్యేకించి సంఘములో క్రమము, క్రమశిక్షణ, దిద్దుబాటు, చేసే విషయము చాలా సున్నితమైనది. దైవభక్తిగల నిజాయితి పరుడైన క్రైస్తవ నాయకుని రెండవ గుణము ఇక్కడ పౌలు జీవితములో మనకు స్పష్టమవుతుంది. అది పౌలునకు కొరింధీ సంఘస్తుల పట్ల ఉన్న ప్రగాఢమైన, మిక్కటమైన ప్రేమ. ఈ గుణమును మనమంతా అలవరచు కోవడానికి, నేర్చుకోవడానికి శ్రమించాలి. కాబట్టి దైవభక్తిగల నిజాయితి పరుడైన క్రైస్తవ నాయకుడు లోతుగా జాగ్రత్తగా ఆలోచిస్తాడు, అతడు లోతైన ప్రగాఢమైన ప్రేమను కలిగి ఉంటాడు. 

ప్రియ సోదరీ సోదరులారా, మన సంఘాల్లో పరిశుద్ధత కనిపిస్తుందా? ఈ విధమైన ప్రేమ కనిపిస్తుందా?? ఇతరులపట్ల పౌలునకున్న ప్రేమ, ఆలోచన, జాగ్రత్త మనలో కనిపిస్తుందా? దోషములో పడిపొయిన విశ్వాసిని ప్రేమతో గద్దిస్తారా? తప్పు దిద్దుతారా? “ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు” అని I యోహాను పత్రిక 4:8లో స్పష్టంగా పరిశుద్ధ గ్రంధం బైబిల్ బోధిస్తున్నది. కుటుంబములో, సంఘములో, మరెక్కడైనా, దేవుని పిల్లలు ప్రేమతో నిండి ఉంటారు. చివరికి క్రమశిక్షణ చేసినా, తప్పు దిద్దినా, గద్దించినా, ప్రేమతో చేయాలి. ఇది దేవుని వాక్యపు హెచ్చరిక. ప్రియ సంఘ కాపరులారా, సువార్తికులారా, సంఘ పెద్దలారా, పరిచారకులారా, విశ్వాసులారా, మన సంఘాల్లో ప్రేమ, దయ, పరిశుద్ధత, కనికరం, క్షమాపణ, క్రమము, క్రమశిక్షణ, దిద్దుబాటు, గద్దింపు కనిపించేదెప్పుడు? అది నీతో, నాతో ఆరంభం కావాలి.  

ప్రార్థన:  దేవుని వాక్యపు వెలుగులో మన జీవితములను, హృదయములను పరీక్షించి చూసుకొని, ప్రభువు ప్రేరేపించిన విధంగా మీ స్వంత మాటలలో ప్రార్ధన చేసుకొనండి.  


            


II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...