చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము.
దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
Or send a message by Whats App to 98663 41841
మట్టలాదివారపు బైబిల్ అధ్యయనం
మీరంతా బాగున్నారా? కష్టాలు, కన్నీళ్లు ఎల్లప్పుడు ఉండవు. పరిశుద్ధ గ్రంధం బైబిల్లోనుండి సామెతల గ్రంధం
17:3 లో ఉన్న దేవుని మాటలు వినండి: “వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది…..” కొలిమిలో
మలినమంతా కరిగిపోయినట్టే, మన జీవితాల్లో ఉన్న అనవసరమైనవన్నీ తొలిగిపోతాయి. కనికరము గల దేవుడు
కష్టాలను, వేదనలను, నిందలను తన మంచి ఉద్దేశ్యం కోసం వాడుకుంటాడు. రోమా. 8:28 చదవండి, కంఠస్థం చేసి
భద్రం చేసుకోండీ. కాబట్టి క్రుంగి పోకండి, నిరాశపడకండి, జీవితాన్ని, పరిస్థితులను, ప్రజలను ఎదుర్కొని,
విజయముతో జీవించడానికి ప్రభువు మనకందరికీ
సహాయం చేయగల శక్తిమంతుడు. ప్రార్ధించుకుందామా?
ఈ ప్రభువుదినము ప్రత్యేకమైన ప్రభువు దినం. ఎందుకనగా ఇది మట్టలాదివారము. మట్టలాదివారo యేసు
ప్రభువు యేరూషలేములో ప్రవేశించిన దినము. దీన్నిగూర్చి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో వ్రాయబడింది.
మత్తయి 21:1-17; మార్కు 11:1-11; లూకా 19:28-44; యోహాను 12: 12-19.
ఈనాటి లేఖన భాగం లూకా 19:28-38,
28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.
29. ఆయన ఒలీవల కొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు
వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి
30. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక
గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు
31. ఎవరైనను మీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్మునడిగినయెడల ఇది ప్రభువునకు
కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.
32. పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
33. ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని
వారి నడిగిరి.
34. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
35. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి,
యేసును దానిమీద ఎక్కించి,
36. ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.
37. ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
38. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన
స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో
దేవుని స్తోత్రము చేయసాగిరి.
ఎందుకు యేసు క్రీస్తు ప్రభువు యెరూషలేములో విజయపు ఉత్సవముతో ప్రవేశిస్తున్నారు? అనే ఈ ప్రశ్నకు
జవాబు తెలుసుకుందాం. ప్రభువు ఎన్నడూ పబ్లిసిటీ కోరలేదు. తన అద్భుతాలు సహితం ఇతరులతో చెప్పవద్దని
హెచ్చరించాడు. మార్కు 1:43,44: మత్త. 5:14 తన్ను ప్రసిద్ధి చేయవద్దని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. కానీ
ఇక్కడ జరిగేది దానికి విరుధ్ధంగా ఉంది. గమనించారా? ప్రభువే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేసి జెకార్యాలోని
ప్రవచనపు నెరవేర్పుగా యెరూషలేము పట్టణంలోనికి రాజుగా విజయపు ప్రవేశము చేస్తూఉన్నాడు. శిష్యులు, ఇతర
ప్రజలు పరచిన బట్టలపైన ప్రభువు కూర్చోని ఊరేగింపుగా వెళుతూ ఉన్నాడు. ముందు, వెనుక నడిచేవారు
“ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడుగాక, హోసన్న” అంటూ ప్రభువును రాజుగా ఘనపరుస్తూ స్తుతిస్తూ
ఉన్నారు. ఇదే ప్రజలు కేవలం 5 రోజుల తరువాత “సిలువ వేయుము, సిలువ వేయుము” అని కేకలు వేస్తారని
సర్వమునెరిగిన రక్షకుడు యేసు క్రీస్తునకు తెలుసు. అయినా ప్రభువు ఎందుకు యెరూషలేము లోనికి రాజుగా
విజయపు ఊరేగింపుగా వెళుతున్నాడు? ప్రభువు ఈ భూమ్మీదికి మానవ స్వరూపములో వచ్చింది పాపపు
బానిసత్వములో బందీలుగా ఉన్నవారిని విమోచించడానికి. ప్రభువు ఇద్దరు దొంగల మధ్యలో అతి కిరాతకమైన
హింసననుభవించి బల్లెముతో ప్రక్కలో పొడువబడి, తలమీద ముళ్ళ కిరీటముతో అవమానకరమైన మరణము ఇంకా
5 రోజుల్లోనే పొందబోతున్నాడని ప్రభువునకు బాగా తెలుసు. ఆ ప్రజల స్తుతులు, జై జై లు కేవలo క్షణికమైనవని,
పెదవులమీదివేనని యేసు రక్షకునికి బాగా తెలుసు. అయినా ప్రభువు ఎందుకు తన ముఖమును
చెకుముకిరాయిలాగా చేసుకొని, ధృడమైన నిశ్చయంతో యెరూషలేమునకు ప్రయాణమైనట్టు? ప్రభువు తాను
మానవస్వరూపం ధరించిన ఉద్దేశ్యమును నెరవేర్చాలని ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువు
ఎవరి గురించి ఆలోచించి ఉండవచ్చు? మొదటిగా తండ్రిని మహిమగురించి, రెండవది నీముఖం నాముఖం
ఆయనకు కనబడింది, నీకు, నాకు ఆయన పరిశుద్ద రక్తము, తన సిలువ మరణము తప్ప వేరే విమోచన మార్గము
లేదని ముందుకే వెళ్ళాడు. ప్రియ సోదరీ,
సోదరుడా, నీ పాపపు రుణమును యేసు ప్రభువు సంపూర్ణంగా
తీర్చాడు. అందుకే సిలువ మీద తన ప్రాణము పోయే సమయంలో అన్న మాట “సమాప్తం” గ్రీకులో “టేటేలేస్టై”
అంటారు. ఈ మాటను ఆదినాల్లో ఒక వ్యక్తి తన అప్పు అంతా చెల్లించిన తరువాత ఋణ పత్రాల మీద వ్రాసే మాట.
మరోమాటలో చెప్పాలంటే ఇది లీగల్ భాషలో వాడే మాట. న్యాయపరమైన మాట. యేసు క్రీస్తు ప్రభువు నీ
పాపమంతటికోసం తన రక్తం, ప్రాణం పరిహారంగా ఇచ్చి ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన పాప క్షమాపణను ఒక
కానుకగా నీకివ్వాలని పిలుస్తూఉన్నాడు. విశ్వాసముతో, వినయముతో, దాన్ని స్వీకరించడానికి నీవు సిధ్ధమా?
ఈ లేఖన భాగములో మరో ముఖ్యమైన విషయముంది. ప్రజలు కేకలు వేసిన మాటలలో ఒక మాట,
“పరలోకమందు సమాధానము”. లూకా 19:38. మీ బైబిల్లో గమనించారా? 3 సువార్తలలో వైద్యుడైన లూకా ఒక్కడే
ఇది వ్రాశాడు. యేసు ప్రభువు జన్మించినపుడు దూతలు చేసిన స్తోత్రములో ఉన్న మాట ఏమిటి? “భూమి మీద
సమాధానము” లూకా 2:14 యేసు ప్రభువునకు యెషయా 9:6లో ఇవ్వబడిన
బిరుదులలో ఒకటి,
సమాధాన
కర్త, అధిపతి. గమనిస్తున్నారా, శ్రోతలూ? సత్య దేవునికి, మానవాళికి దేవునితో పాపమునుబట్టి సంబంధం
తెగిపోయింది. దేవునితో సమాధానము లేదు. అందుకే మన జీవితాల్లో సమాధానం లేదు. తిరిగి ఈ సంబంధం బాగు
కావాలంటే పాపమునకు పరిశుద్ధ రక్తముతో ప్రాయశ్చిత్తం చేయాలి. అది ఎవ్వరూ చేయలేరు. అది చేయడానికే
యేసు ప్రభువు మానవ స్వరూపము ధరించాడు. మన అందరి స్థానములో ధర్మశాస్త్రమును నెరవేర్చాడు.
(మత్త.5:17) దేవుని గొర్రె పిల్లగా పరిహారం పాపపరిహారం చేశాడు. ఈ సత్యమును విశ్వసించి పాప క్షమాపణ
పొందినవారే దేవునితో తెగిపోయిన సంబంధమును బాగుచేసుకొని ఆయనకు కుమారులు కుమార్తెలు అవుతారు.
(యోహాను. 1:12) యేసు ప్రభువు విజయపు ఉత్సాహముతో యేరూషలేములో ప్రవేశించే సమయములో
ఏమన్నారో మనము జాగ్రతగా పరిశీలించాలి. “ ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని
విషయమై యేడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో
మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు
ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ
పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.”
యేసు ప్రభువు ఏడ్చిన సందర్భాలు కొన్నే. యేరూషలేము ప్రజలు ప్రభువును తిరస్కరించారు. ఆయన మెస్సీయ
అని, రక్షకుడని నమ్మలేదు. మరి నీ సంగతేమిటి? ఇప్పుడైనా మారు మనస్సు పొందమని ప్రభువు వారిని ఆనాడు
హెచ్చరించినట్లే, నిన్ను ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. 43, 44 వచనాల్లో యెరూషలేము నేలమట్టం
చేయబడుతుందని ప్రభువు ప్రవచన పూర్వకంగా హెచ్చరించాడు. ఇది అక్షరాల క్రీ.శ. 70 లో రోమా ప్రభుత్వపు
చరిత్రలో నేరవేరింది. వెస్పాసియన్, టైటస్ అనే అధిపతులు ఇది
చేశారు. యేసు రక్షకుని తిరస్కరిస్తే తీర్పు తప్పదు. ప్రభువు చేసిన ఈ రక్షణ పాపక్షమాపణ పొందే సమయం
ముందు కాలములో నీకు ఉండకపోవచ్చు. ఎవరికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. సోదరీ, సోదరుడా,
“సిలువ వేయుము” అని కేకలు వేసే గుంపులో ఉన్నావా? దేవునితో నీ సంబంధం తెగిపోయిన విషయం
గుర్తించావా? యేసు రక్షకుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపపు శిక్ష అంతా ప్రభువే భరించి సహించాడు. నీ
పాపపు రుణప్రత్రo మీద “సమాప్తం” అని ఆయన రాయడానికి ఒప్పుకుంటావా? లేదా ఆయనను తృణీకరించి
తీర్పుకులోనవుతావా? నిర్ణయం నీదే!