I కొరింథీ అధ్యయనం-18 6:12-20
క్రైస్తవ ప్రవర్తన
మీ బైబిల్ తెరిచి అ. కా. 4:12 గమనించండి: “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” దేవుని పరిశుద్ధ గ్రంధం బోధిస్తున్న ఈ అత్యవసరమైన సత్యముగూర్చి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రక్షణ అంటే నీ సృష్టికర్తతో నీకు సంబంధం కలుగుతుంది, దానివల్ల మరణిoచిన తరువాత పరిశుద్ధుడైన దేవునితో నిత్యం మహిమ శరీరములో జీవించడానికి మార్గ మేర్పడుతుంది. నిత్య నరకమును తప్పించుకుంటారు. ప్రియ స్నేహితుడా, సోదరీ, నీ జీవితములో ఇంతవరకు నీ పాపములు యేసు క్రీస్తు ఎదుట ఒప్పుకొనకపోతే, ఇప్పుడే చేయవచ్చు. ఇదే మీ తరుణం!
ఈ దినం మన అంశం క్రైస్తవ ప్రవర్తన. I కోరింథీ 6:12-20 గమనించి చూడండి. క్రైస్తవునిగా ప్రవర్తించడానికి, మన శరీరమునకు సంబంధించిన మూడు మూల సత్యములు ముడిపడి ఉన్నవి. వాటిని ఆపో. పౌలు ఎలా బోధించాడో ఈ దినాన్న అధ్యయనం చేద్దాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చోండి. మొదటి మూలసత్యము సృష్టిని బట్టి శరీరం ప్రభువు కోసమే! 12వ వచనమునుండి చదువుకుందాం. “అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను. భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.౹ దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.” ఆదికాండమువరకు వెనుకకు పోతే, దేవుడు తనకిష్టమైన రీతిగా మానవ శరీరమును సృష్టించినట్టు తెలుస్తున్నది. ఆదాము ఒక పసివాడు కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిపూర్ణంగా ఎదిగిన మానవుడుగా ఆదాము సృష్టించ బడ్డాడు. దేవుడు ఆదామును తన స్వరూపములో నిర్మించాడు. కాబట్టి నీ శరీరము సృష్టినిబట్టి దేవుని కోసమే! శరీరము పరిసరాలతో అనుబంధం కలిగిఉంటుంది. దానికి ఐదు ఇంద్రియాలు ఉన్నవి: 1)దృష్టి 2)వినికిడి 3) అనుభూతి 4) రుచి 5) వాసన ఈ ఐదు ఇంద్రియాలద్వారా మనచుట్టూ ఉన్న పరిసరాలను గ్రహించగలుగుతున్నాము. ఆపో. పౌలు అంటున్న మాటలు
గమనించండి. “ అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు.”
స్వాతంత్రమున్నవన్నీ చేయడానికి వీలు లేదు. మన ప్రవర్తన దేవుని వాక్యానుసారంగా ఉండాలి.
