I కోరింథీ-41 12:4-6
పరిశుద్ధాత్ముని కేంద్రీయత, అత్యవసరత
శ్రోతలందరికీ శుభములు, వందనములు! మీరు బాగున్నారా? పరిచర్య భారమునుబట్టి, కొన్ని మునుపటి
అధ్యయనాలు మళ్ళీ ప్రసారం చేయబడినవి. రెండవసారి వచ్చినందు చేత ఇదంతా నాకు తెలుసు, ఇంతకుముందే
విన్నాను అనుకున్నారా? లేక ఇప్పుడు ప్రభువు నాతో ఏమి నేర్పించాలని ఇది అనుమతిస్తున్నారని ఆయన స్వరము
వినాలని ప్రభువునకు మనవి చేశారా? ఈ నాటికీ, ఎన్నిసారులు చదివినా, పరిశుద్ధ గ్రంధం బైబిల్ లోని ప్రతి మాట
నాకు క్రొత్తగానే వుంటుంది. ప్రభువు ఈ నాడు బోధించే విషయము క్రొత్తది, కానీ అదే గ్రంధములోనుండి, అదే
మాటలలోనుండి? గతించిన అధ్యయనములో నుoడి నేర్చుకున్న సత్యము చాలా అద్భుతమైనది. అదే
పరిశుద్ధాత్మునితో మన సంబంధానికి పునాది రాయి లాంటిది. నీ జీవితానికి యేసు క్రీస్తు రక్షకుడే కాదు, ఈ నాడు
కూడా ప్రభువై ఉండకపోతే, ఆయనకు నీవు నీ జీవితము, హృదయము మీద సర్వాధికారము ఇవ్వకపోతే,
పరిశుద్ధాత్ముని పరిచర్య విషయం నీకేమీ అర్ధం అర్ధం కాదు, బోధపడదు. ఇది కేవలం ఒక బడిలో కూర్చొని అన్నీ
కంఠస్థం చేసిన విద్యార్థి లాగే ఉంటుంది. కాబట్టి, ఈ ఆధ్యాత్మిక సత్యమును మొదటిగా మీ జీవితానికి అన్వయించుకోండి.
ఒక ముఖ్య ప్రకటన: చదువు లేనందున, లేదా మరే కారణము చేతనైనా పరిశుద్ధ గ్రంధం బైబిల్
చదవలేకపోతున్నారా? ఆది కాండం నుండి ప్రకటన వరకు, వినాలని ఆశపడుతున్నారా? మీ కోసం “ఆడియో
బైబిల్” అనే చిన్న ఉపకరణం అందుబాటులో ఉన్నది. దీనికి అదనంగా, ఈ ఉపకరణములో రోమా పత్రిక
అధ్యయనాలన్నీ మెమొరీ కార్డ్ లో పొందుపరచబడ్డవి. కావలసినవారు ఉదయం 10 నుండి సాయంత్రం 6 లోపల
ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు. ముగింపులో ఫోన్ నంబర్ ఇవ్వబడుతుంది.
ప్రార్థన:
I కోరింథీ 12: 4-6 వచనాలు ఈ పూట ధ్యానిస్తున్నాము. అంశం: పరిశుద్ధాత్ముని కేంద్రీయత, అత్యవసరత, ప్రాముఖ్యత.
“4. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.
5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.
6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.
7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది.
ఇచ్చోట అపోస్తలుడు ఒకే ఆత్మ ఏ విధంగా భిన్నత్వాన్ని నిర్వహిస్తాడో బోధిస్తున్నాడు. “కృపావరములు నానా విధములుగా ఉన్నవి” అనే మాటలు జాగ్రతగా గమనించాలి. ఇవి ఆత్మ వరములు. “కారిస్మాటిక్” అనే మాట ఇక్కడనుండే వచ్చింది. “కారిస్” అంటే కృప. మరి ఈ కృపావరం పుట్టుకతోనే వచ్చిందా? లేదా అది ఒక ప్రత్యేకమైన వరమా? కొందరు స్వాభావికంగా అభివృద్ధి చేసుకొనేవి, మరి కొందరు చేసుకోలేరు. వరములలో భిన్నత్వము, అనగా వేరు వేరు వరములు ఉన్నవి, కానీ ఒకే పరిశుద్ధాత్ముడు అన్ని వరములను అనుగ్రహించి అనేకులచేత వాడబడడానికి శక్తిని ఇస్తూ ఉంటాడు. ఈ ఆత్మీయ వరములు ఆత్మీయమైన దాతృత్వముగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే దానములు. ఈ దానములలో ఆయనే కీలకమైన దాతగా ఉంటాడు.
