రోమా అధ్యయనం – 52 14:22-15:4
మీ క్రైస్తవ జీవితములో అభివృద్ధిచెందడమెలాగు?
వేదనలు, బాధలు, సమస్యలు కృoగదీస్తున్నాయా? ఇది
సహజమే! క్రైస్తవ జీవితం అంతా సవ్యంగా సాగుతుంది
అని అనుకోవడం అపోహ! కానీ వీటన్నిటిలో ప్రభువు స్వయంగా
మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. యేసయ్య
“ఇదిగో యుగసమాప్తివరకు సదాకాలము మీతో ఉన్నానని”
ఆయనను వెంబడిస్తున్న వారితో చెప్పాడు. ఆయన
ఎన్నటికీ మాట తప్పడు. మీరు ఆయనను వెంబడిస్తున్నవారిలో
ఒకరయ్యరా? ప్రార్ధించుకుందాం, ఇలా రేడియోకు
దగ్గరగా వచ్చి కూర్చోండి.
తల్లితండ్రులు వారి పిల్లలు ఎదిగి వృద్ధి చెందాలని,
పెద్దవారు కావాలని ఆశపడుతూఉంటారు. సరియైన ఆహారం,
శ్రద్ధతీసుకుంటే, ఎదుగుదల కలుగుతుంది. ఒకవేళ ఎదగడం
జరగకోపోతే దానికి కారణాలు ఏమిటో పరీక్షిస్తారు.
అలాగే మన పరమతండ్రి మన క్రైస్తవ జీవితములో మనమంతా
ఎదగాలని ఆరాటపడుతూఉంటాడు. మనము
ఎదగకపోయినట్లయితే కారణమేమిటో పరీక్షించాలి. మన క్రైస్తవ
జీవితాల్లో ఎదిగి, అభివృద్ధి చెందడానికి
పాటించవలసిన కొన్ని నియమాలు, ఆపో. పౌలు రోమా 14:22
నుండి 15:4 వరకు ఉన్న లేఖన భాగములో
పొందుపరిచాడు.
22. నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు.
23. అనుమానించువాడు తినినయెడల విశ్వాసములేకుండ తినును, గనుక దోషియని తీర్పునొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.
2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.
3. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.
4. ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై
పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
క్రైస్తవ జీవితములో ఎదగడానికి మొదటి నియమము,
ప్రాథమికమైనది, నీ విశ్వాసము దేవునిమీద గట్టిగా
ఉంచుకో.
మొదటి వచనం “నీకున్న విశ్వాసము దేవుని యెదుట
నీమట్టుకు నీవే యుంచుకొనుము” దేవుడొక్కడే మన
విశ్వాసమునకు, మన స్తుతికి యోగ్యుడు. ఆపో. నీ మట్టుకు నీవే
ఉంచుకొనుము” అని చెబుతున్నపుడు, అది వ్యక్తిగత
విషయమని అర్ధమవుతున్నది. విశ్వాసమును మనము అప్పు
తెచ్చుకోలేము. ఇతరులకు మన విశ్వాసము నివ్వలేము. అది
వ్యక్తిగతవిషయం. అందుకే మనము గుర్తుంచుకోవలసిన ముఖ్య
విషయం దేవునిమీద, మీ విశ్వాసము బలముగా, ధృడముగా
ఉంచుకొనండి.
దానివల్ల మీకేమి కలుగుతుంది? అది సరియైన త్రోవలో
మిమ్మల్ని నడిపిస్తుంది. ఇతరుల జీవితాల్లో మీరు చూచి
ఖండించే పాపము మీ జీవితాల్లో ఉండకుండా జాగ్రత్తపడాలి.
తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు
తీర్చుకొననివాడు ధన్యుడు.” మీరు దేవునియoదుంచే
విశ్వాసము వల్ల మీరు పాపమును మీ జీవితములో
అనుమతించకుండా ఉంటారు. ఆ విశ్వాసము మిమ్మల్ని
సరియైన చక్కని త్రోవలో నడిపిస్తుంది. నిజానికి, ఆపో. 23వ
వచనములో స్పష్టపరించింది ఏమిటంటే, “విశ్వాసమూలము
కానిది ఏదో అది పాపము.” కాబట్టి మీ విశ్వాసము దేవునిలో
భద్రంగా రూఢిగా ఉంచడం అత్యవసరం. అప్పుడు ఆయన
మిమ్మల్ని సరియైన చక్కని త్రోవలో పదిలంగా నడిపిస్తాడు.
తప్పు మార్గములో పడిపోకుండా కాపాడతాడు. సోదరీ,
సోదరులారా, ఇది జాగ్రతగా గుర్తుంచుకోవాలి.
మీ క్రైస్తవ జీవితమును వృధ్ది చేసే రెండవ నియమం
బలహీనమైన మీ పొరుగువారికి సేవచేయండి. ఆపో. ఇచ్చే
యోచన ఏమిటి? బలహీనమైన మన పొరుగువారికి మన
సహాయం అవసరం. ఆ బలహీనమైన పొరుగువాడు తన
భారమును తాను మోయలేక ఉన్నాడు గనుక నీవు అతనికి
సహాయం చేయాలి. అతడి భారమును అతడు మోయడానికి నీవు
అతనికి సహాయం చేయాలి, అతని బలహీనతలలో అతనికి
తోడ్పాటు చేయాలి. “కాగా బలవంతులమైన మనము,…..
బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై
యున్నాము.” అన్న మాటలు గమనించారా? లేదా వారి
బలహీనతలను భరించాలి అని అర్ధం. ఆ బలహీనుడైన
సహోదరునికి, ఏ ఆధారములోని ఆ పొరుగువానికి నీ సహాయం
అవసరం. అతణ్ణి కట్టి స్థిరపరచాలి గనుక మనము మనల్ని
మనము తృప్తిపరచుకోకుండా అతడి క్షేమం, అభివృద్ధి కోసం
పాటుపడాలి. “క్షేమాభివృద్ధి” అనగా కట్టడం, బలపరచి
స్ఠీరపరచడం. అతడు బలవంతుడైతే, అతను కట్టబడితే, తన
భారమును తానే మోసుకుని వెళ్లగలడు. కానీ ఇప్పుడు అతనికి
సహాయం అవసరం. నీవు అతనికి ఇప్పుడు సేవచేయడం
అవసరం.
ఆ తరువాత యేసు క్రీస్తును మనము అనుసరించాలని
మనకు హెచ్చరిక, ఆదేశం ఇవ్వబడినది. “క్రీస్తు కూడా తన్ను
తాను సంతోషపరచుకొనలేదు...” అని లేఖనం సెలవిస్తుంది.
ప్రభువు మన పాపమునకు పరిహారం చెల్లించడానికి, మనకు
మాదిరిగా జీవించడానికి ఆయన వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువు
తన సంతోషం కోసం జీవించినట్లయితే సిలువమోసేవాడు కాదు.
ప్రభువు గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థించాడు? “ తండ్రీ, యీ
గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే
తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే
సిద్ధించునుగాక” (లూకా 22:46). మన లేఖన భాగము మనకు
ఏమని బోధిస్తున్నది? “నిన్ను నిందించువారి నిందలు
నామీద పడెను.” ఆయన తన సంతోషం కోసం చేయలేదు గాని
మన కోసం పరమతండ్రిని సంతోషపెట్టడానికి అది చేశాడు.
అవును, ప్రియ సోదరీ సోదరులారా, యేసు క్రీస్తు ప్రభువు తన
సంతోషం కోసం ఏదీ చేయలేదు, అదే విధంగా మీరు, నేను, మన
బలహీమైన పొరుగు వానిని సంతోషపెట్టడానికి అతనికి సేవ
చేయాలి. ఈ నియమము పాటిస్తే మనమంతా మన క్రైస్తవ
జీవితములో ఎదిగి ఫలిస్తాము.
క్రైస్తవ అనుభవములో ఎదిగి ఫలించడానికి మూడవ
నియమం పరిశుధ్ధ గ్రంధం బైబిల్ పఠించు, ధ్యానించు,
అనుసరించి జీవించు. నాలుగవ వచనం జాగ్రత్తగా గమనించి
దానిమీద నీ మనసును కేంద్రీకరించు. అక్కడ ఆపో. పౌలు పాత
నిబంధన గ్రంధమును గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన
చెబుతున్నదేమిటంటే, పరిశుద్ధగ్రంధం బైబిల్లో వ్రాయబడిన
సత్యాలు, గత కాలమునుండి భద్రపరచబడిన సత్యాలు మనకు
బుద్ధి చెప్పడానికి ఇవ్వబడ్డాయి. ఈ సత్యాలన్నీ దేవుడే
స్వయంగా బయలుపరచినవి, మనము క్రైస్తవ జీవితములో
ఎదిగి ఫలించాలని ఆశిస్తే, మనమంతా బైబిల్ గ్రంధమును
క్షుణ్ణంగా చదివి, పఠించి, ధ్యానించాలి.
దాని ద్వారా దేవుడు ఎవరో, మనమేమి చేయాలని ఆయన
ఇష్టమో, మన పక్షంగా ఆయన కోరిక ఏమిటో, గత కాలములో
ఆయన ఏ విధంగా ప్రజలకు తీర్పు తీర్చాడో, ఇవన్నీ బైబిల్
గ్రంధంలో తెలుసుకోవచ్చు. లేఖనములలోని సహనము,
ఆదరణ మనకు నిరీక్షణ కలిగిస్తాయి. దేవుని వాక్యము ఎంత
ప్రాముఖ్యమైనదో గ్రహించడానికి ఒక బలమైన ఉదాహరణ హెబ్రీ.
11:8-12 లో ఉన్నది. మీ బైబిళ్లలో దయచేసి నాతో బాటు
గమనించండి:
“8 అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ
పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న
ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి
వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.౹ 9
విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు
సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును,
గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో
ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.౹ 10 ఏలయనగా
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో,
పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము
ఎదురుచూచుచుండెను.౹ 11 విశ్వాసమునుబట్టి శారాయు
వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను
గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము
ధరించుటకు శక్తిపొందెను.౹ 12 అందుచేత
మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు
ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప
శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.”
హల్లెలూయ! పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో
కూడా మనము గ్రహించవలసిన గొప్ప సత్యములున్నవి.
విశ్వాసము వలన అబ్రహాము, శారాలు ఏమి చేశారో గమనించారు
గదా! బైబిల్ గ్రంధం చదివి, పఠించి, ధ్యానిస్తూ, ఆ సత్యాలు
జీవించడం ఎంత అవసరమో తెలుసుకుంటున్నామా? బైబిల్
పఠనలో మనకు ఎంతో సహాయము, నెమ్మది, ఆదరణ, ధైర్యం,
విశ్వాసము దొరుకుతుంది. ప్రియ సోదరీ, సోదరులారా, ఈ
నియమాలు చాలా సరళమైనవి, సాధారణమైనవి, కానీ మన
క్రైస్తవ జీవితపు ఎదుగుదల, అభివృద్ధికి అత్యవసరం. నీ
విశ్వాసము దేవుని మీద గట్టిగా, రూఢిగా ఉంచుకో, నీ
విశ్వాసములో నిశ్చలంగా, తప్పిపోకుండా, స్థిరంగా ఉంచుకో! నీ
బలహీనమైన పొరుగువారిని బలపరచు, వారికి సేవ చేయండి!
మీ పొరుగువారి అవసరాల విషయము దయ, కనికరముతో
స్పందించి మెలగండి! బైబిల్ గ్రంధమును పఠించడంలో
క్రమబద్ధంగా ఆసక్తిగా ఉండండి. అనుదినం క్రమం తప్పక
చేయండి! లేఖనముల వెలుగులో మీ జీవితాన్ని మీరే
పరీక్షించుకొని సరిదిద్దుకొనండి. అట్టి కృప ప్రభువు మనలో ప్రతి
ఒక్కరికీ అనుగ్రహించుగాక! అమెన్!!