ఆలోచించవలసిన అవసరత ఉన్నది. అది ప్రయోజనకరమైనదేనా? ఇది అవసరమా? దానివల్ల
మేలుకలుగుతుందా? అవసరమనిపించేవి హానికరమైనవి కావచ్చు! క్రైస్తవ ప్రవర్తన అంటే సృష్టినిబట్టి
శరీరము దేవునికి చెందిందనే సత్యమును జాగ్రతగా జీవించడం! ఒక దైవజనుడు ఏమని బోధిస్తున్నాడో
గమనించి నేర్చుకుందాం. కొందరికి మనసులో, హృదయములో చాలా శక్తివంతమైన గుణములు
ఉండవచ్చు. పదునైన ఆలోచనాశక్తి, గ్రహించగల జ్ఞానము, మంచి ఉత్సాహం మొదలైన గుణములు
ఉండవచ్చు. కానీ వాటన్నిటిని కలిపి తన వ్యక్తిత్వమును రూపాంతరం చెందించే కృప లేకపోవచ్చు. ఈ
శక్తివంతమైన గుణములు మంచివే అయినా, వాటిని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉండవచ్చు. సృష్టిలో
కొన్ని శక్తులు బలమైనవే కానీ అవి మేలు కలిగించవు. అలాగే ఈ మానసిక ప్రవృత్తులు కూడా
శక్తివంతమే అయినా ఉపయోగకరమైనవికాదు. నీయిష్టప్రకారం చేసే నిర్ణయాలు గుడ్డివి, అక్రమమైనవి,
దుర్నీతికరమైనవి, నీతిలేనివి. అందుచేత అవి నిజమైన స్వేచ్ఛను ఇవ్వవు. మీ ఆలోచనాశక్తిని
అదుపులోపెట్టి, దాన్ని పరిశుద్ధాత్మునిద్వారా దేవుని శక్తితో జతచేసినట్లయితే అది నిజమైన
నీతివంతమైన స్వేచ్ఛ. ఎందుకనగా దేవుని చిత్తము పరిశుద్ధమైనది, న్యాయమైనది, మంచిది కూడా.
అవును, శరీరము సృష్టినిబట్టి ప్రభువునకు చెందినది. ప్రియ సోదరీ, సోదరుడా, నీ శరీరాన్ని దేవునికి
సమర్పించావా? రోమా. 12:1-2 శ్రోతలూ, శరీరమును దేవునికి సమర్పించడానికి దేవుని చిత్తము
తెలుసుకోవడానికి ఎంత దగ్గరి సంబంధముందో జాగ్రత్తగా పరీక్షించండి.
క్రైస్తవనిగా ప్రవర్తించడానికి అవసరమైన రెండవ మూల సత్యము, విమోచననుబట్టి నీ శరీరము
క్రీస్తులో భాగము, అవయవము. I కోరింథీ 6:15-18 గమనించండి. “మీ దేహములు క్రీస్తునకు
అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క
అవయవ ములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై
యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా? అటువలె
ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు. 18 జారత్వమునకు దూరముగా
పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము
చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. “
15వ వచనములో ఉన్న ప్రశ్న ఏమిటి? “మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని
మీరెరుగరా?” మరి దేవుని అవయమును తీసుకొని వ్యభిచారిణితో కలిపే హక్కు మీకెవరిచ్చారు? పౌలు
ఇస్తున్న హెచ్చరిక గమనించాలి. “అదెంతమాత్రమును తగదు.” అంటే ఆ విధంగా ఎన్నటికీ జరగకూడదు.
అని అర్ధం. ఈ ఆంక్ష సరిగ్గా ఉందికదూ! మీరిప్పుడు మీ శరీరానికి యజమాని కారు. క్రీస్తు యజమాని.
నీవు ఆయన సేవకుడవు. నీవు క్రైస్తవ విశ్వాసివి అయితే, నీ శరీరము మీద ఆయనకు అధికార
మున్నది. నీశరీరాన్ని నీవు కంట్రోల్ చేసినట్లయితే, క్రీస్తు అధికారాన్ని తృణీకరించినట్టు. వారి శరీరాలను,
వారి కిష్టమువచ్చినట్టు వాడుకునే క్రైస్తవ విశ్వాసులు దేవుని వాక్యమును శ్రధ్ద్ధగా వినాలి, విధేయత
చూపాలి. క్రీస్తును రక్షకునిగా విశ్వసించని వారుకూడా, వారి శరీరాలను ఏ విధంగా దుర్వినియోగం
చేస్తున్నారో, దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుంది. వారికి కూడా హక్కులున్నాయి, వారికిష్టం
వచ్చినట్టు నిర్ణయాలు చేసుకోవచ్చు. కానీ వాటి ఫలితాలు దేవుడు నిర్ణయిస్తాడు అవి ఎంతో గూఢంగా
ఉంటాయి.
ఈ రోజుల్లో జరుగుతున్న లైంగిక పాపములు మన సమాజములో ఎంతో ఘోరమైన శాపమును
కలిగిస్తున్నాయి. వాటినిబట్టి ఎన్ని ఘోరమైన రోగములు వ్యాపిస్తున్నాయో గమనించoడి. 18వ
వచనములో పౌలు హెచ్చరికను జాగ్రతగా వినండి: “జారత్వమునకు దూరముగా పారిపోవుడి.” లైంగిక
పాపములకు దూరముగా ఉండండి. వాటి పరిసరాల్లోకూడ ఉండవద్దు. మరొక బైబిల్ పండితుడు ఏమని
బోధిస్తున్నాడో జాగ్రతగా తెలుసుకుందాం. మనము దానినుండి తప్పించుకోవాలి. దానిగురించి
మాట్లాడకూడదు, చర్చించకూడదు. దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాను అనుకోవద్దు. నేను ఎంత
బలవంతుడనో పరీక్షించుకుంటానని ఎన్నడూ తలంచవద్దు. కొన్ని పాపములను ఒక వ్యక్తి
ప్రతిఘటించగలడేమో, కానీ ఈ పాపము విషయములో కాదు. దీని విషయములో తప్పించుకోవడం,
పారిపోవడము ఒక్కటే మార్గము. ఏ మాత్రము దాని గురించి ఆలోచించకపోవడమే నిజమైన విజయానికి
మార్గము. ఏ మాత్రము ఆలోచన, చర్చ చేసినా కూడా, ప్రమాదకరమే. ఎందరో స్త్రీ పురుషులు వారి
జీవితాల్లో అపవిత్రులు. ఎన్నో సమాజాల్లో అతిఘోరమైన అపవిత్రత విస్తారంగా వ్యాపించడానికి లైంగిక
పాపములు కారణము. ప్రియ సోదరీసోదరులారా, దేవుని పరిశుద్ధ లేఖనము ఆయన పరిశుద్ధాత్ముని
ద్వారా హెచ్చరిస్తున్నది. విచ్చలవిడిగా జీవించే విశాల మార్గము నిత్య నరకానికి తప్పక తీసుకువెళ్తుంది.
క్రమబద్ధమైన ఇరుకుమార్గము, పాపమును అసహ్యించుకొని జారత్వపు పాపమునకు దూరముగా
పారిపోయే పరిశుధ్ధులే ప్రభువు సన్నిధి అయిన పరలోక మహా భాగ్యాన్ని పొందుతారు. కాబట్టి మన
క్రైస్తవ ప్రవర్తనలో విమోచనము ద్వారా మన శరీరాలు క్రీస్తు రక్షకునిలో భాగమని ఎన్నటికినీ మరచి
పోకూడదు.