ఇచ్చే విధానం, నిర్వహించే పద్ధతి వేరు వేరుగా ఉన్నప్పటికీ ప్రభువు ఒక్కడే! “నిర్వహించడం” అనే మాట, వరము అనే మాట వేరైనా మాటలు. అనగా సేవ చేయడం అని అర్ధం. “సేవ” అని సంబోధించే ఈ మాట “డియకనాస్” అనే గ్రీక్ మాటలోనుండి వచ్చింది. అందులోనుండి “డీకన్” అనే మాట వచ్చింది. ఇదే అపోస్తలుడు వ్రాసిన కాపరత్వపు పత్రికలలో “సేవకులు” సేవ చేయడానికి ఏర్పాటు చేయబడ్డారు. ప్రభుత్వం, పెత్తనం చేయడానికి కాదండీ! వారు యజమానులు కాదు, అధికారులు అంతకూ కాదు. కానీ వారు జాగ్రతగా పరిచర్య, సేవ చేసే సేవకులు. ఈ విషయమును మనమంతా జాగ్రతగా అర్ధం చేసుకొని విధ్యాయత చూపాలి.
పౌలు బోధిస్తూ, “ప్రభువు ఒక్కడే” అంటూ ఉన్నాడు, గమనించారా, శ్రోతలూ? “ప్రభువు” అనే ఈ మాట ప్రాముఖ్యమైనది. అది గ్రీకులో “కురియాస్” అనే మాట. దాని అర్ధం, సంచాలకుడు. ఆదేశాలు ఇచ్చి నడిపించే నాయకుడు. ఒక బోధకుడు అన్న మాటలు ఏమిటో విన్నారా? “యేసు క్రీస్తు అందరికీ ప్రభువైనా అయి ఉండాలి, లేదా ప్రభువు కాకుండానైనా ఉండాలి”. మధ్యస్థం లేదని మనము స్పష్టంగా గ్రహించాలి. ప్రతి సేవ ఆయన అధికారము క్రింద చేయాలి, ఆయనకు లోబడి చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రక్రియ, ప్రతి నిర్వహణ ప్రభువు నాయకత్వములోనే ఉండాలి. ఆయన సేవను ప్రభువే అజమాయిషీ చేస్తూ, ఆజ్ఞలిస్తూ ఉంటాడు. వేరు వేరు సేవలు ఉన్నా, ప్రభువు ఒక్కడే! హల్లెలూయా! పరిశుద్ధాత్ముని కేంద్రీయత, ప్రాముఖ్యత, అవశ్యకతను గమనిస్తున్నారా, శ్రోతలూ? ఆతరువాత క్రియలలో, చర్యలలోభిన్నత్వము ఉన్నదిగాని, అందరిలో అన్నింటినీ చేసేది ఒక్క దేవుడే అని పౌలు బోధిస్తున్నాడు. కార్యాలు, చర్యలు, స్ఫూర్తి లేదా శక్తి నిచ్చేవాడు ప్రభువే! ఒక్క ప్రభువే అన్ని పనులను, క్రియలను, స్ఫూర్తినిచ్చేవాటిని చేస్తూ ఉంటాడు. ఉద్దేశంలోనైనా, అర్ధములోనైనా, భిన్నత్వముండవచ్చు, కాని, అదే ప్రభువు అన్నింటినీ చేస్తూ ఉంటాడు. మూలమైన ఉద్దేశం స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది. అదేమిటి? పరిశుద్ధాత్ముడు కేంద్రీయ స్థానములో ఉన్నాడు. గనుక పరిశుద్ధాత్ముని ప్రత్యక్షత ప్రతి ఒక్క విశ్వాసికి, మేలు చేయడానికి ఇవ్వబడింది. పరిశుద్ధాత్ముని కేంద్రీయతనుబట్టి ఆయన వేరు వేరు వరములలోనైనా, వేరు వేరు సేవలలోనైనా, వేరు వేరు క్రియలలోనైనా, ఆయనే ఉండి కార్యసిద్ధి కలిగిస్తాడు. ఒకే దేవుడు పని చేస్తూఉన్నాడు. మూల ఉద్దేశం ఏమిటి? విశ్వాసులు, దేవుని ప్రజలకు ఒకరికొకరు మేలు, దీవెన, అభివృద్ధి కలిగించడానికి ఆయన ఈ కార్యాలు చేస్తూ ఉంటాడు.