మూడవ మూల సత్యము పరిశుద్ధాత్ముడు మనలను స్వాధీనము చేసుకొన్నందునుబట్టి మన శరీరాలు ఆయనకు
దేవాలయాలు. I కోరింథీ 6:19,20 మీ బైబిల్లో గమనించండి. ఈ వచనాలను కంఠస్థం చేయడం చాలా మంచిది. దీన్నే
సామెతల గ్రంధం కంఠభూషణముగా అనగా మెడలో వేసుకునే గొలుసులాగా ధరించమని సెలవిస్తుంది. “మీ దేహము
దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు
కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.” మారుమనసు కలిగినపుడు
హృదయములో యేసు క్రీస్తుప్రభువు జీవించడం ఆరంభమవుతుంది. పరిశుద్ధాత్ముని కలిగిఉండే విషయం చాలా
అభిప్రాయ భేదాలు ఉన్నాయని మనకందరికీ తెలుసు. కొందరు, నేను మారు మనసు పొందాను, కానీ నేనింకా
పరిశుద్ధాత్మను పొందలేదు అంటారు. కానీ నీవు నిజముగా మారుమనసు పొందిన వ్యక్తివి అయితే నీవు
పరిశుద్ధాత్ముని పొందిన వ్యక్తివే, దానికి రుజువు ఏమిటి? I కోరింథీ 12:3 “దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును
యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు
తెలియజేయుచున్నాను.” శ్రోతలూ, బోధపడిందా? నీవు యేసు ప్రభువు ప్రభుత్వానికి మీ హృదయాన్ని
అప్పగించికున్నట్లయితే, నీలో పరిశుద్ధాత్ముడు జీవిస్తున్నాడు. ఆయన దేవుని వరము. “దేవునివలన
అనుగ్రహింపబడి,” అనే మాటలను, మీరు “మీ సొత్తు కారు” అనే మాటలను చాలా జాగ్రత్తగా
గమనించాలి సుమా! అంతే
కాదు, క్రీస్తు రక్షకుడు పరిశుద్ధాత్ముడి రాక గురించి తన శిష్యులతో వాగ్దానం చేశారు. పరిశుధ్దాత్ముడు వారితో, వారిలో
ఉంటాడని చెప్పారు. అందుకే “మీరు మీ సొత్తుకారు” అని పౌలు ఉద్ఘాటిస్తున్నాడు. జాగ్రతగా వినండి, మారు మనసు
పొందినపుడు, అనగా క్రీస్తు రక్షకుడు నీ హృదయములో జీవిస్తున్నపుడే, పరిశుద్ధాత్ముడు కూడా నీ హృదయములో
జీవిస్తుంటాడు. ప్రభువు చెల్లించిన విలువ ఏమిటి? క్రీస్తు రక్షకుని రక్తము. ఈ కారణముగా మీ శరీరాలతో, ఆత్మలతో
దేవుని మహిమపరచండి. ఆయనకు మీ శరీరము మీద అధికారమున్నది.
కల్వరి సిలువమీద యేసు క్రీస్తు రక్తము చిందించకపోయిఉంటే మీరు, నేను నిత్యత్వము నిత్య నాశనమునకే వెళ్ళేవాళ్ళము. ఇక వేరే ఆశ, నిరీక్షణ మనకు లేవు. దీని ద్వారా మనకు తండ్రితో సమాధానము కలిగింది, హల్లెలూయ! II కొరింథీ 5:21లో చాలా అద్భుతమైన సత్యమున్నది. “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.” ఆలోచించండి, , నీవు నేను దేవునినీతి కావాలని, పాపమేమాత్రము ఎరుగని యేసురక్షకుడు, పాపమునకు పరిహారముగా అయ్యాడు. మనము ఏ ప్రయత్నము చేసినా సాధించుకోలేనిది, క్రీస్తు ప్రభువు చేసిన అమూల్యమైన బలిద్వారా పొందవచ్చు. ఈ మూడు మూలసత్యములను ప్రకారము జీవిస్తే క్రైస్తవేతరుల ప్రవర్తనకు వేరుగా క్రైస్తవ ప్రవర్తన ఉంటుంది.
జీవితపు ప్రవర్తనలో మనకు తండ్రితో, కుమారునితో, పరిశుధ్ధాత్మతో వ్యక్తిగత సంబంధం ఉన్నది.
మూడు సత్యములు మరోసారి:
1. 1. సృష్టిని బట్టి నీ శరీరం ప్రభువు కోసమే!
2. 2. విమోచననుబట్టి నీ శరీరము క్రీస్తులో భాగము, అవయవము.
3. 3. పరిశుద్ధాత్ముడు మనలను స్వాధీనము చేసుకొన్నందునుబట్టి మన శరీరాలు ఆయనకు దేవాలయాలు.
క్రైస్తవ ప్రవర్తన ఆయన ఆత్మ ద్వారా, జీవించుటకు అవసరమైనంత కృప త్రియేక దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ,
ఒక్కొక్కరికీ అనుగ్రహించుగాక! అమెన్!