ఒక విషయం గమనించాలి. ఇక్కడ త్రిత్వము, అనగా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి పనిచేస్తూ ఉన్నారు. వారి పని చేస్తున్న క్రమము ఇదే! పరిశుద్ధాత్ముడు, కుమారుడు లేదా ప్రభువు, దేవుడు లేదా తండ్రి. 4వ వచనములో "ఆత్మ", 5వ వచనములో "ప్రభువు", 6వ వచనములో "దేవుడు" అనే మాటలు గమనించండి. ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు, ప్రభువు అనగా యేసు క్రీస్తు ప్రభువు, దేవుడు అనగా తండ్రి. వీరు ముగ్గురూ, విశ్వసిస్తున్న
వారందరి మేలు, దీవెన, అభివృద్ధి కోసం
కలిసి పనిచేస్తూ ఉన్నారు. అలాగే మనము మన తోటి విశ్వాసులతో, భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లితండ్రులు విశ్వాసులైన పిల్లలతో, విశ్వాసులైన పిల్లలు విశ్వాసులైన తల్లితండ్రులతో, సంఘములోని ఏ కులము వారైనా, ఏ మతము వారైనా, ఏ ఆర్ధిక స్థాయిలోని వారైనా, విశ్వాసులైన వారందరూ దేవుని కుటుంబములో ఐక్యపరచబడ్డారు గనుక కలిసి పనిచేయవలసిన బాధ్యతమన అందరిమీద ఉన్నది. ఈ ప్రాముఖ్యమైన సత్యమును గమనించాలని మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుతున్నాను.
ఈ మహా శక్తి గలిగిన సత్యమును గ్రహిస్తున్నారా? అందరూ ఒక్కటే పని చేయడము జరగదు. వేరు వేరు పనులు, సంఘములో, దేవుని రాజ్య కార్యములలో మనమంతా దేవునికి సేవ చేయాలి, జాగ్రత సుమీ, మీ ఇష్టమైనది కాదు, దేవుని ఆజ్ఞ, పిలుపు, ఆదేశం ప్రకారం చేయాలి. మనుష్యులని సంతోషపెట్టడానికి కాదు, మనలను ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న యేసు క్రీస్తు ప్రభువును సంతోష పెట్టడానికి, ఆయన చెప్పింది చేయాలి. ఎవరికి ప్రభువు ఏ వారము, ఏ శక్తి, ఏ సామర్థ్యము అనుగ్రహిస్తే దాన్ని వినయముగా చేయాలి. గర్వానికి, అతిశయించి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి కాదు. నీవు చేసేది ప్రభువు కోసం ఆయన ఆదేశమునుబట్టి చేస్తున్నావని చూసేవారందరూ గ్రహించి దేవుని మహిమపరుస్తారు. ఈ విధంగా దేవుని పిలుపునందుకొని ఆయన ఇచ్చే శక్తి మేరకు నిన్ను నీవు ప్రభువు సంఘపు పరిచర్యలో నీవున్న నీ సంఘములోనే ప్రభు నీకు చెప్పిన సేవ చేయడానికి నీవు సిద్ధమా? ప్రార్థన: